Tuesday, March 8, 2011

ప్రజలకు సబ్సిడీ భారం పంచే పథకం


బిజినెస్‌వాచ్‌ డెస్క్ Mon, 7 Mar 2011, IST

కొండూరి వీరయ్య

అనుభవాజ్ఞుడైన రాజకీయవేత్త ప్రణబ్‌ ముఖర్జీ ప్రతిపాదించిన బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను కూడా రాజకీయ రంగంలాగే సంక్షోభంలోకి నెడుతుందా అన్న సందేహం కలుగుతోంది. బడ్జెట్‌ రూపకల్పన ఆర్థికరంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్తలు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా, కౌశిక్‌బసు వంటి వారి పర్యవేక్షణలో జరిగింది. అయినా వాస్తవిక జాతీయ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్‌ ప్రతిపాదనలు లేకపోవటంతో మొత్తంగా బడ్జెట్‌ ప్రక్రియే ఆందోళనకరంగా మారుతోంది. ఉదాహరణకు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన నగదు సబ్సిడీ పథకం గురించి చూద్దాం.


ఎరువులు, డీజిలు, పెట్రోలియం సబ్సిడీ స్థానంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికినేరుగా సబ్సిడీ ఫలితాలు అందేలా చూడటానికి సరుకుల స్థానంలో డబ్బులు అందచేయనున్నామని బడ్జెట్‌ ఉపన్యాసంలో ఆర్థికమంత్రి ప్రకటించారు. సంబంధిత విధి విధానాలు రూపొందించటానికి నందన్‌ నీలేకని ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ జూన్‌ నాటికల్లా విధి విధానాలు రూపాదించాలి. ఈ పద్ధతిని అమలు చేయటానికి ఆధార్‌ పథకాన్ని పునాదిగా చేసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. అంటే ఆధార్‌ పథకం ద్వారా ప్రజలందరికీ బహుముఖ ప్రయోజనకారి అయిన గుర్తింపుకార్డులు ఇచ్చి ఈ గుర్తింపు కార్డులతో సమాచారకేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ సమాచార కేంద్రమంతా ఒక చోట క్రోడీకరించి పథకాల ప్రయోజనాలు సదరు ప్రజలకు అందుతాయో లేదో పర్యవేక్షిస్తున్నారన్నమాట. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకూ విస్తరించి ఉన్న ఈ దేశంలో లక్షలాది మంది ప్రభుత్వ సిబ్బందిని మూలమూలలా నియమించిన తర్వాత కూడా వివిధ పథకాల అమల్లో లోపాలు జరుగుతున్నాయి. అటువంటిది ఒక కంప్యూటర్‌ మాస్టర్‌ స్విచ్‌ను అదుపు చేస్తూ పథకాలు అమలు చేయటం అన్నది ఎంత వరకు సాధ్యం ?

బడ్జెట్‌కు ముందు విడుదలైన ఆర్థిక సర్వేలో ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ ప్రకటనకు అవసరమైన వేదికను సిద్ధం చేసింది ప్రభుత్వం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సబ్సిడీల వ్యవస్థను సంస్కరించాలన్నది ఆర్థిక సర్వే ఉపదేశం. ఈ సంస్కరణలో భాగంగానే సరుకుల రూపంలో సబ్సిడీలు ఇవ్వటం మానేసి ఈ సబ్సిడీకి కేటాయించిన మొత్తాన్ని నేరుగా లబ్దిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. తద్వారా ప్రజల చేతుల్లో డబ్బులు రావటంతో మార్కెట్‌లో ఎంత మేర ధరలు పెరిగాయి అన్నదాంతో నిమిత్తం లేకుండా వాళ్లే సరుకులు కొనుగోలు చేస్తారు, దాంతో ధరల సమస్య ఉండదు అన్నది ఆర్థిక సర్వే సిఫారసు సారాంశం. కానీ నిజానికి ఇది ఏమేరకు సాధ్యం, ఈ విధానం అమల్లో ఉన్న పరిమితులు ఏమిటి అన్న విషయంపై ప్రభుత్వం దృష్టి మళ్లించలేదు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీ వ్యవస్థ రెండు విధాలుగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు సహకరిస్తోంది. ప్రభుత్వమే సరుకులు సేకరించి, వాటికి అయ్యే ఖర్చు భరించి మార్కెట్‌ ఖర్చు కంటే ఎంతో కొంత తక్కువ ధరకు ప్రజలకు సరఫరా చేయటం ఇప్పుడున్న సబ్సిడీ వ్యవస్థ సారాంశం. తొలిదశలో ప్రభుత్వం చమురు ఉత్పత్తులు, ఎరువుల సబ్సిడీ విషయంలో క్యాష్‌ సబ్సిడీ పథకం అమలుచేయాలని నిర్ణయించింది కాబట్టి ముందుగా ఈ సరుకులు ప్రస్తుత సబ్సిడీ వ్యవస్థలో ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయో పరిశీలిద్దాం.

స్వదేశంలో తయారైన చమురు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే చమురు నిల్వలు మొత్తం చమురు శుద్ధి కర్మాగారాలకు వెళ్తాయి. శుద్ధి చేయబడిన తర్వాత సరఫరా కేంద్రాలకు చేరతాయి. ఈ మొత్తానికి అయ్యే ఖర్చును లెక్కించి చమురు కంపెనీలు లీటరు పెట్రోలు, డీజిలు ధర నిర్ణయిస్తాయి. అందులో కొంత భాగాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో కంపెనీలకు అందచేస్తుంది. ఒక సారి మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత చమురు అందరికీ ఒకే ధరకు అందుబాటులో ఉంటుంది. ఎరువుల సబ్సిడీ కూడా కుడిఎడంగా ఇదేవిధంగా అమలు జరుగుతుంది. ఈ ప్రక్రియలో వినియోగదారులందరూ సబ్సిడీ ఫలాలు అందుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సార్వజనిక సబ్సిడీ పథకం. దీని స్థానంలో ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించింది ఏమిటి? రానున్న కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఎరువులు, చమురు ధరలపై సబ్సిడీ అందుతుంది. అదికూడా నేరుగా డబ్బు రూపంలో అందుతుంది. ఈ డబ్బు, వినియోగదారుడి వద్ద ఉన్న డబ్బు కలిపి ప్రజలు మార్కెట్‌ ధరకే సరుకులు కొనుక్కోవచ్చు అన్నది ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విధానం.

ఇందులో నష్టం ఏమిటి? ఇప్పుడున్న పద్థతిలో కార్లు, మోటార్‌సైకిళ్లు వాడేవాళ్లు అందరూ చమురు ధరల సబ్సిడీ ఫలాలు పొందుతున్నారు. పైగా పౌరరవాణా సేవలు ఉపయోగించేవారికి కూడా ఈ సబ్సిడీ అందుతుంది. కానీ నూతన పద్థతిలో వీళ్లందరూ సబ్సిడీ పరిధి నుండి బయటకు పోతారు. పైగా ప్రభుత్వం ప్రతిపాదించిన విధానంలో పౌరరవాణా సేవలు ఉపయోగించే వారికి నగదు సబ్సిడీ ఎలా అందుతుంది? ఇవన్నీ లెక్కేసుకునే ఆర్టీసి, రైల్వే టిక్కెట్‌ ధర నిర్ణయిస్తాయి. నూతన పథకం ప్రకారం ఇక్కడ కూడా దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి ఒక టిక్కెట్‌ ధర, ఎగువన ఉన్న వారికి ఒక టిక్కెట్‌ ధర నిర్ణయిస్తారా? పైగా ఈ విధంగా నేరుగా చేతికి అందిన సొమ్మును ఫలానా వస్తువు కొనుక్కోవటానికే వినియోగిస్తామన్న హామీ ఏమిటి? ఉన్న ఫళంగా కుటుంబ సభ్యులకు ఆరోగ్యం పాడైతే ఆసుపత్రి ఖర్చులకో, పిల్లల చదువు నిమిత్తమో వాడుకోమని హామీ ఏమిటి? ఇటువంటి పద్ధతిలో క్యాష్‌ సబ్సిడీ ద్వారా వచ్చిన సొమ్ము వేరే ప్రయోజనం కోసం వినియోగిస్తే ఉత్పత్తి, సరఫరా వలయంపై దాని ప్రభావం ఏమిటి? ఈ విషయాలు ఏమీ అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం గుడ్డిగా ఈ పథకాన్ని అమలు చేయబూనుకొంది.

ఇక ప్రజాపంపిణీ వ్యవస్థలో ఈ నూతన సబ్సిడీ ఏ విధంగా అమలు జరుగుతుంతో చూద్దాం. ప్రస్తుతం ప్రభుత్వం రైతులవద్ద ధాన్యం కొని, గోదాముల్లో దాచి దశలవారీగా ప్రజలకు సబ్సిడీమీద అందించటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ సాధనంగా ఉంది. నూతన ప్రక్రియలో ఇవేవీ అవసరం లేదు. నేరుగా ప్రజలే ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో మార్కెట్లో కొనుగోలు చేస్తారు కాబట్టి లెవీ ధాన్యం సేకరించాల్సిన అవసరం ఉండదు. లెవీ ధాన్యం కోసమైనా కనీస మద్దతు ధర అమలు జరుగుతుంది. ఈ ధరకు కాస్త అటూ ఇటూగా మార్కెట్‌లో ధాన్యం సేకరణ జరుగుతుంది. తాజా పథకంలో అటువంటి అవసరం లేకపోవటంతో రైతాంగానికి గిట్టుబాటు ధర అమలు చేయాల్సిన అవసరం ఏమిటి? పైగా నేరుగా మార్కెట్‌ సరఫరాపై ఆధారపడ్డాక ఎఫ్‌సిఐ అవసరం ఏముంటుంది? ఎఫ్‌సిఐ ప్రైవేటీకరణకు ఈ పథకం రంగం సిద్ధం చేయదా? ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని చెప్తోంది. 1997కు ముందు అందరికీ ఈ పథకం వర్తించేది. తర్వాత లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ అని ప్రారంభించారు. అంటే నిజంగా సబ్సిడీ ధరకు ఎవరికి అవసరమో వారికే ప్రభుత్వం సరఫరా చేస్తుంది, మిగిలినవారు మార్కెట్లో కొనుక్కోవాలి. అప్పుడే తెల్లకార్డులు, పచ్చ కార్డులు వచ్చాయి. నిజానికి ఈ విధంగా కార్డుల విభజన జరిగిన తర్వాతనే దుర్వినియోగం 27 శాతం నుండి 40 శాతానికి చేరిందని జాతీయ శాంపిల్‌ సర్వే చెప్తోంది. అదే వాదనలో ఇప్పుడు ముందుకొస్తున్న పథకం ఏ విధంగా దుర్వినియోగాన్ని అడ్డుకోగలదు అన్నది కీలక ప్రశ్న.

అటు ఎరువులు, పెట్రోలు అయినా ఇటు ఆహార ధాన్యాలు అయినా అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావల్సిందే. అటువంటపుడు బడ్జెట్‌లో ఫలానా నిధి క్యాష్‌ సబ్సిడీ మ్తొతం అని నిర్ధారించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే మార్పుల వల్ల ధరలు పెరుగుతాయి. అటువంటప్పుడు ఈ భారాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి రక్షణ చర్యలు ప్రతిపాదిస్తుంది? అప్పటికప్పుడు బడ్జెట్‌లో కేటాయించని అదనపు నిధుల సమీకరణ ఎలా సాధ్యమవుతుంది ? అసలే బడ్జెట్‌ నియంత్రణ చట్టం ఆదేశం మేరకు ఈ సబ్సిడీలు రద్దు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అంతర్జాతీయంగా ధరలు పెరిగాయని మళ్లీ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఈ పథకానికి అదనపు నిధులు కేటాయిస్తుందా? అలా చేయదు కదా..మరి అంటువంటప్పుడు గత్యంతరం ఏమిటి? గురువారం నాడు ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థిక మంత్రి ప్రకటించినట్లు ఈ భారాన్ని ప్రజలు మోయటమే మార్గం. అందువల్ల ఈ పథకం లోతుగా పరిశీలిస్తే - ఏమి వేషం అంటే ఎగ్గొట్టే వేషం - అన్న ముతక సామెత గుర్తు రాక మానదు. ఇది సబ్సిడీ రొక్కం ప్రజలకు చేరవేసే పథకం కాదు. ప్రభుత్వానికి రొక్కం, ప్రజలకు సబ్సిడీ భారం పంచే పథకం.

No comments: