Wednesday, July 28, 2010

మూలాలను తడమని ఉపాధి నివేదిక




కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన దేశంలో ఉపాధి గురించిన నివేదిక విడుదల చేసింది. గత ఐదేళ్లలో దేశంలో ఉపాధి కల్పన వృద్ధి రేటు రెండు శాతంగా ఉందని చెప్పుకుని మురిసిపోయింది. రానున్న ఐదేళ్ల కాలంలో మరో 2.5 శాతం వృద్ధి రేటు సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ రకంగా ఉపాధి కల్పన గురించి ప్రత్యేకంగా నివేదిక విడుదల చేయటం హర్షదాయకమనే చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వం చెప్పకుండా దాచిన విషయం ఒకటి ఉంది. గడచిన ఐదేళ్లలో సగటున వృద్ధి రేటు 8 శాతానికిపైగానే ఉంది. ఈ కాలంలో ఉపాధిలో వృద్ధిరేటు రెండుశాతం మాత్రమే ఉంది. వచ్చే అయిదేళ్ల కాలంలో 2.5శాతం వృద్ధి సాధించాలంటే ఆర్థికాభివృద్ధి రేటు అంతకంటే ఎక్కువగా ఉండాలన్నది నిర్వివాదం. అయితే మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో ఈ వృద్ధి రేటు సాధ్యమా అన్న ప్రశ్న వేసుకున్నపుడు ఉపాధి వృద్ధి రేటు అంచనా వేయటంలో ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించటం లేదు. ముందు ఉపాధి నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిద్దాం.

యుపిఎ-1 అధికారంలో ఉన్న మొదటి మూడేళ్లు అంటే 2005-2008 మధ్య కాలంలో అదనంగా 24 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అంటే సంవత్సరానికి సగటున ఎనిమిది లక్షల చొప్పున ఉద్యోగాలు వచ్చాయి. 1999-2000 నుండి 2004-2005 మధ్యకాలంలో సాధించిన ఉపాధి కల్పన రేటు కంటే ఇది చాలా తక్కువ. అంతేకాదు. 1983 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 239 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగల సామర్థ్యంతో ఉంటే, 1993 నాటికి ఈ సామర్థ్యం 314 మిలియన్లకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో 75 మిలియన్ల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించగల పరిస్థితికి చేరింది. అయితే సంస్కరణల తర్వాత కాలంలో ఈ ఎదుగుదల వేగం కొనసాగలేదు. 1983తో పోల్చి చూస్తే 1993, 2000 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చింది. అయితే వృద్ధి రేటు వేగానికి అనుగుణంగా ఉపాధి కల్పన సామర్థ్యం పెరగలేదు. సంస్కరణల వేగంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన సామర్థ్యం పెరగలేదన్న విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన ఈ గణాంకాలే రుజువు చేస్తున్నాయి. 1993-2000 మధ్య కాలంలో 338 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా 2000-2004 మధ్య కాలంలో 385 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగింది భారత ఆర్థిక వ్యవస్థ. 1991 తర్వాత జనాభా పొందికలో వచ్చిన మార్పులు పరిగణనలోకి తీసుకుంటే ఈ వృద్ధి రేటు ఇంకా తగ్గిపోతుందన్న విషయం వాస్తవం. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో కష్టించి పని చేయగలిగిన వయస్సున్న వారు 58 శాతంగా ఉన్నారు. 2010 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అంటే మొత్తం 2001 నాటికి భారత జనాభా 99 కోట్లు అనుకుంటే, కుడిఎడంగా 60 కోట్ల మంది పని చేయగలిగిన వారున్నారు. ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2000 నాటికి 33 కోట్ల 80 లక్షల మంది, 2004లో 38 కోట్ల 50 లక్షల మంది ఉపాధి పొందగలిగారు. అంటే శ్రమించగలిగిన జనాభాతో పోలిస్తే నిరుద్యోగం 50 శాతానికి పైగా ఉంటే మొత్తం జనాభాతో పోలిస్తే నిరుద్యోగం 15 శాతానికి దగ్గరగా ఉంటుంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా 15 శాతం ఉత్పాదక సామర్థ్యం నిరుపయోగంగా పడి ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా వెనకబడినట్లే అని వేరే చెప్పనవసరంలేదు.


ఈ కాలంలో మొత్తం శ్రమశక్తి మార్కెట్‌ 46 కోట్లకు చేరుకొంది. పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్రజల రేటు ఈ కాలంలో బాగా పెరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ఈ రేటు 2.85గా ఉంటే ఉపాధి కల్పన కేవలం రెండు శాతంగా మాత్రమేఉంది. అంటే సంవత్సరానికి ఉపాధి కల్పన వృద్ధి రేటు శ్రమ శక్తి మార్కెట్‌ వృద్ధి రేటు కంటే వెనుకబడి ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన సామర్థ్యాన్ని తగ్గించి వేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2008 అక్టోబరులో ఐదు లక్షల మంది అదనంగా నిరుద్యోగ సైన్యానికి తోడు కాగా జనవరి 2009 నాటికి అందులో 2.76 లక్షల మంది తిరిగి శ్రమ మార్కెట్లోకి ప్రవేశించారు. అంటే వీరికి ఉద్యోగాలు దక్కాయి. కానీ అందులో జూన్‌ 2009 నాటికి మరో లక్షా ముప్పయివేల మంది నిరుద్యోగులయ్యారు. అంతేకాదు. సంక్షోభం ఉపాధి మార్కెట్‌పై మరో విధమైన ప్రభావం కూడా చూపింది. 2004-2008 మధ్య కాలంలో మధ్యతరగతి ఉద్యోగికి సగటున వేతనాల్లో 8-11 శాతం వృద్ధి రేటు ఉంటే 2008 తర్వాతి కాలంలో ఇది దాదాపు స్థబ్దతకు లోనైందని చెప్పవచ్చు. ఈ కాలంలో ప్రభుత్వం ఆరవ వేతన సంఘం నివేదిక అమలు చేయకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో రుతుపవనాలపై ఆధారపడ్డ ఉపాధి కల్పనలోని లోటుపాట్లు ఉండనే ఉన్నాయి. ఈ నివేదిక మరో విషయాన్ని కూడా దృష్టికి తెస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్య అది. గ్రామీణ ప్రాంతంలో 57 శాతం మంది స్వయం ఉపాధి చూసుకుంటున్నారని నివేదిక ప్రస్తావించింది. అందులో కూడా గ్రామీణ ఉపాధి మార్కెట్‌కు కీలకంగా ఉన్న వ్యవసాయ రంగం ఈ కాలంలో వృద్ధి రేటు మందగించటంతో వ్యవసాయ కూలీ వేతనాలపై ఆధారపడ్డ మహిళలు, దళితులు, బలహీన వర్గాలకుచెందిన ప్రజలు ఎక్కువ మంది నిరుద్యోగం బారిన పడ్డారని నివేదిక చెప్తోంది. అందువల్లనే ఈ వర్గాలకు చెందిన ప్రజలు ఈ కాలంలో పెద్దఎత్తున పట్టణ ప్రాంతాలకు వలసవెళ్లిన విషయాన్ని కూడా నివేదిక గుర్తించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల మూడేళ్లలో అంటే 2004-005 నాటికి 221 మిలియన్లుగా గ్రామీణ ఉపాధి అవకాశాలు కల్పిస్తే 2007-2009 నాటికి 939 మిలియన్లకు పెరిగిందని ప్రభుత్వం చెప్తోంది. పైన చెప్పిన లెక్కలకు ఎన్‌ఆర్‌ఇజిఎ లెక్కలకు మధ్య పొంతన కుదరని పరిస్థితిని ఈ గణాంకాలు ముందుకు తెస్తున్నాయి. 2010-2015 నాటికి 63.5 మిలియన్ల మంది అదనంగా శ్రమశక్తి మార్కెట్లో చేరనున్నారని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకున్నపుడు రానున్నకాలంలో నిరుద్యోగ మహమ్మారి మరింత స్వైరవిహారం చేయనున్నట్లు అర్థమవుతోంది.

2004-05లో మొత్తం ఉపాధిలో శాశ్వత ఉపాధి శాతం ఆధారంగా ప్రధాన రాష్ట్రాల వర్గీకరణ

అట్టడుగు స్థాయి

(పది శాతం కంటే తక్కువ)

బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌

దిగువస్థాయి

(10 నుంచి 15 శాతం)

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ , అస్సోం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌

మధ్యస్థాయి

(15 - 20 శాతం)

జమ్మూకాశ్మీర్‌, గుజరాత్‌, కేరళ, హర్యానా

అధిక స్థాయి (20 శాతానికి పైబడి)

మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, ఢిల్లీ

విద్యార్హతను అనుసరించి కార్మికులు విభజన శాతం- వారి ఉపాధి స్థాయి

కార్మికుల విద్యార్హత స్వయం ఉపాధి రెగ్యులర్‌ క్యాజువల్‌

నిరక్షరాస్యులు 56.11 4.33 39.56

ప్రాథమిక 56.03 8.86 35.11

మాధ్యమిక 58.94 11.88 29.18

సెకండరీ 60.34 15.75 23.91

హైయర్‌ సెకండరీ 62.33 25.08 12.59

పట్టభద్రలు- ఆపైన 49.45 46.29 4.26

2009-10 నుంచి 2014-15 వరకు అంచనాగా చూపిన జనాభా, పనిలో ఉన్న కార్మికుల రేటు(ఎల్‌ఎఫ్‌పిఆర్‌), మొత్తం కార్మికులు, ఉపాధి వివరాలు...

2009-10 2010-11 2011-12 2012-13 2013-14 2014-15

మొత్తం జనాభా (పదిలక్షల్లో) 1177 1193 1208 1224 1239 1254

ఎల్‌ఎఫ్‌పిఆర్‌ (%) 44.2 44.4 44.8 45.1 45.4 45.8

కార్మికులు (పదిలక్షల్లో) 520 530 541 552 563 574

వార్షిక కార్మికుల జనాభా పెరుగుదల (పదిలక్షల్లో) 10 10 11 11 11 11

ఉపాధి వృద్ధి రేటు రెండుశాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 516 526 537 548 559

ఉపాధి వృద్ధి రేటు 2.25శాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 517 529 541 553 566

ఉపాధి వృద్ధి రేటు 2.50శాతంగా ఉంటే (పదిలక్షల్లో) 506 519 532 545 559 572

1993-94 నుంచి 2004-05 మధ్యకాలంలో ఉపాధి వారిగా కార్మికుల శాతం

ఉపాధి రకం 1993-94 1999-2000 2004-05

గ్రామీణ

స్వయం ఉపాధి 57.96 55.76 60.2

వేతన కార్మికులు 42.04 44.24 39.9

1) రెగ్యులర్‌ 6.45 6.83 7.1

2) క్యాజువల్‌ 35.59 37.41 32.8

పట్టణాలు

స్వయం ఉపాధి 42.29 42.23 45.4

వేతన కార్మికులు 57.71 57.77 54.5

1) రెగ్యులర్‌ 39.40 40.03 39.5

2) క్యాజువల్‌ 18.31 17.74 15.0

కొండూరి వీరయ్య

Thursday, July 8, 2010

చంచల్‌ పెట్రోల్‌

Published in Sunday supplement Book, Prajasakti July 4th 2010
జూన్‌ 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో చమురు ఉత్పత్తుల ధరలపై నియంత్రణలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు ఆహ్వానించాయి. ఇకపై చమురు ఉత్పత్తుల రంగంలో అవధుల్లేని విధంగా ప్రైవేటు పెట్టుబడులు వచ్చిపడతాయని ప్రభుత్వం, 'కొంతమంది' మేధావులు చెప్తున్నారు. మరోవైపున ధరాఘాతంతో కకావికలవుతున్న సామాన్య ప్రజానీకంపై ఇది కొండంత భారం అనటానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో నిత్య జీవితంలో చమురు ఉత్పత్తుల పాత్ర, చమురు ఉత్పత్తుల ధరవరల్లో వచ్చే మార్పులు, వాటికి కారణాలు, శుద్ధి ప్రక్రియ, పన్నుల విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

పెట్రోలు, డీజిలు, కిరోసిన్‌, గ్యాస్‌. ఈ నాలుగు సరుకులు లేకుండా ఆధునిక మానవుడి అత్యాధునిక జీవితాన్ని ఊహించటం సాధ్యం కాదు. షుమారు శతాబ్దిన్నర కాలంగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో చమురు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి చమురు శుద్ధి ప్రక్రియ మొదటిప్రపంచ యుద్ధానికి కాస్తంత ముందుగా ప్రారంభమైన చమురు శుద్ధి ప్రక్రియతో నిత్య జీవితంలో చమురు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయింది. లేటెక్స్‌ కాటుక మొదలు, వాహనాలు సున్నితంగా నడవటానికి ఉపయోగించే కందెన నూనెల వరకూ, ధరించే బట్టల మొదలు ఇళ్లలో అలంకరించే కార్పెట్ల వరకూ... అంతెందుకు. మహిళలు నిత్యం ఉపయోగించే సౌందర్యసాధనాల మొదలు వైద్యులు రాసిచ్చే మందుల వరకూ అన్నింటిలోనూ చమురు ఉత్పత్తులు వివిధ పాళ్లలో మనకు దర్శనం ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ''ఎందెందు వెదకి చూసిన అందందే గలదు 'చమురు'' అని నిర్ధారించుకోవచ్చు. చమురు, దాని ఉప ఉత్పత్తుల నుండి తయారయ్యే వస్తువులు జాబితా తయారు చేయాలనుకుంటే కనీసం 212 వస్తువుల జాబితాను చూడవచ్చు. కంప్యూటర్లు, కంప్యూటరు డిస్కులు, ఎరువులు, పురుగుమందులు, కృత్రిమ హృదయాలు, పేస్‌మేకర్స్‌, యాస్పిరిన్‌, కాంటాక్టు కళ్లద్దాలు, బ్యాండేజిలు, అత్యవసర శస్త్రచికిత్స సాధనాలు, ప్లాస్టిక్కు వస్తువులు, గృహోపకరణాలు, ఫోన్లు, బట్టలు, ఫుట్‌బాల్‌ వంటి క్రీడా వస్తువులు, తలంటుకునే షాంపూలు... ఇలా చెప్పుకుంటూ పోతే చమురు ఉత్పత్తులు లేని సరుకులు గుర్తించటం బ్రహ్మ విద్యే అవుతుంది. అందుకనే శాస్త్రజ్ఞులు మనం పెట్రో రసాయనాల యుగంలో జీవిస్తున్నామని నిర్ధారించారు.

ఇంత చమురు ఎక్కడ నుండి వస్తోంది ?

నిత్యజీవితంలో అంతగా ముడిపడి ఉన్న ఈ చమురు ఎలా వస్తుంది, ఎక్కడ నుండి వస్తుంది అన్న ఆసక్తి కలగటం సహజం. మన దేశానికి సంబంధించినంత వరకు దేశంలోని చమురు నిల్వలు వెలికి తీసే బాధ్యత భారత చమురు సహజవాయువుల కంపెనీది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో అస్సాంలోని డిగ్బోరు, మహారాష్ట్రలోని బోంబే హై, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా గోదావరి బేసిన్‌లలో చమురు వెలికితీత కార్యక్రమాలు గత మూడు దశాబ్దాలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మధ్యనే రిలయన్స్‌ కంపెనీ కెజి బేసిన్‌లో గ్యాస్‌ వెలికితీత పనుల్లో ప్రవేశించింది. ఎస్సార్‌, గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, షెల్‌ అదాని వంటి మరికొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా దేశంలో ఈపనిలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బ్రిటిష్‌ పెట్రోలియం (బిపి), షెల్‌ కంపెనీలు ప్రపంచంలో మూడొంతుల చమురు రంగంపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఈ సముద్ర నిల్వలు భూగర్భంలోనే కాదు. సముద్ర గర్భంలో కూడా దాగి ఉన్నాయి. ఆధునిక పెట్టుబడిదారీ విధానం నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడి పొట్ట చీల్చి పేగులు బయటికి తీసినట్లుగా భూగర్భాన్ని చీల్చి చమురు బయటికి తీయటంలో ఎప్పటికపుడు అత్యాధునిక సాధనాలు కనిపెడుతోంది. ఇవి కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను యధా విధిగా కొనసాగించేందుకు అవసరమైన చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు, చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల కూటమిగా ఒపెక్‌గా ఏర్పడ్డాయి. ఇందులో ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా, వెనిజులా వంటి దేశాలు కీలకమైనవి.

ఎక్కడెక్కడ ఎంతెంత....

నిత్య జీవితంలో ఇంత కీలక పాత్ర పోషిస్తోంది కనుకనే అంతర్జాతీయంగా చమురు నిల్వలపై పెత్తనం సంపాదించేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2002 నాటికి అధికారిక అంచనాల ప్రకారం ప్రపంచంలో ప్రధానమైన చమురు నిల్వలున్న దేశాల గురించిన సమాచారాన్ని ప్రత్యేకంగా ఇచ్చిన బాక్స్‌లో చూడొచ్చు. 2002 ప్రామాణికంగా తీసుకోవటం వెనక వున్న ఉద్దేశ్యం స్పష్టం. నూతన సహస్రాబ్దిలో అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాదం వెనక కీలక లక్ష్యం అంతర్జాతీయ ఇంధన వనరులపై పెత్తనం సాధించటమే. కీలకమైన చమురు వనరులున్న దేశాల్లో నయానో భయానో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇంధన వనరుల ఉత్పత్తిని రోజువారి నియంత్రిస్తోంది.

శుద్ధి ప్రక్రియ

భూగర్భం నుండి వెలికి తీసిన ముడి చమురు యథాతథంగా వినియోగించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది కర్బన ఇంధనాల సముదాయం. ఇది యథాతథంగా వాడితే ప్రాణాంతకం. అందువల్ల దాన్ని శుద్ధి చేయాలి. ఈ శుద్ధి ప్రక్రియలోనే రవాణాకు ఉపయోగించే పెట్రోలియం, డీజిల్‌, ఇళ్లల్లో అవసరాలకు వాడే గ్యాస్‌, కిరోసిన్‌, ఎరువుల తయారీలో ఉపయోగించే నాఫ్తా, కందెన నూనెలు, మైనం, తారు, వంటి ఇతర ఉత్పత్తులు వెలుగు చూస్తాయి. 1900కి పూర్వం నుండే చమురు శుద్ధి చేయటానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. తొలినాళ్లలో జరిగే శుద్ధి ప్రక్రియలో 15 బారెళ్ల చమురు నుండి ఒక బారెల్‌ పెట్రోలు మాత్రమే వెలికి తీయగలిగేవారు. 19వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాల్లో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం తారాస్థాయికి చేరుకోవటంతో దాని అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ఇంధన వనరులు కూడా అవసరమయ్యాయి. ఈ దిశగా అనేక ప్రయోగాలు జరిగాయి. 1913లో ఇండియానాకు చెందిన స్టాండర్డ్‌ ఆయిల్‌ కంపెనీ ఉద్యోగి విలియం బర్టన్‌ థర్మల్‌ క్రాకింగ్‌ అనే ప్రక్రియను కనిపెట్టాడు. చమురు అంటే కర్బన వాయువుల సముదాయం అని పైన చెప్పుకున్నాము.

ఈ ప్రక్రియలో ముడి చమురును బాయిలర్‌లో వేసి నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకూ వేడి చేయటం ద్వారా అందులోని హైడ్రోకార్బన్లను వేరు చేస్తారు. వివిధ దశల్లో జరిగే ఈ ప్రక్రియలో వివిధ ఉత్పత్తులు బయటికి వస్తాయి. మనం పురాణాల్లో చూసే క్షీరసాగర మధనానికి ఇదేమీ తక్కువ కాదు. ఈ తొలినాటి ప్రక్రియల్లో 15 బారెళ్ల చమురును శుద్ధి చేసి ఒకే బారెల్‌ పెట్రోలు బయటికి తేగలిగితే, బర్టన్‌ ప్రక్రియ ద్వారా ఒక్కో బారెల్‌ చమురు నుండి రెండు బారెళ్ల పెట్రోలు బయటికి తేగలుగుతారు. నాటి నుండి చమురు శుద్ధి ప్రక్రియే స్వతంత్ర పరిశ్రమ హోదాకు ఎదిగింది. భారతదేశంలో హెచ్‌పిసిఎల్‌, బిపిసిఎల్‌ కంపెనీలు చమురు శుద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కాక గుజరాత్‌ కేంద్రంలో పని చేస్తున్న రిలయన్స్‌ పెట్రో కెమికల్స్‌ ప్రైవేటు రంగంలో కీలకమైనది. మన దేశ పారిశ్రామిక అవసరాలకు సరిపడినంత చమురు నిల్వలు దేశీయంగా అందుబాటులో లేకపోవటంతో విదేశాల నుండి పెద్దఎత్తున చమురు నిల్వలు దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి దేశీయ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఈ విధంగా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను మార్కెట్‌ చేయటానికి ఉన్నవే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వంటివి. వీటికి తోడు ఇండియన్‌ గ్యాస్‌, భారత్‌ గ్యాస్‌ అంటూ రెండు రకాల గ్యాస్‌ బ్రాండ్లు మన దేశంలో మార్కెట్‌లో ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాల అమలు ప్రారంభించిన నాటి నుండీ క్రమంగా చమురు, సహజవాయువు వెలికి తీతను ప్రైవేటు పరం చేస్తూ వచ్చిన ప్రభుత్వాలు, శుద్ధి పనులు కూడా ప్రైవేటు రంగానికి అప్పగించే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇక మిగిలింది చమురు ఉత్పత్తులు మార్కెటింగ్‌ మాత్రమే. నేటి వరకూ చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ప్రస్తుతం అమల్లోకి రానున్న నూతన విధాన ద్వారా ఈ నియంత్రణ గాల్లో కలవనుంది.

నిల్వ నిర్ధారణ- పన్నులు

చమురు రంగం ద్వారా ప్రభుత్వానికి రెండు రకాల ఆదాయాలు సమకూరతాయి. ఒకటి ముడి చమురు దిగుమతి చేసుకునే సందర్భంలో వచ్చే దిగుమతి సుంకం. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను పారిశ్రామిక ప్రక్రియ ద్వారా వినియోగానికి వీలయ్యే సరుకుల రూపంలో మార్చినపుడు విధించే సుంకాలు. ఇవి ఎక్సైజు పన్ను, కార్పొరేట్‌ పన్ను, రాయల్టీ, డెవిడెండ్‌, డెవిడెండ్‌ పై పన్ను, ఇతరములు. ఈ విధంగా మార్కెట్‌లో వినియోగానికి వీలయిన సరుకులు వినియోగదారుడికి చేరే క్రమంపై విధించే పన్నులు వేరే ఉన్నాయి. అవి వాణిజ్య పన్ను, వాట్‌, ఆక్ట్రారు పన్నులు. ఇన్ని రూపాల్లో వచ్చే ఆదాయాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. బహుశా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో అబ్కారీ ఆదాయం తర్వాత ఈ రూపేణా వచ్చే ఆదాయమే ఎక్కువ. ఉదాహరణకు ఢిల్లీ లాంటి చోట్ల ఒక లీటరు పెట్రోలు ధరలో ఎన్ని పద్దులు కలిసి ఉంటాయో చూద్దాం. లీటరు పెట్రోలు ధరను రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి ముడి చమురు కొనుగోలు నుండి శుద్ధి వరకూ అయ్యే ఖర్చు. రెండోది శుద్ధి అయిన సరుకును మార్కెట్లోకి తెచ్చే ప్రక్రియలో ఉండే ఖర్చు. అంతర్జాతీయ ధరవరలను ప్రభుత్వం నియంత్రించలేకపోయినా పన్నుల విధానాన్ని మాత్రం నియంత్రించ గలిగే శక్తి దానికి ఉంది. అందువల్లనే చమురు ఉత్పత్తులపై పన్నులను పునర్వవస్థీకరించటం ద్వారా వినియోగదారులపై భారాలు తగ్గించవచ్చని నిపుణులు వాదిస్తున్నారు.

కొనుగోలు, శుద్ధి తర్వాత లీటరు పెట్రోలు ధర - 20.42 రూపాయలు

ఎక్సైజు పన్ను - 14.63 రూపాయలు

విద్యారంగ సెస్‌ - 2.92

వాణిజ్య సుంకం - 7.2

డీలర్‌ కమీషన్‌ - 0.84

వెరసి లీటరు పెట్రోలు ధర 46.01(పెంచటానికి ముందు)

ధరల్లో మార్పు

చమురు ఉత్పత్తుల ధరల్లో వచ్చే మార్పులకు కారణాలు జాతీయ, అంతర్జాతీయంగా ఉంటాయి. జాతీయ కారణాలు అంటే పైన చెప్పుకున్న పన్నుల విధానంలో వచ్చే మార్పులు. అంతర్జాతీయ కారణాలు అంటే చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఉత్థాన పతనాలు, డెరివేటివ్‌ వాణిజ్యం ముఖ్య కారణాలు. ఉదాహరణకు 2006-08 మధ్య బారెల్‌ చమురు ధర కుడిఎడంగా 180 డాలర్లకు చేరింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇది తగ్గిపోయి నేడు షుమారు 77 డాలర్లగా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు మారినపుడల్లా పైన చెప్పుకున్న చమురు సంబంధ పద్దుల్లో పెద్దఎత్తున తేడాలు వస్తాయి. చమురు ధరలు చంచలంగా మారుతూనే వుంటాయి. నష్టం వచ్చే మాట ఉండదు. ధరలు పెరిగినపుడు ఆ ధరల భారాన్ని ప్రజల నుండే వసూలు చేస్తారు. ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేటు ఉన్నపుడు ఎక్కువ దిగుమతి సుంకం ఆదాయం, తక్కువ రేటు ఉన్నపుడు తక్కువ దిగుమతి సుంకం ఆదాయం వస్తుంది. మిగిలిన పద్దులన్నీ వినియోగదారుల నుండి వసూలు చేసేవే కనుక పెద్ద మార్పు ఉండదు.

2010 జూన్‌ వరకు భారతదేశంలో చమురు ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఇకపై ఈ నియంత్రణ ఉండదు. అంటే పెట్రోలియం కంపెనీలే అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకొకసారి చమురు ఉత్పత్తుల ధరలు మార్చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయి. ఈ రకమైన స్వేచ్ఛ ఉంటే చమురు శుద్ధి రంగంలో ప్రైవేటు పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వం వాదన. అదేవిధంగా ధరలు కూడా తగ్గుతాయన్నది ఈ వాదనల ఉమ్మడి సారాంశం. ఇప్పటికే వర్థమాన దేశాల్లో అనేక దేశాల్లో చమురు ఉత్పత్తుల ధరలను మార్కెట్‌ ధరలతో అనుసంధానం చేశారు. అయితే అయా దేశాల్లో ఎక్కడా మార్కెట్‌ మాయాజాలంలో ధరలు తగ్గిన దాఖలాలు లేవు. లాభాల కోసం వచ్చే కంపెనీలు ప్రజల స్థితిగతులను పట్టించుకుంటాయని నమ్మటం చెరువులో స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు చెరువుగట్టున ఉన్న పులి చేతిలో బంగారు కడియం గురించి ఆశపడినట్లే ఉంటుంది సుమా.



పెట్రో పన్ను లెక్కించే విధంబెట్టిదనిన...

పెట్రోల్‌ ధరలో అసలు ధర (baరఱష జూతీఱషవ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, డీలరు కమీషన్‌, రవాణా చార్జీలు కలిసి ఉంటాయి. ముందుగా పెట్రోల్‌ అసలు ధరను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. ప్రభుత్వం ముడిచమురు బ్యారెళ్ల లెక్కన దిగుమతి చేసుకుంటుంది. ఒక బ్యారెల్‌కు 42 అమెరికా గ్యాలన్ల ముడిచమురు పడుతుంది. 42 గ్యాలన్లంటే 159 లీటర్లు. దీనిని లెక్కల సౌకర్యార్ధం 160గా తీసుకుంటారు. అంటే ఒక బ్యారెల్‌కు 160 లీటర్లన్నమాట. 1 లీటరు ముడిచమురు (క్రూడ్‌ ఆయిల్‌) ధరనే పెట్రోల్‌ అసలు ధరగా ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. అంటే 1 లీటరు పెట్రోల్‌ అసలు ధర = బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర (రూపాయిలలో) క్ష్మి 160 లీటర్లు. పెట్రోల్‌ ధరలు పెంచిన రోజున (25.06.2010న) బ్యారెల్‌ ముడిచమురు ధర 77 డాలర్లుగా ఉంది. అంటే 77 × 46.39 = రు||3572.03 అన్నమాట. ( 1 డాలరు 46.39రు||లు). దీని ప్రకారం 1 లీటరు పెట్రోల్‌ అసలు ధర = రు||3572.03 క్ష్మి 160 = 22.33 ( దీనిని రు||23గా తీసుకున్నారు). ఇక పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన అనంతరం మన రాష్ట్ర రాజధానిలో పెట్రోల్‌ ధరను విశ్లేషిద్దాం.

పెట్రోల్‌ అసలు ధర రు||23.00

సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రు||15.35 (ఇది కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయించిన స్థిరమైన ధర)

ఎడ్యుకేషన్‌ సెస్‌ రు||00.46 (సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ మీద 3%)

క్రూడ్‌ ఆయిల్‌ కస్టమ్స్‌ డ్యూటీ రు||01.15 (అసలు ధరపై 5%, ఇది కేంద్ర ప్రభుత్వ పన్ను)

పెట్రోల్‌ పై కస్టమ్స్‌ డ్యూటీ రు||01.73 (అసలు ధరపై 7.5%, ఇది కేంద్ర ప్రభుత్వ పన్ను)

వ్యాట్‌ రు||07.59 (అసలు ధరపై 33%, ఇది రాష్ట్ర ప్రభుత్వ పన్ను)

డీలర్‌ కమీషన్‌ రు||01.05

రవాణా చార్జీలు రు||07.17

మొత్తం రు||57.50

పై అంశాలలలో కేంద్ర పన్నులు రు||18.69 (అసలు ధర మీద 81.26%)

రాష్ట్ర పన్నులు రు||07.59 (అసలు ధర మీద 33%)

మొత్తం పన్నులు రు||26.28 (అసలు ధరమీద 114.26%)

దీనిని బట్టి చూస్తే పెట్రోల్‌ అసలు ధర లీటరు రు||23లు. దీనిమీద పన్నులు రు||26.28లు. పన్నులు అసలు ధరను మించిపోయాయన్నమాట.

25.06.2010న పెట్రోలు రేటు లీటరుకు రు3.50 పెంచింది. దీనితో మార్కెట్‌ రేటుకు సమానమైంది. అంటే అంతకు ముందు రు||3.50లు తక్కువకు ఇచ్చింది. దీని ప్రకారం పెంచకముందు కేంద్రం మనకు లీటరుకు ఇచ్చిన సబ్సిడీ రు||3.50. పన్ను రూపంలో మన దగ్గర తీసుకున్నది రు||17. నిజంగా కేంద్రం ఇంత కాలం పెట్రోలుపై సబ్సిడీ ఇచ్చిందా? లేక మనదగ్గరే కాజేసిందా? ఆలోచించండి. ప్రభుత్వం మన నుండి లీటరుకు రు||17 పన్నుల రూపంలో తీసుకుని, లీటరుకు రు||3.50 సబ్సిడీ ప్రకటించింది. మన నుండి తీసుకున్న రు||17 నుండే ఈ రు||3.50 ను ఆయిల్‌ కపెంనీలకు చెల్లిస్తే ఆయిల్‌ కంపెనీలకు నష్టం వుండదు. ప్రభుత్వం ప్రత్యేకంగా తన ఖజానా నుండి చెల్లించ నవసరంలేదు. ప్రాంతాలను బట్టి రవాణా చార్జీల్లో కొద్ది మార్పులొస్తాయి. దాంతో పెట్రోల్‌ ధర స్వల్పంగా మారతుంది. ఇక డీజిల్‌ ధర చూసినా ఇదే పరిస్థితి. డీజిల్‌ అసలు ధర మీద కూడా ఇవే పన్నులు, ఇవే మోతాదులో వసూలు చస్తున్నారు. డీజిల్‌ ధర అసలు ధర కన్నా 1.49 శాతం తక్కువ వున్నదని మన ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెబుతున్నారు. మనమీద ఏదో దయ దలచినట్లుగా చెబుతున్నారు. కానీ వసూలు చేస్తున్న పన్నులు 36 శాతం వున్నాయి. ఈ విషయాన్ని మంత్రిగారు చెప్పడంలేదు. 36 శాతం తీసుకుని 1.49 శాతం ఇస్తున్నారన్నమాట. ఇదీ వరస.

యం.వి. ఆంజనేయులు, ఎల్‌.ఐ.సి.ఆఫ్‌ ఇండియా సి.ఎ.బి, విజయవాడ.


ప్రధానమైన

చమురు నిల్వలున్న దేశాలు

సౌదీ అరేబియా - 261750 మిలియన్‌ బారెళ్లు,

ఇరాక్‌- 112500 మి.బా,

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ - 97800

కువైట్‌ - 96500,

ఇరాన్‌ - 89700,

వెనిజులా - 77685,

రష్యా -48573,

లిబియా-29500,

మెక్సికో-26941

నైజీరియా-24000,

చైనా-24000,

అమెరికా-22045,

కతార్‌ - 15207,

హనవోరు -9947,

అలర్జీయా- 9200

బ్రెజిల్‌ - 8465,

ఒమన్‌-5506,

కజకిస్తాన్‌-5417,

అంగోలా-5412,

ఇండోనేషియా-5000.

డిల్లీలో చమురు ఉత్పత్తుల పన్ను

పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ కిరోసిన్‌

వ్యాట్‌ 20% 12.5% 4% 4%

సెంటర్‌

సేల్స్‌ టాక్స్‌ 2% 2% 2% 2%

- కొండూరి వీరయ్య

Monday, July 5, 2010

ఫైనాన్స్‌ పెట్టుబడి పడగ నీడన జి 20


జి 20 కూటమి సమావేశాలు జూన్‌ చివరి వారంలో కెనడాలోని టొరంటోలో జరిగాయి. ఈ కూటమి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది నాల్గో సమావేశం. దీనికి ముందు జి 20 ఆర్థిక మంత్రుల సమావేశం జూన్‌మొదటి వారంలో జరిగింది. ఈ సమావేశాల తీరు, తీర్మానం గమనిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభం నుండి కూడా ఏమాత్రం పాఠాలు నేర్వలేదని స్పష్టమవుతోంది. టొరంటో సమావేశాల చర్చలన్నీ అభివృద్ధి వర్సెస్‌ లోటు నియంత్రణ చుట్టూ తిరిగాయి.అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి ప్రపంచాన్ని బయటపడేసే శక్తి అమెరికాకు,దాని నాయకత్వంలో పని చేస్తున్న జి 8కు లేకపోయింది. తొలుత 97లో ఆసియా ఆర్థిక సంక్షోభం భారాన్ని మోయడానికి జి20 వేదికగా మారింది. నేడు దశాబ్ధం తరువాత (2008లో) అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ భారాన్ని మోపేందుకు మళ్లీ జి 20 కావాల్సి వచ్చింది. అంటే అప్పటి వరకూ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మండువా లోగిలిని నిలబెట్టటానికి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎనిమిది స్థంభాలు జి8 శాయశక్తులా కృషి చేశాయి. ఇంటిని నిలబెట్టి ఉంచాల్సిన నిట్టాడుల కూసాలకు చెదలు పడితే ఇళ్లునెలమట్టమవుతుంది. అటువంటపుడు రెండే మార్గాలు. పాత స్థంభాల నడుమ కొత్త స్థంభాలు నిలబెట్టి పాతవాటిపై భారాన్ని తగ్గించటం ద్వారా మరికొంత కాలం ఇంటిని నిలబెట్టటం. లేదా పూర్తిగా పడేసి కొత్త పునాదులపై కొత్త ఇల్లు కట్టుకోవటం. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభ భారానికి జి8 కూసాలు కుళ్లిపోయాయి. దాంతో మరో పన్నెండె కూసాలు అదనంగా చేర్చి దాన్ని నిలబెట్టేప్రయత్నం జరిగింది. ఆ విధంగా 2008లో అంతర్జాతీయ వ్యవహారాల్లో బేరసారాల వేదికగా ఉన్న జి20 అమాంతంగా బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు వచ్చింది.

ఈ పరిణామాన్ని అప్పట్లో పలువురు విశ్లేషకులు ఆహ్వానించారు. జి20 సరైన దిశలో నడిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏకధృవ ప్రపంచం నుండి బహుళ ధృవ ప్రపంచంగా మారుతుందని దాంతోపాటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దూకుడు తగ్గుతుందని ఆశించారు. ఈ కలలు కల్లలేనని రుజువు చేసింది టొరంటో సమావేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నీడ నుండి బయటకు తేవటానికి గల మార్గాలు ఏమిటి, ఈ దిశగా ఏదేశం ఏమి చేయగలదు అన్న చర్చకు బదులుగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో పెరిగి పోతున్న లోటు గురించిన చర్చ కేంద్రక స్థానం ఆక్రమించింది. తుది ప్రకటనలో కూడా దేశాలు తరతమ స్థాయిల్లో లోటు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

గత రెండేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపనల పేరుమీద 11.9 ట్రిలియన్‌ డాలర్ల మేర నిధులు కుమ్మరించారు. అయినా ఉపాధి కల్పన, ఉత్పత్తి, ఎగుమతుల వృద్ధి ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిందని దేశాధినేతలు విచారం ప్రకటించారు. ఇంత మొత్తంలో అదనపు నిధులు ఆర్థిక వ్యవస్థలో కుమ్మరించేందుకు మద్దతుగా కీన్స్‌ను తిరిగి బతికించారు. మహా మాంద్యం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బతికించటానికి ప్రభుత్వాలు లోటుతో కూడిన ఆర్థిక విధానాలు అమలు జరిపినా తప్పు లేదని ఆయన ప్రతిపాదించారు.

లోటుతో కూడిన ఆర్థిక విధానాలు అంటే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయటం అన్నమాట. ఈ విధంగా చేసే అదనపు ఖర్చు ఉపాధి కల్పన పెంచేందుకు, నిజ ఆర్థిక వ్యవస్థలో కదలిక తెచ్చేందుకు వెచ్చించాలని ఆయన సిఫార్సు చేశారు. కీన్స్‌ పేరుతో అమలు జరుగుతున్న నేటి ఉద్దీపనలన్నీ ఈ మౌలిక సూత్రాన్ని పక్కన పెట్టాయి. పైన పేర్కొన్న మొత్తాన్ని ద్రవ్య మార్కెట్లోకి కుమ్మరించాయి. దాంతో ద్రవ్య మార్కెట్‌లో కదలిక వచ్చింది. పెద్ద పెద్ద ద్రవ్య సంస్థల లాభాలు పెరిగాయి. తప్ప ఉత్పాదక రంగంలో పెద్దగా మార్పు రాలేదు. చైనా, భారతదేశం వంటి చోట్ల ఉద్దీపనలు లేకపోతే ఈ మాత్రం వెసులుబాటు కూడా ఉండేది కాదు. ద్రవ్య మార్కెట్‌ కాస్తంత ఊపిరి తీసుకోవటంతో ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరిగి కొమ్ములువచ్చాయి. ఈ ద్రవ్య పెట్టుబడి సమర్థకులు పెరుగుతున్న లోటు గురించి గొంతు చించుకుని అరవటం ప్రారంభించారు. దీనికితోడు యూరోపియన్‌ యూనియన్‌లో దేశాలకు దేశాలే దివాళా తీసే స్థితి వచ్చింది. వెరసి జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో లోటు తగ్గించుకోకపోతే కష్టమన్న నిర్ధారణకు వచ్చాయి యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాలు. జర్మనీ, బ్రిటన్‌లు ఈ వాదన లంకించుకున్నాయి. అమెరికా కూడా ఇందుకు భిన్నంగా లేకపోయినా తానున్న ఆర్థికస్థితిలో ఇయుతో పెద్దగా వివాదానికి సిద్ధపడే పరిస్థితి లేదు. దాంతో ఇయు మాట నెగ్గింది. ద్రవ్యలోటు నియంత్రణ చర్యలు గురించిన చర్చ కొలిక్కి వచ్చింది. 2015 గడువుగా నిర్దేశించుకుని సంపన్న దేశాలు ద్రవ్య లోటు తగ్గించాలని టొరంటో సమావేశాలు తీర్మానించాయి.

ఈ పరిణామాలు చూస్తుంటే ఉద్దీపన నేపథ్యంలో కనపిస్తున్న కాస్తంత అభివృద్ధి వాపును చూసి ఇదే తమ బలమని ద్రవ్య పెట్టుబడి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకింగ్‌ లావాదేవీలపై పన్ను విధించే విషయంలోనూ, పన్నుఎగవేతదారుల స్వర్గధామాలపై చర్చ విషయంలోనూ ద్రవ్య పెట్టుబడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కీన్స్‌ ప్రతిపాదించిన ఆర్థిక విధానాల మద్దతుదారుల మాటకు విలువ లేకుండా పోయింది. మరోవైపున ఆర్థిక వ్యవస్థ సరిగ్గా గాడిలో పడలేదన్న విషయాన్ని దృష్టిలోకి తీసుకుని నోబెల్‌ బహుమతి గ్రహీత పాల్‌ క్రుగ్‌మాన్‌ వంటి ఆర్థిక వేత్తలు ఉన్న ఫళంగా ఉద్దీపన వ్యయంలో కోత కోస్తే జపాన్‌ తరహా అనుభవాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు. జి 20 సమావేశాలకు ముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన నేపథ్య పత్రంలో కూడా ఇప్పుడున్న ఉద్దీపనలను యథావిధిగా కొనసాగిస్తూ ఆర్థికాభివృద్ధికి అవసరమైన మిగిలిన చర్యలు చేపడితే రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా సగటున రెండు శాతం అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని, మొత్తంగా ప్రపంచంలో మూడు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు వస్తాయని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఉద్దీపన రద్దు చేస్తే ఆసియాదేశాలు సాధించగలుగుతాయనుకుంటున్న ఆర్థికాభివృద్ధి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ చర్చ మొత్తం 1937-38 నాటి కీన్స్‌, ఆయన ప్రత్యర్ధులకు మధ్య జరిగిన సంవాదాన్ని గుర్తు చేస్తోంది. బ్రిటన్‌, మరియు ఇతర యూరోపియన్‌ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరగటంతో యూరప్‌ సాధ్యమైనంత త్వరగా మహా మాంద్యం నుండి బయటపడగలిగింది.

అదే సమయంలో రూజ్వెల్డ్‌ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ విధానాల్లో పెద్దఎత్తున కోత విధించటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించటంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి సంక్షోభంలోకి కూరుకుపోయింది. విచిత్రమేమిటంటే తాజా సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఉద్దీపనలను కొనసాగించాలని వాదిస్తుంటే యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ప్రత్యేకించి బ్రిటన్‌, జర్మనీ దేశాలు ఉద్దీపన నిధుల్లో కోత కోయాలని నిర్ణయించాయి.ఏతావాతా చూసుకుంటే ఏ ద్రవ్య పెట్టుబడిని పరిరక్షించే విధానాలు తాజా సంక్షోభానికి కారణం అయ్యాయో జి20 దేశాధినేతలు అవే ద్రవ్య పెట్టుబడి పరిరక్షణ విధానాల పంచన చేరాలని చూస్తున్నారు. ఇది ఏ ఒక్క దేశానికో కాక మొత్తంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే అశనిపాతంలా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు, ఆర్థిక మేధావులు ద్రవ్య పెట్టుబడి ప్రభావం నుండి బయట పడనంత వరకూ ఈ ముప్పు కొనసాగుతూనే ఉంటుంది.