Friday, January 18, 2013
2014లో అధికారమే చింత !
2014లో అధికారమే చింత !
శుక్రవారం నుండీ రెండు రోజుల పాటు జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరం జరుగుతుంది. గత నెల్లో సూరజ్ కుండ్‌లో జరిగిన సమావేశాలు సంస్కరణల విషయంలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య కోసం జరిగినవైతే ప్రస్తుతం జరుగుతున్న మేధో మధనం సూరజ్‌కుండ్ నిర్ణయాల మార్గదర్శకత్వంలో పార్టీని రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఉద్దేశించి నవని చెప్పవచ్చు. ఈ సమావేశాల్లో పాల్గొనే వెయ్యికి పైగా ప్రతినిధుల్లో మూడొంతుల మంది యువజన కాంగ్రెస్ నేతలే ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. దాంతో ఈ శిబిరం నిర్వ హణ యావత్తూ రాహుల్‌బాబా చుట్టూ తిరగనున్నదని స్పష్టం అవుతోంది.
జైపూర్ సమావేశాలకు తక్షణ నేపథ్యం ఢిల్లీలో అత్యాచారం, దానికి ప్రజా ప్రతిస్పందన, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రారంభించిన నగదు బదిలీ పథకంలో గందరగోళం, రెండో దశ ఆర్థిక సంస్కరణలకు తెరచాప ఎత్తటం వంటి పరిణామాలు తక్షణ నేపథ్యంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో బోనులో నిలబెట్టిన పరిణామాలే. ఈ సంవత్సరం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు 2014లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు డ్రస్ రిహార్సల్స్ వంటివి. అందువల్ల 2014 ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసి సదరు వ్యూహాన్ని పరీక్షకు పెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ముందుంది. అంతేకాదు. అవినీతి బూతం నీడన ప్రభుత్వం ఉందన్న సార్వత్రిక ప్రజాభిప్రాయం నుండి బయటకు వచ్చి ప్రభత్వాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అత్యవసర స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపున చిందంబరం, మన్మోహన్, మాంటెక్‌సింగ్ త్రయం నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ మొత్తంగా గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల మేరకు నిర్ణయాలకై పరుగులు పెట్టిస్తున్నది. ఖజానాకు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెట్టే పన్నుఎగవేత నియంత్రణ నిబంధనలు మొదలు, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై పన్ను వేయటం వంటి చర్యల వరకు రెండేళ్ల పాటు వాయిదా వేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటానికి ప్రజల పై భారాలు వేయటం తప్ప మరో మార్గం లేదంటున్నారు.
ఈ భారాల కత్తికి తేనె పూసే బాధ్యత జైపూర్ మేధోమధన శిబిరంపై పడుతుంది.. ఢిల్లీ అత్యాచార ఉదంతం, కేజ్రీవాల్ కొత్త పార్టీ వంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల మధ్యతరగతి ప్రజల్లో అప్రతిష్టపాలైంది. గత సంవత్సర కాలంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం, మహిళలపై అత్యాచారాల వ్యతిరేకత ఉద్యమంలో మధ్యతరగతి శ్రేణులు ముందు పీఠిన నిలవటం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రతిఘటనోద్యమానికి ఆలంబనగా మారిన ఇంటర్నెట్ ఆలంబనగా మారటంతో కాంగ్రెస్‌లో యువతరాన్ని ఈ దిశగా కార్మోన్ముఖులను చేసేందుకు జైపూర్ శిబిరం దిశానిర్దేశం చేస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న శిబిరం నాల్గోది. స్వాతంత్య్రానంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రతిష్ట నీడన తన వైఫల్యాలన్నీ చక్కబెట్టుకోగలిగింది. నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ నేతృత్వంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ నెహ్రూతరం, ఇందిరా తరం మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో 1974లో తొలిసారి ఇటువంటి శిబిరం నిర్వహించారు. మరోవైపున 70దశకం నాటి ఆర్థిక సంక్షోభం, అఖిల పక్ష ఉద్యమాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. అవినీతిపై లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన ఉద్యమం, ఆర్థిక సమస్యలపై వామపక్షాలు నిర్వహించిన అఖిల పక్ష ఉద్యమాలు ప్రభుత్వానికి ఊపిరి సలపనీయలేదు. అటువంటి పరిస్థితుల్లో రాజకీయ ఎజెండాను ఇందిరాగాంధీ చేతుల్లోకి తీసుకునేందుకు 1974లో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో నరోరా అనే చోట చింతన శిబిరం జరిగింది. ఈ శిబిరం చర్చల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దళితుల సమస్యలపై దృష్టి పెట్టటం, భూ సంస్కరణలను మళ్లీ తన ఎజెండాలోకి తీసుకోవటం వంటి సానుకూల చర్యలు చేపట్టింది. దాంతో ప్రతిపక్షాలు ప్రారంభించిన జాతీయ స్థాయి ఆందోళన నేపథ్యంలో తలెత్తిన ప్రతికూల పవనాలను తట్టుకుని ఇందిరా గాంధీ నేతృత్వంలో మళ్లీ పార్టీ అధికారానికి రాగలిగింది. తర్వాత మళ్లీ 1998లో మధ్యప్రదేశ్‌లోని పంచమఢిలోను, 2003లో సిమ్లాలోనూ ఇటువంటి శిబిరాలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన సమయంలో పార్టీని తిరిగి గాంధీ పరివారం చెప్పు చేతుల్లోకి తెచ్చేందుకు 1998 నాటి సమావేశాలు దారి తీశాయని చెప్పవచ్చు. నాటి నుండి నేటి వరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అప్రతిహతంగా అధ్యక్షత వహిస్తూ వస్తున్నారు.
పంచమఢి సమావేశాలకు మరో ప్రాముఖ్యత కూడా ఉంది. 13 రోజుల వాజ్ పేయి ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన ఈ సమావేశాలు సంకీర్ణ రాజకీయాలు భారతదేశ పరిస్థితులకు సరిపడవని, కాంగ్రెస్ ఒక్కటే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయగల శక్తిగా ఉంటుందని ఈ సమావేశం తీర్మానించింది. పంచమఢి తీర్మానం నేపథ్యంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటు చేయగల పరిస్థితుల్లో కాంగ్రెస్ ముందుకు రాకపోవటంతో 2004 వరకు అధికరానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. 2004 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరు నూరైనా కేంద్రంలో అధికారానికి రావటం ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 2003లో సిమాల్లో మరోమారు మేధోమధనానికి పూనుకొన్నది. ఈ సమావేశాల్లోనే కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటానికి సిద్ధమని ప్రకటించింది. 2004 ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు పాఠకులకు విదితమే. మళ్లీ ఇప్పుడు జైపూర్‌లో అటువంటి మేధో మధనానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశాల్లో మొత్తం ఐదు అంశాలపై కమీషన్లుగా చర్చించనున్నారు. రాజకీయ సవాళ్లు, సామాజిక ఆర్థిక సవాళ్లు, ప్రపంచ పరిణామాలు, నిర్మాణం, మహిళల సాధికారతలపై ప్రత్యేకత చర్చలు జరిపి తీర్మానాలు చేయనున్నారు. రాజీకయ సవాళ్లలో తెలంగాణ సమస్య ప్రత్యేక స్థానం ఆక్రమించనుంది. ఎకె అంటోని నేతృత్వంలో సంకీర్ణాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. సామాజిక ఆర్థిక సమస్యలపై దిగ్విజరుసింగ్ నేతృత్వంలో తీర్మానం, సామాజిక మీడియా విషయంపై సమాచార ప్రసార మంత్రి మనీష్ తివారి తీర్మానాలు ప్రతిపాదించనున్నారు. ఈ సమావేశాల్లోనే రాహుల్ బాబాను పార్టీ వ్యూహరచయితగా కూడా పరిచయం చేసేందుకు ప్రయత్నం జరగనున్నది. ఏతావాతా ఈ చర్యలన్నీ 2014లో కాంగ్రెస్ తిరిగి అధికారానికి రావటం ఎలా అన్న ఏకైక ఎజెండా చుట్టూ తిరగనున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment