ప్రజాశక్తి - బిజినెస్ వాచ్ హైదరాబాద్ కొండూరి వీరయ్య Sun, 27 Dec 2009, IST
నూతన సంవత్సరం ఆరంభంతో ప్రస్తుత సహస్రాబ్దిలో రెండో దశాబ్దం మొదలవుతుంది. 21 వ శతాబ్దంలో మొదటి దశాబ్దం సంపన్న దేశాలకు పీడ కలగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. గత శతాబ్దం చివరికి సంపన్న దేశాల చేతుల్లో సంఘటితమవుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ క్రమాన్ని నూతన సహస్రాబ్దంలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఉవ్విళ్లూరిన ప్రపంచీకరణ వాదులకు ఈ దశాబ్దం చేదు అనుభవాలు మిగిలించింది. 2001 సంవత్సరంలో మొదలైన దోహా దఫా ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలు నేటికీ ముగింపుకు రాకపోవటం ఒక కారణం కాగా గత మూడేళ్లుగా పెట్టుబడిదారీ వ్యవస్థలను ముంచెత్తిన సంక్షోభం ఆ దేశాలను పెద్దఎత్తున దెబ్బ తీసింది. చివరిగా కోపెన్‌హాగెన్ సమావేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో సంపన్న దేశాల దూకుడుకి పెద్దఎత్తున గండి పెట్టింది. కోపెన్‌హాగెన్ సదస్సు గతవారం ప్రస్తావించుకున్నట్లు తరుగుతున్న సంపన్న దేశాల పలుకుబడికి, పెరుగుతున్న వర్థమాన దేశాల ప్రతిష్టకు అద్దం పడుతున్నాయి. రెండు సంఘటనలు ఇక్కడ ప్రస్తావించుకుందాం.
చర్చలు పతాక స్థాయికి చేరుకున్న 18వ తేదీ అర్థరాత్రి బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా, భారతదేశం (బేసిక్ దేశాలు) సూడాన్‌లు వర్థమాన దేశాల తరపున వ్యూహరచన చేస్తుంటే ఉన్నట్లుండి హఠాత్తుగా ఒబామా తలుపుతోసుకుని లోపలికి వచ్చాడు. అంతకుముందు సంపన్న దేశాలు జరుపుకున్న ప్రత్యేక సమావేశానికి భారత, చైనా ప్రధాన మంత్రులను ఆహ్వానించకపోవటంతో వీరిద్దరూ అలక వహించారు. దీనికి బదులుగా ఒబామాతో జరిగే కీలక చర్చలకు చైనా ప్రధాని అత్యంత దిగువ స్థాయి అధికారిని పంపించటంతో అమెరికా, జర్మనీ అధినేతలు నోరు వెళ్లబెట్టారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం పొందేలా చూసుకోవటానికి సంపన్న దేశాల అధినేతలు ఎన్ని పాట్లు పడాల్సి వచ్చిందో ఈ ఉదాహరణలు వివరిస్తున్నాయి. అంతేకాదు. అమెరికా అధినేత పట్టుకొచ్చిన ముసాయిదాలో క్యోటో ఒప్పందం ఆధారంగా భవిష్యత్తు చర్చలు జరగాలన్న వాక్యం చేర్చే వరకూ ఆ ముసాయిదాను చర్చింటానికే వర్థమాన దేశాలు, బేసిక్ దేశాలు నిరాకరించాయి. చివరకు దిగి వచ్చిన అమెరికా రాజకీయ అవగాహన తుది ముసాయిదాలో భవిష్యత్తు చర్చలు క్యోటో ఒప్పందం అవగాహన పునాది మీదనే ముందుకు వెళ్లాలని అంగీకరించింది.
ఈ పరిస్థితి చూస్తే గత దశాబ్ద కాలంలో సామ్రాజ్యవాద దేశాలు అంతర్జాతీయ ఒప్పందాల రూపకల్పనలో దోహా వైఫల్యం నుండి ఎంతో కొంత పాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. కోపెన్‌హాగెన్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ అధిపతి పాస్కల్ లామే విఫలమవుతున్న దోహా దఫా వాణిజ్య చర్చలు కొలిక్కి తేవటానికి కూడా కోపెన్‌హాగెన్ తరహా పద్ధతులు అనుసరించాలని అభిప్రాయపడ్డాడు.
ఈ దశాబ్దకాలంలో పెట్టుబడిదారీ సౌధానికి బీటలు కొట్టిన ఆర్థిక సంక్షోభం, దాని పూర్వా పరాల గురించి 'ప్రజాశక్తి బిజినెస్‌వాచ్'లో విపులంగానే చర్చించుకున్నాము. ఈ సంక్షోభానికి, కోపెన్‌హాగెన్ రాజకీయ అవగాహనకు మధ్య సంబంధం ఉండటమే కాదు. సదరు సంక్షోభ నివారణకు జరిగిన ప్రయత్నాలకు, కోపెన్‌హాగెన్‌లో రాజకీయ అవగాహన ఆమోదింపచేసుకునేందుకు జరిగిన ప్రయత్నాలకు మధ్య కూడా సారూప్యత కనిపిస్తోంది.
ముందుగా సంక్షోభానికి, కోపెన్‌హాగెన్ సదస్సు ఆమోదించిన రాజకీయ అవగాహనకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను కుదిపేసిన తాజా సంక్షోభం నుండి అమెరికాతో సహా సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలేవీ బయట పడలేదు. ఇప్పటికీ అమెరికాలో నిరుద్యోగం పద్దెనిమిది శాతానికి అటు ఇటుగా కొనసాగుతోంది. గత వారం ఒక పత్రికలో వ్యాఖ్యానిస్తూ జోసెఫ్ స్టిగ్లిట్జ్ అమెరికా రెండో దఫా ఉద్దీపన పథకానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మరో విశ్లేషణలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరటంతో నిరుద్యోగ భృతి కింద అయ్యే ఖర్చు కూడా విపరీతంగా పెరిగిందని అమెరికా ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ని వివరాలు ప్రస్తావించుకోవటం ఎందుకని ప్రశ్నించవచ్చు.
పర్యావరణం ఎదుర్కొంటున్న ముప్పును నివారించటానికి ఇంధన వనరుల వినియోగంలో సమగ్ర, సమూల మార్పులు కీలక, తక్షణ అవసరం అన్నది తెలిసిందే. ఈ రకమైన మార్పు సాధించాలంటే ఇంధన వినియోగానికి సంబంధించిన పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు సాధించాలి. శిలాజ ఇంధనాల వినియోగానికి బదులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వినియోగంలోకి తేవాలి. ఈ మార్పు ఒక్కసారిగా సాధ్యం కాదు కనుక ప్రస్తుత శిలాజ ఇంధన వనరుల ఉపకరణాలు తయారు చేసే పరిశ్రమలను ఆధునీకరించాలి. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం 43 ట్రిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉపకరణాల పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఇంధన మదుపుకు అవసరమైన రీతిలో వీటిని ఆధునీకరించాలంటే సంవత్సరానికి నూట అరవై బిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు పెట్టాలి.
అది కూడా రెండువేల ఇరవై నాటికి దీనిపై ఏటా మూడు శాతం అదననపు వ్యయం పెంచుకుంటూ పోతే రెండువేల ఇరవై నాటికి పెరిగే పర్యావరణ ముప్పును నియంత్రించటానికి దీటుగా నిలవగలుగుతుంది. ప్రపంచబ్యాంకు రెండువేల ఏడులో ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఒక నివేదిక ప్రకారం ఇందులో వివిధ రూపాల్లో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం. ఈ పరిస్థితుల్లో సంక్షోభం నుండి బయట పడని సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంత పెద్ద మొత్తం భారాన్ని భరించటానికి సిద్ధంగా లేవు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం నిధులు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వెచ్చింపుకు వినియోగించటం అంటే ఆ మేరకు సదరు కంపెనీలకు వచ్చే లాభాలను తగ్గించుకోవటమే అవుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అభివృద్ధి చేయకుండా పర్యావరణంలో చేరే కర్బన ఉద్గారాలను నియంత్రించటం సాధ్యం కాదు. సంపన్న దేశాలు నిర్దిష్ట మోతాదులో కర్బన ఉద్గారాలు తగ్గించుకుంటామని చెప్పేందుకు సాహసించకపోవటం వెనక గల కారణం ఇది. తాజా సంక్షోభం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
చివరిగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుండి బయటపడటానికి చేసే ప్రయత్నాలకు కోపెన్‌హాగెన్ సదస్సును కొలిక్కి తేవటానికి జరిగిన ప్రయత్నాలకు మధ్య సారూప్యత ఉందని పైన చెప్పుకున్నాము. మూడేళ్ల పాటు సంపన్న దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అనే ఊడల మర్రిని గడగడలాడించింది తాజా సంక్షోభం. ఈ సంక్షోభం నుండి బయట పడటానికి సంపన్న దేశాలు దేశీయంగా తీసుకున్న చర్యలన్నీ విఫలం అయ్యాయి. అమెరికా నాయకత్వంలో సంక్షోభ తీవ్రత నివారణ యత్నాలను అభివృద్ది చెందుతున్న దేశాలకు కూడా విస్తరించిన తర్వాత మాత్రమే సంక్షోభం తీవ్రత శాంతించింది. సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువుగా నిలిచే పెట్టుబడులు స్థంభించిపోయాయి. సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు జి20 దేశాల కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాధ్యతలు భుజానికెత్తుకున్న తర్వాత గానీ మార్కెట్లలో విశ్వాసం కలగలేదు.
అదే విధంగా కోపెన్‌హాగెన్ సమావేశాలు కూడా. అప్పటి వరకు సంపన్న దేశాలు ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మటానికి సిద్ధంగా లేని ప్రపంచం కోపెన్‌హాగెన్ చివరి రోజున అమెరికాతో సహా మరో 27 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చామని ప్రకటించిన తర్వాత గానీ పర్యావరణానికి ఎదురయ్యే ముప్పును నియంత్రించగలమన్న విశ్వాసానికి రాలేకపోయింది. అయితే ఈ ఒప్పందంలో నిర్దిష్ట విధి విధానాలు, కాల పరిమితులు లేకపోవటం ఆందోళన కలిగించే అంశమే అనటంలో సందేహం లేదు. అదే సమయలో ఈ పరిణామం మాటున దాగి ఉన్న మరో కీలకమైన మార్పు అంతర్జాతీయ విధాన రూపకల్పనలో వర్థమాన దేశాలు ప్రధానంగా చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల పాత్ర. ఈ పరిణామాన్ని ఆచరణలోకి తేవాలంటే వర్థమాన దేశాల ఐక్యత మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కోపెన్‌హాగెన్ సమావేశాలు సంపన్న దేశాలకు వ్యతిరేకంగా వర్థమాన దేశాలు విశాల ఐక్యసంఘటన నిర్మించటానికి వేదికను కల్పించాయి. ఈ వేదికను వర్థమాన దేశాలు సరిగ్గానే ఉపయోగించుకున్నాయి.
ఈ విశాల ఐక్య సంఘటనకు చైనా నాయకునిగా అవతరించింది. అయితే చైనా, అమెరికాల మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక వైరుధ్యాలు అందరికీ తెలిసినవే. ఈ వైరుధ్యాల నడుమ వర్థమాన దేశాల విశాల ఐక్యత ఏ దిశగా ప్రేరకంగా పని చేయనున్నదన్న విషయం రానున్న కాలంలో అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ చిత్రపటం ఏ రూపు తీసుకోనుందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment