మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల మాంద్యంలోకి జారిపోకుండా నిలబడింది. 2008లో విశ్వవ్యాప్తమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నెమ్మదిగా తిరిగి కోలుకొంటోంది. సంక్షోభానికి పుట్టినిల్లయిన అమెరికాలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆర్థిక వ్యవస్థలో తొలిసారిగా ఎదుగుదల కనిపించింది. అమెరికా కంటే యూరోపియన్ యూనియన్ దేశాల్లో పారిశ్రామిక రంగం త్వరగా కోలుకొంటున్న చిహ్నాలు కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక, పారిశ్రామిక రంగంలో కనిపిస్తున్న ఈ కదలిక ఉపాధి కల్పనలో కనిపించటం లేదు. ఇటువంటి సందర్భాల్లో కీన్స్ ప్రతిపాదించిన పరిష్కారాలు అమలు జరిపితే ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకొంటుందన్న అభిప్రాయం ఉండేది. కానీ తాజా సంక్షోభం కీన్స్ సిద్ధాంతానికి కూడా సవాలు విసురుతోంది. సంక్షోభాల సమయంలో పన్నులు తగ్గించి, ప్రభుత్వ వ్యయం పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాల నుండి బయటకు రావచ్చన్నది కీన్స్ ప్రతిపాదనల సారాంశం. దీని ఆధారంగానే గత సంవత్సరంన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ కొద్దో గొప్పో మోతాదులో ఈ దిశగా చర్యలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలకే ఉద్దీపన పథకాలని పేరుపెట్టారు. భారతదేశంలో ప్రభుత్వవయం పెరగటం, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు తగ్గించటం మనం చూసిందే. అమెరికాలో సైతం ఇదే తరహాలో 787 బిలియన్ డాలర్ల వ్యయంతో ఉద్దీపనపథకం చేపట్టిన విషయమూ బిజినెస్‌వాచ్‌లో ప్రస్తావించుకున్నాము. కానీ ఈ పథకాలేవీ ఉపాధికల్పనలో కదలికతెచ్చేందుకు ఉపయోగపడటం లేదు. అంటే వ్యవస్థలో మనం గమనించని, గమనించినా అంగీకరించలేని లోపం ఎక్కడో ఉందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
ఉదాహరణకు సంక్షోభానికి పుట్టినిల్లయిన అమెరికా విషయం పరిశీలిద్దాం. అధికారిక లెక్కల ప్రకారమే అమెరికాలో ఈ కాలంలో నిరుద్యోగం విస్తరించింది. ఆ దేశ కార్మికశాఖ అంచనాల మేరకే 90లక్షల మంది అధికారిక నిరుద్యోగులున్నారు. ఆర్థిక నిపుణుల అంచనాలో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. దాదాపు రెండుకోట్లకు దరిదాపుల్లో అమెరికా నిరుద్యోగం పెరిగింది. అందరూ ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారు. 1929 నాటి మహామాంద్యం తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం ఎన్నడూ లేదన్నదే ఆ విషయం. అమెరికా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది దీర్ఘకాలిక ఉద్యోగం. ప్రస్తుత నిరుద్యోగం రేటు 2007 డిశంబరు నుండి కొనసాగుతుంది. ఎందుకంటే అమెరికా మార్కెట్లో వారాలు, గంటల లెక్కన ఉద్యోగాన్ని లెక్కిస్తారు. అందువల్ల దాదాపు రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం లేకపోవటం అంటే అమెరికా ఆర్థిక ప్రమాణాల ప్రకారం చాలా తీవ్రమైన సమస్య.
వ్యవస్థాగత సమస్య. ఈ నేపథ్యంలో కీన్స్ సూత్రాల ప్రాతిపదికన ప్రకటించిన ఉద్దీపన పథకాలు సాధించిందేమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. అమెరికా అమలు చేసిన ఉద్దీపన ఉపాధి రంగంలో కనిపిస్తున్న పతనాన్ని నిలువరించి ఉపాధి అవకాశాలు విస్తరించేలా చేయాలన్నది 787 బిలియన్ డాలర్ల ఉద్దీపన పథకం ముందున్న లక్ష్యాల్లో ఒకటి. దీనికి భిన్నంగా పైన చెప్పుకున్నట్లు 2007 డిశంబరు నుండీ నిరుద్యోగం పెరుగుతోందే తప్ప తరగటం లేదు. ప్రభుత్వ సమర్థకులైన ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఈ ఉద్దీపన పథకం లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా దిగజారి ఉండేదన్న వాదనను ముందుకు తెస్తున్నారు.2009 ప్రారంభం నుండి అమెరికా ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత వినిమయం తగ్గుముఖం పట్టింది. వాణిజ్య వ్యయం కూడా తిరోగమనంలోనే ఉంది. దీని ప్రభావాన్ని మనం అంతర్జాతీయ వాణిజ్యంలో కనిపిస్తున్న స్థబ్దత రూపంలో చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాకుండా చేయటంలో ఉద్దీపన దోహదం చేసిందని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే గత సంవత్సరం అక్టోబరు, నవంబరుల్లో బిజినెస్‌వాచ్‌లో మనం విశ్లేషించుకున్నట్లు సంక్షోభం వ్యవస్థాగతం అన్న నిర్ధారణ సరైందే అని భావించాల్సి వస్తోంది.
అమెరికా అయినా, మరో దేశమైనా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొనసాగుతున్న దేశాల్లో ప్రపంచ దేశాల వనరులు దిగమింగకుండా తమకు తాము సంక్షోభం నుండి బయటపడే అవకాశాలు లేవన్నది మరో సారి రుజువు అవుతోంది. ఈ పరిణామం పెట్టుబడిదారీ వ్యవస్థలోని తాజా ధోరణిని ముందుకు తేవటంతో పాటు కీన్స్ ప్రతిపాదించిన బహుముఖ ప్రయోజనాలు అన్న అంశాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ డిశంబరులో అమెరికా ప్రభుత్వం ఉద్దీపన 2ను ప్రకటించాల్సి ఉంది. తాజాగా ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ఫార్చ్యూన్ 500 కంపెనీల విశేషాల్లో చెప్పుకోదగ్గ అంశం సంక్షోభం సమయంలో సైతం కంపెనీల సిఇఓల వేతనాల్లో మార్పు లేదు. నిజానికి కొన్ని కంపెనీల సిఇఓల విషయంలో వేతనాల పెరుగుదల దాదాపు 25 శాతంగా ఉంది. మరోవైపున వ్యక్తిగత కొనుగోళ్లు ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాలు గడువు ముగిసిపోయాయి. ఈ పథకాలు అమల్లో ఉన్నపుడు మార్కెట్లో ప్రత్యేకంగా కనిపించిన కదలిక ఏమీలేదు.
ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలు ప్రత్యేకించి ఉద్దీపన వంటి నిర్ణయాల బహుళపక్ష ప్రయోజనాల గురించి క్లుప్తంగా చెప్పుకొందాం. ఉద్దీపనలో ముఖ్యమైన భాగాలు రెండు. ప్రభుత్వ వ్యయం పెంచటం, పన్నులు తగ్గించటం. పన్నులు తగ్గించటం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించటం ఒక లక్ష్యమైతే మరోవైపున వ్యక్తిగత వినిమయాన్ని ప్రోత్సహించటం మరో లక్ష్యం. ఉత్పత్తి క్రమంలో తగ్గిన పన్నుల భారం సరుకుల ధరల తరుగుదల్లో ప్రతిఫలించాలి. ఈ సరుకుల ధరల తరుగుదల వినిమయదారులను ప్రోత్సహించి మార్కెట్లోకి తేవాలి. మరోవైపున ప్రభుత్వ వ్యయం పెంచటం ద్వారా గిరాకీ సమస్యను ఎదుర్కొంటున్న మార్కెట్లో గిరాకీ సృష్టించాలి. గిరాకీ-సరఫరా సూత్రం ఆధారంగా మార్కెట్లో గిరాకీ సృష్టిస్తే మార్కెట్ చక్రం దానంతట అదే తిరుగుతుందన్న అవగాహన దీనికి పునాది. కానీ ఈ రెండు సూత్రాలు అమెరికా ఉద్దీపన విషయంలో పని చేసినట్లు కనిపించటం లేదు.
దీనికి ముఖ్యమైన కారణం ఉద్దీపన ప్రయోజనాలను దుర్వినియోగం చేయటం. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన తాజా సర్వే ఫలితాలు గమనిస్తే పలుకుబడి కలిగి, వ్యవస్థను శాసించే శక్తులు, సంస్థలు ఈ ఉద్దీపన ప్రయోజనాలను మూకుమ్మడిగా స్వంతం చేసుకున్న తీరు అర్థం అవుతుంది. అంటే మార్కెట్‌లో కదలిక తెచ్చేందుకు నిధులు కుమ్మరిస్తేనే సరిపోదు. ఈ కుమ్మరించిన నిధులను వ్యవస్థాగత లక్ష్య సాధనకు ఉపయోగించటమా లేక వ్యక్తిగత లక్ష్య సాధనకు వాడుకోవటమా అన్నది నిర్ధారించి నియంత్రించాల్సిన పాత్ర కర్తవ్యం ప్రభుత్వానిదే. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర గత నాలుగు దశాబ్దాలుగా అంతకంతకూ కుదించుకుపోయింది. దిగువ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పారిశ్రామిక లాబీయిస్టుల మధ్య సంబంధాలు మరింత పెనవేసుకుపోయాయి. దీంతో ప్రభుత్వాలుమారినా ఈ పాలనా వ్యవస్థలో ఉన్న ఈ బాదరాయణ సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో మార్పు తేవాలంటే వ్యవస్థాగత మార్పు కూడా అనివార్యం. కేవలం ఆర్థిక వ్యవస్థలో నిధులు పుష్కలంగా కుమ్మరించి దాని మానాన దాన్ని పనిచేసుకు పొమ్మంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అందువల్లనే ఆర్థిక వ్యవస్థ రాజ్యం నియంత్రణలో ఉండాలని, ప్రభుత్వ నియంత్రణలో ఉన్నపుడే వ్యవస్థ ఆశించిన ఫలితాలు అందుకోవటం సాధ్యమవుతుందని చైనా ఉద్దీపన అనుభవాలు రుజువు చేస్తున్నాయి.
Monday, November 9, 2009
కోలుకున్న ఆర్థిక వ్యవస్థ - ఓ పరిశీలన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment