Wednesday, January 13, 2010

భాషాప్రయుక్త రాష్ట్రాలు: చారిత్రక నేపథ్యం

Published in Marxistu, CPI(M) AP State Committee's Theoretical Monthly in January 2010

ఫజుల్‌ ఆలీ సంఘం నివేదిక 371 పేరాగ్రాఫ్‌లో ''తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలుగు మాట్లాడే 3.20 కోట్ల మంది ప్రజలతో కూడిన విశాల రాష్ట్రం ఒకే పరిపాలనా యూనిట్‌గా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి అవసరమైన ఇంధన, జల వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. అవసరమైనంత స్థాయిలో ఖనిజవనరుల సంపద అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న రాజధాని సమస్య కూడా పరిష్కారమవుతుంది. హైదరాబాద్‌, సికిందరాబాద్‌లతో కూడిన జంట నగరాలు విశాలాంధ్ర రాజధానిగా ఏర్పాటుచేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు'' అని అభిప్రాయపడింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో రాజ్యాంగ సంక్షోభం అంచులకు చేరింది. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలు రాష్ట్ర ప్రజల మధ్య దీర్ఘకాల ప్రభావం చూపించే అఘాతాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రం ఒకవైపున ప్రత్యేక తెలంగాణ వాదులు, మరోవైపున సమైక్య ఆంధ్రప్రదేశ్‌ వాదుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. మధ్యలో కేంద్రం నుండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు మరో సంఘాన్ని నియమించాలన్న ప్రతిపాదలు వినవస్తున్నాయి. మీడియాలో సైతం భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి చర్చ జరుగుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాథమిక పునాది గురించే ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల వాస్తవిక చరిత్రను గుర్తు చేసుకోవటం తాజా పరిణా మాలపై అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేస్తుంది.

భారతదేశంలో భాష, భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య నేటిది కాదు. దీనికి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉంది. 1894లోనే వలసపాలకులు ప్రాంతీయ భాషల్లో భావప్రక టనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా చట్టం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు సాగాయి. అప్పటికే యూరోపియన్‌ దేశాల ప్రజలను ఏకం చేయటం లోనూ, ఇటలీ, జర్మనీ వంటి దేశాల ఏకీకరణ లోనూ భాష పోషించిన పాత్ర గురించి తెలుసు కున్న తొలితరం స్వాతంత్య్రోద్యమ నేతలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాషల విలువ తెలుసుకున్నారు. యూరోపియన్‌ దేశాల్లో భాషల ఆధారంగా ఏర్పడిన దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు అవసరమైన విశాలమైన మార్కెట్లను అందుబాటులోకి తెచ్చాయి. అదేసమయంలో భాషకు ఉండే ప్రజాతంత్ర స్వభావం కూడా ఆ సమయంలోనే వెల్లడైంది. ఒక దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను సమకా లీన రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు వ్యతిరేకంగా సమీకరించటంలో భాష ప్రధాన సాధనంగా ఉపయోగపడింది.

19వ శతాబ్దం చివర్లో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌లలో జరిగిన ప్రజా తంత్ర పోరాట లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయటంలో ప్రజాదరణ పొందిన భాష, అటువంటి భాష మాట్లాడే ప్రజానీకం ఒకే ప్రాంతంలో నివశించటం ముఖ్యమైన కారణా లుగా ఉన్నాయి. భారత స్వాతంత్య్రోద్యమంలో భాష ప్రాధాన్యత, అది నిర్వహించగలిగిన పాత్రను గుర్తించటమే కాదు వలస ప్రభుత్వం భారతదేశాన్ని భాషల ప్రాతిపదికన పునర్విభ జించాలని ప్రతిపాదించిన మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు భాలగంగాధర్‌ తిలక్‌ అని చెప్పవచ్చు. 1891లో ఆయన కేసరి పత్రికలో ''ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిపాలనా విభాగాలు నిర్దిష్ట చారిత్రక క్రమం నేపధ్యంలో ఉనికిలోకి వచ్చినవై యుండాలి. లేదా పూర్తిగా కాకతాళీయంగా తెరమీదకు వచ్చిన వైనా అయి ఉండాలి. ప్రస్తుతం ఉన్న ప్రావిన్సు లను భాషల ప్రాతిపదికన విభజిస్తే ఆయా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య సారూప్యత ఉండటమే కాదు తమతమ భాషలను అభివృద్ది చేసుకోవటానికి అవసరమైన ప్రోత్సాహం కూడా ప్రజలకు అందుతుంది'' అని రాశారు.

1905లో లార్డ్‌ కర్జన్‌ అప్పటి బెంగాల్‌ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించినప్పుడు కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాల భావన భారత రాజ కీయాల్లో కేంద్ర స్థానానికి చేరలేదు. పైన చెప్పుకున్నట్లు భాషకున్న ప్రజాతంత్ర లక్షణం, రాజకీయ సమీకరణలపై దాని ప్రభావం గురించి వలసపాలకులకు అప్పటికే అవగాహన ఉంది. యూరప్‌లో దేశాలు ఎదుర్కొన్న పరిస్థితులు భారతదేశంలో పునరావృతం కారాదన్న నిర్ణయా నికి వచ్చారు. అందువల్లనే భారతదేశంపై సంపూర్ణాధికారం సాధించిన తర్వాత కూడా బ్రిటిష్‌ పాలకులు రాష్ట్రాలను ఏర్పాటు చేయటంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ బహుళ భాషలు మాట్లాడే ప్రజానీకం సహజీవనం సాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, బెంగాల్‌ ప్రావిన్స్‌, నేటి పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రావిన్సు, అవిభవిక్త సెంట్రల్‌ ప్రావిన్సులు ఈ విధంగా తెరమీదకు వచ్చినవే. 1903లో అప్పటి హౌంమంత్రి హెచ్‌ ఎస్‌ రిజ్లీ బెంగాల్‌లో వెల్తువెత్తుతున్న స్వాతంత్య్రో ద్యమ కాంక్షను అణగ దొక్కాలంటే భాష ద్వారా సమీకృతం చేయబడ్డ రాష్ట్రాన్ని విడగొట్టటం తప్ప మరో మార్గం లేదని బ్రిటన్‌ పార్లమెంట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ ఆలోచన 1905కి గానీ ఆచరణరూపం దాల్చలేదు.

ఫలితంగా ఒకే భాష మాట్లాడే విశాల వంగ దేశం ముస్లిం లు అధికంగా ఉన్న తూర్పు బెంగాల్‌, హిందు వులు అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్‌గా విభజితమైంది. నాటి నుండీ వలసపాలకుల విభజించు పాలించు సూత్రం గురించి భారతీ యులకు సుపరిచితమే. ఈ చర్య వలసవాద వ్యతిరేకతను సామాన్య ప్రజల వరకూ విస్తరిం చటంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు. భాషా పరంగా ప్రజలు ఏకం కావాలన్న ఆలో చనను కూడా ముందుకు తెచ్చింది. బెంగాల్‌ ఏకీకరణ కోసం సాగిన ఉద్యమం అనతి కాలం లో తూర్పు భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఈ మార్పును గమనంలోకి తీసుకున్న జాతీయ కాంగ్రెస్‌ 1905లో కలకత్తాలో జరిగిన వార్షిక సమావేశాల్లో ఆమోదించిన తీర్మానం కర్జన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించటమేకాదు. ''ఈ మహాసభ పరిపాలన సౌలభ్యంతో పాటు బెంగాలీ భాష మాట్లాడే ప్రజలందరినీ ఒకే పరిపాలనా విభాగంగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేస్తోంది'' అని ప్రకటిం చింది.

చివరికి వలసపాలకులు బెంగాల్‌ విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఉద్యమం ఒత్తిడి తెచ్చింది. అయితే అదేసమయంలో అవిభక్త వంగ దేశం నుండి అస్సాం, ఇతర ఈశాన్య ప్రాంతాలను ఒక రాష్ట్రంగానూ, బీహార్‌, ఒరిస్సా లతో కూడిన ప్రాంతాలను మరో రాష్ట్రంగానూ విభజిస్తూ వలస ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ విధంగా భారతదేశంలో 1911లో తొలి సారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చాయి. ఇదేసమయంలో 1916లో లక్నోలో జరిగిన వార్షిక సమావేశాల్లో జాతీయ కాంగ్రెస్‌ సమాఖ్య వాదాన్ని ఆమోందించటంతో అటు వంటి పలు రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి అవస రం గురించి చర్చ జరిగింది. పలు ప్రాంతాల వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాం డ్‌ను కాంగ్రెస్‌లో వినిపించారు. 1917 ఏప్రిల్‌ 8న లక్నో మహాసభల తీర్మానాన్ని అనుసరించి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రజలను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్‌ ముందుకు తెచ్చింది. అదేవిధంగా భాషాప్రయుక్త రాష్ట్రాల సమస్యను జాతీయ రాజకీయ సమస్యగా మలచటంలో హౌంరూల్‌ ఉద్యమం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. 1917లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించిన అనిబీసెంట్‌ ''సాధ్యమైనంత త్వరలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలను భాషల ప్రాతిపదికన విభజించాల''ని డిమాండ్‌ చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో 1920లో నాగ పూర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాల్లో భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించటం స్వాతంత్య్రోద్యమ లక్ష్యాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ తీర్మానం పర్యవ సానంగానే తొలుత కాంగ్రెస్‌ పార్టీ, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర స్థాయిలో తమ తమ సంస్థాగత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ కార్యక్రమాలు దిగువ స్థాయిలో మాతృభాషలో ప్రజలను సమీకరించ టంలో ముఖ్య పాత్ర పోషించాయి.ఈ విధంగా భారతదేశంలో పెరుగుతున్న సమాఖ్య తత్వం నేపథ్యంలో బ్రిటిష్‌ పార్లమెంట్‌ 1927లో జాన్‌ సైమన్‌ నేతృత్వంలో రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్విభజించటానికి అవసరమైన చట్టబద్ధమైన కమిషన్‌ను నియమిం చింది. (స్టాట్యుటరీ కమిషన్‌ ఆన్‌ లింగ్విస్టిక్‌ రీ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ప్రావిన్సెస్‌) పేరుతో ఇది పేరుకెక్కింది.

ఈ కమిషన్‌ 1928లో సమర్పిం చిన తన నివేదికలో ''రాష్ట్రాలను పునర్విభ జించటానికి భాష ఏ మాత్రం ప్రాతిపదిక కాకూడదు'' అని స్పష్టం చేసింది. తదనంతరం స్వాతంత్య్రోద్యమంలో పలు ధోరణులకు ప్రాతి నిధ్యం వహించే మోతీలాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్ర బోస్‌, సర్‌ ఆలీ ఇమామ్‌, సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ తది తరులతో కూడిన నెహ్రూ కమిటీ ప్రతిపా దించిన రాజ్యాంగంలో స్వాతంత్య్రానంతరం భాషల ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన చేస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ నెహ్రూ కమిటీ ''పాక్షికంగా భౌగోళిక పరిస్థితులు, పాక్షికంగా ఆర్థికాభివృద్ధి రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదికగా ఉండాలి. కానీ ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే ప్రాంతంలో నివసించటం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికగా ఉండాలి. అందువల్ల రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్విభజించటం అవసరం'' అని వివరించింది. దాంతో దిగువ స్థాయిలో ఈ నినాదం పెద్దఎత్తున ప్రజలను కదిలించే నినాదంగా మారింది.

''ఈ సూత్రాన్ని కాంగ్రెస్‌ అధికారికంగా ఆమోదించింది. ఎన్ని కల ప్రణాళికలో చేర్చింది. 1947 నవంబరు 27న రాజ్యాంగ పరిషత్తులో ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ భారత ప్రభుత్వం తరపున రాష్ట్రాల పునర్విభజనకు భాష ప్రాతిపదిక అన్న సూత్రాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు'' అని రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు బి. శివరావు రాశారు. అంబేద్కర్‌ మార్గదర్శ నంలో ఈయనే మన రాజ్యాంగంలో అత్యధిక భాగానికి అక్షర రూపం ఇచ్చారు.

మరోవైపున రెండో ప్రపంచ యుద్ధా నంతరం దేశానికి స్వాతంత్య్రం రానుందన్న వాతావరణం నెలకొనటంతో దక్షిణ భారత దేశంలో విశాలాంధ్ర, ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర నినాదాలతో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం సమాంతరంగా ముందుకు వచ్చింది. ఈ ఉద్యమాలకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోజనాలను కమ్యూనిస్టు పార్టీ పెద్దఎత్తున ప్రజల వద్దకు తీసుకెళ్లింది.

తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం అన్న సమస్య జాతీయ రాజకీయ ఎజెండాలో నిరంతరం కీలక స్థానాన్ని ఆక్రమిస్తూ వచ్చింది. చివరకు రాజ్యాంగ పరిషత్తులో కూడా ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ప్రతిపాదన కేరళ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఏర్పాటు డిమాండ్ల గురించి అధ్యయనం చేసేందు కు రాజ్యాంగ పరిషత్తు ఒక కమిటీని నియమిం చేందుకు దారితీసింది. ఆ విధంగా తెరమీదకు వచ్చిందే ధర్‌ కమిషన్‌. భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం జరుగుతున్న డిమాండ్లు చివరకు దేశాన్ని ముక్కలు చేస్తాయన్న వాదన ముందుకు తెచ్చారు. దాంతో ధర్‌ కమిటీ 1948 డిశంబరు 10న సమర్పించిన తన నివేదికలో ''భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడటం భారతదేశ ప్రయోజనాలకు భంగకరం. అందువల్ల ఈ ఎజెండాను ఇప్పట్లో చేపట్టరాదు'' అని సిఫారసు చేసింది. అంతేకాదు. ''సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన ద్విభాష జిల్లాలు తమకంటూ విలక్షణ మైన ఆర్థిక జీవన శైలిని ఏర్పరచుకున్నాయి. వీటిని విడదీయటం సరికాదు. వాటి ప్రత్యేక అవసరాలు, ప్రయోజనాలను గమనంలోకి తీసుకోవాలి'' అని ప్రకటించటం ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శాశ్వత అవరోధాన్ని సృష్టించింది.

భవిష్యత్తులో అభివృద్ధి చేయటానికి గల అవకాశాలు, భౌగోళిక సామీప్యత, ఆర్థిక సామర్థ్యం, పరిపాలనా సౌలభ్యం ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ధర్‌ కమిటీ తీర్మానించింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నెహ్రూ, వల్లభాయి పటేల్‌, పట్టాభి సీతారా మయ్యలతో కూడిన జెవిపి కమిటీని నియమించి భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ కమిటీ దేశవిభజన అనంతరం నెలకొన్న పరిస్థితులను గమనంలోకి తీసుకుని భద్రత, ఐక్యత, ఆర్థిక సాఫల్యత ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని, అంతే తప్ప భాష ఒక్కటే రాష్ట్రం ఏర్పాటుకు ప్రామాణి కంగా ఉండకూడదని ప్రతిపాదించింది. తద్వా రా స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్క టానికి రంగం సిద్ధం చేసింది. అంతేకాదు సర్దార్‌ పటేల్‌ మాటల్లో ''ఈ విధంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయటం భారతదేశం ఒక జాతిగా ఎదగటానికి ఆటం కంగా మారుతుంది'' అని ఆందోళన కూడా వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో మరోవైపున తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం కోసం, నిజాం సంస్థా నంలో ఆంధ్రమహాసభ పేరుతో వెట్టి, భూస్వా మ్య వ్యవస్థల దోపిడీకి వ్యతిరేకంగా మహౌధృత పోరాటం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రం - విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలన్న నినాదం ఆంధ్రమహాసభ నినాదాల్లో అంతర్భాగం అయ్యింది. తెలంగాణా సాయుధ పోరాటం పురోగమించేకొద్దీ విశా లాంధ్ర ఉద్యమం కూడా ఊపందుకొంది. రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటి కమ్యూనిస్టేతర ప్రముఖులు కూడా విశాలాంధ్ర నినాదాన్ని సమర్థించారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పోలీసు యాక్షన్‌ తర్వాత నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమయింది.

ఈ సంస్థానాన్ని మూడు భాగాలుగా విడదీసి తెలుగు మాట్లాడే ప్రాంతాలను హైదరాబాద్‌ రాష్ట్రంలో కలిపారు. అంతేకాదు వ్యక్తిగతంగా తన అభిప్రాయాలు వెల్లడించనప్పటికీ ముఖ్య మంత్రిగా 1953లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేభర్‌కు రాసిన లేఖలో తెలంగాణ ప్రాంతం విశాలాంధ్రలో కలవాలన్న డిమాండ్‌కు సమాం తరంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే కొన సాగించాలన్న డిమాండ్‌ కూడా శక్తివంతంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని భూస్వాములందరూ విశాలాంధ్ర నినాదాన్ని వ్యతిరేకంచటంలో ముందుపీఠిన నిలిచారు. తెలంగాణ సాయుధపోరాట ప్రభావం దీనికి తక్షణ కారణమని ప్రత్యేకంగా ప్రస్తావించన వసరం లేదు. చివరకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ శాసనసభలో తీర్మానం ఆమోదించి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికి మార్గం సిద్ధం చేశారు. ఈ విధంగా తెలంగాణా సాయుధ పోరాటం భూసంస్కరణలతో పాటు భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యను సైతం జాతీయ ఎజెండాలోకి తేవటంలో జయప్రదం అయ్యింది.

విశాలంధ్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ అనుస రించిన దాగుడుమూతలకు ఆ పార్టీ తొలి సార్వత్రిక ఎన్నికల్లో పెద్దఎత్తున మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రాభవానికి అద్దం పట్టాయి. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయ సంఖ్యలో సీట్లు సాధించటంతో పాటు మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలో మొత్తం 140 సీట్లకు గాను కాంగ్రెస్‌ పార్టీ కేవలం 43 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ, టంగుటూరి ప్రకాశం పంతులుతో చేతులు కలిపి ఐక్య ప్రజాతంత్ర సంఘటన- యుడిఎఫ్‌గా ఏర్పడ్డారు. ఈ కూటమి 163 సీట్లు గెల్చి ప్రకాశం పంతులును శాసన సభాపక్ష నేతగా ఎన్నుకొంది. కాంగ్రెస్‌ పార్టీ 152 సీట్లకు పరిమితం అయ్యింది. అయితే శాసనసభలో ఆధిక్యత ఉన్న యుడిఎఫ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు చెందిన రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించింది. ఈ అప్రజాస్వా మిక చర్యను అంగీకరించలేని తెలుగు ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తిరిగి ఉద్యమం ప్రారంభించారు.

ఈ ఉద్యమానికి మద్దతుగా 1952 జూలై 16న పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య ఒక అనధికార చట్టాన్ని ప్రతిపాదిస్తూ ''ఇప్పుడున్న బహుళ భాషా రాష్ట్రాల కంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తేనే భారతదేశం మరింత ఐక్యంగా ఉంటుంది. ఈ డిమాండ్లు అంగీకరించకపోతే పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. తాత్కాలి కంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం డిమాం డును అంగీకరించినంత మాత్రాన సరిపోదు. నా మిత్రుడు కోటంరాజు రామారావు గారు అభిప్రాయపడినట్లుగా హైదరాబాద్‌ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడేవరకు మేము విశ్రమించేది లేదు'' అన్నారు. నెహ్రూ వ్యక్తం చేసిన ఆందోళనకు సుందరయ్య సమాధానమిస్తూ ''భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రభుత్వం భావిస్తున్న ట్లుగా జాతీయ సమైక్యతకు ముప్పు కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిజానికి జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతలను మరింత పటిష్టపర్చగలవు'' అని కూడా వివరించారు. కానీ నెహ్రూ ఈ ప్రతిపాదనలను అంగీకరించకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని పార్లమెంట్‌లో సమాధానమిచ్చారు.

ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ వాదుల్లో సైతం నిరాశ, ఆగ్రహాలకు కారణం అయ్యాయి. నెల్లూరు జిల్లాకుచెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష సాగించి అమరులయ్యారు. దాంతో ఒక్కసారిగా తెలుగు ప్రజలు అగ్రహౌ దగ్రులయ్యారు. మద్రాసు, సర్కారు, సీడెడ్‌ జిల్లాల్లో ఉద్యమం తారాస్థాయికి చేరింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలుగు మాట్లాడే ప్రజలున్న జిల్లాలను వేరు చేసి ఆంధ్రరాష్ట్రంగా ప్రకటించేందుకు సిద్ధమైంది. 1952 సెప్టెంబరు 2న ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్దింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ బిల్లులో భాషా ప్రయుక్త రాష్ట్రం అన్న పదాన్ని వాడకుండా జాగ్రత్త పడింది. ఈ బిల్లును సమర్థిస్తూ రాజ్యసభలో మాట్లాడిన సుందరయ్య నెహ్రూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ''30 ఏళ్ల అనుభవం తర్వాత కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అన్న సూత్రాన్ని తిరస్కరించటం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఈ డిమాండ్‌ను తిరస్కరించబూనుకొంటోంది.

ప్రజలు మాత్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవటంలో జయప్రదం అవుతారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం మరో సంఘం నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సమస్య అక్టోబరు 1 నుండి ఆంధ్రరాష్ట్రం ఉనికిలోకి వస్తుందని ప్రకటించటమా లేదా అన్నదొక్కటే. మరే హామీ ఈ సమస్యను పరిష్కరించటానికి సరిపోదు'' అన్నారు. చివరిగా నెహ్రూ 14 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఉనికిలోకి వస్తున్నట్లుగా లోక్‌సభలో ప్రకటించారు. ఆ విధంగా అక్టోబరు 1న కర్నూలు రాజధాని, గుంటూరు హైకోర్టుతో ఆంధ్రరాష్ట్రం అవతరించింది. ఆంధ్రరాష్ట్రా వతరణ విశాలాంధ్ర ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది. మరోవైపున కేరళ, మైసూరు, ముంబయి ప్రాంతాల్లో కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ పతాక స్థాయికి చేరింది. ఈ ఉద్యమంలో భాగంగానే సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని సమర్థిస్తూ దానికి అవసరమైన వాదనలను తన విశిష్టరచనలో ప్రస్తావించారు. ఈ వాదనలకు అనుగుణంగానే 1956 ఏప్రిల్‌ 19-29 వరకూ పాల్ఘాట్‌లో జరిగిన నాల్గో జాతీయ మహాసభల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానంలో ''భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రజా జీవనం మెరుగుపర్చుకోవటానికే కాదు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే కర్తవ్యంలో అంతర్భాగం కూడా'' అని పేర్కొంది. అంతేకాదు ''ఏ పరిస్థితుల్లోనూ ప్రజలు భాష కారణంగా విడిపోరాదు. ఇటువం టి విచ్ఛిన్నకర చర్యలు భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ను బలహీనపర్చటమే కాదు ఆర్థిక, ప్రజాస్వామ్య అభివృద్ధికి అవసరమైన ప్రజల ఐక్యతకు కూడా భంగం కలిగిస్తాయి'' అని కూడా హెచ్చరించింది.

న్యాయశాఖ మంత్రిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించిన రాజ్యాంగ నిర్మాత బి. ఆర్‌. అంబేద్కర్‌ సైతం 1956 నాటికి తన అభిప్రాయం మార్చుకుని ఈ డిమాండ్లను బలపరిచారు. 1955 డిసెంబరులో రాసిన ''భాషా ప్రయుక్తరాష్ట్రాలపై నా అభిప్రాయాలు'' అన్న రచనలో ''బహుళ భాషా రాష్ట్రాలు అన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రతి రాష్ట్రం ఒకే భాష మాట్లాడే ప్రాంతంగా ఉండాలి. ఎక్కడైతే ఈ సూత్రాన్ని అమలు చేయటంలో విఫలం అయ్యారో ఆయా దేశాల న్నింటిలో రాజ్యం ఉనికికే ముప్పు వచ్చింది. బహుళ భాషా రాష్ట్రాలతో నిండిన టర్కీ సామ్రాజ్యం గానీ, ఆస్ట్రియన్‌ సామ్రాజ్యం గానీ దీర్ఘకాలం మనుగడ సాగించలేకపోయాయి. ఈ సామ్రాజ్యాలు పతనం కావటం వెనక గల ప్రధాన కారణాల్లో బహుళ భాషా రాష్ట్రాలు ఒక కారణం. భారతదేశం ఇప్పుడున్న పరిస్థితి, బహుళ భాషా రాష్ట్రాల సమాఖ్యగా కొనసాగితే అటువంటి ముప్పును ఎదుర్కొనే సమస్య ఉంది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పటికే నెహ్రూ ప్రభుత్వం పెరుగుతున్న ప్రజా ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఫజుల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్య్వవస్థీకరణ సంఘాన్ని నియమించింది. ఈ సంఘం భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌లను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఆంధ్ర, తెలంగాణా, విశాలాంధ్రల గురించి ప్రధాన భాగం కేటాయించింది. ఫజుల్‌ ఆలీ సంఘం నివేదిక 369-389 పేరాల్లో విశాలాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గురించి విపు లంగా పరిశీలించి ఈ క్రింది నిర్ధారణలకు వచ్చింది. రాష్ట్రాల పునర్య్వవస్థీకరణ సంఘం మాటల్లోనే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి.

371 పేరాగ్రాఫ్‌లో ''తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలుగు మాట్లాడే 3.20 కోట్ల మంది ప్రజలతో కూడిన విశాల రాష్ట్రం ఒకే పరిపాలనా యూనిట్‌గా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి అవసరమైన ఇంధన, జల వనరులు పుష్కలంగా అందుబా టులో ఉంటాయి. అవసరమైనంత స్థాయిలో ఖనిజవనరుల సంపద అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న రాజ ధాని సమస్య కూడా పరిష్కారమవుతుంది. హైదరాబాద్‌, సికిందరాబాద్‌లతో కూడిన జంట నగరాలు విశాలాంధ్ర రాజధానిగా ఏర్పాటు చేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించ వచ్చు'' అని అభిప్రాయపడింది. అంతేకాదు ఈ నివేదిక ''ఇరు ప్రాంతాల ప్రజలు దీర్ఘకాలం సంస్థలు, వ్యవస్థలతో తమ జీవితాలు ముడివేసుకుని ఉన్నందున ఇంతకంటే బలమైన ప్రత్యేక కారణం ఉంటే తప్ప విశాలాంధ్ర నినాదాన్ని అంగీకరించకపోవటానికి ప్రత్యేక కారణం ఏమీ కనిపించటం లేదు'' అని కూడా ప్రకటించింది. అంతటితో ఆగలేదు ''విశాలాంధ్ర ఏర్పాటు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. కృష్ణా, గోదావరి నదీపరివాహక ప్రాంతాలు ఒకే నియంత్రణ కిందకు తేవటం, రెండు ప్రాంతాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు, హైదరాబాద్‌ ఉభయులకూ ఆమోదయోగ్యమైన రాజధాని కావటం, ఇవి క్లుప్తంగా ప్రయోజనాలు అని చెప్పవచ్చు.'' అని నివేదిక 381 పేరాగ్రాఫ్‌లో స్పష్టంగా చెప్పింది.

అంత మాత్రాన ఫజల్‌ ఆలీ సంఘం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పకూడదు. ''ప్రత్యేక తెలంగాణా నినాదం'' అన్న శీర్షిక కింద విశాలాంధ్ర ఏర్పాటుకు ఎదురయ్యే అవరోధాల గురించి కూడా వివరంగా పేర్కొంది. ''ఎన్ని వివరణలు ఇచ్చినా కొందరు తెలంగాణ ప్రాంత నేతల్లో ఆందోళనలు తొలగిపోలేదు. ఈ విలీనం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న అధిక ఆదాయ వనరులను మిగిలిన ప్రాంతంలో పంచుకోవాల్సి వస్తుంది. ఈ ఆదాయంతోనే అభివృద్ధి పథకాలకయ్యే ఖర్చును భరించవచ్చు. ఈ విలీనం నేడు ఆంధ్రరాష్ట్రం ఎదుర్కొంటున్న తరహాలో ఆర్థిక అస్థిరత్వానికి దారితీయవచ్చు''(పేరా 376) ''కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న ప్రత్యేక హక్కులు వదులుకోవటానికి ఈ ప్రాంతం సిద్దంగా లేదు'' ( పేరా 377). ''మరోవైపున తెలంగాణ ప్రాంతం విద్యాపరంగా వెనకబడటం ఈ విలీనాన్ని వ్యతిరేకించటం వెనక ఉన్న కారణాల్లో ఒకటి'' ( పేరా 378). అదే సమయంలో ఈ నివేదిక వివిధ ప్రాంతాల ప్రజల్లో ఉన్న అపోహల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంత ప్రత్యేక ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవ టంలో విఫలం అయ్యేట్లయితే ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం సిఫార్సు చేయటానికి వెనకాడ బోము'' అని కూడా నివేదిక హెచ్చరింది.

ఫజుల్‌ ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్య్వవస్థీకరణ సంఘం ఉభయ ప్రాంతాల వాదనలు, వాటి సమంజసత్వం వేర్వేరుగా పేర్కొన్నప్పటికీ చివరికి విశాలాంధ్రకు అనుకూ లంగా తన నిర్ధారణ ఇస్తూ ''ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు వేర్వేరు రాష్ట్రాలుగానే కొనసాగుతూ మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాలు విలీనం కావటానికి అవకాశాలు అట్టేపెట్టుకోవాలి. అది కూడా రెండు శాసనసభల్లో మూడింట రెండువంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించిన తర్వాతనే'' అని చెప్పింది. ఈ తరహా ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా విపులీకరిస్తూ తన నివేదికలో ఫజల్‌ ఆలీ సంఘం ''ఐదారేళ్లలలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు విలీనం కావటా నికి ఉన్న అవకాశాలు ఏమీ తగ్గిపోవు. ఈ కాలంలో రెండు ప్రభుత్వాలూ తమ పరిపాలనా వ్యవస్థలను స్థిరీకరించుకోవటానికి కృషి చేయ వచ్చు. రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్న లాండ్‌ రెవిన్యూ వ్యవస్థను కూడా అవసరమనుకుంటే సమీక్షించుకోవచ్చు. రెంటిమధ్య సారూప్యత సాధించ వచ్చు. ఈ రెండు ప్రారతాల ప్రజల్లో అక్కడక్కడా ఉన్న భేదాభిప్రాయాలు, ఆందోళ నలను తొలగించటానికి కూడా ఈ కాల వ్యవధి ఉపయోగపడుతుంది. ఒకసారి అటువంటి ఆందోళనలు తొలగిపోతే విలీనం శాశ్వతమవు తుంది'' అని ప్రకటించింది. ఈ విధంగా రాష్ట్రా ల పునర్య్వవస్థీకరణ సంఘం అన్ని అవకాశా లు, మార్గాలు సూచించింది. విశాలాంధ్ర ఏర్పా టుకు అవసరమైన భూమిక సిద్ధం చేయా ల్సిన బాధ్యత పాలకులపైనే ఉందని స్పష్టం చేసింది.

కానీ ఈ దూరదృష్టితో కూడిన కమిషన్‌ నివేదికను పక్కన పెట్టి నెహ్రూ ప్రభుత్వం తెలంగాణను శాశ్వతంగా ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని ప్రయత్నించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అప్పటి హైదరాబాద్‌ శాసనసభలో రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కమ్యూని స్టులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ పరిస్థితు ల్లో హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శాసనసభలో తీర్మానం ఆమో దించటం ద్వారా హైదరాబాద్‌, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించటానికి మార్గం సిద్ధం చేశారు. ఆ విధంగా నవంబరు 1, 1956 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయటంతో సంయుక్త మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల ఏర్పాటు గురించి కూడా సమరశీల పోరాటం ప్రారంభమైంది. ఈ ఉద్యమం వెనక ఉన్న బల మైన ప్రజాతంత్ర కోరిక, స్పూర్తిని గుర్తించ నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున అణచివేతకు పూనుకొంది. బొంబాయిలో ఒక్క రోజులోనే 90 మంది ఆందోళనకారులు పోలీసు కాల్పుల్లో బలయ్యారు. బొంబాయిని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలన్న నెహ్రూ ఆలోచననను బూర్జువావర్గం సమర్థించింది. స్వాతంత్య్రానంత రం రాజకీయ రాజధాని ఢిల్లీ అయినా ఆర్థిక రాజధానిగా బొంబాయి అవతరించిన విషయం తెలిసిందే. బొంబాయి ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే తమ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలకు మెరుగైన రక్షణలుంటాయని ఈ వర్గం భావించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల సమస్య పరిష్కారం అయిన తర్వాత పంజాబ్‌ సమస్య జాతీయ రాజకీయాల్లో ముఖ్య సమస్యగా ముందుకు వచ్చింది. హర్యానా, పంజాబ్‌లను వేర్వేరు రాష్ట్రాలుగా చేయాలన్నది అక్కడి ప్రజల డిమాండ్‌. 1968లో శ్రీనగర్‌లో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశాల్లో మాట్లాడుతూ అప్పటి సిపిఐ(ఎం) ప్రధాన కార్య దర్శి పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్రాల పునర్య్వ వస్థీకరణ సమస్యను ఒక కొలిక్కి తేవటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తాత్సార వైఖరిని దుయ్యబట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలను కులతత్వం, మతత త్వంతో కూడిన ఉద్యమాలతో జతకట్టి జాతీయ సమగ్రతకు ప్రమాద చిహ్నాలుగా చూపించేందుకు జరిగిన ప్రయత్నాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను కూడా పునర్య్వవస్థీకరించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. చివరకు 70 దశకంలో ఈశాన్య రాష్ట్రాలను భాష, జాతుల ఆధారంగా పునర్య్వ వస్థీకరించటంతో భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ముగింపుకు వచ్చింది.

No comments: