Monday, February 22, 2010

రానున్న దశాబ్ధిలో భారత్‌ పయనాన్ని నిర్దేశించే బడ్జెట్‌

Published in Prajasakti Telugu Daily, Mon 22nd Feb 2010, IST

* 20 సంవత్సరాల క్రితం సంస్కరణలు ప్రారంభమైనపుడు ప్రభుత్వం ముందున్న మరో లక్ష్యం, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు నిర్దేశించిన కీలక షరతు, ద్రవ్యలోటు తగ్గించటం. ఈ షరతు అమల్లో భాగంగా తెరమీదకు వచ్చిందే ద్రవ్యనియంత్రణ చట్టం. పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభ దశ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రించాలా వద్దా అన్న అంశంపై పెద్దఎత్తున సైద్ధాంతిక చర్చ జరుగుతోంది.

అనుభవాజ్ఞుడైన ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఈ శుక్రవారం యుపిఎ-2 ప్రభుత్వపు రెండో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్నారు. నిజానికి యుపిఎ-2లో ఇది తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రతిపాదించినా దానికంటే ముందే ఎన్నికలు ముగియగానే రెండు, మూడు దఫాల ఉద్దీపన పథకాలు ప్రకటించటం మనకు తెలుసు. దాంతో గత సంవత్సరం బడ్జెట్‌ అంతా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం పడగ నీడన సాగింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం పగడ నీడ నుండి బయట పడుతుందని చెప్పుకొస్తున్నారు. వర్ధమాన దేశాలు ప్రత్యేకించి చైనా, భారతదేశాల్లో ఆర్థికాభివృద్ధి వేగం గురించి పుంఖానుపుంఖాలుగా వివరాలు వస్తున్నాయి.

తాజాగా గత వారం విడుదలైన పారిశ్రామికాభివృద్ది సూచికలు కూడా భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి రెండంకెల స్థాయిని దాటిపోతుందని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రణబ్‌ ముఖర్జీ పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రతిపాదించాల్సి ఉంది. ఈ బడ్జెట్‌కు రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జనవరి రెండో వారంలో చెప్పుకున్నట్లు గత దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు సవాళ్లు విసిరిన దశాబ్దం. అదేసమయంలో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పట్టు పెంచుకుంటున్న కాలం కూడా. పలువురు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఈ దశాబ్దం చిండియా దశాబ్దం (చైనా, భారత్‌ల ఆధిపత్యం కొనసాగే దశాబ్దం)గా పరిగణిస్తున్నారు. అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ రెండు దేశాలు ఆర్థిక రంగంలో ప్రదర్శిస్తున్న ప్రతిభాపాటవాలు మరో దశాబ్దం పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అంటే దశాబ్దం పాటు నిర్వరామమైన అభివృద్ధికి కావల్సిన విధానమార్గదర్శనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్‌ ఒక అనూహ్య అవకాశంగా ఉండనుంది.

మరో ముఖ్యమైన ప్రత్యేకత ఈ సంవత్సరంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పివి నరసింహారావునేతృత్వంలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు నిండా రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభంతో సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వాలు వరుసగా కొద్ది పాటి వ్యత్యాసాలు మినహా ఈ ధోరణిని కొనసాగిస్తూ వచ్చాయి. ప్రణబ్‌ ముఖర్జీ ప్రతిపాదించే బడ్జెట్‌ గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలను సమీక్షించుకునేందుకు మంచి అవకాశంగా ఉంటుంది. ప్రణాళికా సంఘం అంచనాల మేరకే సంస్కరణల ఫలితంగా తోసుకొచ్చిన అభివృద్ధి అవకాశాల తర్వాత కూడా 35 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే చివరికి ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే తప్ప ప్రభుత్వం పౌరులందరికీ ఆహారం పెట్టలేని దుస్థితికి చేరింది. ఆహారోత్పత్తుల ధరలు బహుశా చమురు సంక్షోభం తర్వాత ఇంత స్థాయిలో పెరిగింది ఇప్పుడేనేమో.సంస్కరణలు ప్రారంభించే నాటికి ప్రభుత్వం ముందున్న మౌలిక లక్ష్యాల్లో ఒకటి రెండంకెలకు చేరుకున్న ద్రవ్యోల్బణం మదపుటేనుగును లొంగదీసుకోవటం. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల పాటు 5-6 శాతానికి అటు ఇటూగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం తిరిగి గత రెండు సంవత్సరాలుగా రెండంకెల దశకు చేరుకొంది. గత సంవత్సరం వరకూ వరసగా నాలుగు సంవత్సరాల పాటు కరుణించిన వరుణుడి సహకారంతో అదుపులో ఉన్న ఈ మదపుటేనుగు ఎన్నికలకు ముందు ఒక్కసారిగా కట్లు తెంచుకొంది. దాంతో ద్రవ్యోల్బణం పది శాతానికి పైమాటగానే మిగిలింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంక్షోభం కారణంగా దెబ్బతిన్న పారిశ్రామికోత్పత్తి సంవత్సరం చివరి నాటికి కోలుకున్నా వ్యవసాయోత్పత్తి మాత్రం కరువు బారి నుండి బయటపడలేదు. దాంతో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 17-19 శాతం మధ్య ఊగిసలాడుతోంది. దాని ప్రభావం మార్కెట్లో కనిపిస్తోంది. మరోవైపున ఉపాధి రంగంలో కొత్తగా కనిపిస్తున్న పురోగతి ఏమీ లేదు. ఐటి రంగంలో, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో కాస్తంత ఉపాధికల్పన సామర్థ్యం పెరిగినా సాంప్రదాయకంగా ఉండే పారిశ్రామిక రంగం, వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయిందని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. ఉన్న కొద్ది పాటి ఉపాధి కల్పన కూడా నిరంతరం అభద్రత వాతావరణంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్‌ ఈ పర్యవసానాలను, ఈ పర్యవసానాలకు కారణమైన విధానాలను సమీక్షించాలని ఆశించటం అత్యాశ కాదు. ప్రభుత్వం ఈ సమీక్షకు సిద్ధమవుతుందా లేదా అన్నది వేరే ప్రశ్న. రెండు దశాబ్దాల సంస్కరణలను పురస్కరించుకుని మిగిలి ఉన్న సంస్కరణల ప్రక్రియను అంటే కాపిటల్‌ అకౌంట్‌ కన్వర్టబిలిటీ, వివిధ దేశాలతో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలు, కార్మికరంగ సంస్కరణలు వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాదు. పన్నుల రంగంలో కూడా సంపన్నులకు, పెట్టుబడిదారీ వర్గానికి మరింత రాయితీలు ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా ముందుకొస్తోంది. ప్రత్యక్ష పన్నుల ప్రవర్తనా నియమావళి, దేశవ్యాప్తంగా వర్తించే ఒకే తరహా వాణిజ్యపన్నుల విధానం- గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌(జిఎస్‌టి)- ఇందులో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం సంస్కరణలు ప్రారంభమైనపుడు ప్రభుత్వం ముందున్న మరో లక్ష్యం, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు నిర్దేశించిన కీలక షరతు, ద్రవ్యలోటు తగ్గించటం. ఈ షరతు అమల్లో భాగంగా తెరమీదకు వచ్చిందే ద్రవ్యనియంత్రణ చట్టం. పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభ దశ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రించాలా వద్దా అన్న అంశంపై పెద్దఎత్తున సైద్ధాంతిక చర్చ జరుగుతోంది.

యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశం గ్రీస్‌ తన స్థూల జాతీయోత్పత్తి కంటే 114 శాతం అధికంగా అప్పుల్లో కూరుకుపోయింది. 2012 నాటికి అమెరికా అప్పులు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 77 శాతంగా ఉంటాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్‌ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిస్తితుల్లో రానున్న దశాబ్దంలో భారతదేశం ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలంటే ద్రవ్య లోటు నియంత్రించటం ముఖ్యమైన షరతుగా పలువురు ఉదారవాద ఆర్థికవేత్తలు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యలోటు నియంత్రించకపోతే ద్రవ్యరంగంలో సుస్థిరత సాధ్యం కాదన్నది వీరి వాదన. సంక్షోభం నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు విస్తృతంగా ఉత్పాదక, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ పెట్టుబడులు పెరుగుతున్నంత కాలం ద్రవ్యలోటుపెరుగుతూ ఉంటుంది. అదేసమయంలో ప్రైవేటు రంగ పెట్టుబడికి గల అవకాశాలు పరిమితం అవుతూ వస్తాయి. అందువల్లనే ద్రవ్యనియంత్రణ పేరుతో ఉత్పత్తి రంగంలోనూ, మౌలిక సదుపాయాల రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడికి అవకాశాలు విస్తరింపచేయాలన్నది వీరి వాదన. ద్రవ్యలోటు నియంత్రణ రెండంచెల చర్య. మొదటిది పైది. రెండో అంచెలో భాగంగా ప్రభుత్వ వ్యయం తగ్గించుకునేందుకు గాను సబ్సిడీలపై వేటు వేయాలని వీరు ప్రతిపాదిస్తున్నారు.

బడ్జెట్‌కంటే ముందే ఎరువులపై ఇచ్చే సబ్సిడీని కుదించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు జరిగిపోయాయి. గురువారం నాటి క్యాబనెట్‌ నిర్ణయం వల్ల, డీకంట్రోల్డ్‌ నుండి న్యూట్రియంట్‌ బేస్డ్‌ ఎరువుల సబ్సిడీకి మళ్లటంతో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.30వేలకోట్లు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. స్థూలంగా చూస్తే రెండు దశాబ్దాల ఆర్థికాభివృద్ధి ఫలితాలు, పర్యవసానాలు సమీక్షించి సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన విధానాలకు బడ్జెట్‌ ప్రాధాన్యత ఇస్తుందా లేక రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ ఆర్థికరంగంపై భారతదేశ బహుళజాతి కంపెనీల ఆధిపత్యం నిలుపుకోవటానికి అవసరమైన విధానాలకే ఈ బడ్జెట్‌ పరిమితం అవుతుందా అన్నది దేశం ముందున్న ప్రశ్న.

కొండూరివీరయ్య

Monday, February 8, 2010

సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కాలంటే అవుట్‌ సోర్సింగ్‌ పై వేటు పరిష్కారం కాదు

Published in Prajasakti February 8th 2010

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జాతినుద్దేశించి చేసిన ప్రసంగం మరో సారి భారతదేశంలో ఐటి, ఐటెస్‌ పరిశ్రమల భవితవ్యంపై చర్చను రేకెత్తించింది. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ను తెరమీదకు తెచ్చింది సంపన్న దేశాలే. ఆయా దేశాల్లో 80వ దశకంలో కంపెనీలు ఎదుర్కొంటున్న లాభాల రేటు పతనమవుతున్న నేపథ్యంలో ఈ భావన తెరమీదకు వచ్చింది. బహుళజాతి కంపెనీలు ఉత్పాదక కార్యకాలాపాలు, అనుబంధ కార్యకలాపాల భారం తగ్గించుకోవటానికి ఉత్పత్తి క్రమం దెబ్బతినకుండా కొన్ని కార్యకలాపాలను భారతదేశం వంటి దేశాలకు తరలిస్తూ వచ్చారు. ఈ విధమైన తరలింపుతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోగలిగాయి. లాభాల రేటు పెంచుకోగలిగాయి.అదేసమయంలో అంతేమేరకు మానవవనరుల వినియోగాన్ని తగ్గించుకోగలిగాయి. అంటే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడుతున్న దేశాల్లో సదరు రంగంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటే ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సేవలందిస్తున్న దేశాల్లో ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి. దాంతో పాటు సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. దేశీయంగా ఇన్ఫొసిస్‌, విప్రో, టిసిఎస్‌ వంటి కంపెనీల స్థాపనకు అవకాశం ఇచ్చాయి.

అమెరికా, యూరప్‌ దేశాల్లో కంటే భిన్నంగా భారతదేశంలో ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన రంగం (గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు)లో విద్యార్థులు అసమాన ప్రతిభాపాటవాలు చూపించటం కూడా వివిధ శాస్త్రపరిజ్ఞానం రంగానికి సంబంధించిన సేవలను మన దేశానికి ఔట్‌సోర్సింగ్‌ చేయటానికి సంపన్న దేశాలు సిద్ధపడ్డాయి. ఔట్‌సోర్సింగ్‌ రెండు రకాలు. మొదటిది వనరులు, నైపుణ్యం కోసం కొన్ని సేవలు ఇతర దేశాల్లో పూర్తి చేయించుకోవటం కాగా రెండోది మార్కెట్‌ అవకాశాలు విస్తరించుకోవటం ఔట్‌సోర్సింగ్‌ విధానాలను అవలంభించటం. భారతదేశంలోని బిపిఒ, ఔట్‌సోర్సింగ్‌ పరిశ్రమ ప్రధానంగా మొదటి తరహాకు చెందినదిగా చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నా ఈ పరిశ్రమలు మాత్రం నిలకడగా ఉన్నాయి. తాజాగా వెల్లడయిన గణాంకాల ప్రకారం మన దేశంలో 71 శాతం కంపెనీలు ఈ సంవత్సరం సిబ్బంది నియామకానికి గాను పథకాలు సిద్ధం చేసుకున్నాయి. సాధారణంగా ఔట్‌సోర్సింగ్‌ పరిశ్రమల్లో డిమాండ్‌ను బట్టి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకం జరుగుతుంది. అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో బిపిఒ పరిశ్రమ పెద్దఎత్తున అవకాశాలు వస్తాయన్న అంచనాతో ముందుకు పోతుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి వస్తువులు, సేవలు ఔట్‌సోర్సింగ్‌ రూపంలో తరలించే కంపెనీలపై పన్ను వేస్తామని, అమెరికాలోనే పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తామని ఒబామా ప్రకటించారు. దాంతో ఇటు అమెరికా కంపెనీల్లోనూ, భారతదేశంలోని బిపిఒ పరిశ్రమలోనూ ఆందోళన మొదలైంది.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా భారతదేశంలోని బిపిఒ పరిశ్రమ ఆదాయం పడిపోయింది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి గాను 50 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు సాధించిన బిపిఒ పరిశ్రమ 2010-2011 ఆర్థిక సంవత్సరానికి మరో 15 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 7 లక్షల మంది బిపిఒ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. ఇందులో 60 శాతం ఆదాయం అమెరికా కంపెనీల నుండే వస్తోంది. దాంతో అమెరికా ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పులు ప్రత్యేకించి బిపిఒ పరిశ్రమను ప్రభావితం చేసే విధానాల పట్ల మన దేశంలో సహజమైన ఆసక్తి ఉంటుంది. గత సంవత్సరం ఒక ఉపన్యాసంలో బెంగుళూరులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమల కంటే బఫెలోలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇస్తామని ప్రకటించారు. గత నెల జాతినుద్దేశించి చేసిన 70 నిముషాల ప్రసంగంలో అమెరికాలో దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం గురించి 29 సార్లు ప్రస్తావించారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తన సంపాదకీయంలో 2009 సంవత్సరంలో ఆరోగ్యబీమా లక్ష్యంగా పని చేసిన ఒబామా ప్రభుత్వం 2010 సంవత్సరంలో ఉపాధికల్పన లక్ష్యంతో పని చేయనుందని వ్యాఖ్యానించింది.

ఔట్‌సోర్సింగ్‌ వల్ల గతంలోకూడా నిరుద్యోగం పెరిగింది. అయితే మిగిలిన పారిశ్రామిక, ఆర్థిక సేవల రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కనిపిస్తూ ఉండటం, ప్రపంచ ఆర్థికరంగంపై అమెరికా పెత్తనం కొనసాగుతూ ఉండటంతో ఇది పెద్ద సమస్యగా అప్పట్లో కనిపించలేదు. కానీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం పర్యవసానంగా అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఉత్పాదకరంగం, ఆర్థిక సేవల రంగం కుదేలయ్యాయి. దాంతో కంపెనీల లాభాలతో పాటే ఉపాధి అవకాశాలూ ఆవిరయ్యాయి. అమెరికాలో అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగం 12 శాతం వరకూ ఉండగా అనధికారిక లెక్కల ప్రకారం 18 శాతం వరకూ ఉంది. అందువల్లనే ఒబామా ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు లారీ సమ్మర్స్‌ ''అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో రికవరీ చూపిస్తున్నప్పటికీ మానవవనరుల వృద్ధి విషయంలో స్థబ్దత కొనసాగుతూనే ఉంది'' అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు పెంపొందించాల్సిన తక్షణ ఆవశ్యకత ఒబామా ప్రభుత్వం ముందుంది. దానికనుగుణంగానే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడే కంపెనీలకు ఉన్న పన్ను రాయితీలు రద్దు చేయటంతో పాటు కొత్తగా పన్నులు విధించే అవకాశం కూడా ఉందని ప్రకటించింది. తద్వారా అదనంగా 241 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీని ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్‌ అనుకూల విధానాల వల్ల అమెరికా కంపెనీల పారిశ్రామిక ఉత్పత్తులు చౌకగా తయారవుతున్నాయి.

ఈ విధంగా చౌకైన పారిశ్రామిక ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. మిగిలిన దేశాల పారిశ్రామిక ఉత్పత్తులు భారీ వ్యయంతో కూడుకున్నవి కావటంతో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఉత్పత్తులతో పోటీపడలేకపోతున్నాయి. ఈ అవుట్‌సోర్సింగ్‌ విధానాలకు స్వస్తి చెబితే అమెరికా కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తుల మార్కెట్‌ విలువ పెరిగిపోతుంది. ప్రపంచీకృతమైన ఆర్థిక వ్యవస్థలో ఒక్క కలంపోటుతో ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయటం సాధ్యం కూడా కాదు. ఈ విషయాన్ని గుర్తించబట్టే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడే కంపెనీలపై పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఈ చర్య కూడా ఆయా కంపెనీ ఉత్పత్తులను మరింత ప్రియం చేయనున్నాయి. అదే జరిగితే ఇప్పటికే సంక్షోభం పడగ నీడన ప్రాణాలరచేతిలో పెట్టుకు కూర్చున్న అమెరికా పారిశ్రామిక రంగం మరింత ఒత్తిళ్లకు లోనవుతుంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆధిపత్యానికి సంపూర్ణంగా స్వస్తి చెప్పాల్సి వస్తుంది. దాంతో అదనపు ఆదాయం ఎలా ఉన్నా ఉన్న ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక అంచనా మేరకు ఒబామా ప్రతిపాదించిన పన్నుల విధానం అమలు జరిగితే అమెరికాలో తయారయ్యే పారిశ్రామిక వస్తువులు, సేవలు ఖరీదు 50 శాతం అదనంగా పెరుగనున్నాయి. ఈ పరిస్థితి అటు అమెరికా కంపెనీలకు మాత్రమే కాదు, ఇటు అమెరికా ప్రభుత్వానికీ యమపాశంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్‌ గురించి ఒబామా బెదిరింపులు ఆచరణకు నోచుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెలుగు చూసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో ఐటి, ఐటెస్‌ రంగ పరిశ్రమల లాభాలు పెరగటం వెనక ఉన్న తర్కం ఇదే.

కొండూరి వీరయ్య

Monday, February 1, 2010

రికవరీకి సహకరించని ద్రవ్య విధానం

కొండూరి వీరయ్య, Prajasakti Telugu daily, February 1st edition
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో తాజా చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతమేర అదుపులోకి వస్తుందో ప్రకటించలేదు. పైగా ఈ సంవత్సరం ఋతుపవనాలపై ఆధారపడి ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామికోత్పత్తుల ధరల నడవడిక ఉంటుందని స్పష్టం చేసింది. అటువంటప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చటం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వదులుకోవటం ఎందుకో అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది. మరోవైపున మారిన ద్రవ్య విధానం పర్యవసానంగా పెరిగే ఉత్పత్తి వ్యయం పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపనుంది. ఇంత వరకు ప్రభుత్వం అభిప్రాయంలో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. తాజా చర్యలు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించటంలో దోహదం చేయకపోగా పారిశ్రామికోత్పత్తుల ధరలను కూడా పెంచేస్తాయి. ఈ పరిస్థితులు ప్రైవేటు పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గించేస్తాయి. దాంతో ప్రైవేటు పెట్టుబడుల చలనం కూడా తగ్గిపోతుంది. ఇది మార్కెట్లో నిధుల కొరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం నాడు ప్రకటించిన విధానం అటు ఆర్థిక వ్యవస్థలో రికవరీని పెంచేందుకు గానీ, ఇటు ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు గానీ దోహదపడేదిగా కనిపించటం లేదు. మూడో త్రైమాసం ఆర్థిక ఫలితాలు సమీక్షించిన అనంతరం ప్రకటించిన ఈ విధానం మార్కెట్‌లో నిధుల లభ్యతను తగ్గించటమే లక్ష్యంగా ఉంది. గత నెలరోజుల నుండే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనుందన్న విషయాన్ని చూచాయగా వెల్లడిస్తూనే వచ్చారు. డిసెంబరు మూడో వారంలో మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరు, ప్రధాని ఆర్థిక మండలి సలహాదారు రంగరాజన్‌ డిసెంబరులో సాధారణంగా కనిపించే ధరల తగ్గుదల ఈ సారి కనిపించకపోతే మార్కెట్లో నిధుల లభ్యతపై ఆంక్షలు విధించటం ఒక్కటే ధరల నియంత్రణ సాధనంగా ఉంటుందని ప్రకటించారు. జనవరి రెండో వారాంతంలో రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ ఉషా థోరట్‌ గృహ నిర్మాణ రంగంలో అవసరానికి మించి బకాయిలు పేరుకుపోతున్నాయని దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అదే విధంగా డిసెంబరులోనే విడుదలైన మరో ప్రకటనలో బ్యాంకుల వద్ద స్థూల పారుబకాయిల రేటు పెరుగుతుందని నిర్దారించారు. ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ఈ లక్షణాలన్నింటికీ కారణం మార్కెట్లో అవసరానికి మించి నిధులు అందుబాటులో ఉండటమేనని ఆర్థికవేత్తలు, ప్రభుత్వం అభిప్రాయపడింది. వీటన్నింటికి తోడు జి 20 ఆర్థిక మంత్రుల సమావేశంలో 2010-2011 ఆర్థిక సంవత్సరంలో సరళ ద్రవ్య విధానాలు సమీక్షించుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమల్లో భాగమే ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు అని చెప్పవచ్చు.

మరో వైపున నిజ ఆర్థిక వ్యవస్థ గురించి వస్తున్న వార్తలు కూడా ఆర్థిక వ్యవస్థ రికవరీ దారిలో పడిందన్న గట్టి అభిప్రాయాన్ని కల్గించింది.

డిసెంబరు నాటి పత్రికలు పరిశీలిస్తే లాభాల రేటు పెరగటం వల్ల కంపెనీలు 20 శాతం మేర అడ్వాన్సు పన్ను ముందే చెల్లించటం గురించి, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు గురించిన వార్తలే ప్రధానంగా కనిపించాయి. దాంతో నిజ ఆర్థిక వ్యవస్థ కూడా గాడిన పడ్డట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోటానికే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం సరళమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. ఒక సారి ఆర్థికవ్యవస్థ గాడినపడిందన్న అంచనాకు వచ్చిన తర్వాత సహజంగానే ద్రవ్య విధానాన్ని పటిష్టం చేయటానికి నడుం కట్టింది. (అందువల్లనే ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న రికవరీ ఈ మార్పులను అనివార్యం చేస్తుంది. ఇంత కాలం అమలు జరిగిన విధానాలు స్థబ్దతతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించినవే తప్ప పరుగులెత్తే ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించినవి కాదు) అని చెప్పుకొంది. స్థూలంగా చెప్పుకోవాలంటే గత సంవత్సర కాలానికి పైగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో అమలు జరిగిన ద్రవ్య విధానం నేడు సదరు లక్ష్యాన్ని పక్కన పెట్టి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే లక్ష్యంపై కేంద్రీకరించింది. భారతదేశంలో సంస్కరణలు మొదలైన నాటి నుండీ ద్రవ్యోల్బణం అదుపు చేయటం ద్రవ్య విధానపు మౌలిక లక్ష్యాల్లో ఒకటిగా మారింది. అంటే భారత ద్రవ్య విధానం తిరిగి సంస్కరణల నాటి ధోరణికి తిరిగి మళ్లుతుందని చెప్పవచ్చు.

నేడు ప్రకటించిన ద్రవ్య విధానం భారత ఆర్థిక వ్యవస్థలు పలు రూపాల్లో ప్రభావితం చేయనుంది. ముందుగా నిధుల లభ్యత విషయాన్ని పరిశీలిద్దాం. గత సంవత్సరం కాలంగా రిజర్వుబ్యాంకు ప్రకటించిన వివిధ రాయితీల వలన మార్కెట్లో సుమారు 5,60,000 కోట్ల రూపాయల అదనపు నిధులు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పారిశ్రామిక రుణాలు, గృహ నిర్మాణ రంగానికి రుణాలు చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించటానికి తోడ్పడింది. ఉత్పత్తి వ్యయం తగ్గటంతో కంపెనీల లాభాల రేటు బాగా పెరిగింది. ఈ విషయాన్ని బిజినెస్‌వాచ్‌ గత సంచికల్లో ఉద్దీపన లాభాల శీర్షికన వచ్చిన వ్యాసాల్లో వివరంగా తెలియచేశాము. అదేవిధంగా మార్కెట్లో నిధుల లభ్యత అధికంగా ఉండటంతో ఈ నిధులు ఈక్విటీ మార్కెట్‌కు మళ్లించబడ్డాయి. గత సంవత్సరకాలంలో అనుత్పాదక ఆర్థిక రంగంలో ఈక్విటీ మార్కెట్‌ లాభాల పంట పడించిన వాటిలో ఒకటిగా ఉంది. అదేవిధంగా పుష్కలంగా లభ్యమవుతున్న నిధులు తక్కువ వడ్డీలకు చేతికందటంతో ముఖ్యమైన కంపెనీలన్నీ తమ ఉత్పాదక విస్తరణకు అవసరమైన వనరులు సమకూర్చుకున్నాయి.

ఈ పెరిగిన సామర్థ్యంలో ముడివనరుల మొదలు సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఉన్నాయి. దీంతో కంపెనీలు రానున్న కాలంలో అవసరమైన ఉత్పత్తిని అందించగలిగే సామర్థ్యంతో పాటు అంతర్జాతీయ పోటీని తట్టుకోవటానికి అన్ని విధాలా సిద్ధం కావటానికి సరళమైన ద్రవ్య విధానం ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం దశల వారీగా ఈ అదనపు నిధులను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం నాటి చర్యల ద్వారా మార్కెట్‌లో చలామణిలో నుండి 36000 కోట్ల నిధులు తగ్గించింది. రానున్న కాలంలో కూడా మరిన్ని నిధులు మార్కెట్‌ నుండి వెనక్కుపోనున్నాయి. ఈ పరిణామం పైన పేర్కొన్న సానుకూల అంశాలన్నింటికీ నష్టదాయకంగా మారనుంది. ఉన్న ఫళంగా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరక్క పోయినా ఇటువంటి నిర్ణయాలు గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవటంలో మాత్రం ఈ మార్పులు కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పవచ్చు.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం ఈ తాజా మార్పులకు తక్షణ లక్ష్యమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. కానీ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తాజా చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతమేర అదుపులోకి వస్తుందో ప్రకటించలేదు. పైగా ఈ సంవత్సరం ఋతుపవనాలపై ఆధారపడి ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామికోత్పత్తుల ధరల నడవడిక ఉంటుందని స్పష్టం చేసింది. అటువంటప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చటం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వదులుకోవటం ఎందుకో అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది. రిజర్వు బ్యాంకు మాటల్లోనే.. ''పెద్దఎత్తున ఆహారధాన్యాల నిల్వలు సిద్ధం చేసుకోవటం ధరల నియంత్రణకు ఉపయోగపడుతుంది. జూలై తర్వాతికాలంలో ద్రవ్యోల్బణం ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది.'' మరోవైపున మారిన ద్రవ్య విధానం పర్యవసానంగా పెరిగే ఉత్పత్తి వ్యయం వల్ల పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు కూడా భారం కానున్నాయి. ఇంత వరకు ప్రభుత్వం అభిప్రాయంలో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. తాజా చర్యలు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించటంలో దోహదం చేయకపోగా పారిశ్రామికోత్పత్తుల ధరలను కూడా పెంచేస్తాయి. ఈ పరిస్థితులు ప్రైవేటు పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గించేస్తాయి.

దాంతో ప్రైవేటు పెట్టుబడుల చలనం కూడా తగ్గిపోతుంది. ఇది మార్కెట్లో నిధుల కొరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరళమైన ద్రవ్య విధానం కారణంగా గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల కోసం పెద్దగా బహుళజాతి సంస్థలు అంటే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. నేడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం నుండి వైదొలగటం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలపై భారాన్ని కూడా పెంచనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలు భారం కావటం అంటే వివిధ పన్నులు, సేవలపై విధించే చార్జీల రూపంలో ప్రజలపై మరో రకమైన భారం పెరగటమే. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోవటం అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంపై ఆధారపడి ఉంటుందని గుర్తించిన రిజర్వు బ్యాంకు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో సరళ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నంత కాలం వాటిని దేశీయంగా కూడా అమలు చేయాలి. అటువంటి విధానాల ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరేందుకు మార్గాలు ఏమిటో ఆలోచించకుండా రూళ్ల కర్ర సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి అంతగా సహకరించే అంశం కాబోదు.