Monday, December 20, 2010
వికీలీక్స్ విస్ఫోటనం
'కుడి ఎడమైతే పొరపాటు లేదోరు ఓడిపోలేదోరు...' అని పాడతాడు దేవదాసు. కానీ మొత్తం భూమండలంపై ఏకఛత్రాధిపత్యం వహించాలని చూస్తున్న అమెరికా మాత్రం కుడి ఎడమైతే కొంపలంటుకుపోతాయని తెలుసుకున్నట్టుంది. అందుకనే మొదట్లో చైనాకు వ్యతిరేకంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థల ప్రచారం కోసం అంటూ తెరమీదకు వచ్చిన వికీలీక్స్ పొరుగు దేశాల రహస్యాలు తమకు చేరవేయటానికి బదులు తమ రహస్యాలే బట్టబయలు చేయటంతో అమెరికా అధినేతల గొంతులో వెలక్కాయ పడింది. పత్రికలు పాలకవర్గాల చంకల్లో పిల్లులుగా మారుతున్న సంపన్న దేశాల్లో 'ఎంబెడెడ్ జర్నలిజం' సైతం వికీలీక్స్ విడుదల చేసిన పత్రాలకు ముఖ్యమైన ప్రతికలు పతాకశీర్షికల్లో స్థానం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. పత్రికా స్వాతంత్య్రం, ప్రజాస్వామిక హక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా తన గురివింద నైజాన్ని బయట పెట్టుకుంది. విలక్షణమైన కేసులో వికీలీక్స్ ప్రధాన బాధ్యుడు జూలియన్ అసాంజేను అరెస్టు చేయించింది. అమెరికా, ఆస్ట్రేలియా, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్‌లు కూడబలుక్కున్నట్లు వ్యవహరించి అమెరికా విదేశాంగ నీతికి సంబంధించి కీలక పత్రాలు బయట పెట్టిన వికీలీక్స్ పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. లైంగిక విషయాల్లో అసాంజేని దోషిని చేయటం ద్వారా వికీలీక్స్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకోవటం అటువంటి ప్రయత్నాల్లో ఒకటి. అసలు ఇంటర్నెట్ ఆధారంగా నడిచే చిన్న సంస్థపై అమెరికా వంటి దేశం అంత పెద్ద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? వికీలీక్స్ ఎవరు నడుపుతున్నారు? ప్రధాన స్రవంతికి చెందిన ప్రసార సాధనాలు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, టైమ్స్, గార్డియన్ వంటి పత్రికలు చేయలేని పనిని కొద్ది మంది కంప్యూటర్ రహస్యాలు ఛేదించే హాకర్స్‌గా మారిన యువకులు ఎలా చేయగలుగుతున్నారు? అన్న విషయాలు ఈ వారం అట్టమీదికథలో పరిశీలిద్దాం.
వికీలీక్స్ పేరుతో వెబ్‌సైట్ 2006 అక్టోబరు 4న రిజిష్టరు అయ్యింది. కంప్యూటర్‌తోనూ, ఇంటర్నెట్‌తోనూ పరిచయం ఉన్న వారందరికీ వికీపీడియా గురించి తెలుసు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కంప్యూటర్ విజ్ఞాన సర్వస్వం. అదే తరహాలో అందరికి అందుబాటులో ఉన్న బ్రాండ్‌తో ప్రారంభమైంది ఈ సంస్థ (అయితే ఈ రెంటికీ సంబంధం లేదు. వికీపీడియా దీన్ని మొదట్లోనే పేర్కొంటున్నది). ప్రారంభంలో ఈ సంస్థ నిర్వాహకులు తమను తాము చైనాకు చెందిన అసమ్మతివాదులుగా ప్రకటించుకొన్నారు. దాంతోపాటు తైవాన్-చైనాతో నిరంతరం ఘర్షణ పడుతున్న దేశం- యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్లు, గణిత మేథావులు పర్యవేక్షణలో పనిచేసే సంస్థగా ప్రకటించుకోవటంతో అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ఆశ్రయం సంపాదించటం వారికి తేలికైంది. ఆసియా, మాజీ సోవియట్ రష్యాకు చెందిన దేశాల్లో అప్రజాస్వామిక ప్రభుత్వాల గుట్టురట్టు చేయటం తమ లక్ష్యం అని ప్రకటించుకోవటం ద్వారా అమెరికాకు ప్రీతిపాత్రమైన రాజకీయ క్రీడలో తేలికగా ప్రవేశించగలిగారు ఈ సంస్థ నిర్వాహకులు. ఈ విధంగా పశ్చిమ దేశాలకు ప్రత్యేకించి అమెరికాకు అభ్యంతరం కాని విధంగా పని ప్రారంభించిన వికీలీక్స్ సంస్థ 2007 జనవరి నాటికి తమ వద్ద వివిధ ప్రభుత్వాల వ్యవహారాలకు సంబంధించి 12 లక్షల పత్రాలు ఉన్నాయని ప్రకటించింది. ఇదే కాలంలో అమెరికా ఇంటర్నెట్ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునే నిమిత్తం ప్రత్యేక ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అనేక ఘోస్ట్ వెబ్‌సైట్లు ప్రారంభించింది. వికీలీక్స్ కూడా అందులో ఒకటన్న భావన సర్వత్రా నెలకొంది.
పేరు ప్రతిష్టలు
ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లక్ష్యంగా వికీలీక్స్ చేపట్టిన చర్యలు అనతికాలంలోనే ఉద్యమరూపం తీసుకున్నాయి. ప్రత్యేకించి కెన్యా వంటి దేశాల్లో పాలకులు దేశాన్ని దోచుకుతింటున్న తీరును విపులంగా చిత్రీకరించటం, దాన్ని అంతర్జాతీయ మీడియాకు విడుదల చేయటం వంటి చర్యల ద్వారా వికీలీక్స్ పారదర్శకత కోసం, ప్రజాస్వామిక సంస్కరణల కోసం పని చేసే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. 2008లో లండన్‌కు చెందిన 'ఎకానమిస్టు' పత్రిక వికీలీక్స్ సంస్థకు నూతన మీడియా దోరణులకు ఇచ్చే అవార్డు ఇచ్చి సత్కరించింది. మానవహక్కుల కోసం పని చేసే 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' 2009 సంవత్సరానికి గాను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బ్రిటన్ అవార్డును ఇచ్చి వికీలీక్స్ పేరు ప్రతిష్టలు మరింత పెంచింది. 2008లో కెన్యా ప్రభుత్వ దురాగతాలను, మానవహక్కుల ఉల్లంఘనను వెల్లడి చేస్తూ 'రక్త దాహం -కెన్యాలో మానవహక్కుల ఉల్లంఘనలు, అదృశ్యమవుతున్న ప్రజల గాథలు' రూపంలో డాక్యుమెంటరీ రూపొందించినందుకు గాను ఈ అవార్డు పొందింది వికీలీక్స్. న్యూయార్క్ కేంద్రంగా నడిచే డైలీ న్యూస్ అనే పత్రిక రానున్న కాలంలో మీడియా రంగంపై తీవ్రమైన ప్రభావం చూపగల పరిణామంగా వికీలీక్స్‌ను గుర్తించింది. దౌత్య రహస్యాలు వెల్లడి చేసిన తర్వాత రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో వికీలీక్స్‌కు నోబెల్ శాంతి బహుమతి అందచేయాలని బహిరంగంగా సిఫార్సు చేసింది.
పాఠాలు నేర్పిన వికీలీక్స్
వికీలీక్స్ వెల్లడించిన విశేషాల గురించి పత్రికల్లో ప్రముఖంగానే చోటు చేసుకున్నాయి. గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగినపుడు వచ్చిన ప్రచారం, ప్రాచుర్యం కంటే ఇప్పుడు ఎక్కువ ప్రచారం, ప్రాచుర్యం వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ అమెరికా యుద్ధ క్రీడలో పావులుగా సైనికులుగా వ్యవహరించిన వారు, ప్రభుత్వ విధానాల పట్ల పూర్తి వైముఖ్యం ఉన్న వారు, పెట్టుబడిదారీ విధానాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకించే వారు అనేక మంది అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను తూర్పారపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జేమ్స్ పెట్రాస్ వంటి వారు మొదటి కోవకు చెందిన వారైతే మంత్లీరివ్యూ పత్రిక నిర్వాహకులు రెండో కోవకు చెందిన వారు. అయితే వీరికి అంతర్జాతీయంగా వికీలీక్స్‌కు వచ్చినంత ప్రాధాన్యత రాలేదు. జేమ్స్‌పెట్రాస్ తన ఆక్రోశాన్ని, అనుభవాలను 'దళారీ పశ్చాత్తాపం' రూపంలో వెల్లడి చేసుకోవాల్సి వచ్చింది. ఈ పుస్తకం విడుదలైన తర్వాత కూడా అమెరికాకు చెందిన ముఖ్యమైన మీడియా సంస్థలు పెట్రాస్ అనుభవాలు అమెరికా వ్యవహారశైలికి సంబంధించి సార్వత్రిక సత్యాలుగా పరిగణించటానికి వీలు లేదని, ఏదో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన చెప్పిన విషయాలు వాస్తవాలు అయి ఉండే ఉండవచ్చని వ్యాఖ్యానాలు రాసి అమెరికా వరకు ఈ పుస్తకానికి ఆదరణ లేకుండా చేశాయి. వికీలీక్స్ వెల్లడి చేసిన వివరాలు పెట్రాస్ అనుభవాలు కేవలం వ్యక్తిగతం కాదని, అమెరికా ఆర్థిక రాజకీయ వ్యవస్థలో సంస్థాగతమైన పద్ధతులు అవేనని మరోసారి రుజువు చేస్తున్నాయి.
నిన్న విశిష్టుడు! నేడు దుష్టుడు!!
జూలియన్ అసాంజే.. ఈ పేరు ప్రపంచాధిపత్యశక్తిని ప్రకంపింపచేస్తోంది. వికీలీక్స్ వ్యవస్థాపకుడైన అసాంజే అమెరికా ఆఫ్ఘన్ తదితర దేశాల ప్రజల పాలిట శత్రువనే ప్రచారం మోత మొగుతున్నది. అతన్ని లండన్‌లో అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తమకు అప్పగించాలని స్విట్జర్లాండ్ వత్తిడి చేస్తుంటే తెర వెనక నుంచి అమెరికా వేట సాగిస్తున్నది. ఇంతకూ ఈ వికీ విలన్ నిన్న విశ్వ విఖ్యాత హక్కుల యోధుడుగా ఇదే శక్తులతో నీరాజనాలందుకున్నాడంటే నమ్మడం కష్టమే, కాని నిజం. చాలా మంది సంచలనకారులు వివాద కారకుల్లాగే అసాంజే జీవితం కూడా ఆసక్తికరమైన మలుపులతో నిండి వుంటుంది. నాటకీయత పొంగిపొర్లుతుంటుంది. 1971 జులై 3న ఆస్ట్రేలియాలో జన్మించిన అసాంజే బాల్యం తల్లి విడాకులు పునర్వివాహాల మధ్య నడిచింది. చిన్నప్పటి నుంచీ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువే కావడంతో 16 ఏళ్లకల్లా ప్రపంచ స్థాయి కంప్యూటర్ హ్యాకర్ అయ్యాడు. అంటే కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని రాబట్టే లాఘవం అన్న మాట. ఒకానొక చలన చిత్రంలోని పేరును తీసుకుని మాండెక్స్ పేరిట హ్యాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇదంతా చేసేప్పుడు 'కంప్యూటర్లు పాడవకూడదు, తీసుకున్న సమాచారాన్ని మార్చకూడదు, దాన్ని అందరితో పంచుకోవాలి' అని మూడు సూత్రాలు పెట్టుకున్నాడు. 1989 లో 'టేల్స్ ఆఫ్ హ్యాకింగ్' తదితర పుస్తకాల రచనలో పాలుపంచుకున్నాడు. 1991 నాటికి రహస్య సమాచార సేకరణ అందరూ గుర్తించే స్థాయికి చేరింది. 1992లో కంప్యూటర్ సంస్థలైన నొడైల్, మోడెమ్‌లను హ్యాక్ చేశాడు. 2006లో వికీలీక్స్ స్థాపించి దానికి ప్రధాన సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేస్తున్నందుకు 2008లో ఎకనామిస్ట్ పత్రిక అవార్డు ఇచ్చింది. కెన్యాలో చట్టవిరుద్ధ హత్యాకాండను గురించి బయటపెట్టినందుకు ఆయనకు 2009లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. అలాగే ఆఫ్రికాలో విష పదార్థాల గుమ్మరింపు గురించి, ఆ ప్రాంతంలోని ఒక చర్చి నిగూఢ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని కూడా ప్రపంచానికి అందించాడు. ఇవన్నీ అసాంజే గురించిన ఆసక్తిని పెంచాయి. ఆయన ఎక్కడు వుంటాడనే దానిపై ఎవరికీ స్పష్టత వుండేది కాదు. ఆస్ట్రేలియా దేశస్థుడైనా అక్కడ వున్నది తక్కువ. కెన్యా, స్విట్జర్లాండ్, బ్రిటన్, ఐస్‌లాండ్ వగైరా చోట్ల నివసిస్తూ ఎక్కడున్నా రహస్య సమాచార సేకరణ కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 2010 నవంబరు 20 అమెరికా విదేశాంగ కార్యాలయానికి సంబంధించిన రహస్య పత్రాల ప్రకటన ప్రారంభించగానే ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మానవ హక్కుల యోధుడు కాస్తా దేశ ద్రోహి అయిపోయాడు! ఇంతకూ వీటిని ప్రచురించింది ప్రసిద్ధ పత్రికలే. దాంతో ఒక్కసారిగా అమెరికా సైనిక రాజకీయ నేతలు హడలెత్తిపోయారు. నవంబరు 20న ఆయన ఈ పని ప్రారంభించగా 30న స్విట్జర్లాండులో అత్యాచారాల కేసు నమోదైంది. మరో వంక దేశ రహస్యాల చట్టం కింద ఆయనను అప్పగించాలని అమెరికా వత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే లండన్‌లో తనుగా దొరికి పోయిన అసాంజే కోర్టులో హాజరైనాడు. అసాంజే గురించిన నిజానిజాలన్ని పూర్తిగా తెలియక పోయినా ఈ సమయంలో వేటాడటం వెనక రాజకీయాలున్నాయన్నది స్పష్టం. అందుకే అంతర్జాతీయంగా తనపట్ల సంఘీభావం కూడా వ్యక్తమవుతున్నది. రహస్యాలు కాపాడుకోలేకపోవడం అధికారుల లోపం తప్ప అందిన వాటిని ప్రచురించడం మీడియా తప్పు కాదన్నది సాధారణ అభిప్రాయం.ఇదే విధమైన కేసుల్లో అమెరికా పత్రికా స్వాతంత్య్రం పేరిట చేసిన హడావుడి అందరికీ తెలుసు. అసాంజేకు ఆమ్నెస్టీ తదితర అవార్డులు ఇచ్చినపుడు తమకే ఉపయోగపడతాడనుకున్నారు..వాస్తవంలో 2010 నోబుల్ బహుమానం ఆయనకే ఇవ్వాలని టైమ్ పత్రిక ప్రతిపాదించింది కూడా! ఎదురు తిరిగేసరికి ద్రోహి అంటున్నారు.అయితే బ్రెజిల్ అధినేత లూలా డిసిల్వా వంటివారు బహిరంగంగానే అసాంజేను సమర్థిస్తున్నారు. రష్యా కూడా మొదటి నుంచి అసాంజేకు మద్దతునిస్తున్నది. ఆయన బెయిలుకోసం ప్రసిద్ధ దర్శకుడు మైకేల్ మూర్ జామీను మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా విడుదల కాలేదు. అతన్ని స్విట్జర్లాండుకు అప్పగిస్తారన్న సూచనలున్నాయి.
-పీపీ
2000 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బుష్ ఫ్లోరిడా రాష్ట్రంలో రిగ్గింగ్‌కు పాల్పడకపోతే గెలిచి ఉండేవాడు కాదని గ్రెగ్ పలాస్ట్ అనే విలేకరి ఆధారాలతో సహా రుజువు చేశాడు. అయితే ఈ వివరాలను ప్రచురించటానికి అప్పట్లో అమెరికా పత్రికలు గానీ, టీవీలుగానీ ముందుకు రాలేదు. చివరకు ఆయన ఇంగ్లాండ్ వచ్చి లండన్ పత్రికలకు ఈ విషయాలు వెల్లడించిన తర్వాత గానీ బుష్ గుట్టు రట్టు కాలేదు. ఆ తర్వాత కూడా గార్డియన్ వంటి పత్రికల ద్వారా పలాస్ట్ కృషిపై నీళ్లు పోసేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగాయి. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తానే పుస్తకం రాసి అమ్మకానికి అనువైన అతిగొప్ప ప్రజాస్వామ్యం అని ప్రచురించాడు గ్రెగ్ పలాస్ట్.ఇదే విధమైన పరిస్థితి మంత్లీ రివ్యూ నిర్వాహకులది. అమెరికా ఆర్థిక రాజకీయ వ్యవస్థ విషయంలో నికరమైన శాస్త్రీయ విమర్శకులుగా ఉంది ఈ పత్రిక. కానీ ఈ పత్రిక ప్రభావం, పలుకుబడి పరిమితం కావటంతో ఈ పత్రిక వెల్లడి చేసే విశ్లేషణలు, వాస్తవాలు జనసామాన్యానికి చేరుకునే పరిస్థితి లేదు. దాంతో పత్రిక నిర్వాహకులే ముఖ్యమైన పరిణామాలకు సంబంధించిన వ్యాసాలు పుస్తకాలుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. తాజా ఉదాహరణ ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంబంధించినది. మంత్లీ రివ్యూ పత్రికలో 2004 నుండే రానున్న సంక్షోభం గురించి పెద్దఎత్తున హెచ్చరికలు, విశ్లేషణలు వచ్చాయి. కానీ బుష్ నేతృత్వంలో సామ్రాజ్యవాదం కిక్కు తలకెక్కించుకున్న అమెరికా పాలకులకు, విధాన నిర్ణేతలు ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. దాంతో సంక్షోభం మొదలైన తర్వాత 2008-2009 మధ్య మంత్లీ రివ్యూ రచయితలు రెండు చిన్న పుస్తకాలు ఈ వ్యాసాలను అచ్చేశారు.
ఈ విషయాలకు, వికీలీక్స్‌కు మధ్య సంబంధం ఏమిటన్న ప్రశ్న పాఠకులకు తలెత్తవచ్చు. ఇది జర్నలిజం వృత్తి నైపుణ్యానికి సంబంధించిన అంశం. దాదాపు శతాబ్ద కాలం క్రితం మీడియా సాధనాలపై గుత్తాధిపత్యం పెరగటం, ఈ గుత్తాధిపత్యం వహిస్తున్న శక్తులకు, ఆయా దేశాల్లోని రాజకీయ ఆర్థిక పెత్తనం చలాయిస్తున్న శక్తులకు మధ్య అవినాభావ సంబంధం ఉండటంతో తాము ఇచ్చే వార్తలు, వెల్లడించే రహస్యాలు నిష్పాక్షికమైనవని మీడియా సంస్థలు రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పత్రికలు ముందుకు తెచ్చే నూతన ప్రత్యామ్నాయాలు, విధానాల వెనక నిర్దిష్టంగా కొన్ని కంపెనీలకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రికల్స్, వెస్టింగ్టన్ వంటి అణు ఇంధన రియాక్టర్లు తయారు చేసే కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధన ఉత్పత్తి ప్రారంభమైతే ప్రయోజనం. వారికి గిరాకి తగులుగుతుంది. అందుకనే స్వచ్ఛమైన ఇంధనం, హరిత ఇంధనం పేరుతో దశాబ్దంన్నరకు పైగా స్వతంత్ర సంస్థల ద్వారా ప్రచారం చేపట్టారు. చివరకు భారతదేశంతో అణు ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఎఐజి కంపెనీ. బీమా రంగంలో, పెన్షన్ రంగంలో విదేశీ కంపెనీల ప్రవేశానికి అవసరమైన వార్తలు, విశ్లేషణలు వచ్చి, ఈ వార్తలు విశ్లేషణలు మనలాంటి దేశంలో ఏ ప్రణాళికా సంఘాన్నో, ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులనో ప్రభావితం చేస్తే ఎఐజి వంటి కంపెనీలు మన దేశంలో యదేచ్ఛగా ప్రవేశించవచ్చు.
ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయం!
గుత్తాధిపతుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు ప్రలోభాల వల్ల కనిపించే వాస్తవాలను ప్రజలకు నివేదించడంలో ప్రధాన స్రవంతి మీడియా సాధనాల వైఫల్యం పెద్దఎత్తున కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వైఫల్యాన్ని పూరించేందుకు బ్లాగ్‌ల రూపంలో, లాభాపేక్ష ఆశించని ఇంటర్నెట్ మీడియా సాధనాల రూపంలో, సోషలిస్టు భావాలు వ్యాప్తి చేసే సాలిడ్ నెట్ రూపంలో అనేక ప్రత్యామ్నాయ మీడియా సాధనాలు ముందుకొచ్చాయి. ఆ విధంగా తెరమీదకు వచ్చిన వికీలీక్స్ కంప్యూటర్ ద్వారా రహస్యాలు ఛేదించే ప్రక్రియ హ్యాకింగ్ నైపుణ్యంతో వివిధ దేశాల ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని తమ వద్ద నిక్షిప్తం చేయగలిగింది.ఇంటర్నెట్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన సమయంలో సమాచారానికి కొరత లేదు. అయితే ఏ సమాచారం, ఎంత మేర అందుబాటులో ఉండాలి అన్న విషయాన్ని నిర్థారించేది ప్రభుత్వాలు, ప్రభుత్వాలతో కుమ్మక్కైన ఇంటర్నెట్ సంస్థలు పారదర్శకత జపం చేస్తూనే తమ పాలకుల వర్గ ప్రయోజనాలకు నష్టం లేని సమాచారాన్ని మాత్రమే అందుబాటులోకి తెస్తాయి. ప్రపంచం ముందుంచుతాయి. ఉగ్రవాదంపై యుద్ధ సమయంలో అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామం అదే. ఎంపిక చేయబడిన మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వమే సమాచారం ఇచ్చి విశ్లేషణలు, వ్యాఖ్యానాలు రాయించటం ద్వారా - కెజి బేసిన్ గ్యాస్ ధర విషయంలో నీరా రాడియా సూచనల మేరకు వీర్‌సంఘ్వి విశ్లేషణ రాసినట్లు- హాని లేని సమాచారాన్ని మాత్రమే బయటకు వదలటం మీడియా మేనేజ్‌మెంట్‌లో భాగంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు అమలు జరిగిన సమయంలో 1994-2004 మధ్యకాలంలో ప్రపంచ బ్యాంకు ఎంతవరకు సమాచారం అందుబాటులోకి తెస్తే అంతే సమాచారాన్ని ఢిల్లీ ప్రతికలు యథాతథంగా అచ్చేసేవి. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు విధానాలకు తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తమైన తర్వాత మాత్రమే ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రశ్నిస్తూ వచ్చే కథనాలు అది కూడా కొన్ని పత్రికల్లో మాత్రమే అచ్చయిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.
ఈ విధమైన పరిస్థితిలో ప్రజలు సదరు పత్రికల్లో వచ్చే వార్తలను నమ్మటం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే వృత్తినైపుణ్యం కలిగిన పాత్రికేయత. ఈ తరహా పాత్రికేయత్వంలో రాసే వార్తకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఏ సమాచారం ఆధారంగా సదరు వార్త రాస్తున్నామో అన్న విషయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో దీనికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. పై అనుభవాల నేపథ్యంలో అమెరికా మీడియా శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకున్న వికీలీక్స్ నిర్వాహకులు భిన్నమైన వ్యూహం రూపొందించారు. తమవద్ద ఉన్న రహస్య పత్రాలు, వివిధ దేశాలకు, అమెరికాకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేవి కావటం వీరికి కలిసి వచ్చిన అంశం. దాంతో లండన్, పారిస్, బెర్లిన్, వాషింగ్టన్‌ల నుండి ఒక్కో పత్రికను ఎంచుకుని తమ వద్ద ఉన్న రహస్యాలను ముందుగా ఆయా పత్రికలకు చేరవేశారు. ఇవన్నీ వృత్తినైపుణ్యం కలిగిన పాత్రికేయుల చేతుల్లోని పత్రికలు. దాదాపు రెండు నెలలుగా శోధించి, సరి చూసుకుని, వికీలీక్స్ వద్ద ఉన్న పత్రాలు అసలువా, నకిలీవా అన్న విషయాన్ని రుజువు చేసుకున్న తర్వాతనే ఈ పత్రికలు కొద్ది కొద్ది సమాచారాన్ని ప్రచురించాయి. ఉదాహరణకు న్యూయార్క్ టైమ్స్, గార్డియన్ పత్రికలు వికీలీక్స్ ఇచ్చిన సమాచారానికి సంబంధించిన వివరాలు రేఖామాత్రంగా ఇంటర్నెట్‌లో ఉంచారు. ఒకటి రెండురోజుల్లో అది కూడా తీసేశారు. ఈ విధంగా వృత్తినైపుణ్యం పట్ల మక్కువ చేసే సంపన్న దేశాల పాత్రికేయులకు అదే వృత్తినైపుణ్యంతో గుణపాఠం నేర్పింది వికీలీక్స్.
వికీలీక్స్ ప్రవాహం...
చివరిగా వికీలీక్స్ వెల్లడించిన వివరాల గురించి క్లుప్తంగా ప్రస్తావించుకుందాం. ఇప్పటి వరకూ మూడు దఫాలుగా వికీలీక్స్ తన వద్ద ఉన్న సమాచారాన్ని వెల్లడించింది. తొలుత ఆఫ్రికా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి తేవటం ద్వారా పాశ్చాత్య ప్రభుత్వేతర సంస్థలు, మీడియాకు దగ్గరైంది. తర్వాతి దశలో ఇరాక్ యుద్ధం గురించిన వివరాలు వెల్లడించింది. ఈ వివరాల్లో కొత్తదనం ఏమీ లేకపోయినా తెరవెనుక జరిగిన పరిణామాలు, అమెరికా వివిధ దేశాలను ఏ విధంగా కట్టడి చేసి మరీ యుద్ధంలోకి దించిందన్న విషయాలు తొలిసారిగా వెలుగు చూశాయి. యుద్ధ సమయంలో అమెరికా అనుసరించిన వికృత చేష్టలు, మానవహక్కుల ఉల్లంఘనలు, అబుగ్రాయిబ్ వంటి ఉదంతాలు మరికొన్ని ఉన్నాయన్న విషయాన్ని ఈ లీకులు స్పష్టం చేస్తున్నాయి. చివరిది దౌత్య రహస్యాలకు సంబంధించిన లీకులు. సాధారణంగా దౌత్యవేత్తలు, దౌత్య సిబ్బంది తమ మాతృదేశ ప్రయోజనాలకు అవసరమైన సమచారాన్ని సేకరించటానికి వివిధ పద్ధతులు అనుసరిస్తారు. ఈ సమాచారాన్ని నిర్దిష్టంగా రికార్డు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ రికార్డు చేయాల్సిన అవసరం, ఉన్నత అధికారులకు రిపోర్టు చేయాల్సిన అవసరం నేపథ్యంలోనే మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను విరివిగా వాడతారు.
ఒకసారి వీటిని హ్యాక్ చేస్తే అందులో ఉన్న సమాచారం వరదలా నలువైపులా ప్రవహిస్తుంది. వికీలీక్స్ చేసింది కూడా అదే. దేశాల వారీగా ఏయే సమాచారం వెలుగులోకి వచ్చిందన్న విషయాన్ని రోజువారి పత్రికలు కాస్తో కూస్తో రాస్తూనే ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ సమాచారానికి, ఆదేశాలకు, వాటి అమలుకు అమెరికాయే కేంద్రంగా ఉంటోందన్న విషయాన్ని ఈ లీకులు ప్రపంచం ముందుంచాయి. వివిధ దేశాలు తీసుకునే విధాన నిర్ణయాల వెనక అమెరికా ఆదేశాలు, దాని ప్రయోజనాలు ఏ విధంగా ఇమిడి ఉంటున్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఈ లీకులు అక్కరకొస్తాయి. ఇటువంటి విషయాలు రెండు మూడు దశాబ్దాల తర్వాత సదరు ప్రభుత్వాలే విడుదల చేస్తాయి. కాస్ట్రోపై ఎన్ని సార్లు హత్యాప్రయత్నం చేసిందన్న విషయాన్ని స్వయంగా సిఐఎ వెల్లడించింది. ఇందిరాగాంధీ పట్ల అమెరికా అవగాహనను కిసింజర్ పత్రాల ద్వారా అమెరికా ప్రభుత్వమే వెల్లడించింది. సదరు సమాచారం మూడు నాలుగు దశాబ్దాల తర్వాత వెలుగు చూస్తే దాన్ని విశ్లేషించి అంచనాకు వచ్చే పని పరిమిత సంఖ్యలో ఉన్న చరిత్రకారులు చేస్తారు. దీనికి భిన్నంగా వర్తమాన ప్రపంచం, వర్తమాన జీవితం, దేశాల వర్తమానం గురించిన వాస్తవాలు, రహస్యాలు, కథనాలు ఎప్పటికపుడు వెలుగు చూస్తే సదరు పరిణామాల పట్ల ప్రజలందరూ స్పందిచేందుకు అవకాశం ఉంటుంది. కనీసం ప్రజలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది.
ఈ విధంగా చూసుకున్నపుడు వికీలీక్స్ దౌత్య రహస్యాల వెల్లడి ద్వారా ప్రభుత్వాల గుట్టు రట్టు చేయటం విలక్షణ చర్య అని చెప్పక తప్పదు. తాజా వాస్తవాలు తాజాగా ప్రజలకు చేరిపోతే ప్రభుత్వాలు, పాలకుల తలరాతలు మారిపోతాయి. అందువల్లనే హిల్లరీ క్లింటన్ అంతగా గగ్గోలు పెడుతోంది.
ఇంటర్నెట్ యుగంలో పారదర్శకత - మీడియా
గతంలో ప్రభుత్వ విధి విధానాలు తెలుసుకోవటం, అవి ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అన్న విషయాన్ని గుర్తించటం చాలా శ్రమతో కూడిన పని. వర్థమాన దేశాల్లో మీడియా స్వభావానికి, సంపన్న దేశాల్లో మీడియా స్వభావానికి మధ్య మౌలికమైన వ్యత్యాసం ఉంది. ఏ దేశంలోనైనా మీడియా సంస్థలు ఆయా దేశ ప్రయోజనాల పరిధిలోనే వ్యవహరిస్తూ వచ్చాయి. వర్థమాన దేశాల్లో దేశ విముక్తి కోసం జరుగుతున్న పోరాట నేపథ్యంలో మీడియా సాధనాలు నిర్దిష్ట రూపం తీసుకున్నాయి. అటువంటి వర్థమాన దేశాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించటంలో మీడియా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రభుత్వానికి 70 దశకంలో జరిగిన వివాదాలు దేశంలో ప్రసారమాధ్యమాల స్వతంత్రతను కాపాడటంలో కీలక సాధనాలుగా మారాయి. ఈ పరిణామం అమెరికా వంటి దేశాల్లో 19వ శతాబ్దం చివర్లోనే పూర్తయ్యింది. పెట్టుబడిదారీ విధానంతో పాటే మీడియా, ప్రభుత్వం మధ్య సంబంధాల్లో కూడా పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. 'జాతీయ ప్రయోజనాలు' అన్న ముసుగులో మీడియా సాధనాలు ప్రభుత్వాలను నిలదీయటం ఎప్పుడో మానేశాయి. మీడియా స్వయంప్రతిపత్తి పేరుతో ప్రభుత్వాలు కూడా మీడియా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మానేసి మీడియా సంస్థల యజమానులకు కావాల్సినన్ని ప్రయోజనాలు చేకూర్చటం ద్వారా వాటి నోరు మూయించే స్థితి వచ్చింది. దానికి తోడు మీడియా సంస్థల యాజమాన్యం కొన్ని శక్తివంతమైన బహుళజాతి కంపెనీల చేతుల్లోకి మారిపోవటంతో ఒక్కో మీడియా ఒక్కో కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకోసం పని చేయటం సంపన్న దేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో సర్వసాధారణ అంశంగా మారింది. భారతదేశంలో ఈ పరిణామం ఇంకా అమెరికా స్థాయికి చేరుకోకపోయినా నీరా రాడియా టేపుల వివరాలు పరిశీలిస్తే ఈ క్రమం ప్రారంభమైందన్న విషయం రుజువు అవుతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, దాంతో వచ్చిన మార్పులు, తదనుగుణంగా ప్రభుత్వ పాలనలో కూడా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి 24 గంటలు వార్తలు ప్రసారం చేసే టీవీలు వచ్చాక వార్తలు ప్రజలకు చేరవేసే సాధనాల సామర్థ్యం పెరిగింది. అయినా ప్రధాన స్రవంతికి చెందిన వార్తా సంస్థలు కంపెనీలతోనో, పాలకపార్టీలతో ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉండటంతో నిష్పాక్షికమైన వార్తలు ప్రజలకు చేరవేయటంలోనూ, వాస్తవాలు ప్రజలు ముందుంచటంలోనూ సమర్థవంతంగా పని చేయలేకపోతున్నాయి. ప్రత్యేకించి ఈ పరిణామం అమెరికాలో పతాక స్థాయికి చేరుకొంది. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లపై అమెరికా సాగించిన దారుణ మారణకాండ సమయంలో అమెరికా మీడియా ఏకంగా పెంటగాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరించటంతో ప్రధాన స్రవంతి మీడియా పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ వామపక్ష మేధావి జాన్ బెల్లమీ ఫాస్టర్ ''సంక్షోభ సమయంలో ప్రజాతంత్ర మీడియా వ్యవస్థ ప్రతి ఘటనకు సంబంధించి విస్పష్టమైన వాస్తవికతను ప్రజల ముందుంచాలి. అధికారంలో ఉన్న వారి చర్యలను, నిర్ణయాలను నిరంతరం తరచి తరచి ప్రశ్నించాలి...దీనికి భిన్నంగా అమెరికాలో జర్నలిస్టు మేధావులు 9/11 నేపథ్యంలో జర్నలిస్టు ప్రమాణాలు పాటించటం వదిలేశారు'' అని విమర్శిస్తాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment