published in Prajasakti on 2nd November 2009
గత వారం రిజర్వు బ్యాంకు రెండో త్రైమాసానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య పరిణామాల నివేదిక విడుదల చేసింది. రెండో త్రైమాసం అంటే ఆర్థికసంవత్సరంలో సగభాగం పూర్తి అయినట్లు. అందువల్లనే ఈ నివేదికను ఆర్థిక వర్గాలు, విశ్లేషకులు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైన పరిణామంగా భావిస్తుంటారు. గత సంవత్సర ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఈ నివేదిక మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ రిజర్వు బ్యాంకు గవర్నర్ '' ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అంతరాయం కలగకుండా జాగ్రత్తగా '' ద్రవ్య సరళత్వపు విధానాల'' నుండి బయటపడాల్సిన అవసరం ఉంద''ని ప్రకటించారు. గత సంవత్సర కాలంగా ఆర్థిక వ్యవస్థ ఉదారమైన ద్రవ్య విధానంపై ఆధారపడి ముందుకు సాగుతుంది. గత వారం బిజినెస్ వాచ్‌లో ఉద్దీపన పథకాలే ఊపిరిగా కంపెనీలు లాభాలు సంపాదిస్తున్న వైనాన్ని వివరించాము. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు నివేదిక కూడా ధృవీకరిస్తోంది.
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన సమీక్షా నివేదిక కొన్ని ముఖ్యమైన ధోరణులను ముందుకు తెస్తోంది. దేశంలో గత కొద్ది కాలంగా వ్యక్తిగత వినిమయం తగ్గుముఖం పట్టిందన్న విషయాన్ని మొదటిసారిగా 2008 ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంగీకరించింది. ఈ ధోరణీ నేటికీ కొనసాగుతోందని రిజర్వు బ్యాంకు తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం ఎటువంటి ఆర్థికవ్యవస్థకైనా ఇబ్బందికరమైన పరిణామమే. అంతేకాదు. గత ఆరు నెల్ల కాలంగా పరపతి, రుణవినియోగం కూడా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు లెక్కలు చెప్తున్నాయి. వ్యక్తిగత వినిమయానికి క్రెడిట్ కార్డులపైన ఉన్న నిల్వ బకాయిలు, గృహ రుణాలు, ఇతర వినిమయ రుణాలు సూచికలుగా ఉన్నాయి. వ్యక్తిగత గృహ రుణాలు, క్రెడిట్‌కార్డులపై నిల్వ బకాయిలు, వినిమయ రుణాల పెరుగుదల రేటు గత సంవత్సరం పెరుగుదల రేటులో మూడో వంతు కూడా లేదని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.
అంతే కాదు. బ్యాంకు ల నుండి వివిధ రంగాలకు ఇచ్చే రుణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవన్నది ఈ నివేదిక చెప్పే మరో విషయం. వార్షిక ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు రిజర్వు బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య రుణాల పెరుగుదల 29 శాతం మేర ఉంటుందని అంచనా వేసింది. దానికనుగుణంగా మార్కెట్‌లో నిధుల లభ్యత ఉండేలా చూసేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ పరపతి వినియోగం (క్రెడిట్ ఆఫ్‌టేక్) 20 శాతం మాత్రమే పెరుగుదల చూపించగా ఆర్థిక సంవత్సరం సగానికి వచ్చే సరికి ( సెప్టెంబరు నాటికి) కేవలం 11 శాతానికే పరిమితం అయ్యింది. ఉదాహరణకు 2008-2009 ఆర్థిక సంవత్సరంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో అంతకు ముందరి సంవత్సరంతో పోలిస్తే 65.2 శాతం పెరుగుదల కనిపించింది.
కానీ ప్రస్తుత 2009-2010 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటగిరీ కింద ఇప్పటి వరకు 27.4 శాతం మాత్రమే పరపతి వినియోగం కనిపించింది. అంటే భారీ పరిశ్రమల విషయంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఈ వివరాలు పరిశీలిస్తే మొత్తంగా పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి కార్యక్రమాలు మందగించాయని మనం నిర్ధారణకు రావచ్చు.
మరి మార్కెట్‌లో ఉన్న సరుకులన్నీ ఎలా వచ్చాయన్న ప్రశ్న తలెత్తటం సహజం. గత నాలుగైదేళ్లుగా అన్ని రకాల పారిశ్రామిక రంగం అవసరానికి మించి ఉత్పత్తి సామర్ధ్యాన్ని సమకూర్చుకుంది. మార్కెట్ శక్తిని మించి వస్తూత్పత్తి జరిగింది. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో భారతదేశ కంపెనీలు పట్టుకుందంతా బంగారమే అవుతుందన్న విశ్లేషణల నడుమ ఈ పరిణామం చోటు చేసుకొంది.
కానీ గత సంవత్సరకాలంగా పరిస్థితులు ప్రతికూలించటంతో మార్కెట్ విశ్లేషకులు పొగడ్తలకు పొంగిపోకుండా పారిశ్రామిక రంగం ముందు తన వద్ద గోడౌన్లలో మూలుగుతున్న నిల్వ ఉత్పత్తులను వదిలించుకునే క్రమంలో పడింది. ఏదో ఒక రూపంలో పాత సరుకు త్వరగా ఖతం చేయాలని భావించింది. ఒక అంచనా ప్రకారం ఈ సారి దీపావళికి రూ.10,000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. అందువల్లనే వినియమవస్తు మార్కెట్లో రెండో త్రైమాసంలోనూ కదలిక కనిపించింది.
ఒక రకంగా చూసినపుడు ఈ ధోరణి ఆరోగ్యకరమైన ధోరణే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొయ్యిమీద పెట్టిన పాలు పొంగుతాయి. అయితే పైకి పొంగినంత పరిమాణంలో గిన్నెలో పాలు ఉండవు. పొంగు చల్లారిన తర్వాత గిన్నెలో కనిపించేవే అసలైన పాలు. అదేవిధంగా మార్కెట్ పొంగులో పారిశ్రామికరంగపు వాస్తవిక పరిస్థితి మరుగున పడుతుంది.
అంతా లెక్కలు, అంచనాలు, ధోరణులే మనకు దర్శనమిస్తాయి. ఒక సారి మార్కెట్ వర్గాలు కాలు నేల మీదకి దిగిన తర్వాత మాత్రమే వాస్తవిక అంకెలు కనిపిస్తాయి. రిజర్వు బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాల సమీక్ష అటువంటిదేనని చెప్పుకోవచ్చు.
మొత్తంగా పారిశ్రామిక రంగంలోనే కాదు. మార్కెట్‌లో నేడు ప్రధానంగా కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లావాదేవీలు కుదించుకుపోయాయి. గత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో గృహ నిర్మాణం, కొనుగోళ్ల కోసం రూ.29,872 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేయగా ప్రస్తుత సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ మొత్తం రూ.16,668 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు సగానికి సగం తగ్గిపోయింది. ఇందులో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగానూ, వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు తక్కువగానూ ఉన్నట్లు తేలింది.
పైన చెప్పుకొన్నట్లు క్రెడిట్ కార్డుల విషయం కూడా ఇదే పరిస్థితి. గత సంవత్సరం ఏప్రిల్ - సెప్టెంబరు కాలంలో క్రెడిట్ కార్డులపై రూ.7173 కోట్ల మేర నిల్వ బకాయిలు ఉండగా ఈ సంవత్సరం ఈ నిల్వ బకాయిల మొత్తం రూ.4167 కోట్లకు తగ్గింది. దానర్థం ఆదాయం ఎక్కువై అప్పులు చెల్లించేస్తున్నారన్నది కాదు. అరువు బరువు కాదన్నది క్రెడిట్ కార్డు ఫిలాసఫీ. మొత్తంగా మారిన ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వినిమయదారులు అరువు సొమ్ము బరువు చేటు అన్న పాత సామెత సారాంశాన్ని అర్థం చేసుకున్నారని భావించవచ్చు. అంటే గత సంవత్సరం చేతిలో డబ్బులున్నా లేకపోయినా క్రెడిట్‌కార్డులతో కొనుగోళ్లు చేసిన ప్రజలు నేడు ఆ ధోరణి నుండి బయట పడుతున్నారు. అందువల్లనే క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు మూడు వేల కోట్ల రూపాయల మేర తగ్గిపోయాయి.
రిజర్వు బ్యాంకు సడలించిన ద్రవ్య విధానం ద్వారా సుమారు రెండు లక్షల కోట్లకుపైగా నిధులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారమే పరపతి సౌకర్యం పారిశ్రామిక రంగానికీ, రియల్ ఎస్టేట్ రంగానికీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, లేదా వ్యక్తిగత వినియోగానికీ అందలేదు. మరి ప్రభుత్వం మార్కెట్‌లోకి తెచ్చిన ఈ డబ్బంతా ఏమైనట్లు అన్న ప్రశ్న తలెత్తటం సహజం. ఈ ప్రశ్నకు కూడా రిజర్వు బ్యాంకు నివేదికలోనే సమాధానం ఉంది. ఈ నిధులన్నీ మార్కెట్లో నేరుగా పెట్టుబడుల రూపంలోకి మారటానికి బదులు ప్రభుత్వ ఈక్విటీల్లో మూలుగుతున్నాయని రిజర్వు బ్యాంకు గుర్తించింది. మార్కెట్ అనుకూలంగా లేదు కనుక, ఇప్పటి వరకూ ప్రభుత్వమే నూరి పోసిన లాభాపేక్ష ధోరణితో బ్యాంకులు తమ జాగ్రత్తలో తాము ఉన్నాయని దీన్ని బట్టి అర్థం అవుతుంది.
2008-2009 ఆర్థిక సంత్సరంలో బ్యాంకులు ప్రభుత్వ ఈక్విటీల్లో మొదటి ఆరు నెలల్లో కేవలం రూ.29,933 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టాయి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి రూ.1,69,846 కోట్లు, అక్టోబరు నాటికి రూ.2,91,279 కోట్లు రూపాయలను ప్రభుత్వ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాయి. తద్వారా ప్రభుత్వపు ద్రవ్య లోటు పెరగకుండా చూస్తున్నాయి. ఈ కారణంగానే పరపతి సౌకర్యం గణనీయంగా తగ్గిపోయిందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్దీపన పథకాలను అంచెలంచెలుగా విరమించుకోవాలని అటు రిజర్వు బ్యాంకు, ఇటు ప్రభుత్వం ఏకకాలంలో చేసిన ప్రకటన రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment