Monday, December 13, 2010

కాంకున్‌ పర్యావరణ సదస్సులో దేశ ప్రయోజనాలు ఫణంగా పెట్టిన యుపిఎ 2


Published in Prajasakti Business Watch on 13th December 2010
'భారతదేశం విడుదల చేసే కాలుష్యకారకాల్లో సంపూర్ణ నియంత్రణ పాటించేందుకు సిద్ధమ'ని ప్రకటించటం ద్వారా జైరాం రమేష్‌ మరోసారి వివాదానికి తెరతీశారు. కాంకున్‌ బయలు దేరే ముందు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకురాలేదు. మిగిలిన దేశాలు ముఖ్యంగా సంపన్న దేశాలు తమ దేశాల్లో కాలుష్య హరణ చర్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు ముందుకు తెచ్చినపుడే వర్ధమాన దేశాలు ప్రత్యేకించి భారతదేశం ఇవ్వాల్సిన తదుపరి రాయితీల గురించి చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా ప్రధానమంత్రి శుక్రవారం, డిశంబరు10నచేసిన ప్రకటనలో జైరాం ప్రకటనలో అభ్యంతరం ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నారు. దాంతో గత రెండు దశాబ్దాల నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చిన పర్యావరణ విధానానికి లోపాయికారీగా తూట్లు పొడిచారు.

కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత పనీ చేసింది. క్రియాశీలకమైన పర్యావరణ శాఖ మంత్రి కాంకున్‌లో భారతదేశ ప్రయోజనాలు, ఆర్థికాభివృద్ధిని ఫణంగా పెట్టారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లు వర్ధమాన దేశాల కూటమిలో కీలక బాధ్యతల్లో ఉన్న భారతదేశం కార్బన్‌ విడుదల తగ్గింపు విషయంలో స్వతంత్రంగా పరిమితులు విధించుకుంటామని ప్రకటించినా సంపన్న దేశాలు ముందుకు రాలేదు. దాంతో క్యోటో ఒప్పందం కొనసాగింపు సందేహాస్పదంగా మారింది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏయే దేశాలు ఏయే బాధ్యతలు నెరవేర్చాలో నిర్దేశించింది క్యోటో ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం 2012 నాటికి సంపన్న దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు (వీటినే ఎనెక్స్‌ 1 దేశాలు అంటారు) ఒక్కో దేశం తాము విడుదల చేసే కర్బన వాయువుల్లో ఎంతమేర తగ్గించాలో నిర్ధారించాయి. ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకు, కాలుష్యానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేదరికం తగ్గాలంటే ఉపాధి పెరగాలి.

ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు పెట్టాలి. పరిశ్రమలు పని చేస్తే కాలుష్యం పెరుగుతుంది. అయినప్పటికీ వర్ధమాన దేశాలు, వెనకబడిన దేశాలు ఇంకా అభివృద్ధి సాంధించాల్సి ఉన్నందున, కోట్లాదిమంది ఆయా దేశాల్లో పేదరికంలో జీవిస్తున్నందున ఆ దేశాలు విడుదల చేసే కర్బనవాయువుల పరిమాణం, దానిలో కోత గురించి అప్పట్లో చర్చ జరగలేదు. తర్వాత మారిన ప్రపంచ ఆర్థిక చట్రం, ప్రపంచీకరణ నేపథ్యంలో వర్ధమాన దేశాల్లో కొన్ని చైనా, భారతదేశం, బ్రెజిల్‌, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో పారిశ్రామికరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఉన్నత స్థాయి వినిమయవాదం కూడా విస్తరించింది. దీంతో ఈ దేశాలు కూడా వాతావరణాన్ని కలుషితం చేయటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి కనుక ఈ దేశాలు బాధ్యత నెత్తిన వేసుకుంటేనే మిగిలిన దేశాలు ముందుకొస్తాయన్నది అమెరికా, జపాన్‌ వంటి దేశాల వాదన. 2009లో కోపెన్‌హెగన్‌లో జరిగిన చర్చలు ఈ అంశంపైనే అసంపూర్తిగా మిగిలిపోయాయి.

కోపెన్‌హెగన్‌కు ముందే భారతదేశం, చైనా, బ్రెజిల్‌ దేశీయంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక విధి విధానాలు ప్రకటించాయి. భారతదేశంలో యుపిఎ-2 ప్రభుత్వం ఏకంగా 12 మిషన్‌లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్వతంత్రంగా కొంతమేర కర్బనవాయువుల పరిమాణం తగ్గిస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. దాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలకు 2009 డిసెంబరు మొదటివారంలో పార్లమెంటులో సమాధానమిచ్చిన జైరాం రమేష్‌ పార్లమెంటు ప్రతిపాదించిన సూత్రాల మేరకే పర్యావరణ ఒప్పందం ఉంటే సంతకం చేస్తామని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఇదంతా కోపెన్‌హెగన్‌లో మిగిలిన దేశాలతో బేరసారాలు ఆడేందుకేనని నమ్మబలికింది. మనలను చూసి మిగిలిన దేశాలు కూడా ఇదే తరహాలో కొన్ని చర్యలు ప్రతిపాదిస్తే అది మొత్తంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని ఆశచూపింది.

కోపెన్‌హేగెన్‌లో ఈ విషయంపై చర్చ జరిగిన అన్ని దేశాలు తదుపరి సమావేశం 2010 నాటికి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. కానీ కీలకమైన కాలుష్యకారకం అమెరికా ఈ విషయంలో స్వతంత్ర విధాన ప్రకటన ఏమీ చేయలేకపోయింది. దిగువనున్న పట్టికలోని వివరాలు సంపన్నదేశాలు పర్యావరణ పరిరక్షణ దిశగా దేశీయ విధానాలు రూపొందించడంలో, అమలు చేయడంలో విఫలమయ్యాయని స్పష్టం చేస్తున్నాయి. హరిత ఇంధనం బిల్లు పేరుతో ఆర్భాటంగా ఒబామా ప్రతిపాదించిన బిల్లు అమెరికా పార్లమెంట్‌ ఎగువసభలో చిక్కుకుపోయింది. ఇపుడు దిగువ సభలో సైతం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇకపై ఆ బిల్లు ఆమోదం పొందటం సాధ్యం కాదు.

కానీ కాంకున్‌ సమావేశాల్లో ప్రభుత్వం వైఖరి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. రెండు వారాలు జరిగే ఈ సమావేశాల్లో మొదటి వారం పది రోజుల్లో అధికారులు, సాంకేతిక నిపుణులు మేథోమదనం చేసి ప్రభుత్వాధినేతల ముందు ఒక ప్రతిపాదన పెట్టాలి. తర్వాత దశలో మూడునాలుగు రోజులు పర్యావరణ మంత్రులు ఈ ప్రతిపాదనలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించుకుని తుది ముసాయిదాను ముందుకు తెస్తారు. అప్పుడు గానీ దేశాధినేతలు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తూ తీర్మానిస్తారు. అయితే గత రెండు దఫాలుగా జరిగినట్లే అధికారులు, సాంకేతికనిపుణుల స్థాయిలోనే ఉమ్మడి ప్రతిపాదనలపై అంగీకారం కుదరలేదు. డిశంబరు 4న కాంకున్‌ బయలు దేరటానికి ముందే ఢిల్లీలో ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ దేశీయంగా తాము తీసుకున్న కాలుష్యహరణ చర్యల అమలుపై అంతర్జాతీయ పర్యవేక్షణ జరుపుకోవచ్చని ప్రకటించి తొలి వివాదానికి తెరతీశారు. ఇప్పటి వరకూ ఒక ప్రభుత్వం తీసుకునే జాతీయ నిర్ణయాలను మరో ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థ మదింపు చేయకూడదన్నది ప్రామాణిక వైఖరిగా ఉంది.

ఈ వైఖరి నుండి తొలిసారిగా భారత్‌ వైదొలగింది. ఇప్పుడు కూడా బేరసారాలు ఆడేందుకే అని చెప్పినా వర్ధమాన దేశాల కూటమికి నాయకత్వం వహిస్తున్న బేసిక్స్‌ (బ్రెజిల్‌, భారత్‌, దక్షిణ ఆఫ్రికా, చైనా)లోని మూడు దేశాలూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కాంకున్‌లో డిశంబరు 8వ తేదీన బేసిక్స్‌ సమావేశం నుండి బయటకు వచ్చిన జైరాం రమేష్‌ తన ప్రతిపాదనను మిగిలిన దేశాలు అంగీకరించటం లేదని ప్రకటించారు. మరుసటి రోజే 'భారతదేశం విడుదల చేసే కాలుష్యకారకాల్లో సంపూర్ణ నియంత్రణ పాటించేందుకు సిద్ధమ'ని ప్రకటించటం ద్వారా జైరాం రమేష్‌ మరోసారి వివాదానికి తెరతీశారు. కాంకున్‌ బయలు దేరే ముందు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకురాలేదు. మిగిలిన దేశాలు ముఖ్యంగా సంపన్న దేశాలు తమ దేశాల్లో కాలుష్య హరణ చర్యలకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు ముందుకు తెచ్చినపుడే వర్ధమాన దేశాలు ప్రత్యేకించి భారతదేశం ఇవ్వాల్సిన తదుపరి రాయితీల గురించి చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి భిన్నంగా ప్రధానమంత్రి శుక్రవారం, డిశంబరు10నచేసిన ప్రకటనలో జైరాం ప్రకటనలో అభ్యంతరం ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నారు.దాంతో గత రెండు దశాబ్దాల నుండి భారతదేశం అనుసరిస్తూ వచ్చిన పర్యావరణ విధానానికి లోపాయికారీగా తూట్లు పొడిచారు.

అంతేకాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రధాన బాధ్యత తమపై మోపిన క్యోటో ఒప్పందాన్ని సమూలంగా రద్దు చేయాలని, దాని స్థానంలో కొత్త ఒప్పందాన్ని తెరమీదకు తేవాలని సంపన్నదేశాలు నడుం కట్టాయి. కాంకున్‌లో బేసిక్స్‌ దేశాలు కూడా ఈ బాధ్యత తీసుకోకపోతే తాను సమావేశాల నుండి వైదొలుగుతానని బెదిరించాయి. దీనికి తోడు కాంకున్‌ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగుస్తాయనగా గతంలో అమెరికా తరపున చర్చల్లో పాల్గొన్న అధికారులందరూ కాంకున్‌ చర్చలు విఫలం కానున్నాయని ఇంటర్వూలు ఇవ్వటం ద్వారా అటు ఆతిథ్య దేశం, ఇటుచిన్న చిన్న దీవుల వంటి దేశాలకు ఆందోళన కలిగించాయి. ఈ పరిస్థితుల్లో జైరాం రమేష్‌ చేసిన ప్రకటన కేవలం చర్చలను బతికించటానికే అనుకున్నా ఈ ఉడత ఊపులకు అమెరికా గానీ,జపాన్‌ గానీ దిగొచ్చింది లేదు. క్యోటో ఒప్పందంలో మరో కీలక అంశం ఉంది.

అది తరతమ స్థాయిలో ఉమ్మడి బాధ్యతకు సంబంధించినది. పర్యావరణ పరిరక్షణ ఉమ్మడి కర్తవ్యం. పర్యావరణానికి తరతమ స్థాయిలో హాని కలిగిస్తున్న దేశాలు అదే స్థాయిలో పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నది క్యోటో ఒప్పందం సారాంశం. అన్ని దేశాలూ కర్బనవాయువుల విడుదలల నియంత్రణకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన ముందుకు తేవటం ద్వారా అమెరికా, జపాన్‌ వంటి ప్రధాన కాలుష్యకారక దేశాలు కోరుకుంటున్న అంశాన్నే జైరాం రమేష్‌ భారత ప్రభుత్వ ప్రతిపాదన రూపంలో చర్చకు పెట్టాడు. ఈ ప్రతిపాదన అంగీకరించటం అంటే క్యోటో స్థానంలో నూతన ఒప్పందాన్ని, ఈ బాధ్యత అన్ని దేశాలకూ సమానంగా పంపిణీ చేసే ఒప్పందాన్ని అమల్లోకి తేవటమే. అందువల్లనే మిగిలిన వర్ధమాన దేశాల నుండి ఈ ప్రతిపాదన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ వ్యాసం పూర్తిచేసే సమాయానికి కాంకున్‌ సమావేశం ఇంకా తుది తీర్మానం పై అంగీకారానికి రాలేదు.

కాంకున్‌ తీర్మానం సంగతి ఎలా ఉన్నా భారతదేశం మాత్రం సామ్రాజ్యవాద దేశాల పంచన చేరి, వర్ధమాన దేశాల అభివృద్ధితో సహా జాతీయ ఆర్థికాభివృధ్ధిని కాంకున్‌లో ఫణంగా పెట్టింది. ఇటువంటి విషయాలు బయటకు పొక్కుతాయన్న ఉద్దేశ్యంతోనే పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని కాంకున్‌ చేరనీయకుండా మరీ పర్యావరణ శాఖ, ప్రధాని కార్యాలయం మోకాలడ్డాయి. ఏతావాతా పర్యావరణ పరిరక్షణ విషయంలో జైరాం రమేష్‌, ప్రధాని వైఖరి కాకులను కొట్టి గద్దలకు వేయటం అన్న చందంగా మారింది. పివి నరసింహారావు ప్రభుత్వం గాట్‌ ఒప్పందంపై సంతకం చేయటంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వాములు కావాల్సి వచ్చినట్లే జైరాం రమేష్‌ నేడు తీసుకున్న ఈ నిర్ణయం రానున్న ప్రభుత్వాల మెడకు గుదిబండగా మారనుంది.

కొండూరి వీరయ్య

No comments: