Wednesday, May 22, 2019

 http://www.navatelangana.com/article/net-vyaasam/780845

ఓటమి భయంలో బీజేపీ

లోక్‌సభ ఎన్నికలకు తెర లేచింది. వివిధ పార్టీలు అస్త్రశస్త్రాలు సంధించటానికి సిద్ధంగా ఉన్నారు. షరామామూలు ఎన్నికల క్రమం ఎన్నికల షెడ్యూల్‌ జారీతో మొదలైనా దాదాపు గతేడాది నవంబరు నుంచీ దేశం ఎన్నికల మూసలోకి వెళ్లింది. ఈ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలంటే గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలను మననం చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, రాష్ట్రాల్లో 2014 బీజేపీ సాధించిన విజయాలు ఈసారి పునరావృతం చేసే అవకాశం లేదు. ఈ ఏడు రాష్ట్రాల నుంచి మొత్తం 273సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో 196సీట్లు అంటే 71శాతం సీట్లు బీజేపీ కైవశం చేసుకుంది.
మొదటిది, భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు ఏకమవటంపై బీజేపీ దుష్ప్రచారం. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌లల్లో ఘోరపరాజయంతో బీజేపీ ఉలిక్కిపడింది. అప్పటి వరకు మోడీ అజేయుడనీ, 2019 ఎన్నికల్లో అలవోకగా బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు ఏకమవటం మొదలైంది. గత మూడునెల్లుగా ఢిల్లీ, కొల్‌కత్తా కేంద్రాలుగా ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విరజిమ్మిన విద్వేషం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తాను అవినీతిపై పోరాటం చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు తమ అవినీతి బయటపడు తుందన్న భయంతో ఏకమవు తున్నాయని పలు బహిరంగసభల్లో మోడీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను అనని మాట లేదు. ఫిబ్రవరి ఏడో తేదీన లోక్‌సభలో మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాల కూటమి కల్తీసరకని తూలనాడారు. ఇంతకాలం సైద్ధాంతిక విభేదాలున్న వారు కేవలం తనను ఓడించటానికే ఏకమవుతున్నారని ఆడిపోసుకున్నారు. ఎన్నికల్లో గెలవటానికి ఎవరి ప్రయత్నం వారు చేయటం సహజం. అంతమాత్రాన నీలాపనిందలు మోపాల్సిన అవసరం లేదు. ఈ విజ్ఞత కూడా మర్చిన మోడీ-అమిత్‌షా ద్వయం ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్న నేతలపై అవాకులు చవాకులు పేలారు.

ఇప్పటి వరకు బీజేపీ 200స్థానాలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు సంబంధించి పొత్తులు ఖరారు చేసింది. ఒకవైపున మోడీని ఒంటరి చేసి ఓడించటానికి పత్రిపక్షాలు అపవిత్ర కూటమి కడుతున్నాయని వాపోయిన బీజేపీ ఈ ఎన్నికల్లో నిజంగానే ఒంటరి పోరుకు సిద్ధమైందా? లేదు. గత మూడు నెల్లుగా అమిత్‌షా ప్రాంతీయ పార్టీలతో ముందస్తు ఎన్నికల పొత్తుల కోసం తిరగని రాష్ట్రం లేదు. చేయని ప్రయత్నం లేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిన బీజేపీ-జేడీయూ పొత్తును సంఘటితం చేసుకోవటం ఈ ప్రయత్నంలో మొదటి అడుగు. బీజేపీ, జేడీయూలు చెరి 17సీట్లకు, లోక్‌జనశక్తి పార్టీకి ఆరు సీట్లు కేటాయించాలని డిశంబరులోనే ఒప్పందం ఖరారు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 30సీట్లు పోటీ చేసి 22సీట్లు గెలుపొందింది. ఈసారి పోటీ చేస్తున్నదే కేవలం 17సీట్లు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు కోసం ఏకంగా అమిత్‌షా పలు దఫాలు ప్రయత్నం చేశాక శివసేన అధినేత గడప తొక్కక తప్పలేదు. ప్రశాంత్‌ కిషోర్‌ (2014లో మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రస్తుతం జేడీయూ తరపున ఎంపీగా పోటీ పడుతున్నారు) దౌత్యంతో 2014లో మోడీ హవాతో శివసేనను కాలదన్నిన బీజేపీ నేడు అవసరార్థం అదే పార్టీ కాళ్లు పట్టుకోవటానికి సిద్ధమైందన్నది విదితం. తమిళనాడులో సైతం కాంగ్రెస్‌-డీఎంకెలు పొత్తులు ఖరారు చేసుకోవటానికి ముందే బీజేపీ ఎఐడీఎంకే, పీఎంకెలతో పొత్తులు ఖరారు చేసుకుంది. అప్పటికే నిట్టనిలువునా చీలిన ఎఐఎడీఎంకెతో కుదుర్చుకున్న పొత్తు ఏ మేరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-వైయస్సార్‌సీపీలను దగ్గర చేయటానికి మంత్రసాని పాత్ర పోషించి విఫలమైన బీజేపీ చివరకు వైయస్సార్‌ సీపీకి లోపాయికారీ మద్దతు ప్రకటించిందని పరిశీలకులు భావిస్తున్నారు.

మూడో అంశం. నిన్న మొన్నటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో వలస వచ్చే హిందువులకు పౌరసత్వం ఇచ్చే బిల్లు విషయంలో బీజేపీ వైఖరి అస్సోం గణపరిషత్‌ సహా అనేక ప్రాంతీయ పార్టీలతో వైషమ్యాలు పెంచింది. చిట్టచివరకు రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికలపై మారుతున్న అంచనాలు నేపథ్యంలో బీజేపీ మెట్టు దిగక తప్పలేదు. వివాదాస్పద బిల్లును తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్టు స్వయంగా రామ్‌ మాధవ్‌ అస్సోం గణపరిషత్‌ వ్యవస్థాపక నేత ప్రపుల్లకుమార్‌ మహంతకు హామీ ఇచ్చాకనే అస్సాంలో పొత్తులు ఖరారయ్యాయి. ఇదే కాదు. ఎన్నికల్లో గెలవటానికి అత్యంత ప్రీతిపాత్రమైన రాజకీయ ఎజెండాను తాత్కాలికంగా గూట్లో పెట్టడం బీజేపీకి కొత్తేమీ కాదు. 1999లో తృటిలో జారిపోతున్న అధికారాన్ని చేజిక్కించుకోవటానికి వివాదాస్పద అంశాలు - రామమందిరం, ఉమ్మడి పౌరస్మృతి, 370 అధికరణం రద్దును తమ ఎజెండా నుంచే తీసేసింది బీజేపీ. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలతో సైతం అదే ఆట మొదలు పెట్టింది. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కటానికి, తన మౌలిక ఎజెండానుంచి పక్కకు తప్పుకుని పెద్దమనిషి ఫోజు పెట్టటానికి బీజేపీ వెనకాడ దన్న విషయాన్ని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ఏరు దాటాక బోడిమల్లయ్య అనటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.

నాల్గో అంశం. మోడీ స్వయంగా పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు ఎన్నికల పొత్తులన్నీ కల్తీలు, దురుద్దేశ్యంతో పెట్టుకునేవే అయితే మరి బీజేపీ పెట్టుకుంటున్న పొత్తుల వెనక ఉన్న దురుద్దేశ్యం ఏమిటి? ప్రతిపక్షాల కూటమి అధికారానికి వస్తే మోడీ పాలనలో సాగించిన కుంభకోణాల జాబితా బయటకు వస్తుందన్న భయం లేకపోతే ముందస్తు పొత్తుల గురించి అంత ఆందోళన ఎందుకు అన్న ప్రశ్నకు బీజేపీ నేతలు సమాధానం ఇవ్వాలి. బీజేపీలో ఓటమి భయం ఎంత పరాకాష్టకు చేరిందంటే చివరకు పుల్వామా ఘటనను ఉపయోగించు కుని జాతీయ భద్రత ఎజెండా మార్చటానికి కూడా వెనకాడలేదు. ఇంత చేసినా జాతీయంగానూ అంతర్జాతీయంగానూ బాలా కోట్‌ దాడి గురించి ఎదురవుతున్న ప్రశ్నలకు బీజేపీ గానీ ఇటు ప్రభుత్వం గానీ సమాధానం ఇచ్చుకోలేకోపోతోంది. బాలాకోట్‌ మంత్రం మహా అయితే పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, ముంబయి వంటి మధ్య తరగతి కేంద్రీకృతమైన ప్రాంతాల్లో మాత్రమే ఎంతో కొంత ప్రభావం చూపనుంది.
చివరిగా భారతదేశాన్ని కాపాడటానికి చిటికేస్తే ఆరెస్సెస్‌ సైనికులు మూడు నిముషాల్లో రంగంలోకి దిగుతారని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ జబ్బలు చరిచారు. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా నివారించటంలో సైన్యం విఫలమైందన్నదే ఈ వ్యాఖ్య సారాంశం. పుల్వామా దాడి జరిగి నెలరోజులు గడిచినా ఈ ఆరెస్సెస్‌ సైనికులు పత్తా లేరు. దేశ సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులకు ఇంతకన్నా ఎవ్వరూ అవమానించి ఉండరు. అయినా బాలాకోట్‌ మృతుల సంఖ్య విషయంలో వస్తున్న ప్రశ్నలకు మొహం చెల్లని బీజేపీ అలాంటి ప్రశ్నలు వేసేవారినందరినీ దేశ ద్రోహులనో, పాకిస్థాన్‌ మానస పుత్రులనో, సైన్యాన్ని కించపరుస్తారనో భావోద్వేగాలు రెచ్చగొట్టటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. మోడీ, బీజేపీ, ఆరెస్సెస్‌ కోరుకుంటున్న జాతీయ భద్రత ఏమిటి మరో మారు చర్చించుకుందాం. ఓటమి భయంతో బీజేపీ పడుతున్న పాట్లు, మోడీ - షా ద్వయం చేస్తున్న ఫీట్లు ప్రజలను ఒప్పించలేవు. మెప్పించలేవు.
- కొండూరి వీరయ్య
సెల్‌:9871794037

పాలకపార్టీ మానసపుత్రికలుగా మారిన పత్రికలు 

http://www.navatelangana.com/article/net-vyaasam/781334

నిష్పాక్షికంగా వాస్తవాలు ప్రజల ముందుంచి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభంగా వ్యవహరించాల్సిన మీడియా ప్రభుత్వాన్ని నిలబెట్టే నాల్గో స్తంభంగా మారుతోంది. గత నెలరోజులుగా దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఈ విషయాన్ని మరింత స్పష్టం చేసింది. దేశాన్ని దేశభక్తితో ఉర్రూతలూగించేందుకు అటు ప్రభుత్వం, ఇటు మీడియా రంగం శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి. ఎక్కడన్నా దేశభక్తిని రెచ్చ గొట్టేందుకు జరిగే ప్రయత్నాలు మందకొడిగా సాగుతున్నాయనిపిస్తే ఆయా సందర్భాల్లో ఏకంగా మంత్రులు, పాలక పార్టీ టిక్కెట్లమీద ఎంపికైన ప్రజాప్రతినిధులు గొంతెత్తుతున్నారు. ఇదే అదనుగా మీడియా ప్రత్యేకించి పత్రికా రంగం కూడా గుండెలు చీల్చి రామభక్తి ప్రదర్శించిన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని పేజీలు తెరిచి మరీ దేశభక్తిని అక్షరాలతో అలంకరిస్తున్నాయి. ఈ విధంగా దేశభక్తి భావన పత్రికారంగం తలకెత్తుకోవటం ప్రజాస్వామ్యానికి చేటు అని గత మూడువారాల పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఇందుకు దారితీసిన సందర్భాన్ని క్లుప్తంగా నెమరు వేసుకుందాం. ఫిబ్రవరి 14న పారామిలిటరీ దళాలను తీసుకెళ్తున్న సైనిక వాహనాలపై జరిగిన ఉగ్రవాద దాడిలో 40మంది సైనికులు మరిణించారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైష్‌ ఎ మొహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ఇది తమ పనే అని ప్రకటించింది. ఈ రెండు వారాలు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. వాణిజ్యోత్పత్తులు ఎగుమతి చేయటానికి అత్యంత ఆసక్తి గలిగిన దేశంగా పాకిస్థాన్‌కు ఇచ్చిన గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు చర్చించుకునేవాళ్లు. కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అంటూ ఓ సమీకృత ఉద్యమ రూపంలో పాకిస్థాన్‌ వ్యతిరేకత పేరుతో ముస్లిం వ్యతిరేక భావాలూ ఆలోచనలు గుప్పించబడ్డాయి. దీన్నే సాకుగా తీసుకుని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్న సాకుతో ప్రభుత్వం మరింత బరితెగించింది. ఎట్టకేలకు బాలాకోట్‌ ప్రాంతంలో జైష్‌ ఎ మొహ్మద్‌ శిక్షణా శిబిరంగా గుర్తించిన ఓ ప్రాంతంపై భారత వాయుసేన బాంబుదాడికి దిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే 'ఈ దాడిలో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు' అని ప్రకటించారు. భారత వాయుసేన దాడిని ధృవీకరిస్తూనే పాకిస్థాన్‌ సైన్యం బాంబులు వేసిన ప్రాంతం అడవి అనీ, ప్రాణనష్టం లేదనీ ప్రకటించింది.

ఈ మొత్తం విషయాన్ని ప్రజలకు చేరవేయాల్సిన మీడియా గందరగోళంతో కూడిన వార్తలు ప్రజలకు చేరవేసింది. ఈ నివేదికలు వార్తలూ కథనాలూ ఒకదానికొకటి పొంతన లేక పోవటం విశేషం. యథా ప్రకారం మీడియా సంస్థలు తాము రాసిన కథనాలకు కట్టుకథలకు '' ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం మేర''కో ''ఆయుధ నిపుణుల అంచనా మేర''కో ''విశ్వసనీయ వర్గాల కథనా'' లనో ఆధారంగా ప్రస్తావిస్తాయి. ఏ మాత్రం విచక్షణ వర్తింపచేయకుండా వార్తల రూపం తీసుకున్న ఈ అభిప్రాయాలను ఆబగా చదివి తలకెక్కించుకున్న దేశభక్తులు రోడ్డున పడ్డారు.
ఈ వార్తా కథనాల్లో ప్రస్తావించిన వాస్తవాల గురించి మీడియా సంస్థలు స్వతంత్ర పరిశోధనతో నిర్ధారించుకున్నవి కావు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రిగానీ, విదేశాంగ శాఖ కార్యదర్శి గానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ''పేర్లు ప్రస్తావించటానికి'' అంగీకరించని సమాచార వనరుల ఆధారంగా రాసే కథనాలు ప్రధానంగా అభిప్రాయాలు కుమ్మరించేవే తప్ప విషయాలు యథాతథంగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం కాదు.

ఈ విషయాలు గమనిస్తే పుల్వామా తర్వాత కానీ, బాలాకోట్‌ దాడులు, అనంతర పరిణామాల గురించి కానీ నిజానికి భారతీయులకు విస్పష్టమైన సమాచారం చేరలేదు. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యలో వ్యత్యాసాల మొదలు వాయుసేన ప్రయోగించిన బాంబుల బరువు వరకూ అన్నీ పరస్పరం పొసగని అంకెలే వివిధ పత్రికలు, టీవీలు వెల్లడించాయి. ఈ పొసగనితనాన్ని ప్రశ్నించిన వారంతా దేశద్రోహులయ్యారు. కారుబాంబుకు, టీవీ బాంబుకు జూబిలీ హిల్స్‌లో ఇళ్లు పేలిపోయిన వార్తలు చదివాం. బకెట్‌ బాంబులకు బ్రిడ్జిలు కూలిపోయిన సంఘటనలు, ఊహాజనితమే అయినన్పటికీ (అరవింద సమేత వీరరాఘవ)చూశాం. గిలిటెన్‌ స్టిక్స్‌ ప్రయోగంతో చత్తీస్‌గఢ్‌లో కార్లల్లో ప్రయాణిస్తున్న రాజకీయ నాయకులు శవాల గుట్టలైన సందర్భాన్ని చూశాము.
కానీ వందల కిలోమీటర్ల ఎత్తునుంచి వేల కిలోల బరువున్న ఆధునిక బాంబులు, కంప్యూటర్‌ పర్యవేక్షణలో ప్రయోగించిన బాంబులు పేలిస్తే పరిసర ప్రాంతాల్లో ఇంటి కప్పులు మాత్రమే ఎగిరిపోయాయనీ, అయినా ఈ బాంబుదాడిలో వందలమంది ఉగ్రవాదులు హతులయ్యారనీ, పాకిస్థాన్‌ బెంబేలెత్తి ఎదురుదాడికి దిగిందనీ చదువుతున్నాము. రెండు మూడు వారాల తర్వాత కూడా ఈ వార్తా కథనాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవటానికి ఏ వార్త సంస్థ ప్రయత్నం చేయలేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ గందరగోళ వార్తలు ప్రసారంతో దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతోనే ఈ వార్తలు ప్రసారం చేసినట్టు అర్థమవుతున్నది.

ఈ మొత్తం వ్యవహారంలో పత్రికలు ప్రభుత్వ ఆలోచనలకు బాకాలుగా మారాయి. రాత్రికి రాత్రే టీవీ వార్తల్లో కనిపించే వ్యాఖ్యాతలందరూ యుద్ధతంత్ర నిపుణులుగా మారారు. ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు సుఖోరు యుద్ధ విమానాలకు మధ్య ఉన్న వ్యత్యాసం, భారత వాయుసేన ప్రయోగించిన ఆయుధ సామాగ్రికి, పాకిస్థాన్‌ వాయుసేన వద్ద ఉన్న ఆయుధసామాగ్రికి మధ్య పోలికలు ధారాళంగా చర్చించి వీక్షకుల జ్ఞానాన్ని పెంచేందుకు శక్తివంచన లేకుండా పని చేశారు. మరికొన్ని హనుమంతుడిని మించిన భక్తులు స్టూడియోలను యుద్ధచిత్రాలు, సన్నివేశాలతో నింపేసి మరీ వార్తలు (వాదనలు) వినిపించారు.
ఈ మొత్తం గందరగోళంలో గత నెల రోజుల్లో ఉగ్రవాద నియంత్రణ పేరుతో జమ్ము కాశ్మీర్‌లో ఖైదుచేసిన యువత గురించిన వార్తలకు తావు లేకుండా పోయింది. జమ్ము కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరపటానికి అవకాశం కల్పిస్తున్న శాంతి భద్రత పరిస్థితులు శాసనసభ ఎన్నికలు జరపటానికి ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నాయో విశ్లేషించే ప్రయత్నాలకు తావు లేకుండా పోయింది. సీమాంతర కాల్పుల్లో గాయపడిన, చనిపోయిన పౌరుల గురించిన ఊసే లేకుండా పోయింది. ఈ తుపాకీ కాల్పుల మోతలో జమ్ము కాశ్మీర్‌లో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం కేకలు కూడా వినిపించకుండా పోయాయి.
అప్పటివరకు పతాక శీర్షికల స్థానాన్ని ఆక్రమించిన రాఫెల్‌ కుంభకోణం పత్తా లేకుండా పోయింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఈ విషయమై చేపట్టిన విచారణకు కూడా తగిన స్థానం దక్కలేదు. బాలాకోట్‌ దాడులకు ముందు అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయంగా ఉన్న నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధి స్థానంలో ఈ దాడుల తర్వాత జాతీయ భద్రత కీలక ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. కోట్లాదిమంది అటవీవాసుల హక్కుల గురించిన గోడు పాఠకులకు, వీక్షకులకు చేరకుండా పోయింది. మీడియా సంస్థలు ఈ కాలంలో ప్రాతినిధ్య స్వభావాన్ని కోల్పోయాయి. రిలయన్స్‌ వంటి దేశీయ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. స్వతంత్ర ప్రదర్శించిన సీనియర్‌ పాత్రికేయులకు శ్రీముఖాలందాయి. ఈ నేపథ్యంలో మూక హింస, మూక హత్యలు వంటి హిందూధర్మ పరిరక్షణ పేరుతో సాగుతున్న వికృత అకృత్యాలు ప్రజలకు చేరవేయటానికి మీడియా ఆలంబనగా మారింది. పుల్వామా-బాలాకోట్‌ అనంతర పరిణమాలపై మీడియా వైఖరి గత నాలుగేండ్లుగా వస్తున్న మార్పును మరింత బలోపేతం చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభంగా వ్యవహరించాల్సిన మీడియా ప్రభుత్వాన్ని నిలబెట్టే నాల్గో స్తంభంగా మారటం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి చేటు దాపురిస్తుందన్న వాస్తవాన్ని హెచ్చరిస్తోంది.
- ధీర
సెల్‌: 9871794037

ఖరీదవుతున్న ప్రజా ప్రాతినిధ్యం

 http://www.navatelangana.com/article/net-vyaasam/782502

కాపలా మాని కథలు చెపుతున్న చౌకీదార్‌!

ఏది భారత జాతీయత?

(నిన్నటి సంచిక తరువాయి)
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ప్రజాతంత్ర జాతీయవాదానికి పునాదులు వేసిన మరో మైలురాయి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు. యిప్పుడు చెప్పుకున్న దశల్లో చివరి దశలో తెరమీదకు వచ్చిన ఈ ఉద్యమాలు అవిభక్త బెంగాల్‌ నుంచి ఒరిస్సాను వేరు చేయటంతో ప్రారంభమై రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా స్వతంత్ర భారతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ముగిసాయి. నాటి నుండీ నేటి వరకు కొనసాగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు గానీ, స్వాతంత్య్రానంతరం ఆరెస్సెస్‌ రాజకీయ విభాగాలుగా తెరమీదకు వచ్చిన జనసంఫ్‌ుకు గానీ, నేటి బీజేపీకి గానీ ఈ ఉద్యమాలతో ఏ మాత్రం సంబంధం లేదు. స్వాతంత్రోద్యమ పోరాటంలో మరో కీలక కోణం కూడా ఉంది. నాడు పోరాటం విదేశీ పాలకులకు వ్యతిరేకంగా సాగింది. దేశీయ ఆర్థిక వనరుల మీద వారి పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం. జాతీయ వనరుల మీద ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కు కోసం జరిగిన పోరాటం. ఈ పోరాటంలోనే జాతీయత అన్న భావనలో ప్రజలు, వారి ఆర్థిక అవసరాలు, వనరులపై ప్రజల ఆధిపత్యం ఇమిడి ఉన్నాయి.
సమీకృత, సమ్మిళిత భారతీయ జాతీయతకు ఆర్థిక పునాదులు వేసిన స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, ఆ స్ఫూర్తిని కాగడాల పట్టి నిలిపిన మహౌన్నతుల త్యాగాలను తృణీకరిస్తూ నేటి ఆరెస్సెస్‌, బీజేపీ భక్తులు ముందుకు తీసుకొస్తున్నది కుహనా భారత జాతీయత. అంబేద్కర్‌, గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్‌, భగత్‌సింగ్‌ వంటి నేతల త్యాగాలతో స్ఫూర్తి పెనవేసుకుపోయింది. అందుకే ఈ స్వాతంత్య్రోద్యమ సేనానులను దూషించి, తూలనాడి, తృణీకరించి, బహిరంగంగా అవమానపరిస్తే తప్ప వారితో పాటు పెనవేసుకుపోయిన జాతీయతా భావాన్ని తప్పుపట్టడం సాధ్యం కాదు. నెహ్రూని ఏకంగా హిందూస్థాన్‌ని దోచుకున్న బందిపోటు ముఠా నాయకుడు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర టీవీ చర్చలో వ్యాఖ్యానించినా మందలించిన పాపాన పోలేదు బీజేపీ నాయకత్వం. తాజాగా అరుణ్‌ జైట్లీ నెహ్రూవల్లనే భారతదేశానికి దక్కాల్సిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం చైనా తన్నుకుపోయిందని వ్యాఖ్యానించటం కూడా ఇందులో భాగమే.

ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల పేరుతో తిరిగి దేశాన్ని ఆర్థిక సామ్రాజ్యవాద శక్తులకు కుదవపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను ప్రతిఘటించే ఉద్యమాలను బలహీనం చేసే కుట్రపూరిత ప్రయత్నమే భారత జాతీయత అంటే కేవలం హిందూ జాతీయత అని చెప్పడం. ఈ దేశంలో మిగిలిన సామాజిక, ధార్మిక తరగతులను దేశం నుంచి జాతీయ ఆర్థిక జీవన స్రవంతి నుంచి వెలివేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నది వీరి భావన! ఈ విధంగా దేశంలో వివిధ మత విశ్వాసాలకు చెందిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను, అంతర్గత ప్రత్యర్థులను దేశద్రోహులుగా ముద్ర వేసుకుంటూ పోతే చివరకు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీయే దేశంగా మారటం, చిట్టచివరకు సదరు పార్టీనాయకుడే దేశంగా మారుతుందని నియంతృత్వాల చరిత్ర నిర్ధారిస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా మోడీ దైవాంశ సంభూతుడన్న నాటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను గమనించవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వమే దేశం, ప్రభుత్వ వ్యతిరేకతే దేశ వ్యతిరేకత అని ఆరెస్సెస్‌ మందీ మార్బలం సాగిస్తున్న ప్రచారం చివరకు ప్రభుత్వానికి నాయకత్వం వహిసుస్తన్న పార్టీయే ప్రభుత్వం అన్న స్థాయికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తోంది.

ఈ క్రమంలో సదరు ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీ సిద్ధాంతాలను, వివిధ సామాజిక ఆర్థిక సాంస్కృతిక వ్యవహారాలపై వారి అభిప్రాయాలను ప్రశ్నించటం, తిరస్కరించటం అంతిమంగా దేశద్రోహంగా మారే విపరీత పరిస్థితి సృష్టించింది. ఇక్కడ పాఠకులు, పాలకులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకల్లా అత్యంత ప్రజాతంత్ర రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ పీఠిక భారతీయులమైన మేము భారత దేశాన్ని సర్వ సత్తాక ప్రజాతంత్ర లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాము అని చెప్పటం ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ నిర్మాతగా మారాడు. గత ఆరు దశాబ్దాల్లో వివిధ సందర్భాల్లో రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పదే పదే గుర్తు చేస్తూనే వచ్చింది. ఈ రాజ్యాంగం, తద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించే న్యాయవ్యవస్థనే గుర్తించ నిరాకరిస్తున్న సంఘ పరివారం ప్రభుత్వంపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించే అవకాశం కల్పించటం భారత రాజ్యాంగంలోని ప్రజాతంత్ర స్వభావానికి తాజా ఉదాహరణ.
మోడీ కేబినెట్‌లో పలువురు ఆరెస్సెస్‌ యూనిఫారం ధరించటం మానేశారు తప్ప ఆరెస్సెస్‌ మౌలిక లక్ష్యాలను మక్కికి మక్కీ అమలు చేస్తున్నారు. అటువంటి వారి చేతుల్లో రాజ్యాంగయంత్రం నేడు బందీ అయ్యింది. ఈ రాజ్యాంగ యంత్రం దేశ వాసులందరికీ సమాన హక్కులు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత నుంచి నిర్దిష్ట సామాజిక సమూహాలకు దేశ వనరులు, అవకాశాలు, హక్కులను దఖలు పరుస్తూ మిగిలిన వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేందుకు బాహాటంగానే కృషి చేస్తోంది. బీజేపీ చేస్తున్న విధ్వంసం కేవలం దేశంలో జాతీయవాద భావాలు తగ్గినందువల్ల దాన్ని పెంపొందించటానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్పబూనుకోవటం విడ్డూరం. నిజమైన జాతీయవాదం, రాజ్యాంగ నిర్మిత జాతీయవాదానికి తూట్లుపొడవటానికి జరుగుతున్న ప్రయత్నమే తప్ప మరోటి కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమైతే స్వాతంత్య్రో ద్యమం ప్రజాతంత్ర లక్ష్యాలు ఆశయాలకు ప్రాతనిధ్యం వహిస్తూ నిర్మితమైన పలు రాజ్యాంగ వ్యవస్థలకు ఆరెస్సెస్‌ భావజాల ప్రేరేపిత ప్రభుత్వం తెచ్చిపెడుతున్న ముప్పు పట్ల ఏమరుపాటు వహించిన వాళ్లమే అవుతాము.

ప్రపంచ దేశాల రాజ్యాంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి, సామాజిక అభివృద్ధికి సంబంధించిన అత్యంత పురోగామి భావాలను రాజ్యాంగ బద్ధమైన హక్కులు, అవకాశాలు, బాధ్యతలు, విధులు కింద మార్చటంలో రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు బిఆర్‌ అంబేద్కర్‌ పాత్ర అద్వితీయం. రాజ్యాంగం ప్రతిపాదించిన ఇటువంటి అనేక అవకాశాలు ప్రజాతంత్ర జాతీయతను పరిపుష్టం చేశాయి. నేడు జాతీయత పేరుతో ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్న వాదనలన్నీ ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తామని రాష్ట్రపతి ముందు ప్రమాణం చేసిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన దాడికి నాయకత్వం వహించటం దేశాధ్యక్షుడుగా ఉన్న హిట్లరే స్వయంగా జర్మనీ పార్లమెంట్‌కు నిప్పంటించే కుట్రకు వ్యూహం పన్నిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. రష్యాలో గోర్బచేవ్‌ నాయకత్వంలో విప్లవ రష్యా రాజ్యాంగాన్ని, విప్లవ పతాకాన్ని, పార్టీని, పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసి జార్‌ కాలం నాటి చిహ్నాలను చట్టబద్ధం చేసిన సందర్భంతోనూ మోడీ పాలనకు పోలికలున్నాయి. అదికూడా బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకు మొక్కుబడిగా నీరాజనాలు పలుకుతూ మరోవైపు ఆయన అందించిన రాజ్యాంగంలోని ప్రజాతంత్రయుతమైన హక్కులను 'హిందూ'మహా సముద్రంలో నిమజ్జనం చేయటానికి పాచికలు వేస్తోంది ఆరెస్సెస్‌. ఆరెస్సెస్‌ శకుని తరహాలో ఆడిస్తున్న పాచికలాటను దుర్యోధనుడు ఆడినట్టుగా మోడీ, కౌరవ సమూహంలా ఆయన మంత్రివర్గంలోని హేమా హేమీలు ఆడుతున్నారు. నాటి మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణానికి గురైతే నేటి భారతంలో రాజ్యాంగంలోని ప్రజాతంత్ర హక్కులు వస్త్రాపహరణానికి గురవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయాల పరిరక్షణకు పాటుపడటం అంటే అంబేద్కర్‌ విరచిత రాజ్యాంగాన్ని, దాని ప్రజాతంత్ర స్వభావాన్ని, స్వాంత్య్రోద్యమ వారసత్వంగా అందివచ్చిన ప్రజాతంత్ర జాతీయతను కాపాడుకోవటానికి పోరాడటమే. ఇదే నిజమైన దేశభక్తుల కర్తవ్యం. జాతీయవాదం ముసుగులో రాజ్యాంగ విరచిత ప్రజాతంత్ర జాతీయత స్థానంలో ఆరెస్సెస్‌ విరచిత మతోన్మాద జాతీయతను ముందుకు తేవటానికి, అదే అసలైన జాతీయతగా చిత్రించేందుకు జరుగు తున్న కుయత్నాలను ఆమూలాగ్రం వ్యతిరేకించి పోరాడటమే నిజమైన భారతీయతకు నీరాజనం పట్టే మార్గం. ఈ సందర్భంగా స్వాతం త్యోద్యమం తోనూ, స్వాతంత్య్రోద్యమం అందించిన ప్రజాతంత్ర జాతీయవాద భావనలతోనూ ఏ మాత్రం సంబంధం లేని ఆరెస్సెస్‌ బీజేపీలు ఏ విధంగా మిథ్యా జాతీయవాదాన్ని తెరమీదకు తెస్తున్నాయో వివరించే ప్రయత్నం చేయాలి. ఆరెస్సెస్‌ కుట్రలకు అడ్డు కట్ట వేయాలి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తున్న శక్తులను గద్దె దింపాలి. దీనికి 2019 ఎన్నికలే తగిన సందర్భం.
- కొండూరు వీరయ్య
సెల్‌: 9871794037

మారుతున్న సంఘ్‌' వ్యూహాలు.. 

http://www.navatelangana.com/article/net-vyaasam/787073

సామాజిక జీవితంపై ప్రభావంలోక్‌సభ ఎన్నికలకు గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లాల్‌ కిషన్‌ అద్వానీ స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నామినేషన్‌ దాఖలు చేయటంతో బీజేపీ తొలితరం నాయకత్వం పూర్తిగా తెరమరుగైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పార్టీకి రాజకీయంగా సైద్ధాంతికంగా సారధ్యం వహించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి-అద్వానీ స్థానంలో అమిత్‌షా- నరేంద్రమోడీ ద్వయం పార్టీ వ్యవస్థపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్టీకి సారధ్యం వహించటంలో ఈ రెండు జోడీల మధ్య సాపత్య వ్యత్యాసాలు రానున్న కాలంలో చర్చనీయాంశం కానున్నాయి.
మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి వాజ్‌పేయి-అద్వానీ సారధ్యం వహించిన తీరుకు గత ఐదేండ్లుగా మోడీ-షా సారధ్యం వహిస్తున్న తీరుకూ మధ్య పోలిక లేదు. మోడీ-షా ద్వయం నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఫ్‌ు పడగ నీడ అటు పార్టీపైనా ఇటు ప్రభుత్వంపైనా మర్రి ఊడలా పర్చుకుంటోంది. 1998లో ఎన్డీయే తొలిసారి అధికారానికి రావటంతో భారత రాజకీయాల్లో హిందూత్వ ఆధిపత్య రాజకీయాలు నిర్ణయాత్మక దశకు చేరుకుంటే 2014లో మోడీ-షా ద్వయం పగ్గాలు చేపట్టాక హిందూత్వ రాజకీయాలు కాస్తా హిందూ ఉన్మాద రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. రెండు దశల్లోనూ సంఘపరివారం వ్యూహాత్మకంగానే వ్యవహరిం చింది. 1998లో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో పరివార్‌కు కీలకమైన రాజకీయ విధానాలను కూడా పక్కన పెట్టింది. 2014లో ఎలాగైనా అధికారం చేజారిపోదు అన్న ధీమా వచ్చాక మోడీ-షా ద్వయం అప్పటి వరకు పక్కన పెట్టిన విధానాలు, వ్యవహారాలు, ఎజెండాలు అన్నీ తెరమీదకు తెచ్చేసింది.
ఇప్పటి వరకు కేంద్రంలో అధికారం చేపట్టిన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతంతో పోల్చి చూస్తే 2014లో బీజేపీకి మాత్రమే అతి తక్కువ ఓట్ల శాతం -31 శాతం వచ్చాయి. అంటే సంఖ్యరీత్యా పార్లమెంట్‌లో బలంగా ఉన్నా ప్రజాపునాది రీత్యా అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. కానీ మోడీ పరిపాలన ప్రాధాన్యతలు దేశాన్ని మరో రెండు దశాబ్దాల వరకు ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. పరిమిత ప్రజా పునాది కలిగిన ప్రభుత్వం దేశ భవిష్యత్తును అపరిమితంగా ప్రభావితం చేసే విధానాలకు తెర తీసే అధికారం కలిగి ఉందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఇటువంటి విధానాలన్నీ రాజకీయ సైద్ధాంతిక సాంస్కృతిక రంగంలో ఏ విధంగా ప్రభావం చూపుతాయో అర్థం చేసుకుంటే తప్ప మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకోలేం. మరో మాటలో చెప్పాలంటే ఆధిపత్య రాజకీయాల స్వరూప స్వభావాలను అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామిక వ్యవస్థపై విస్తరిస్తున్న సంఘపరివారం పడగ నీడ ప్రమాదాన్ని కూడా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే ఏమిటి అన్న ప్రశ్నతో కాలం వెళ్లబుచ్చదల్చుకున్న వారికి ఓటు కేవలం ప్రభుత్వాలను ఎన్నుకోవటం కోసం మాత్రమే కాదనీ, ప్రజల భవిష్యత్తును, దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయటంలో ఓటు కీలకపాత్ర పోషిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించటంలో విఫలమవుతాము.
మోడీ పరిపాలనలో భారతీయ సమాజంలో పెరుగుతున్న మితవాద ప్రజాతంత్ర వ్యతిరేక ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటే మోడీ పాలన ప్రభావాన్ని విశ్లేషించాలి. అర్థం చేసుకోవాలి. హిందూత్వ రాజకీయాల నాందీ ప్రస్తావన నుంచి పరిశీలిస్తే తప్ప దీన్ని అర్థం చేసుకోలేము. వలసవాదంతో మొదలైన హిందూ-ముస్లిం విభజన స్వాతంత్య్రానంతరం ఏయే రూపాలు తీసుకుంది, జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించిన తర్వాత పరిస్థితుల గురించిన ప్రశ్న అటువంటి వాటిలో ఒకటి. ముస్లిం వేర్పాటువాదానికి ప్రతిగా హిందూ మతోన్మాదం తలెత్తిందన్న వాదన తరచూ వినిపిస్తోంది. కానీ చరిత్రను పరిశీలిస్తే ఈ వాదన సత్యదూరమని తేటతెల్లమవుతుంది. వలస పాలనలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు ఆవిర్భÛవించిన దశాబ్దం తర్వాతే ముస్లింలీగ్‌ భారత రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది. అందుకే సంఫ్‌ుపరివారానికి మొదటి శతృవు చరిత్ర. చరిత్రకారులు. చరిత్ర నుంచి పుట్టుకొచ్చిన సంస్కృతి. సాంస్కృతిక రంగ కార్యదక్షులు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల బీజేపీ రాజకీయ ప్రస్థానంలో అనేక విధానపరమైన ప్రయోగాలు చేసింది. ప్రపంచ సోషలిస్టు శిబిరం పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఎన్ని పరిమితులతోనైనా కొనసాగుతున్న దశలో బీజేపీ వంటి పచ్చి మితవాద పార్టీ కూడా ప్రజల ముందుకు రావటానికి గాంధేయ సామ్యవాదం నినాదాన్ని స్వీకరించాల్సి వచ్చింది. బీజేపీ పూర్వావతారం భారతీయ జనసంఫ్‌ు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో సాగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం వహించటం ద్వారా తన మతోన్మాద రాజకీయ కోణాలను జయప్రదంగా కప్పిపెట్టుకుని ప్రజల ముందుకు వచ్చింది. ఈ రెండు నినాదాలు పెద్దగా ఆరెస్సెస్‌ పరివారానికి పెద్దగా రాజకీయ ప్రాబల్యాన్ని తెచ్చిపెట్టలేక పోయాయి.

ఈ రెండు ప్రయోగాలు విఫలమయ్యాక బీజేపీ చేపట్టినదే రామమందిరం సమస్య. శతాబ్దాల తరబడి భారతీయ మానసికతలో అంతర్భాగంగా ఉన్న రాముడు, రామాయణాన్ని కుహనా చరిత్ర ఆధారంగా రాజకీయ సాధనంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు వచ్చిందే అయోధ్యలో రామమందిర నిర్మాణం సమస్య. పూర్వపు రెండు ప్రయత్నాల కంటే ఈ ప్రయత్నం బీజేపీకి దాన్ని వెన్నంటి నడుపుతున్న ఆరెస్సెస్‌కు రాజకీయ ప్రాబల్యాన్ని, ప్రజామోదాన్ని తెచ్చి పెట్టింది. దీంతో రామమందిరం బీజేపీకి రాజ్యాధికార సోపానంగా మారింది. దీంతోపాటే ప్రపంచ వ్యాప్తంగా మారిన భౌగోళిక రాజకీయ వాతావరణం కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేకత కాగడాను నిలిపి ఉంచటానికి దోహదం చేసింది.
2014లో మోడీ-షా ద్వయం నాయకత్వ స్థానానికి వచ్చాక హిందూత్వ రాజకీయాల సామాజిక పునాది పెరగటానికి, ప్రజామోదం పొందటానికి వీలుగా మతోన్మాద రాజకీయ చిహ్నాలు, వ్యూహాల్లో పరిణామాత్మక మార్పులు వచ్చాయి. కేవలం ధార్మిక జీవనమే కాక ప్రజా సాంస్కృతిక జీవన శైలి కూడా రాజకీయ కురుక్షేత్రంలో భాగమైంది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చినవే లవ్‌ జీహాద్‌, నవనిర్మాణ సేనలు, ఘర్‌వాపసీ క్రతువులు. వీటన్నింటికీ పరాకాష్ట గోరక్ష, మూక హత్యలు. ఈ నూతన ఎజెండా యావత్తు భారత సామాజిక జీవితాన్ని అతలాకుతలం చేసింది. మరీ ముఖ్యంగా మహిళలను నూతన ఆధిపత్య హిందూ రాజకీయాలకు కేంద్రంగా మార్చింది. ఈ విధంగా సాధారణ హిందూ మతావలంబీకులకు, హిందూమతోన్మాదులకు మధ్య ఉన్న సన్నని గీతను చెరిపేసేందుకు ఈ ఐదేండ్లల్లో జరిగిన కృషి భవిష్యత్తు భారతాన్ని మార్చటంలో బీజాక్షరాలుగా పని చేస్తాయనటం సందర్భరహితం కాబోదు.

తమ నిత్యజీవన సమస్యల పరిష్కారానికి బీజేపీ/మోడీ ప్రతిపాదించిన పరిష్కారాలను అమలు చేయాలని 2014లో ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. కానీ బీజేపీ ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి తాను ఎంచుకున్న లక్ష్యాలను, నిర్దేశించుకున్న ఉద్దేశ్యాలతో ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తూ 21వ శతాబ్దంలో మధ్యయుగాల నాటి ప్రపంచం తిరస్కరించిన సామాజిక నిర్మాణాలను పున:ప్రతిష్టించటానికి శాయశక్తులా పని చేసింది. 2014 నాటి మోడీ పాలనకు ప్రజా పునాది పరిమితం అన్న సంగతి గుర్తెరిగారు కనకనే సామాజిక సమీకరణాల అవసరాన్ని బీజేపీ- సంఘపరివారం గుర్తించింది. వాజ్‌పేయి- అద్వానీ బీజేపీని అధికారానికి తేవటానికి రాజకీయ సంకీర్ణాలు నిర్మిస్తే మోడీ-షా ద్వయం సామాజిక సంకీర్ణాలను నిర్మిస్తోంది. రాజకీయ సంకీర్ణాలు ఐదేండ్లకొకసారి మారుతూ ఉంటాయి. కానీ సామాజిక సమీకరణాలు తరానికి ఒకసారో రెండు మూడు తరాలకు ఒకసారో మారతాయి. మోడీ-షా ద్వయం ప్రారంభించిన ఈ ప్రయత్నాలకు గండి కొట్టాలంటే 2019 ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించటం తప్ప మరో మార్గం లేదు. మరో రెండు మూడు తరాలను ఆధిపత్య మతోన్మాద భావజాలానికి బలి చేయకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయం కోరుకునే లౌకిక ప్రజాతంత్ర శక్తులు రాజకీయంగా మతోన్మాదశక్తులను గద్దెనెక్కకుండా చూడటంతో పాటు సామాజిక సాంస్కృతిక జీవనం నుంచి మతోన్మాద శక్తులను వెలివేయాలి.
- కొండూరి వీరయ్య

సెల్‌: 987179403
7

ప్రజాస్వామ్యానికి ఫేక్‌న్యూస్‌ వైరస్‌