ప్రజాశక్తి - బిజినెస్ వాచ్ హైదరాబాద్ కొండూరి వీరయ్య
ఒకసారి విబేధాలు తారాస్థాయికి చేరాక చైనా, భారత్ వల్లనే కోపెన్హెగన్ సదస్సు విఫలం అయ్యే దిశగా నడుస్తోందని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి, అమెరికా ప్రతినిధి విమర్శల దాడికి దిగారు. చైనా, భారత్, జి 22 దేశాల ప్రతినిధులు ఈ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చివరకు వర్థమాన దేశాల ప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏ రకమైన అవగాహనకు రావటం సాధ్యం కాదని సంపన్న దేశాలు గుర్తించేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయ్యింది. ఎటువంటి అంగీకృత ఒప్పందం లేకుండానే దేశాధినేతలు చర్చలు ప్రారంభించాల్సి వచ్చింది. బహుళ అంతర్జాతీయ సమావేశాలు ఈ విధంగా జరగటం ఇదే ప్రథమమేమో.
12 రోజులుగా డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్‌లో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సును స్థూలంగా చూసినప్పుడు నిరాశాజనకంగా ముగిసిందని చెప్పొచ్చు. సమావేశం ఆరంభం నుండి ముగింపు వరకు వర్థమాన దేశాలకు, సంపన్న దేశాలకు మధ్య హోరాహోరి వాగ్యుద్ధం నడిచింది. సంపన్న దేశాలు అన్నీ ఏకమై మొత్తం పర్యావరణ చర్చలకు ప్రాణాధారంగా ఉన్న క్యోటో ఒప్పందాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని వర్థమాన దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి అని చెప్చొచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ సంక్షోభం తర్వాత అమెరికా నేతృత్వంలోని ధనిక దేశాలు అంతర్జాతీయంగా ఎదుర్కొన్న మరో ఎదురు దెబ్బగా దీనిని అభివర్ణించవచ్చు. సమావేశాలు ప్రారంభం అయిన రోజున ఇదే పేజీలో భారత్ ఏ వైఖరి చేపట్టనుందో చర్చించుకున్నాము. దానికి కొనసాగింపుగా చూస్తే భారత దేశం చాలా కాలం తరువాత చైనా ఇతర వర్థమాన దేశాల కూటమితో ఆద్యంతమూ నడిచిన సందర్భంగా దీనిని చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కోపెన్హెగన్ సదస్సు క్యోటో ఒప్పందాన్ని బతికించుకోవటంలో విజయవంతం అయ్యిందని చెప్పొచ్చు.
కోపెన్హెగన్ సదస్సు ప్రధానంగా మూడు లక్ష్యాలతో మొదలయ్యింది. మొదటిది, క్యోటో అనంతర కాలంలో పర్యావరణ సమస్యలపై వివిధ దేశాలు అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించటం, అందుకవసరమైన నూతన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించటం సదస్సు ముందున్న మొదటి లక్ష్యం. ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అధిగమించే దిశగా వర్థమాన దేశాలు చేపట్టే చర్యలకు అవసరమైన నిధులు అందుబాటులోకి తేవటం కోపెన్హెగన్ సదస్సు ముందున్న రెండో కర్తవ్యం. ఇక మూడో కర్తవ్యం సంపన్న దేశాలు 2012 తర్వాతి కాలంలో ఎంత మేర హరిత హనన వాయువులను తగ్గించగలరో తేల్చుకోవటం. ఈ మూడు లక్ష్యాల సాధనలో కెపెన్హెగన్ సదస్సు సాధించిన పురోగతి కంటితుడుపు చర్యగానే ఉంది తప్ప ప్రయోజనకరంగా లేదు. ఈ కంటి తుడుపు పురోగతికి ముఖ్య కారణం సంపన్న దేశాలు అనుసరించిన వైఖరి. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన డెన్మార్క్ స్వయంగా సదస్సు నిస్సారంగా మారటానికి కావాల్సిన రంగం సిద్ధం చేసింది.
మొదటి వారం సంప్రదింపులు కూడా ఒక కొలిక్కిరాక ముందే ఒక ముసాయిదా ఒప్పందం ప్రతిని విడుదల చేసింది. 13 పేజీల ఈ ఒప్పందం ప్రారంభంలోనే 'ఐక్యరాజ్య సమితి రూపొందించిన పర్యావరణ ఒప్పందపు దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చటానికి ఏర్పాటయిన తాత్కాలిక వర్కింగ్ గ్రూప్, మరియు క్యోటో ఒప్పందం తర్వాతి కాలంలో అన్నెక్స్1 దేశాలు అమలు చేయాల్సిన హరిత హనన వాయు విడుదల పరిణామంపై ఏర్పాటయిన వర్కింగ్ గ్రూప్ లక్ష్యాలను గమనంలోకి తీసుకుని, ఉమ్మడి లక్ష్యాలు, కార్యాచరణతో కూడిన దేశీయ పథకాల నేపథ్యంలో కోపెన్హెగన్ సదస్సు ఆమోదిస్తున్న రాజకీయ తీర్మానం ఇది' అని పేర్కొంది. అంటే సదస్సు ముగింపుకు రాకముందే ఆతిథ్య దేశం సదస్సు లక్ష్యాలను తుంగలో తొక్కే ప్రయత్నం ప్రారంభించిందన్నమాట. అంతే కాదు 'ఇది రాజకీయ తీర్మానం' అని ముందుగానే లీక్ చేయడం ద్వారా ఈ సదస్సులో సంపన్న దేశాలు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా లేవని చెప్పకనే చెప్పింది. సంపన్న దేశాలు గత రెండు వారాలుగా అనుసరించిన ఎత్తుగడలు, వైఖరులు, పన్నిన వ్యూహాలు అన్నీ ఈ లక్ష్య సాధన దిశలోనే ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఈ ఒప్పందం మొదటి భాగంలోనే క్యోటో ఒప్పంద స్ఫూర్తికి భిన్నంగా అన్ని దేశాలు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను సమానంగా పంచుకోవాలని ప్రతిపాదించింది. అంటే ఇంతకాలం పర్యావరణానికి హాని చేసిన సంపన్నదేశాలను, నష్టపోయిన వర్థమాన దేశాలను ఒకే గాటన కట్టేందుకు డెన్మార్క్ ప్రతిపాదించిన తీర్మానం ప్రయత్నించింది. అందువల్ల ప్రతినిధుల స్థాయి చర్చల నుండి వర్థమాన దేశాల ప్రతినిధులు వరుసగా మూడు రోజులు వాకవుట్ చేయటాన్ని తప్పు పట్టలేం. అంతేకాదు. ఇప్పటి వరకు సంపన్న దేశాలకు పరిమితం అయిన గరిష్ట వాయువిడుదల సంవత్సరం అన్న సూత్రాన్ని డెన్మార్క్ ముసాయిదా వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకోవడానికి బదులుగా సంపన్న దేశాల సరసన జతకట్టి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పురోగతిపై ఆంక్షలు విధించేందుకు కుంటి సాకులు వెతికే ప్రయత్నం చేసింది. చర్చలు మొదలయిన రెండు మూడు రోజుల్లోనే వర్థమాన దేశాలు, సంపన్న దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరటం వెనుక జరిగిన తతంగం ఇది.
ఒకసారి విబేధాలు తారాస్థాయికి చేరాక చైనా, భారత్ వల్లనే కోపెన్హెగన్ సదస్సు విఫలం అయ్యే దిశగా నడుస్తోందని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి, అమెరికా ప్రతినిధి విమర్శల దాడికి దిగారు. చైనా, భారత్, జి 22 దేశాల ప్రతినిధులు ఈ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చివరకు వర్థమాన దేశాల ప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏ రకమైన అవగాహనకు రావటం సాధ్యం కాదని సంపన్న దేశాలు గుర్తించేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయ్యింది. ఎటువంటి అంగీకృత ఒప్పందం లేకుండానే దేశాధినేతలు చర్చలు ప్రారంభించాల్సి వచ్చింది. బహుళ అంతర్జాతీయ సమావేశాలు ఈ విధంగా జరగటం ఇదే ప్రథమమేమో.
ఈ సమావేశాలు మరో అంశాన్ని కూడా ముందుకు తెచ్చాయి. అది తగ్గిన అమెరికా రాజకీయ పలుకుబడి గురించి. చర్చలు మరో మూడు రోజుల్లో ముగుస్తాయనగా నెలకొన్న ఎడతెగని ప్రతిష్టంభనను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి 'అమెరికా అధ్యక్షులు బారాక్ ఒబామా రాకతో చర్చల్లో సానుకూల కదలిక రావచ్చు. అంగీకృత ఒప్పందం కుదరవచ్చు.' అని అభిప్రాయపడ్డారు. కానీ ఆచరణలో అటువంటిదేమీ జరగలేదు. ఒబామా సైతం విమానం దిగి నేరుగా సంప్రదింపులకు వెళ్లి వర్థమాన దేశాలను అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న తంత్రాన్ని ఉపయోగించారు. అది కూడా ఫలించలేదు. దీనిని బట్టి సంపన్న దేశాలు ఏ స్థాయిలో ఒంటెత్తుపోకడలకు పోయాయో అర్థం చేసుకోవచ్చు. చివరకు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ తిరుగు ప్రయాణానికి కూడా సిద్ధమయిన తర్వాత సంపన్న దేశాలు మేలుకొన్నాయి.
కనీసం ముందుగా అనుకున్నట్లు రాజకీయ ప్రకటన అయినా చేయలేకపోతే అమెరికా, ఒబామా పరువు గంగలో కలుస్తుందన్న ఆందోళనతో హోటల్ నుండి మన్మోహన్‌సింగ్‌ను వెనక్కు పిలిపించారు. చివరగా అమెరికా, జర్మనీ నాయకత్వంలోని సంపన్న దేశాల ప్రతినిధులకు, చైనా, భారత్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, సుడాన్, బంగ్లాదేశ్ దేశాధినేతల సమక్షంలో వర్థమాన దేశాల ప్రతినిధులకు మధ్య అర్థరాత్రి చర్చలు ముగిసాయి. ఫలితంగా ఒక నిస్సారమైన ప్రకటన వెలుగు చూసింది.
పలు దఫాల నిఘూడ చర్చల తర్వాత వెలుగు చూసిన రాజకీయ తీర్మానం కూడా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. సదస్సు విడుదల చేసిన తీర్మానానికి ముందు 36 గంటల వ్యవధిలో ఎనిమిది ముసాయిదాలు చర్చకు వచ్చాయి. ఏ ఒక్క ముసాయిదా అందరి ఆమోదాన్ని పొందలేకపోయింది. చివరగా వర్థమాన దేశాల ప్రతినిధిగా చైనా, సంపన్న దేశాల ప్రతినిధిగా అమెరికాలు ఒక అంగీకారానికి వచ్చి తీర్మానాన్ని దేశాధినేతల ముందు ఉంచాయి. ఈ ఒప్పందం రానున్నకాలంలో పర్యావరణంలో ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి పెరగకుండా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తోందే తప్ప నిర్దిష్టంగా ఏ దేశం ఏ చర్యలు తీసుకోవాలి అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయినా అదే పెద్ద ముందడుగని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించటం హాస్యాస్పదం. అదే విధంగా వర్థమాన దేశాలు తమ తమ దేశాల్లో చేపట్టే చర్యలకు అవసరమైన నిధుల విషయంలో కూడా తీర్మానం పెద్దగా పురోగతి చూపించలేకపోయింది.
మాట వరుసకు పర్యావరణ నిధిని 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ప్రపంచం చవి చూసిన పెట్టుబడిదారీ సంక్షోభం నుండి ఒక్క అమెరికాలోనే బ్యాంకులను గట్టెక్కించడానికి 800 బిలియన్ డాలర్లు వెచ్చించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఈ పర్యావరణ నిధి ఎంత తక్కువో అర్థం అవుతుంది. అందువల్లనే ఆఫ్రికా దేశాల ప్రతినిధి 'ఈ సదస్సు అత్యంత నిరుత్సాహకరంగా ముగిసింది. భవిష్యత్తు పట్ల ఎటువంటి ఆశలూ రేకెత్తించలేకపోయింది.' అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదించిన నిధి కూడా కేవలం 2020 వరకే వర్తిస్తోంది. తర్వాతి కాలానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఇందులోలేవు. ఈ ఒప్పందం మరోవైపున అటవీ సంరక్షణకు సంబంధించి కొత్త ప్రతిపాదన ఒకటి తెచ్చింది.
అమెజానన తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున వృక్ష సంపదను నరికివేయటం పర్యావరణానికి ముప్పు తెస్తున్న అంశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అందువల్ల అడవులు కాపాడేలా ఆఫ్రికా దేశాలను ప్రోత్సహించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. తీర్మానంలో మరింత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే కనీసం వచ్చే ఏడాది మెక్సికోలో జరిగే సదస్సులోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన తీర్మానం ఆమోదించేందుకు సహకరించేలా సంపన్న దేశాల నుండి ఎటువంటి హామీ తీర్మానంలో చోటు చేసుకోలేదు. క్యోటో ఒప్పందాన్ని మాత్రం చెత్త బుట్టలో పడనీయకుండా వర్థమాన దేశాలు అడ్డుకోగలిగాయి.
వర్థమాన దేశాలు కోపెన్హెగన్ సదస్సు సందర్భంగా ప్రదర్శించిన ఐక్యత, సమన్వయం, సహకారం రానున్న కాలంలో కూడా ప్రదర్శించి సంపన్న దేశాల కుయుక్తులను అడ్డుకోగలిగినప్పుడు మాత్రమే వర్థమాన దేశాలు నిజంగా ప్రపంచ పర్యావరణ సమస్యకు న్యాయమైన పరిష్కారం చూపించటంలో విజయవంతం అవుతాయి. వర్థమాన దేశాల ఐక్యతకు భారత్ చైనాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పునాదిగా ఉంది. ఈ సమావేశాల సందర్భంగా రెండు దేశాల మధ్య సహకారం బలపడింది. ఈ సమావేశాల్లో మరో ముఖ్య పరిణామం వర్థమాన దేశాలకు నాయకుడిగా చైనా రూపాంతరం చెందటం. ఈ నేపథ్యంలో కోపెన్హెగన్ సమావేశాలు సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ సంబంధాలపై విలక్షణమైన ప్రభావాన్ని చూపనున్నాయి.
ఒంటెత్తు పోకడకిదో మచ్చుతునక
చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో, ఒబామా విమానం దిగి నేరుగా సంప్రదింపులకు వెళ్లి వర్థమాన దేశాలను అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న తంత్రాన్ని ఉపయోగించారు. అది కూడా ఫలించలేదు. దీనిని బట్టి సంపన్న దేశాలు ఏ స్థాయిలో ఒంటెత్తు పోకడలకు పోయాయో అర్థం చేసుకోవచ్చు. చివరకు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ తిరుగు ప్రయాణానికి కూడా సిద్ధమయిన తర్వాత సంపన్న దేశాలు మేలుకొన్నాయి.కనీసం ముందుగా అనుకున్నట్లు రాజకీయ ప్రకటన అయినా చేయలేకపోతే అమెరికా, ఒబామా పరువు గంగలో కలుస్తుందన్న ఆందోళనతో హోటల్ నుండి మన్మోహన్‌సింగ్‌ను వెనక్కు పిలిపించారు.
కోపెన్హెగన్ ఒప్పందం ముఖ్యాంశాలు
* రానున్న కాలంలో పర్యావరణంలో ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కి మించరాదు
* వంద బిలియన్ డాలర్లతో పర్యావరణ నిధి
* 2012లోపు 30 బిలియన్ డాలర్ల వెచ్చింపు
*పారదర్శకత కోసం నూతన అంతర్జాతీయ ఒప్పందం
*జాతీయ స్వచ్ఛంధ ఉద్గారాల తగ్గింపు పథకాలపై అంతర్జాతీయ పర్యవేక్షణ మదింపు
* క్యోటో ఒప్పందం కొనసాగింపుపై కుదరని ఏకాభిప్రాయం.
* కాల వ్యవధికి నోచుకోని తుది ఒప్పందం
దేశాధినేతల ఆమొదం పొందలేని కోపెన్హెగన్ అకార్డ్
* ఇంధన పొదుపు చేసే టెక్నాలజీకి ప్రాధాన్యత
* అన్నెక్స్ 1 దేశాలు 2020 నాటికి నిర్దారిత ఉద్గారాల తగ్గింపు చర్యలు అడవుల పరిరక్షణకు పారితోషికాలు
Monday, December 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment