Monday, December 7, 2009

కోపెన్హెగన్‌లో భారత్‌ పయనమెటు ?

మన్మోహన్‌సింగ్‌ తాజా అమెరికా పర్యటనలోనూ, పర్యటన ముగింపు సందర్భంగానూ కోపెన్హెగన్‌ సదస్సు ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదని ఒబామాతో గొంతు కలిపాడు. నిజానికి అటువంటిదేదైనా జరిగే ప్రమాదం ఉంటే దానికి వ్యతిరేకంగా వర్దమాన దేశాలను కూడగట్టాల్సిన మన దేశం ఆ కర్తవ్యాన్ని విడనాడింది. అంతేకాదు. అమెరికా తీసుకుంటున్న తిరోగమన వైఖరికి మద్ధతు చేకూర్చే పనిలో నిమగమైంది. ఫలితంగా కోపెన్హెగన్‌లో మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్న వర్దమాన దేశాలు మనవైపు రావటానికి సిద్ధంగా లేవు. ఈ దేశాలు నేడు చైనా మార్గదర్శనంలో ముందుకు నడుస్తున్నాయి.ఈ మధ్యకాలంలో భారత పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ జరిపిన చైనా పర్యటనలో విధానపరంగా చైనా ఏ విధంగా ముందుకు దూసుకుపోతోందో రుజువయ్యింది. బ్రెజిల్‌, భారత్‌, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు కోపెన్హెగన్‌లో ఒక కూటమిగా వ్యవహరించాలని, ఒక తీర్మానాన్ని కూడా ప్రతిపాదించాలని చైనా చొరవ తీసుకున్నది. ఈ పరిణామం రానున్న కాలంలో విదేశాంగ వ్యవహారాల్లో మనదేశం ఎదుర్కొనే పరిణామాలను తెలియచేయటమే కాదు. అంతర్జాతీయ సమావేశాల్లో అవసరమైన ఎత్తుగడలు వేసే శక్తి మనకు లేదన్న విషయాన్ని కూడా ముందుకు తెస్తోంది.




సోమవారం నుండి కోపెన్హెగన్‌లో పర్యావరణ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో మొత్తంగా ప్రపంచాన్ని పర్యావరణ ముప్పు నుండి కాపాడడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. ఇందుకు గాను దేశ దేశాల నేతలు హాజరు కానున్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉండి, పెద్దగా వివాదాలు రాని పక్షంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదలు, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వరకు కోపెన్హెగన్‌ బయలుదేరే అవకాశం ఉంది. ముందుగా తొమ్మిదవ తారీఖున కోపెన్హెగన్‌ చేరుకోవాలనుకున్న ఒబామా ప్రస్తుతం 18న చేరుకోనున్నారు. అదే విధంగా సీనియర్‌ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ స్థానంలో భారత్‌ బృందానికి నేరుగా ప్రధాని మంత్రి మన్మోహన్‌సింగ్‌ స్వయంగా నాయకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. మన్మోహన్‌సింగ్‌ కూడా 17వ తేదీనాటికి కోపెన్హెగన్‌ చేరుకోనున్నారు. వాషింగ్టన్‌ నుండే ఒబామా వివిధ దేశాధినేతలతో మంతనాలు నడుపుతున్నారు.



దాదాపు రెండు వారాల పాటు జరిగే ఈ సమావేశాలు మొత్తంగా మానవాళి తనను తాను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్న విషయంపై ఒక అవగాహన కలిగించనున్నాయి. ఈ సమావేశం ముఖ్య లక్ష్యం క్యోటో ఒప్పందం స్థానంలో ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవసరం అయిన నూతన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించడం. దానికి గాను ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. క్యోటో ఒప్పందం ముఖ్యాంశాలుగా చెప్పుకోవాలంటే సంపన్న దేశాలు తమ పరిశ్రమలు, జీవన శైలి కారణంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్న హరిత హనన వాయువులు (వీటినే పెట్టుబడిదారీ విశ్లేషకులు హరిత వాయువులు అని పిలుస్తున్నారు) తగ్గించుకోవాలి. అదే సమయంలో వర్దమాన దేశాలు సంపన్న దేశాలు చేసే ఈ ప్రయత్నాలకు సహాయం చేయాలని కూడా నిర్ణయం అయ్యింది.



అటువంటి సహాయం అమలులో భాగంగానే కార్బన్‌ట్రేడింగ్‌ పథకం ఉనికిలోకి వచ్చింది. ఈ క్రమంలో వర్దమాన దేశాలు తమ తమ దేశాల్లో పేదరికం నివారణకు, నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఈ చర్యల నేపథ్యంలో హరిత హనన వాయువుల విడుదల సమస్య కాబోదని కూడా అంగీకారం కుదిరింది. అందువల్లనే క్యోటో ఒప్పందం మొత్తం ప్రపంచ దేశాలను రెండు భాగాలుగా విడగొట్టింది. మొదటి భాగంలో సంపన్నదేశాలు ఉన్నాయి. ఈ దేశాలు కర్బన వాయువు విడుదలలను తగ్గించాల్సిన బాధ్యతను నెరవేర్చాలి. రెండో భాగంలోని దేశాలు వర్దమాన దేశాలు. ఈ దేశాలు తమ తమ దేశాల్లోని పేదరికాన్ని తగ్గించేందుకు కృషి చేయాలి. క్యోటో ఒప్పంద కాలంలో కుదర్చుకున్న అవగాహన మేరకు సదరు ఒప్పందం కేవలం 2012 వరకూ వర్తిస్తుంది. తర్వాత కాలానికి గాను ప్రపంచ దేశాలు మరో అవగాహనకు రావాల్సి ఉంది.



అంతే కాదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వివిధ దేశాలు క్యోటో ఒప్పందం అమలులో ఏ మేరకు పురోగతి సాధించాయన్న విషయాన్నీ సమీక్షించాలి. అటువంటి సమీక్షల కోసం జరిగే సమావేశాలనే భాగస్వామ్య దేశాల సమావేశంగా పిలుస్తున్నారు. డెన్మార్క్‌లో జరుగుతున్న సమావేశం అటువంటి వార్షిక సమావేశాల్లో 15వ సమావేశం. మిగిలిన 14 వార్షిక సమావేశాలు వివిధ దేశాలలో కర్బన వాయువుల తరుగుదల తీరును లేదా పెరుగుదల తీరును పరిశీలించి విశ్లేషణలు చేస్తే ప్రస్తుత సమావేశాలు ఈ విశ్లేషణలతోపాటు రానున్న కాలానికి గాను నూతన చట్రాన్ని నిర్దారించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే కోపెన్హెగన్‌ సమావేశాలకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. కోపెన్హెగన్‌ సదస్సులో చర్చలను ఒక నిర్దిష్ట దిశలో మళ్లించటానికి గాను అంతర్జాతీయ పర్యావరణ వేదిక (ఐపిసిసి) ఒక అధ్యయన నివేదికను తయారు చేసింది.



ఈ నివేదిక నిర్దారణల మేరకు సంపన్న దేశాలు విడుదల చేసే కర్బన వాయువుల్లో 2020నాటికి 25-40శాతానికి, 2050 నాటికి 85-90శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది. కానీ క్యోటో ఒప్పందం నాటికి కర్బన వాయువుల విడుదల 5.2శాతం చొప్పున పెరిగితే ఈ కాలంలో 11.2% చొప్పున పెరిగింది. అంటే గత 12 సంవత్సరాల్లో మనం లక్ష్యానికి ఆమడ దూరంలో వెనక్కి జరిగామన్నమాట.


ఈ విధంగా గత దశాబ్దకాలంగా కర్బన వాయువు విడుదల లక్ష్యానికి దూరంగా జరగడం క్యోటో ఒప్పంద వైఫల్యమేనని సంపన్న దేశాలు ముఖ్యంగా అమెరికా వాదన ప్రారంభించింది. ఈ వాదన నేడు పెరిగి పెరిగి మొత్తంగా క్యోటో ఒప్పందాన్నే ప్రశ్నార్థకం చేసింది. ఇటువంటి పరిణామానికి దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి.



నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒబామా నిర్వహించిన ప్రచారంతో పర్యావరణ వాదులందరికీ కాస్తంత ఆశ పుట్టింది. అంతకు పూర్వం బుష్‌ హయాంలో అమెరికా పూర్తిగా క్యోటో ఒప్పందం నుండి వైదొలిగింది. దాంతో మొత్తంగా పర్యావరణ చర్చలు ప్రశ్నార్థకం అయ్యాయి. అప్పట్లో బుష్‌ ముందుకు తెచ్చిన వాదనే నేడు అమెరికా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. క్యోటో ఒప్పందం నాటికి సెనేటర్‌గా ఉన్న ఒబామా అప్పుడే క్యోటో ఒప్పందాన్ని వ్యతిరేకించాడు. కానీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒబామా 'నేను (అధ్యక్షునిగా) ఎన్నికయితే ఈ చర్చల్లో అమెరికా మరో మారు కీలక పాత్ర పోషిస్తుందని హామీ ఇస్తున్నాను. పర్యావరణ చర్చల విషయంలో నూతన తరహా అంతర్జాతీయ సహకారాన్ని అందిస్తాము' అని పేర్కొన్నారు. ఆ సమయంలో బ్రిటన్‌కు చెందిన ఒక పత్రిక 'క్యోటో ఒప్పందాన్ని పునఃసమీక్షించడానికి అమెరికా సిద్ధమన్న అమెరికా అధ్యక్ష ప్రతినిధి ప్రకటనతో పర్యావరణ చర్చలు ఒక్కసారిగా సానుకూల మార్గంలోకి మళ్లినట్లయ్యింది.



బుష్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా పర్యావరణ చర్చలకు సృష్టించిన ప్రతిబంధకాలు తొలిగిపోయినట్లయ్యింది. బుష్‌ కల్పించిన అవరోధాలు పర్యావరణ చర్చల పురోగతిని పెద్ద ఎత్తున అడ్డుకున్నాయి.' అని విశ్లేషించింది.


అయితే ఈ ఓదార్పు ఎంతోకాలం నిలవలేదు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఒబామా తిరిగి బుష్‌ బాటలోనే నడక ప్రారంభించారు. ప్రస్తుత పర్యావరణ ఒప్పందం వెలుగులో సంపన్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడపాదడపా మాట్లాడడం ప్రారంభించాడు. ఒబామా ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదించిన వాక్స్‌మన్‌-మార్క్‌, కెర్రీ-బాక్సర్‌ బిల్లులోనూ ఇదే ధోరణి వ్యక్తం అయ్యింది. ప్రస్తుతం సెనెట్‌ కమిటీ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు 2013కంటే ముందు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం పొందే అవకాశం కనిపించటం లేదు. అదే సమయంలో తాజాగా ఒబామా చైనా పర్యటన సందర్భంగా 'కోపెన్హెగన్‌లో అమెరికా తీసుకునే వైఖరి అమెరికా చట్టాలకు లోబడి ఉంటుంది.



' అని స్పష్టం చేశారు. అంటే దానర్థం వాక్స్‌మన్‌ మార్క్‌ బిల్లు ఆమోదం పొందేంత వరకూ పర్యావరణ చర్చల్లో అమెరికా వైఖరిలో ఏ మార్పూ ఉండదన్నమాట. అమెరికా సెనెట్‌లో డెమోక్రాట్లదే ఆధిపత్యం. అధ్యక్షుడు డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన వాడు. అయినా బిల్లు ఆలస్యం అవుతుందంటే దాని వెనుక ఉన్న ఎత్తుగడను మనం అర్థం చేసుకోవాలి. ఈ తాత్సారానికి ఒక ముఖ్య కారణం 2010లో జరగనున్న ఎన్నికలు. ఇప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున నిరుద్యోగం తాండవిస్తోంది. దానికి తోడూ ఉద్దీపన పథకం పలాలు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. క్యోటో ఒప్పందం కానీ, అటువంటి మరే ఒప్పందమయినా కానీ సంపన్న దేశాల్లో పారిశ్రామిక ప్రగతికి అవరోధం అన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో క్యోటో తదనంతర కాలంలో అమలు కావాల్సిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాన్ని ఖరారు చేయటంలో అమెరికా పాత్ర పోషించడం అంటే దేశీయంగా రాజకీయ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావటమే. దీనికి ఒబామా కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగానీ సిద్ధంగా లేవు.



మరో ముఖ్యమైన కారణం ఉంది. అది తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న పెట్టుబడిదారీ సంక్షోభం. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కుదిపేసిన, కుదిపేస్తున్న పెట్టుబడిదారీ సంక్షోభం నేపథ్యంలో పలు ప్రపంచ దేశాలు దేశీయ ఆర్థిక వ్యవస్థలను సరిదిద్దుకునే క్రమంలో ఉన్నాయి. తాజా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న అమెరికాలో దేశీయంగా కొనుగోలు శక్తి పెంచటం తక్షణ సమస్యగా ఉంది. కొనుగోలు శక్తి పెరగడానికి, పారిశ్రామిక రంగ ప్రగతికి మధ్య ఉన్న సంబంధం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాన్ని చేరుకొంటూ పారిశ్రామిక ప్రగతి సాధించాలంటే ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానం కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాలి. సంక్షోభంతో చితికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతశక్తి లేదు. ఒకవేళ ఉన్నా అమెరికా ప్రభుత్వాన్నే శాసించగల శక్తివంతులకు కేంద్రంగా ఉన్న వాల్‌స్ట్రీట్‌ గోడలు దాటి అది బయటపడలేదు.



ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఒక్కటే. అది కోపెన్హెగన్‌ చర్చలను దారి మళ్లించడం. ఈ ప్రయత్నంలో సంపన్న దేశాల మేధావులు, ప్రభుత్వాలు కుమ్మక్కయి ముందుకు తెస్తున్న వాదనే చైనా, భారత దేశాల నుండి విడుదలవుతున్న కాలుష్య కారకాల గురించిన చర్చ.సంపన్నదేశాలు, ఆ దేశాలకు చెందిన విశ్లేషకులు గత కొంత కాలంగా ముందుకు తెస్తున్న ప్రధాన వాదన వర్దమాన దేశాలను పర్యావరణ ఒప్పందం బాధ్యతల నుండి మినహాయించడం ద్వారా మొత్తం భారం సంపన్న దేశాలపై మోపారన్నది. దీనికి ఆధారంగా వర్దమాన దేశాలు ముఖ్యంగా భారత్‌, చైనా దేశాల పారిశ్రామిక ప్రగతిని చూపిస్తూ దాని ఆధారంగా ఈ దేశాల పారిశ్రామిక వ్యవస్థల నుండి విడుదలవుతున్న కాలుష్య వాయువుల పరిమాణాన్ని ఆధారం చేసుకుని చర్చలు జరగాలని, అదే విధంగా వర్దమాన దేశాలు కూడా తమ తమ కలుషిత వాయువిడుదలల నియంత్రణ లక్ష్యాలను ముందుగానే ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నారు.



భారత్‌ వంటి వర్దమాన దేశాలు ఈ ఒత్తిళ్లకు లొంగి ఈ విధంగా ప్రకటిస్తున్నాయి కూడా. తాజాగా మన్మోహన్‌ ప్రభుత్వం పర్యావరణ పథకాన్ని ప్రకటించటమే కాదు. కలుషిత వాయు విడుదల లక్ష్యాలను కూడా ప్రకటించింది. అందరూ ఏమర్చిన విషయమేమిటంటే భారతదేశం కలుషిత వాయు విడుదల లక్ష్యాలను ప్రకటించడానికి రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు ఒబామా పలు దఫాలు మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడారు. ప్రధాని కార్యాలయం ప్రతినిధులు ఈ టెలిఫోన్‌ చర్చలు ఆఫ్ఘన్‌కు సైన్యాన్ని పంపటం గురించి అని చెప్పినా, పర్యావరణ మంత్రి జైరామ్‌ రమేష్‌ కలుషిత వాయు విడుదల లక్ష్యాలను పార్లమెంట్లో ప్రకటించటం వెనుక అమెరికా జోక్యం లేదని భావించలేం. అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే తీరును పరిశీలించిన వారెవరికైనా ఈ సందేహం కలగడం సహజం. అంతే కాదు. భారత ప్రభుత్వం గత ఆరు మాసాలుగా పర్యావరణ విషయాలపై వెల్లడిస్తున్న అభిప్రాయాలు గమనిస్తే, జైరామ్‌ రమేష్‌ మాటల్లోనే 'భారత ప్రభుత్వ వైఖరిలో సున్నితమైన మార్పులు' వచ్చాయి.



ప్రభుత్వం దృష్టిలో ఇవి సున్నితమైనవే కావచ్చు కానీ ఇవి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానానికి సూచికలుగా కూడా ఉన్నాయి. మన్మోహన్‌సింగ్‌ తాజా అమెరికా పర్యటనలోనూ, పర్యటన ముగింపు సందర్భంగానూ కోపెన్హెగన్‌ సదస్సు ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదని ఒబామాతో గొంతు కలిపాడు. నిజానికి అటువంటిదేదైనా జరిగే ప్రమాదం ఉంటే దానికి వ్యతిరేకంగా వర్దమాన దేశాలను కూడగట్టాల్సిన మన దేశం ఆ కర్తవ్యాన్ని విడనాడింది. అంతేకాదు. అమెరికా తీసుకుంటున్న తిరోగమన వైఖరికి మద్ధతు చేకూర్చే పనిలో నిమగమైంది. ఫలితంగా కోపెన్హెగన్‌లో మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్న వర్దమాన దేశాలు మనవైపు రావటానికి సిద్ధంగా లేవు. ఈ దేశాలు నేడు చైనా మార్గదర్శనంలో ముందుకు నడుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో భారత పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ జరిపిన చైనా పర్యటనలో విధానపరంగా చైనా ఏ విధంగా ముందుకు దూసుకుపోతోందో రుజువయ్యింది.



బ్రెజిల్‌, భారత్‌, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు కోపెన్హెగన్‌లో ఒక కూటమిగా వ్యవహరించాలని, ఒక తీర్మానాన్ని కూడా ప్రతిపాదించాలని చైనా చొరవ తీసుకున్నది. ఈ పరిణామం రానున్న కాలంలో విదేశాంగ వ్యవహారాల్లో మనదేశం ఎదుర్కొనే పరిణామాలను తెలియచేయటమే కాదు. అంతర్జాతీయ సమావేశాల్లో అవసరమైన ఎత్తుగడలు వేసే శక్తి మనకు లేదన్న విషయాన్ని కూడా ముందుకు తెస్తోంది. మర్దమాన దేశాలు కూడా ఎంతో కొంత వాయు విడుదలలను తగ్గించాలన్న డిమాండ్‌ ముందుకు తేవటం అంటే క్యోటో ఒప్పందంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని (వర్దమాన దేశాలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం సంపన్న దేశాల నుండే రావాలన్న లక్ష్యాన్ని) ఎజెండా నుండి తొలగించడమే అవుతుంది. తర్వాత కాలంలో వర్దమాన దేశాల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అవసరమైన వనరులు సమకూర్చే బాధ్యత నుండి సంపన్న దేశాలు వైదొలగడానికి అవసరమయిన భూమికను ఈ డిమాండ్‌ సిద్ధం చేస్తోంది.



సంపన్న దేశాలు ఇప్పటి వరకు సాంకేతిక సామర్థ్యాలు పెంచుకునేందుకు సహకరించలేదు. పైగా అనేక అవరోధాలు సృష్టించాయి. అటువంటి పరిస్థితుల్లో వర్దమాన దేశాలు పర్యావరణ పరిరక్షణలో సమాన బాధ్యతలు నెత్తిన వేసుకోవడం అంటే అభివృద్ధి కావటానికి వీలుగా ఏర్పరుచుకున్న వెసులుబాట్లను వదులుకోవటమే అవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తాజా సంక్షోభం నేపథ్యంలో సంపన్న దేశాలకు కావాల్సింది కూడా అదే. ఉన్న కాసిన్ని నిధులు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఖర్చయిపోతే బహుళజాతి కంపెనీల లాభాలు గణనీయంగా దెబ్బతింటాయి. అందువల్లనే కోపెన్హెగన్‌లో ఒప్పందం ఖరారు అయ్యే అవకాశాలు లేకుండా సంపన్న దేశాలు వ్యూహం పన్నాయి. ఈ వ్యూహాన్ని వర్దమాన దేశాలు ఎలా ఎదుర్కొంటాయన్న సంగతి కోపెన్హెగన్‌ సదస్సు ముగిసిన తర్వాత కానీ వెల్లడి కాదు.



2020 నాటికి వివిధ దేశాల కార్బన్‌ విడుదల లక్ష్యాలివి



కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల (బిలియన్‌ టన్నుల్లో) విడుదల తీవ్రత (జిడిపి/కెజి)


దేశం 1990 2005 2020 1990 2005 2020 2020లక్ష్యం భారంపంపిణీ


చైనా 2.2 5.1 11.1 86 49 31 28 -10


అమెరికా 4.9 5.8 5.8 58 43 31 26 -18


భారత్‌ 0.59 1.15 3.39 33 26 19 20 5


యూరోప్‌ 3.2 3.3 3.2 35 28 20 16 -21


ఇండోనేషియా 0.14 0.33 0.60 21 27 21 16 -26


కెనడా 0.43 0.56 0.62 55 46 36 26 -29


కొరియా 0.23 0.47 0.69 42 39 29 21 -30


బ్రెజిల్‌ 0.18 0.33 0.55 16 18 16 11 -36


జపాన్‌ 1.1 1.2 1.3 30 29 23 14 -37


ఆస్ట్రేలియా 0.26 0.39 0.46 60 52 40 25 -38


నార్వే 0.03 0.04 0.04 26 20 15 6 -59

No comments: