Published in Marxistu january 2011 Issue
అమెరికా అనుసరించిన విధానాలతో తెరమీదకు వచ్చిన అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థబ్దత దశకు తెస్తే గత సంవత్సరం కాలంగా యూరోపియన్ యూనియన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వెలుగు చూస్తున్న సార్వభౌమత్వ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 1929 నాటి తరహాలో మహా మాంద్యం దిశగా నెడుతున్నాయని నిర్ధారించవచ్చు.
యూరోపియన్ యూనియన్ సంక్షోభం నుండి పెద్ద సంక్షోభం దిశగా నడుస్తోంది. గత సంవత్సరం గ్రీసు దేశం ఎదుర్కొన్న ద్రవ్య సంక్షో భంతో అప్పటి వరకు అమెరికా చుట్టూ తిరిగిన ఆర్థిక విశ్లేషకులు యూరోపియన్ యూనియన్ వైపు దృష్టి సారించారు. ఈ సంక్షోభాన్ని నిపు ణులు సార్వభౌమత్య సంక్షోభం అంటున్నారు.
మొత్తం 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్‌లో 16 దేశాలు ఒకే ఆర్థిక చట్రం - యూరోజోన్ - ప్రమాణాలు పాటిస్తున్నాయి. అంటే మొత్తం యూరప్ రెండు భాగాలుగా ఉందని అర్థం. యూరో జోన్‌లో ఐర్లాండ్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, గ్రీస్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. క్లుప్తంగా వీటిని పిగ్స్ దేశాలు అని పిలుస్తున్నారు, యూరో జోన్ బయట యూరోపియన్ యూనియన్‌లోనే ఉన్న బ్రిటన్, లాత్వియా, హంగరీ వంటి దేశాలు కూడా దాదాపు గ్రీస్ తరహా సమస్యలే ఎదుర్కొంటు న్నాయి. గ్రీస్ లాగానే హంగరీ, లాత్వియాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద అప్పు తెచ్చు కున్నాయి. కానీ గ్రీసు గురించి చర్చించినంత విస్తృతంగా మిగిలిన దేశాల్లో పరిణామాల గురించి చర్చ జరగటం లేదు. యూరోపియన్ యూనియన్‌ను సమైక్యం చేయటంలో మూడు దశలు ఉన్నాయి. మొదటిది దేశాల మధ్య రాజకీయ ఐక్యత సాధించటం. యూరోపియన్ యూనియన్‌ను ఏర్పాటు చేయటం ద్వారా మొదటి దశ 1990 నాటికి పూర్తయ్యింది. రెండో దశ ఆర్థిక ఏకత్వం సాధించటం. ప్రపం చీకరణ విధానాలు వేగం పుంజుకుంటున్న కాలంలో యూరో జోన్ ఏర్పాటు ద్వారా సగం సభ్య దేశాలు రెండో దశకు చేరుకున్నాయి. మిగి లిన దేశాలు ఇంకా ఈ దశకు చేరుకోవాల్సి ఉంది. నేడున్న సంక్షోభ పరిస్థితుల్లో ముందుకొస్తున్న ప్రత్యామ్నాయాలు యూరోపియన్ యూనియన్‌లో ద్రవ్య విధానాల పరంగా ఏకత్వం సాధించే దిశగా ముందుకు సాగుతున్నాయి.
సార్వభౌమత్వ సంక్షోభం అంటే ఏమిటి? నిత్య జీవితంలో ఆదాయానికి మించిన అవస రాలు ఉన్నపుడు అప్పులు చేయటం సహజం. ఇదే దేశాలకూ, ప్రభుత్వాలకూ ఉంటుంది. అందువల్లనే వివిధ కారణాల రీత్యా దేశాలు రుణాలు సేకరిస్తాయి. ఈ రుణాలు అంతర్గత వనరుల ద్వారా సేకరించవచ్చు. మదుపు పథకాలు అమలు చేయటం దీనికి కీలకమైన సాధనం. బహిర్గత వనరుల నుండి కూడా రుణాలు సేకరించవచ్చు. విదేశీ రుణాలు, ప్రత్యక్ష పెట్టుబడులు, బాండ్ల అమ్మకం, ట్రెజరీ పత్రాల అమ్మకం వంటి చర్యలు దీనికి సాధనాలు. ఒకసారి ఈ పద్ధతుల్లో రుణాలు సేకరించిన తర్వాత తిరిగి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమ వుతుంది. చెల్లింపు ప్రక్రియలో ఒక్కో సారి ఖజానాలో నిధులు నిండుకుంటాయి. వ్యక్తిగత జీవితాల్లో ఈ పరిస్థితి చేతుల్లో డబ్బులు ఆడటం లేదు, కటకటగా ఉంది అన్న భావనలో వ్యక్తం అవుతుంది. ఈ కటకట పరిస్థితి దేశాలు, ప్రభుత్వాల స్థాయికి విస్తరిస్తే దీన్నే ద్రవ్య కొరత - లిక్విడిటీ సమస్య అంటారు. అటువంటి పరిస్థితుల్లో అంతర్గత వనరులు, బాహ్య వనరుల ద్వారా ద్రవ్య సరఫరా అయ్యేట్లు చూస్తే సరిపో తుంది. అమెరికాలో తలెత్తిన తాజా సంక్షోభానికి తొలిరూపం సబ్‌ప్రైమ్ సంక్షోభం. 2007- 2008 మధ్య సబ్‌ప్రైమ్ సంక్షోభం గురించి వచ్చిన విశ్లేషణలన్నీ ఇది కేవలం డబ్బుల కటకట వలన తలెత్తిన సంక్షోభంగానే పరిగణించాయి. దాంతో మరిన్ని మార్గాల్లో రుణమార్కెట్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాయి. చివరకు ఇది కేవలం మార్కెట్‌లో వనరులకొరతతో వచ్చిన సమస్య కాదనీ, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వం, ప్రజల వద్దనే వనరుల కొరత వల్ల తలెత్తిన సమస్య అని తెలుసుకునేటప్పటికి మూడేళ్లు గడిచిపోయింది. ఒకసారి అమెరికా ఈ అవగాహనకు వచ్చాక ఆర్థిక వ్యవస్థలో నిజమైన సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. చారిత్రాత్మక చట్టంగా చెప్పుకుంటున్న ఆరోగ్య బీమా చట్టం అమలు బాధ్యత నుండి ఒబామా ప్రభుత్వం వైదొలగటంతో ప్రారంభమైన ఈ సర్దుబాట్లు గత నెల్లో కార్మికుల వేతనాల పెరుగుదలపై మారటోరియం విధించటంతో నూతన దశకు చేరుకున్నాయి.
మార్కెట్లో ద్రవ్య వనరులు అందుబాటులోకి తేవటం రెండు రకాలుగా జరుగుతుంది. మొద టిగా ఉన్న రుణాల చెల్లింపు గడువు వాయిదా వేయటం, వడ్డీ భారం తగ్గించటం వంటి చర్య లు. దీన్నే బుక్ అడ్జస్ట్‌మెంట్, రీస్ట్రక్చరింగ్ అంటున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో కొద్దిపాటి వెసులుబాటు కలుగుతుంది. ఇటువంటి వెసులుబాటు తర్వాత కూడా రుణాలు చెల్లించ లేని పరిస్థితి తలెత్తిన పరిస్థితిని దివాళా తీయ టం అంటాము. వ్యక్తులు, కంపెనీలు దివాళా తీసినట్లే దేశాలు కూడా దివాళా తీస్తాయి. దీన్నే సార్వభౌమత్వ సంక్షోభం అంటున్నారు. ఇటువంటి సంక్షోభాలనుండి బయటపడటానికి మూడు మార్గాలు ఉంటాయి. డబ్బు ముద్రించ టం ద్వారా మార్కెట్‌లో అవసరమైన నిధులు అందుబాటులోకి తేవటం. జాతీయ ఆర్థిక వ్యవస్థలకు బయట ఉన్న ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థల నుండి రుణాలు తీసుకోవటం. మూడోది రుణాలను పునఃసర్దుబాటు చేయటం. మొదటి చర్య వల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో పోటీపడలేని పరిస్థితి తలెత్తు తుంది. చివరి రెండు చర్యలు దాదాపు సమాం తరంగా అమలు జరగటం ఈ కాలంలో చూస్తు న్నాము. దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ దశకు చేరుకున్నపుడు ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చే శక్తులు, సంస్థలు వ్యక్తిగత స్థాయిలో రుణాలు రీస్ట్రక్చర్ చేసినట్లే జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలో మార్పులు ప్రతిపాదిస్తాయి. వీటినే సంస్థాగత సర్దుబాట్లు అని పిలుస్తున్నారు. 1970 దశకం నుండి ఈ ప్రక్రియ జాతీయ ఆర్థిక వ్యవస్థలను సరిచేయటంలో ప్రధాన సాధనంగా మారింది. కర్ర ఎవడిదైతే గొర్రె వాడిదన్న చందంగా ఈ సర్దుబాటును పర్యవేక్షించే సంస్థలు, శక్తులు తమ తమ అవసరాల మేరకు సర్దుబాటు విధి విధానాలు నిర్దేశిస్తాయి. ఈ వివరణ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు పరిశీ లిద్దాం.
గ్రీసు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కొరత ఎదుర్కొంటోంది. ఐర్లాండ్ ప్రభుత్వం బ్యాం కింగ్ వ్యవస్థ వైఫల్యాన్ని ఎదుర్కొంటోంది. పోర్చుగల్‌లో ప్రైవేటు రుణ భారం ఎక్కువగా ఉంది. స్పెయిన్‌లో ఈ అన్ని రూపాలు కలిసి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఐఎంఎఫ్ మొదలు, యూరోపియన్ యూనియన్ వరకూ వివిధ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి యాజమాన్య సంస్థలు ప్రభుత్వ రుణ భారం తగ్గించాలంటే వ్యయం తగ్గించుకోవాలని మూడు దశాబ్దాల నాటి నయా-ఉదారవాద సిద్థాంతాలు వల్లె వేయటం ప్రారంభించాయి. దాంతో రెండేళ్ల క్రితం ఆర్థికరంగంలో ప్రారంభమైన ఈ సంక్షో భం అనతి కాలంలోనే సామాజిక సంక్షోభంగా రూపుదాల్చింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 2009లో ఇయు స్థూల జాతీయోత్పత్తి నాలుగు శాతం పతనమైందని నిర్ధారించారు. 2008 అక్టోబరు-2009 జనవరి మధ్య ఒక్క ఐర్లాం డ్‌లోనే 20 సార్వత్రిక సమ్మెలు, ఆందోళనలు జరిగాయి. గ్రీస్‌లో 2010లో ఏడుసార్లు కార్మికులు, విద్యార్ధులు, ఉద్యోగులు సార్వత్రిక సమ్మె పాటించారు. తాజాగా డిశంబరు 2010లో బ్రిటన్ ప్రభుత్వం విద్యారంగంలో ఫీజులు పెంచాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్ధులు పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. బహుశా ఈ స్థాయిలో వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరే కంగా వీధుల్లోకి రావటం గత మూడు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. ఈ పరిణామం యూరప్‌ను రాజకీయ సంక్షోభం దిశగా నెడు తుందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. సాధా రణంగా 90 దశకంలో వర్ధమాన దేశాలైన లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో విన్న నినాదాలు ''ఐఎంఎఫ్ గోబ్యాక్'', ''ఐఎంఎఫ్ రుణాలు వ్యతిరేకించండి'', ''సార్వభౌమత్వాన్ని కాపాడండి'' అని నేడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో నిత్యం వినపడుతున్నాయి.
సామ్రాజ్యవాద దశకు చేరిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆసియాలో జపాన్, ఐరోపాలో జర్మనీ, బ్రిటన్, ఉత్తరాన అమెరికా దేశాలు కీలకమైన స్థావరా లుగా మారాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆయా దేశాలు, ప్రాంతాలు మమేకం అయిన తీరును బట్టి ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న వర్తమాన సంక్షోభం ఆయా దేశాలు, ప్రాంతాలపై తరతమ స్థాయిల్లో ప్రభావం చూపుతోంది. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. పెట్టుబడిదారీ ప్రపంచంలో మిగిలిన దేశాలు అనుసరించిన సంక్షేమ విధానాల కంటే యూరోపియన్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న దేశాల్లో సంక్షేమ విధా నాలు మరింత విస్తృతమైనవి. సోషలిస్టు కూటమి దేశాలతో ఉన్న భౌగోళిక సామీప్యత వల్ల అది జరిగింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం వర్ధ మాన దేశాలు, సంపన్న దేశాలు సంక్షేమ విధా నాల బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే అమెరికా, జపాన్ వంటి దేశాలు 60 దశకం నాటికే ఈ విధానాల నుండి తిరోగమించాయి. కానీ యూరోపియన్ దేశాలు ప్రత్యేకించి ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లు ఈ విధానాలను మరికొంత కాలం కొనసాగించాయి. సోషలిస్టు కూటమిలో ముఖ్యమైన శక్తులుగా ఉన్న తూర్పు జర్మనీ, రష్యా, యుగోస్లోవియాలు యూరప్‌లో కీలక శక్తులుగా అవతరించాయి. దాంతో పాటే ఆయా దేశాల్లో రాజకీయ వ్యవస్థల ప్రభావం, ఆ రాజకీయ వ్యవస్థల్లో ప్రజలకు అందుతున్న సేవలు, సౌకర్యాల నేపథ్యంలో అదేతరహా సేవలు, సౌకర్యాలు కల్పించాల్సిన ఒత్తిడికి లోన య్యాయి. దాంతో అమెరికా, జపాన్‌ల కంటే విస్తృతమైన సంక్షేమ విధానాలు, వ్యవస్థలు యూరోపియన్ దేశాల్లో అమల్లోకి రావల్సిన రాజకీయ అవసరం ఏర్పడింది. లేనిపక్షంలో సోషలిస్టు కూటమి దేశాలు సాధిస్తున్న వేగవంతమైన ప్రగతితో పెట్టుబడిదారీ దేశాల అభివృద్ధి నమూనా సవాళ్లను ఎదుర్కొనే స్థితికి నెట్టబడింది. ఈ చారిత్ర నేపథ్యంతో పాటు స్కాండినేవియన్ దేశాలు అని పిలవబడే మధ్య యూరప్ దేశాల్లో సంక్షేమ విధానాలు జాతీయ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో అంతర్భాగంగా తెరమీదకు వచ్చాయి. వెరసి యూరప్ దేశాల్లో విస్తారమైన సంక్షేమ వ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి.
సోషలిస్టు కూటమి పతనం అయిన తర్వాత యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్న సంక్షేమ వ్యవస్థల రాజకీయ అవసరం తీరిపో యింది. ఇదేకాలంలో స్వైరవిహారం ప్రారం భించిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యం లో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచీ కృతమైన పెట్టుబడి అవసరాల మేరకు పునర్య్వ వస్థీకరిచబడ్డాయి. ఈ పునర్య్వవస్థీకరణతో పాటే ఆయా దేశాల్లో సంక్షేమ వ్యవస్థలు తీవ్రమైన మార్పులకు లోనయ్యాయి. ఒక్కసారిగా ఇంతటి విస్తృతమైన సంక్షేమ వ్యవస్థలను సమూలంగా రద్దు చేయటం ఆచరణ సాధ్యం కాకపోవటంతో వీటిని కూడా మార్కెట్ సాధనాలుగా మల్చేందుకు నూతన వ్యూహాలు రూపొందించబడ్డాయి. సంక్షేమ వ్యవస్థలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించటానికి బదులుగా దాని స్థానంలో పరపతి వ్యవస్థలను విస్తృతీకరించటం ఇటు వంటి నూతన వ్యూహాల్లో అంతర్భాగం. అందు వల్లనే తొలుత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదు ర్కొన్న సంక్షోభానికి ప్రాథమిక మూలాలు పరిధి దాటిన పరపతి విధానాల్లో ఉండటాన్ని మనం గమనించవచ్చు. యూరోపియన్ దేశాల్లో సైతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఒకపుడు పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదా యలు పెరిగేవి. ఈ ఆదాయలే తిరిగి సంక్షేమ వ్యయం రూపంలో ఆర్థికంగా వెలివేతకు గురైన ప్రజలకు చేరేవి. ప్రపంచీకృత పెట్టుబడి అవసరాలు తీర్చటానికి ప్రభుత్వాలు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటానికి సిద్ధమైన తర్వాత ఈ ఆదాయాలు తగ్గిపోయాయి. దాంతో సంక్షేమ వ్యవస్థలపై వెచ్చించటానికి అవసరమైన నికర నిధులు కొరవడ్డాయి. ఈ నిధుల కొరతతో వచ్చే కొత్త సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వాలు మార్కెట్ మంత్రాన్ని పాటించాయి. పరపతి వసతులు పెంచాయి. దాంతో గతంలో ప్రభు త్వం అందించే రాయితీతో కూడిన సేవలు పొందే ప్రజలు నేడు ప్రభుత్వ రాయితీల స్థానంలో మార్కెట్ పరపతి ద్వారా అందించే నిధులతో సేవలు పొందుతున్నారు. ప్రపంచీ కృతమైన పెట్టుబడి నికర సంపద సృష్టిపై కేంద్రీకరించటానికి భిన్నంగా సత్వర లాభాల కోసం ఖండఖండాల వెంట పరుగులెత్తటం ప్రారంభించింది. అందువల్లనే ఈ కాలంలో నికర సంపద సృష్టిని కొలిచే ఆర్థిక ప్రమాణం కాపిటల్ ఫార్మేషన్ ఈ కాలంలో తగ్గిపోతూ ఉండటాన్ని మనం చూస్తాము. ఈ పరిస్థితుల్లో సంక్షోభ ప్రభావం యూరప్ దేశాలపై, ప్రత్యే కించి ఆ దేశాల్లోని సామాజిక సంక్షేమ వ్యవస్థలపై పెద్దఎత్తున పడింది. ఆర్థిక వ్యవస్థల్లో నికర సంపద సృష్టి తగ్గిపోవటంతో మార్కెట్ సాధనాలపై ఆధారపడాల్సి వచ్చింది. మార్కెట్ సాధనాలు జూదం కంటే దారుణమైన డెరివే టివ్స్, దివాళా బదలాయింపులు-క్రెడిట్ డిఫాల్ట్ శ్వాప్‌లు-వంటి సాధనాల ద్వారా నిత్యావస రాలు తీర్చుకోవాల్సిన దుస్థితికి ప్రజలు నెట్ట బడ్డారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యూరో పియన్ పార్లమెంటరీ యూనియన్ ప్రచురించిన విశ్లేషణ పత్రంలో // పరిమితికి మించి సాగలాగ బడిన ద్రవ్యసేవలు మార్కెట్‌లో వచ్చే ఎగుడు దిగుడను తట్టుకోలేకపోయాయి// అని నిర్ధారిం చింది. అందువల్లనే తొలిదశలో ఈ సంక్షోభం మార్కెట్‌లో ద్రవ్య సరఫరా కొరతగా వ్యక్తం అయినప్పటికీ, పరపతికి పునాదిగా ఉన్న ద్రవ్య సరఫరా కొరత సంక్షేమ వ్యయంపైనా, ప్రభుత్వ వ్యయంపైనా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో ద్రవ్య సరఫరా సజావుగా ఉండేలా చూడటానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఇందుకు సాధనాలుగా ఉన్న ద్రవ్య సంస్థల మనుగడపైనే దృష్టి కేంద్రీకరించింది. దాంతో నిజ ఆర్థిక వ్యవస్థ పతనం యథాతథంగా కొనసా గింది. ఉత్పత్తి పతనం, విదేశీ వాణిజ్యపతనం, పారిశ్రామికోత్పత్తి పతనం, ప్రభుత్వ ఆదాయాల పతనం వంటి పరిణామాలు సమాంతరంగా వ్యక్తం అవుతున్నాయి.
పైన చెప్పుకున్నట్లు యూరప్ దేశాల్లో సంక్షేమ వ్యవస్థల చారిత్ర నేపథ్యంలో తెరమీదకు వచ్చినవి కావటంతో ఈ వ్యయ భారంకూడా ప్రభుత్వ ఖజానాను దెబ్బతీసింది. మార్కెట్‌లో నిధులే లేనప్పుడు అందుబాటులోకి తెచ్చే పరపతి సౌకర్యాలు నీటిమీది రాతలే అవుతాయి. దాంతో గ్రీస్, ఐర్లాండ్ వంటి దేశాల దైనందిన ఆర్థిక అవసరాలు తీర్చటానికి, మార్కెట్ చక్రం ఇరుసు యధావిధిగా తిరగటానికి అవసరమైన కందెన - ద్రవ్య సరఫరా - సమకూర్చాల్సి వచ్చింది. ఈ బాధ్యత యూరోపియన్ యూని యన్ పార్లమెంట్, ఐఎంఎఫ్ నెత్తిన పడింది. అంతర్జాతీయంగా ఇటువంటి పరిస్థితులు తలెత్తినపుడు జోక్యం చేసుకోవటానికి ఐఎంఎఫ్ వద్ద నిధులు, సాధనాలు ఉన్నాయి. యూరో పియన్ యూనియన్ వద్దగానీ, యూరోపియన్ బ్యాంకు వద్దగానీ అటువంటి నిధులూ, సాధనాలూ లేవు. దాంతో అనివార్యంగా ఈ దేశాలు ఐఎంఎఫ్ రుణాల కోసం ఎదురుచూ డాల్సి వస్తోంది. ఈ రెండు సంస్థలు ఇతర దేశాల నుండి సేకరించిన పెట్టుబడులు, ఐఎం ఎఫ్ బంగారం నిల్వలు అమ్మకం ద్వారా సేకరిం చిన నిధులు నుండి ఈ దేశాలకు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో భాగంగానే ఇయు మూడంచెల పరిష్కార చర్యలు చేపట్టింది. మొదటి అంచెగా సంపూర్ణంగా దివాళా తీసిన దేశాలు - గ్రీస్, ఐర్లాండ్ వంటి దేశాలకు ఐఎంఎఫ్ ద్వారా సంస్థాగత రుణాలు అందచేయటం, రెండవ అంచెగా యూరోపియన్ యూనియన్ పరిధిలో 680 బిలియన్ డాలర్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటం ద్వారా మార్కెట్ వర్గాలకూ, ద్రవ్య పెట్టుబడికీ మార్కెట్ సామర్థ్యంపట్ల విశ్వాసం కల్పించే ప్రయ త్నం చేయటం, మూడో అంచె కింద దివాళా తీసిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పునర్ని ర్మాణం పేరుతో సంస్థాగత సర్దుబాట్లు అమలు చేయటం. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. 2010 డిశంబరు నాటికి దేశాల దివాళా గ్రీస్, ఇటలీ, ఐర్లాండ్‌ల పరిధి దాటి స్పెయిన్, స్వీడన్‌లకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో 2009లో కేవలం గ్రీకు విషాదం- గ్రీకు ట్రాజెడీ- గా పిలవబడ్డ ఆర్థిక సంక్షోభం నేడు యూరోపియన్ యూనియన్ స్థాయి సంక్షోభంగా రూపాంతరం చెందింది. ఈ సంక్షోభంలో అన్ని కోణాలు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ వ్యక్తం కావటం లేదు. గ్రీసులో లోటు బడ్జెట్ సమస్య. ఐర్లాండ్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ పతనం సమస్య, పోర్చుగల్‌లో ప్రైవేటు రుణభారం ఎదుర్కొంటున్నాయి. స్వీడన్ ఈ అన్ని సమస్యల సమాహారం. బయటికి కనిపించే సంక్షోభ రూపం ఏదైనా అన్ని దేశాల్లోనూ సంస్థాగత సర్దుబాట్లు పేరుతో ఈ భారాలను ప్రజలపై మోపేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ ప్రయత్నాలను నిలవరించగలిగిన వామపక్ష శక్తులు ఆయా దేశాల్లో బలహీనంగా ఉండటంతో ఈ ప్రయత్నాలు మరింత ఊపందు కున్నాయి.
ఉదాహరణకు డిశంబరు 15న రాత్రిపూట జరిగిన గ్రీకు పార్లమెంట్ సమావేశాలు ప్రజల జీవితాల్లో కాళరాత్రి అయ్యాయి.. ఈ సమావేశా ల్లో కార్మికుల వేతనాల పెరుగుదలపై మారటో రియం విధించటం, ప్రభుత్వరంగంలో ఉపాధి కల్పనపై నియంత్రణలు విధిస్తూ చట్టం ఆమోదించారు. దాంతో పాటు కార్మికవర్గం, సామాన్య ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమ ఫలాలపై కూడా పరిమితులు విధించారు. గత సంవత్సరంలోనే ఈ ప్రయత్నాలు ప్రారంభమ యినా గ్రీకు ఆర్థిక వ్యవస్థ కొలిక్కిరాకపోవటంతో సంవత్సరానికి పైగా అనధికారికంగా అమలు జరిగిన ఈ సర్దుబాట్లకు నేడు చట్టరూపం ఇచ్చారు. ఇప్పటికే రేటింగ్ సంస్థల నుండి హెచ్చరికలు అందుకుంటున్న పోర్చుగల్, స్వీడన్‌లు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. గ్రీసు, ఐర్లాండ్ తరహాల్లోనే సంస్థాగత సర్దుబాట్లకు ఈ దేశాధినేతలు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వ్యయంపై నియంత్రణలు విధించి, మార్కెట్‌లో ద్రవ్య సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చినా ఇటు ప్రభుత్వ ఆదాయం గానీ, అటు ఆర్థికాభి వృద్ధి గానీ పుంజుకున్న దాఖలాలు లేవు. ఐఎంఎఫ్, యూరోపియన్ యూనియన్ పార్ల మెంట్ విధించిన షరతులు, సర్దుబాటు పథకాల వల్ల రానున్న మూడేళ్లల్లో ఒక్క గ్రీసులోనే 11 శాతం స్థూల జాతీయోత్పత్తి పతనం అవుతుం దని అంచనా. స్పెయిన్, ఐర్లాండ్ విషయంలో కూడా 11, 12 శాతం నష్టం జరుగుతుంది. అంటే ఈ మేరకు భారాలు ప్రజలపై పెరుగు తాయి. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా రుణ భారాన్ని ఎదుర్కొంటున్నా ఆ దేశాలు ఆర్థికంగానూ, రాజకీయంగానూ నాయకత్వ స్థానంలో ఉండటంతో ఆయా దేశాల పార్ల మెంట్‌లే స్వతంత్రంగా ఈ చర్యలు తీసుకుం టున్నాయి. దీన్నే నయా-ఉదారవాద విశ్లేషకులు సంస్థాగత సామర్థ్యం అంటున్నారు. అంటే ఇటువంటి సర్దుబాట్లు అమలు జరిగినపుడు ప్రజల నుండి తలెత్తే ప్రతిఘటనను ఎదుర్కోగల సామర్థ్యం ప్రభుత్వాలకు ఉండటం. అటువంటి సామర్థ్యం లేని ప్రభుత్వాలు దేశీయంగా సర్దుబాట్లు అమలు జరిపేందుకు గ్రీస్ తరహాలో అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. పిగ్స్ దేశాలు యూరోజోన్ ఆర్థిక చట్రంలో అంతర్భాగం కావటంతో ఈ దేశాల వైఫల్యం మొత్తంగా యూరోజోన్ వైఫల్య సాఫల్యాలపై ప్రభావం చూపుతుంది. ఇది అంతిమంగా రాజకీయ చట్రమైన యూరోపియన్ యూనియన్ మనుగడను ప్రభావితం చేస్తుంది. జర్మనీలో ఇప్పటికే ఈ తరహా వాదనలు వింటున్నాము. ఆర్థికంగా విఫలమైన దేశాలను నిలబెట్టటానికి జర్మనీ తన వనరులు వెచ్చించాల్సి రావటాన్ని ఆ దేశంలోని మితవాద శక్తులు అభ్యంతరపెడుతున్నాయి. మరోవైపున గ్రీసు, ఐర్లాండ్ వంటి దేశాలు ఐఎంఎఫ్ నుండి అప్పు తెచ్చుకోవటాన్ని వ్యతిరే కించే శక్తులు దీన్ని యూరోపియన్ యూనియన్ అంతర్గత వ్యవహారాలపై బాహ్యశక్తుల జోక్యంగా పరిగణిస్తున్నాయి. ముందు ముందు ఈ వివాదం ముదిరి ఏ రూపం తీసుకుం టుందన్న విషయాన్ని పరిశీలించాలి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లలో మితవాద శక్తులు పై చేయి సాధించాయి. దాంతో మళ్లీ ప్రపంచీకరణ క్రమాన్ని ముందుకు నెట్టిన సంస్థాగత సర్దుబాట్ల క్రమం తొలుత యూరప్‌లోనూ, పాక్షికంగా అమెరికాలోనూ తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాలు గమనిస్తే 80 దశకంలో ఈ రెండు దేశాల్లో ఆధిపత్యం చెలాయించిన రీగనిజం, థాచరిజం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఈ తరహా ధోరణులు ఇటువైపు యూరోపియన్ యూనియన్ ఏకత్వాన్ని సవాలు చేస్తుంటే మరో వైపు అమెరికాలో బుష్ విధానాలకు నిరసనగా ప్రజలు గెలిపించుకున్న డెమొక్రాట్ల ప్రభుత్వం కూడా ద్రవ్య పెట్టుబడి ఒత్తిళ్లను తట్టుకోలేక క్రమంగా ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది.
ఈ పరిస్థితుల్లో సమరశీల పోరాట చరిత్ర ఉన్న గ్రీసు వంటి దేశాల్లో సంస్థాగత సర్దుబాట్లు రాజకీయంగా జయప్రదం అవుతాయా లేదా అన్నది కీలకప్రశ్నగా ఉంది. అక్కడి ప్రజా ఉద్యమాల బలం మీద సాఫల్యవైఫల్యాలు ఆధారపడి ఉంటాయి. ఈ సర్దుబాట్లు రాజకీ యంగా విఫలం అవటం అంటే ఆయా దేశా ల్లోని ప్రజాతంత్ర శక్తులు పైచేయి సాధించటం మన్నమాట. అప్పుడు ద్రవ్య పెట్టుబడి అవసరాల దృష్ట్యా కాకుండా ప్రజల అవసరాల దృష్ట్యా ఆర్థిక వ్యవస్థలను పునర్య్వవస్థీకరించటం జరుగు తుంది. లాటిన్ అమెరికాదేశాల్లో ఈ ప్రయోగం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించే పరిమితు ల్లోనే అమలు జరుగుతోంది. యూరప్‌లో కూడా ఇలాగే జరిగితే పిగ్స్ కూటమిలోని మిగిలిన దేశాలు కూడా గ్రీసు బాట అనుసరించవచ్చు. గ్రీసులో ప్రజాతంత్ర శక్తులు విఫలమైన పక్షంలో అంతిమంగా యూరోపియన్ యూనియన్‌ను మరింత కట్టుదిట్టమైన యూరోపియన్ ద్రవ్య సంఘటనగా మారుస్తుంది. అంటే యూనియన్ లో శక్తివంతమైన దేశాల అవసరాలకు అనుగు ణంగా బలహీన దేశాల ద్రవ్యసరఫరా విధా నాలు నిర్ణయం అవుతాయి. దాంతో ఆయా దేశాల ఉత్పత్తి, ఉపాధి కల్పన, సామాజిక వృద్ధి బలమైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల అవసరాల మేరకు మాత్రమే జరుగుతుంది.
చివరిగా మరో విషయాన్ని ప్రస్తావించు కోవాల్సి ఉంది. యూరోపియన్ యూనియన్‌లో కనిపిస్తున్న వృద్ధి రేటు ధోరణులు కేవలం యూరోపియన్ యూనియన్‌కే పరిమితం కావు. అమెరికా ఇప్పటికే తమ దేశంలో ఉపాధి కల్పన పెంచేందుకంటూ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆత్మరక్షణ విధానాలు పాటిస్తోంది. అంతే స్థాయిలో కాకపోయినా జర్మనీ కూడా ఇదే ధోరణిని అనుసరిస్తోంది. బహుళపక్ష వాణిజ్య ఒప్పందం ప్రపంచ వాణిజ్య సంస్థ దోహా రౌండ్ చర్చలు జయప్రదం అయ్యే సూచనలు కనుచూపు మేరలో లేకపోవటంతో వివిధ దేశాలు ప్రాం తాల వారీగా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాలు కుదుర్చుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో ఆసియాన్-భారత్, ఇయు-భారత్‌ల మధ్య అటువంటి ఒప్పందాలు కుదిరిన సంగతి పాఠకులకు తెలుసు. ఈ దశలో అన్ని దేశాల్లో పాలకవర్గాలు తమ ఉత్పత్తులు అమ్ముకో వాలంటే తమ ఉత్పత్తులు అమ్ముకోవాలని పట్టుబడతాయి. దాంతో ఇప్పటి వరకూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వృద్ది రేటు పతనాన్ని నివారించటానికి ఉద్దేశించిన ఉద్దీపన పథకాలు అంతర్జాతీయ స్వభావం కోల్పోతాయి. ఏ దేశానికి ఆ దేశం తన పాలకవర్గాల అవసరాల మేరకు ఉద్దీపన పథకాల్లోనూ, ద్రవ్య సరఫరా వ్యవస్థల్లోనూ మార్పులు తెస్తాయి. ఈ పోటీ ఇప్పటికే కుదించుకుపోయిన అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఏతావాతా గత రెండేళ్లుగా అమలు జరిగిన ఉద్దీపన పథకాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థబ్దత దశను అధిగమించి పురోగమించటం కష్టంగా మారుతుంది. అమెరికా అనుసరించిన విధానాలతో తెరమీదకు వచ్చిన అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థబ్దత దశకు తెస్తే గత సంవత్సరం కాలంగా యూరోపియన్ యూనియన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వెలుగు చూస్తున్న సార్వభౌమత్వ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 1929 నాటి తరహాలో మహా మాంద్యం దిశగా నెడుతున్నాయని నిర్ధారించవచ్చు.
కె. వీరయ్య
Monday, January 17, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment