Wednesday, May 22, 2019

Apr 18,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/794807


పొట్ట విప్పి చూడ పురుగులుండు..!

ఒక్కోసారి సమకాలీన వాస్తవికతకు దర్పణం పట్టేలా చెప్పాలంటే గతంలోకి వెళ్లాలి. సామాజిక రుగ్మతలపై తెలుగులో వేమన సరళమైన భాష, శైలిలో అందించినంత సాహిత్యాన్ని మరో తెలుగు కవి అందించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మోడీ అవినీతిపై సాగిస్తున్న పోరాట స్వభావాన్ని ఎత్తి చూపటానికి వేమన పద్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. భారతదేశంలో అవినీతి ప్రవాహాలకు వెయ్యి చేతులతో అడ్డుకట్ట వేసే కార్తవీర్యార్జునుడు అని బీజేపీ శ్రేణులు భజన చేశాయి. మనసా వాచా కర్మణా నీతి తప్పని నేతగా మోడీ వ్యక్తిత్వాన్ని ప్రచారం చేయటానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో, ఆ సొమ్ము బీజేపీకి లేదా మోడీకి ఎలా దక్కిందో బట్టబయలు చేస్తే పారదర్శక పాలన నినాదం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతను విశ్వసించవచ్చు. ఐదేండ్ల పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోని ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు అని భుజకీర్తులు తగిలించేందుకు కుహనా విశ్లేషకులు, ఎన్డీ టీవీ యాంకర్‌ రవిష్‌ తివారీ మాటల్లో పాలకుల ఒళ్లో ఒదిగిపోయిన మీడియా విశ్లేషకులు శాయశక్తులా ప్రయత్నం చేశారు. అయినా రాఫెల్‌ కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిశీలించాక అవినీతిపై మోడీ సాగిస్తున్న పోరాటం మేడిపండువంటిదనీ, విదేశీ స్వదేశీ కార్పొరేట్‌ శక్తుల ముందు మోడీ రెక్కలు తెగిన జటాయువులా పడిపోయాడని రుజువవుతోంది.
మోడీ అధికారానికి వచ్చాక తాను అవినీతికి పాల్పడే అవకాశం లేదని జనాన్ని నమ్మించేందుకు రెండు విషయాలు చెప్పారు. మొదటిది తనకు కుటుంబం, వారసులు లేరన్నది అందులో మొదటిది. తనకు కుటుంబంలేదని చెప్పటం ద్వారా మోడీ కాంగ్రెస్‌ నేతలు కుటుంబం కోసం కోట్లు వెనకేసుకునే ప్రయత్నంలో అవినీతికి పాల్పడ్డారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. మరో సందర్భంలో తాను పకీరునని, పదవి నుంచి దిగిపోతే జోలె పట్టుకుని తన మానాన తాను పని చేసుకుంటానని చెప్పుకున్నారు. మోడీ ఏ వ్యాఖ్య చేసినా, ఏ ఉపన్యాసం చేసినా, ఏ నిర్ణయం చేసినా నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంటాయన్న సామెతను నెమరేసుకుని మరీ మోడీ వ్యాఖ్యలు, విమర్శలు, ఉపన్యాసాలు చూడాలి. ఇక్కడ అవినీతి ఏదో వ్యక్తిగత బలహీనత వల్ల చోటుచేసుకునే పరిణామం అన్న అభిప్రాయాన్ని కల్పించటానికి విదేశీ గుత్తపెట్టుబడిదారీ సంస్థలు, ద్రవ్యపెట్టుబడి కంపెనీలు గత మూడు దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రచారాన్నే దేశంలో బీజేపీ నెత్తికెత్తుకున్నది.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై నడుస్తున్న వ్యాజ్యంపై గతేడాది డిసెంబరులో సుప్రీం కోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు ఆధారం ప్రభుత్వం ఇచ్చిన కొన్ని పత్రాలు, కోర్టుకు నివేదించిన కొంత సమాచారం. ఈ పత్రాలు, సమాచారం అవాస్తవాలని, అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం మోసగించేందుకు మోడీ ప్రభుత్వం పూనుకున్నదని తేటతెల్లం కావటానికి పెద్దగా సమయం పట్టలేదు. గత మూడు నెల్లుగా పత్రికల్లో వస్తున్న వివరాలు నేపథ్యంలో ప్రశాంత్‌ భూషన్‌, అరుణ్‌శౌరీ, యశ్వంత్‌సిన్హాలు మరోసారి సుప్రీం గడప తొక్కారు. డిసెంబరులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్నది వారి అభ్యర్థన. ఈ అభ్యర్థనపై విచారణ మొదలవటం అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పాక్షికమైనదీ, న్యాయస్థానాన్ని దారితప్పించేదీ అని అంగీకరించటమే. అంతే కాదు. పత్రికల్లో వచ్చిన వాస్తవాలేనని కూడా అంగీకరించినట్టు. ఈ పరిస్థితిని అడ్డుకోవటానికి మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, ముందుకు తెచ్చిన వాదనలు, వ్యాఖ్యలు బహుశా భారత న్యాయవ్యవస్థలో ఎన్నడూ జరిగి ఉండవు.
ఎట్టకేలకు ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌తో పాటు మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చిన కొన్ని దస్తావేజులను సైతం సాక్ష్యాలుగా పరిగణించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఫలితంగా గత రెండేండ్లుగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు జరుగుతున్న న్యాయ, న్యాయేతర పోరాటం ఓ కొలిక్కి రానుంది. గత వారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూడు విషయాలను స్పష్టం చేస్తోంది.

మొదటిది రాఫెల్‌ కొనుగోలు గురించి మీడియా వెలుగులోకి తెచ్చిన అనేక పత్రాలు, దస్తావేజులు, ఒప్పందాలు, అధికారిక పత్రాలు వాస్తవమైనవే అన్నది. ఈ కుంభకోణం గురించి లోతైన పరిశోధన చేసిన హిందూ పత్రిక అధినేత ఎన్‌ రామ్‌ తనకు అందిన పత్రాలు అధికారికమైనవేనని కూడా స్పష్టం చేశారు. ఈ పత్రాలు ప్రకారం రాఫెల్‌ కొనుగోలు విషయంలో రక్షణశాఖను పక్కనపెట్టి నేరుగా ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవటం పతాక స్థాయి ఉల్లంఘనగా రక్షణశాఖ అభిప్రాయపడింది. ఓ స్వచ్ఛంద సంస్థకు గ్రాంట్‌ ఇచ్చినా ప్రభుత్వం వారి నుంచి బాండ్‌ తీసుకుంటుంది. అలాంటిది వేల కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నామో ఆ దేశ ప్రభుత్వం హామీ ఉండాలన్న షరతు అంతర్జాతీయ వాణిజ్య షరతు. ఈ షరతుతో పని లేదని మోడీ కార్యాలయం తేల్చిచెప్పటం వెనక ఉన్న మతలబు వెలుగు చూడాల్సి ఉంది. అంతేకాదు. అటువంటి కొనుగోళ్లల్లో అవినీతికి తావు లేకుండా కూడా కొన్ని షరతులు కొనుగోలు దార్లు అమ్మకం దార్లకు మధ్య కుదిరే ఒప్పందాల్లో కొన్ని షరతులు, ఒడంబడిక ఉంటాయి. వీటిని కూడా రద్దు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించింది. యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సిన దస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీకి నిజంగా ఒప్పందం మేరకు అన్ని యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసి నిర్దిష్ట గడువులో సరఫరా చేయగలదా లేదా అన్న విషయంపై రక్షణశాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ప్రధాని కార్యలయం తొక్కిపట్టింది. ఇవన్నీ విధానపరమైన అవినీతికి సంబంధించిన విషయాలు.

గతేడాది జరిగిన విచారణలో సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని వాస్తవాలు నివేదించలేదన్నది రెండో విషయం. న్యాయస్థానాలు తీర్పు ఇచ్చే పద్ధతి వింతగా ఉంది. వాస్తవంతో న్యాయస్థానానికి పని లేదు. కేవలం ఆధారాలు మాత్రమే పరిశీలిస్తుంది. కక్షిదారులు తమ ముందుంచిన వివరాలు మాత్రమే తీర్పుకు ప్రాతిపదికగా ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో వాస్తవాలు కక్షిదారులు కోర్టు ముందుకు తేగలిగిన ఆధారాల కంటే వాస్తవాలు చాలా విశాలంగానూ లోతైనవిగానూ ఉంటాయి. కానీ న్యాయస్థానం ఇవన్నీ పరిశీలించదు. అందుకే ఓ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మరో న్యాయస్థానం కొట్టేస్తుంది. సుప్రీం కోర్టులోనే ఏక సభ్య న్యాయస్థానం తీర్పులను బహుళసభ్య న్యాయస్థానాలు కొట్టేయటమో సవరించటమో చేసిన సందర్భాలు కోకొల్లలు. అటువంటి పరిమితులకు లోబడిందే డిసెంబరులో రాఫెల్‌ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని నేడు స్పష్టమైంది. దీనికి కారణం న్యాయస్థానానికి మోడీ ప్రభుత్వం పూర్తి వాస్తవాలు నివేదించకపోవటం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించిందన్న విషయం ఈ తీర్పుతో రుజువైంది. అటువంటి వాటిలో రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం, కేంద్ర రక్షణ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం, కేంద్ర విజిలెన్స్‌ విభాగం మార్గదర్శకాలు, మధ్యవర్తుల బృందం (ఫ్రాన్స్‌ కంపెనీతో చర్చలు జరిపిన బృందం) అభ్యంతరాలు వంటి అనేక కీలక పత్రాలను ప్రభుత్వం సుప్రీం మెట్లు ఎక్కకుండా తొక్కిపట్టింది. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు. మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరీ చేసిన వాగ్దానం, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విషయాన్నీ అనుమతించనన్న వాగ్దానాన్ని ఉల్లంఘించటమే. ఇది అత్యంత నీతిబాహ్యమైన చర్య.
ఫ్రాన్స్‌కు చెందిన లిమోండె పత్రిక సంచలన వార్త మూడో విషయం. ఈ వార్త సారాంశం అనిల్‌ అంబానీ కంపెనీ ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అపరాధ రుసుముల్లో దాదాప 12వందల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నది. భారతదేశంలో బడా కంపెనీలకు సుమారు రూ.ఐదు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసినందున ఫ్రాన్స్‌ 1200కోట్లు మాఫీ చేయటం గొప్ప విషయం కాదు. కానీ రాఫెల్‌ విడిభాగాల తయారీ కాంట్రాక్టు అనిల్‌ అంబానీ కంపెనీకి కట్టబెట్టిన తర్వాత ఈ అపరాధ రుసుము మాఫీ కావటంలోనే కిటుకంతా ఉంది. ఇక్కడ విడివిడిగా కనిపిస్తున్న మూడు విషయాలను కలిపి చూస్తే తప్ప ఈ కుంభకోణంలో తుదీ మొదలూ వెలుగులోకి రావు. అలాంటి ఈ మూడు విషయాలు.

మొదటిది అటు ఫ్రాన్స్‌లో దస్సాల్ట్‌, ఇటు భారత్‌లో రిలయన్స్‌ జూనియర్‌ కంపెనీలు ఆర్థికంగా దివాళా తీసి ఉన్నాయి. రెండు కంపెనీలకూ ఈ యుద్ధ విమానాలు తయారు చేయటానికి కావల్సిన పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత కానీ విడి భాగాలు తయారు చేయటానికి కావల్సిన నిధులు కానీ లేవు. దాంతో ఈ కాంట్రాక్టు అవసరం వచ్చింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ఒప్పందం గురించిన చర్చలు ఓ మేరకు పురోగమించాయి. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని మోడీ తన కార్పొరేట్‌ భక్తి ప్రదర్శించదల్చుకున్నారు.. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను విడిభాగాల తయారీకి భాగస్వామిగా అంగీకరిస్తే దస్సాల్ట్‌ ఆర్థిక అవసరాలు తీరుతాయేమో కానీ అనిల్‌ అంబానీ దివాళా నుండి బయట పడరు. అందుకే ప్రభుత్వరంగ స్థానంలో ప్రయివేటు కంపెనీ తెరమీదకు రావటం, దానికి లేని అర్హతలకు మెరుగులు దిద్దటం జరిగింది. ఈ తప్పుడు పనికి ఫ్రాన్స్‌ ఎందుకు ఒప్పుకుంది అన్నది ప్రశ్న. దస్సాల్ట్‌ కంపెనీ మూతపడితే వేల మంది కార్మికులు రోడ్డున పడతారు. బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత మరింత పుంజుకుంటుంది. ఉద్యమాలకు వేదికవుతుంది. దీనికి బదులు ఇలాంటి ఓ కాంట్రాక్టు సంపాదిస్తే దేశంలో కార్మికుల మద్దతు పొందవచ్చు. ఈ రెండు లక్ష్యాలు నెరవేరుతున్నాయి కాబట్టి ఫ్రాన్స్‌ కూడా అనిల్‌ అంబానీ కట్టాల్సిన రూ.12వందల కోట్ల అపరాధ రుసుము కూడా మాఫీ చేసింది.
అర్హత లేని అనిల్‌ అంబానీ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న విధి విధానాలను, ప్రమాణాలు, చట్టాలు, పద్ధతులను తుంగలో తొక్కింది. వడ్డించేవాడు మనవాడే అయితే దివాళా తీసిన కంపెనీలకు కూడా వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టవచ్చని నిరూపించారు. తనకంటూ కుటుంబమే లేని మోడీ, ఫకీర్‌ అయిన మోడీ ఏ ప్రయోజనం ఆశించి ఈ అడ్డగోలు వ్యవహారాలకు, చివరకు సుప్రీం కోర్టును మోసం చేయటానికి బరితెగించారు?
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
Apr 22,2019
 http://www.navatelangana.com/article/net-vyaasam/797093


హిందూయిజం - హిందూత్వ ఉగ్రవాదం

 గత నాలుగు దశాబ్దాల్లో చూడని స్థాయిలో ఎన్నికల రణరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో పాలక బీజేపీ ముందంజలో ఉంది. కులమతాల పేరుతో ఓట్లు అడగ్గకూడదన్నది మౌలిక నిబంధనగా ఉంది. దీన్ని ఉల్లంఘించటానికి అటు మోడీకి కానీ ఇటు ఆయన శిష్య బృందానికి గానీ ఏ మాత్రం వెరపు లేదు. ఇటువంటి ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాల్సిన ఎన్నికల సంఘం గోళ్లు, కోరలు పీకిన తెగ్గోసిన పులిలా నిల్చుంది. బీజేపీ విజయానికి గండికొట్టే త్రిపుర, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొరాయిస్తున్నాయి. సాంప్రదాయకంగా బీజేపీ కేంద్రాలుగా ఉన్న రాష్ట్రాల్లో ఈ యంత్రాలు సజావుగా పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం రెండున్నర వేల కోట్లు జప్తు చేసింది. ఇందులో 95శాతం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే జప్తు అయ్యింది. బీజేపీకి పెట్టని కోటలుగా ఉన్న రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రభావితం చేయటానికి యథేచ్ఛగా పంపిణీ అవుతున్న నల్లధనం కంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పంపిణీ అవుతున్న నల్లధనమే ఎన్నికల సంఘానికి ప్రమాదకారిగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఈ ఎన్నికల్లో మరో ప్రమాదకరమైన ధోరణిని బీజేపీ ముందుకు తెస్తోంది. ఇప్పటి వరకు దేశ ప్రజల దృష్టిలో ఉగ్రవాదం విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఉగ్రవాదం పేరుతో ప్రజల ప్రాణాలు తీయటం తీవ్రమైన నేరం అన్న అభిప్రాయమే ఉంది. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని కూడా మతాల ప్రాతిపదికన చీల్చి హిందూ ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారి తరపున ఓట్ల వేట సాగిస్తున్నారు. ఎమర్జెన్సీ తర్వాత మతాల ప్రాతిపదికన ఓటర్లను చీల్చటం మొదలైన ఈ క్రమం మోడీ పాలనలో మరింత సిగ్గు విడిచి బరితెగింపు స్థాయికి చేరింది. మాలేగాం బాంబు పేలుళ్లల్లో ప్రధాన సూత్రధారి, నేరస్తురాలు అయిన 'సాధ్వి' ప్రగ్యను ఏకంగా భోపాల్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంతకు ముందే హైందవోన్మాద ఉగ్రవాదం దేశంలో లేనే లేదనీ, ఈ పేరుతో కేవలం హిందూ మతాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు కాంగ్రెస్‌ కంకణం కట్టుకుందన్న విమర్శలకు స్వయంగా ప్రధాని మోడీ ఒడిగట్టారు.

దేశంలో మతోన్మాద రాజకీయాల జోరు, ఉగ్రవాద చర్యల ఉధృతి, మిశ్రమ ఆర్థిక విధానం స్థానంలో ప్రపంచీకరణ విధానాలకు తెరతీయటం కుడిఎడంగా ఒకే సమయంలో మొదలయ్యాయి. ప్రపంచీకరణ గావించబడిన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుదలతో పాటే లౌకిక రాజ్యంగా భారత్‌ పతనం కూడా మొదలైంది. ప్రపంచీకరణ విధానాల్లో కీలకమైనది ఆర్థిక విధాన నిర్ణయాల్లో ప్రభుత్వ పాత్రను కుదించటం. ఈ సూత్రాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు మార్గదర్శకత్వంలో బీజేపీ మరింత నవీకరించింది. సామాజిక జీవితంలో సైతం ప్రభుత్వం పాత్ర, సామాజిక తప్పొప్పులను సరి చేయటంలో ప్రభుత్వ పర్యవేక్షక పాత్రను కుదించటం కూడా ప్రపంచీకరణలో అంతర్భాగమేనని బీజేపీకి చెందిన మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలకవర్గాల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా ప్రజలను గాడిలో పెట్టడానికి ఉనికిలోకి వచ్చిన సాధనమే ఆధునిక రాజ్యం అన్న సూత్రం నానాటికీ రుజువవుతోంది. సామాజిక జీవితంలో ప్రభుత్వ పాత్ర కుదించుకుపోవటంతో అనివార్యంగా ధామస్‌ హాబ్స్‌ చెప్పిన కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న సూత్రం ముందుకొస్తోంది. మందబలం సామాజిక జీవితాన్ని నియంత్రించే సాధనంగా మారటం ఈ సూత్రానికి విస్తరణే. ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని నిర్వచించేందుకు ఒకే ప్రమాణాన్ని పాటించాలి. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వమే ద్వంద్వ ప్రమాణాలు ప్రత్యేకించి మతాల ప్రాతిపదిక ద్వంద్వ ప్రమాణాలు పాటించటం మొదలు పెట్టడం దేశ భద్రతకు ముప్పుగా మారుతుందనటంలో సందేహం లేదు. కాశ్మీర్‌లో ముస్లిం ఉగ్రవాదుల పట్ల, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెంచి పోషిస్తున్న హైందవోన్మాద ఉగ్రవాదం పట్ల బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమే 2019 ఎన్నికల్లో మోడీ ఉపన్యాస శైలి.

హైదరాబాద్‌లోని మక్కా మసీదు బాంబు లోనూ, అజ్మీర్‌లోని షరీఫ్‌ దర్గాలో, అమృతసర్‌- లాహౌర్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేల్చివేత వంటి కేసుల్లో కేంద్ర హౌం శాఖ ప్రారంభించిన దర్యాప్తు తీగలాగితే డొంకంతా కదిలినట్టు నాగపూర్‌ మీదుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌, స్వామి అసీమానంద, సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ల వద్దకు చేరింది. 2006 సెప్టెంబర్‌ 8న మాలెగాంలో జరిగిన పేలుళ్లల్లో 36మంది చనిపోయారు. 2007 ఫిబ్రవరి 18న జరిగిన సంఝౌతా పేల్చివేతలో 68మంది అక్కడికక్కడే చనిపోయారు. అదే ఏడాది మే 18న మక్కామసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుళ్లలో 16మంది, అక్టోబరు 11, 2007న అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా ప్రాంగణంలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం, సీబీఐ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఇది ఇస్లామిక్‌ ఉగ్రవాదుల చర్యలు కావని నిర్ధారణ కావటంతో ఉగ్రవాద చర్యల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఎ)కు ఈ కేసులు 2011లో బదిలీ అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు 2014కు ముందే పూర్తి అయినా ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ మాత్రం 2014 తర్వాత కూడా కొనసాగింది. దర్యాప్తు సమయంలోని విలువైన సాక్ష్యాధారాలన్నీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కాక చిత్తుకాగితాలుగా మారాయి. ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో నిగ్గు తేలిన పురోహిత్‌, స్వామి అసీమానందలతో పాటు పని చేసిన వారంతా నిర్దోషులుగా బయటకొచ్చారు. న్యాయవ్యవస్థను తొలుచుకుంటూ పోయిన ప్రత్యేక యంత్రాంగం, దానికి రాజ్యం అండదండలు లేనిదే ఈ కేసులు తారుమారు అయ్యాయని భావించగలమా? బహుశా ఇందుకేనేమో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగొరు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఓ బలమైన అదృశ్య శక్తి పని చేస్తోందని దేశాన్ని హ్చెరిస్తున్నారు.

ఇక్కడ కోర్టుల్లో జరిగిన కొన్ని పరిణామాలు పాఠకుల దృష్టికి తేవాలి. 2010 డిసెంబరు 18న అసీమానంద కోర్టులో వాంగ్మూలమిచ్చారు. 42పేజీల వాంగ్మూలాన్ని తెహెల్కా పత్రిక యథాతథంగా ప్రచురించింది. పైన ప్రస్తావించిన బాంబు పేలుళ్లన్నీ అత్యున్నత స్థాయిలో హిందూత్వ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రమేయంతో సాగినవేన్నది సారాంశం. దేశ విభజన సమయంలో నాటి నిజాం నవాబు పాకిస్థాన్‌లో విలీనం కావాలని ప్రయత్నం చేశాడనీ అందుకే హిందూత్వ నేతల మార్గదర్శకత్వంలో మక్కా మసీదును లక్ష్యంగా బాంబుదాడి జరిగిందని స్వయంగా వెల్లడించారు. ఇదే తరహాలో అజ్మీర్‌ దర్గా బాంబు పేలుళ్ల కేసులో నిందితులు దేవేంద్ర గుప్త, భవేష్‌ పటేల్‌, సునీల్‌ జోషి (ఆరెస్సెస్‌ జాతీయ నాయకుల్లో ఒకరు) దోషులుగా నిర్ధారింపబడ్డారు. కానీ అసీమానంద మాత్రం నిర్దోషిగా బయట కొచ్చారు. అజ్మీర్‌ దర్గా కేసులో ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన అశ్వని శర్మ, జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులనుద్దేశించి ''అనేకమంది సాక్ష్యులను నిందితుల తరపున న్యాయవాదులు ప్రభావితం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు సాక్ష్యుల ఫోన్‌ కాల్‌ వివరాలు సేకరిస్తే ఈ విషయం నిర్ధారణవుతుంది. నిందితుల తరపు న్యాయవాది సాక్ష్యులతో ఓ హౌటల్లో సమావేశ మయ్యారు. సదరు హౌటల్‌ నుంచి సీసీి కెమెరాల రికార్డులు తెప్పించినా ఈ విషయం రుజువవు తుంది. సాక్ష్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులదే'' అన్న హెచ్చరికలు మోడీ పాలనలో న్యాయదేవత కురుసభలో ద్రౌపదిగా మారిన తీరు తేటతెల్లమవుతోంది. దర్యాప్తు సంస్థ న్యాయ విచారణలో ప్లేటు ఫిరాయించటంతో న్యాయస్థానం లో ఇచ్చిన వాంగ్మూలాలు సైతం చెల్లని ప్రకటనలు గా మారి హైందవోన్మాద ఉగ్రవాదులు నిర్దోషులు గా జనారణ్యంలో అడుగుపెట్టడం సాధ్యమైంది.
సాధారణంగా సీబీఐ గానీ మరో కేంద్ర ప్రభుత్వ సంస్థగానీ చిన్న చిన్న కేసుల విషయంలో దిగువ న్యాయస్థానాల్లో ఓడిపోతే పై న్యాయస్థానాల్లో అప్పీలు చేస్తాయి. ఉదాహరణకు 2018లో ఒంగోలుకు చెందిన ఓ యువకుడు ఐఎఎస్‌గా ఎంపికయ్యారు. అతని సర్టిఫికెట్ల విషయంలో వివాదం తలెత్తింది. సదరు అభ్యర్థి హైదరాబాద్‌లో అడ్మినిష్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌లో యూపీఎస్సీ మీద దావా నడిపి గెలిచాడు. దీనికి వ్యతిరేకంగా యూపీఎస్సీ హైదరాబాద్‌ హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. కానీ దేశ భద్రతకు ప్రమాదంగా మారిన ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో మాత్రం కేంద్ర హౌం శాఖ అప్పీలు చేయటానికి సిద్ధం కాలేదు. అసీమానందతో పాటు సాధ్వి ప్రగ్య, కల్నల్‌ పురోహిత్‌ హిందూత్వ ఉగ్రవాద కార్యక లాపాల వ్యూహకర్తలు. 2008లో బాంబు దాడి తర్వాత ఈ ముగ్గురు నిందితులూ అరెస్టయ్యారు. జైల్లో ఉన్నారు. దర్యాప్తు పూర్తి అయ్యింది. విచారణ జరుగుతోంది. ఉన్నట్టుండి 2016 ఏప్రిల్‌ 13న ఎన్‌ఐఏ సంస్థ కోర్టులో ఓ అనుబంధ పత్రం దాఖలు చేసింది. ఈ పత్రం ప్రకారం ప్రగ్య ఠాకూర్‌ను నిర్దోషిగా భావిస్తున్నామని తెలిపింది. అంతకు ముందే ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయాధికారిగా పని చేస్తున్న రోహిణి సాలియాన్‌ ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా మరింత లోతుగా విచారణ చేయొద్దని కేంద్ర హౌం శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. పాలక పార్టీ ఎవరి పక్షాన ఉంటే వాళ్లకు రాఫెల్‌ కాంట్రాక్టులు దక్కటమే కాదు. ఏ నిందితుల పక్షాన ఉంటే ఆ నిందితులు నిర్దోషులుగా బయటకొస్తారని కూడా బీజేపీ ఈ ఐదేండ్లలో రుజువు చేసింది. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా ఉగ్రవాద చర్యలను మత ప్రాతిపదికన విడదీసి హైందవో న్మాద ఉగ్రవాదులు చేసేది హిందూమత పరిరక్షణ చర్య ఇస్లామిక్‌ ఉగ్రవాదులది దేశ వ్యతిరేక చర్య అని చెప్పటానికి ఓ ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారటం ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వెల్లడిస్తోంది. హిందూమతం అంటే హైందవో న్మాదుల ఉగ్రవాద చర్యలు కాదని నిజమైన హిందువులు పాలక బీజేపీకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
May 04,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/802210


ప్రజాస్వామ్యం.. ధన స్వామ్యం

ప్రజాస్వామ్యం రంగు మారుతోంది. కరెన్సీ కట్టలు రంగు మారినట్టే. నానాటికీ సమాజం సత్యానికి దూరంగా జరుగుతుంటే నిజం చెప్పే వాళ్లనే నిజం అసహ్యించుకుంటుందని జార్జి ఆర్వెల్‌, ప్రముఖ ఆంగ్ల నవల రచయిత అంటారు. సర్వకాలాల్ల నికరంగా నిలబడేదే నిజం. కానీ నేడు మనమున్నది సత్యానంతర సమాజం. ఇంకా చెప్పాలంటే సత్యదూరమైన సమాజం. ఇక్కడ నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే సత్యానికి కూడా బొమ్మా బొరుసు ఉంటాయి. ఎవరి నిజం వారిదే. కానీ కొన్ని నిజాలు నిప్పులాంటివి. అందులో ఒక నిజం ఎన్నికల్లో డబ్బు పాత్ర గురించిన నిజం.
            ప్రజల చేత ప్రజల కోసం ప్రజల వలన సాగే పాలన ప్రజాస్వామ్యమని అప్పుడెప్పుడో అబ్రహాం లింకన్‌ ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పారు. భారత లోక్‌సభ ఎన్నికల తీరు గమనిస్తే బహుశా లింకన్‌ ముక్కు మీద వేలేసుకునేవాడేమో. ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రజలను ఒప్పించి ఇతరులను నొప్పించక ఓటు వేయించుకోవటం ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం. కానీ ఇక్కడ ప్రలోభాలకు కొదవలేదు. లోక్‌సభ నియోజకవర్గంలో పోటీచేసే అభర్థి 70లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు రుజువయితే సదరు అభ్యర్థి గెలిచినా అనర్హునిగా ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నది. అనంతపురం లోక్‌సభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎంపీ జేసీ దివాకరరెడ్డి 50కోట్ల వరకు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వాపోయారు. పూట గడవని వ్యవసాయ కూలీలు దళితులు కూడా నిలబెట్టి నాయకుల వద్ద ఓటు విలువ వసూలు చేశారని తెగబాధ పడిపోయారు. బహుశా నిమ్న వర్గాల శ్రమ దోచుకోవటానికి తేరగా అవకాశాలు కల్పించే ఈ వ్యవస్థలో అటువంటి వారి ఓటుకు ఖరీదు కట్టాల్సి రావటం ఈయనకి అంతగా రుచించలేదు కాబోలు. ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి పది కోట్లకు తక్కువ ఖర్చు పెట్టలేదని ఒక టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం వెల్లడిస్తోంది. ఎన్నికల ప్రచారం మరో రెండ్రోజుల్లో ముగుస్తుంది అనగా హైదరాబాద్‌లో బీజేపీ ఏకంగా ఎనిమిది కోట్లు బ్యాంక్‌ నుంచి డ్రా చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడింది. ఒక సాధారణ ఖాతాదారునికి ఒకేసారి పదివేలకు మించి ఇవ్వటానికి నానా యాగీ చేసే బ్యాంకు నిబంధనలు పాలక పార్టీకి ఏకంగా ఒకే రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎలా డ్రా చేసుకోవటానికి అనుమతినిచ్చాయో అడిగే నాధుడు కరువయ్యాడు.

                దేశంలో అత్యంత ధనం మూట గట్టుకున్న పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి తనను తాను ఫకీరునని చెప్పుకుంటున్నాడు. ఊళ్ళో పెళ్లికి ఎవరికో సందడి అన్నట్టు ఎన్నికలంటే ఎక్కడెక్కడి నిధులు నదుల్లా పొంగి పొర్లుతాయి. దేశంలో నల్ల ధనాన్ని మాయం చేస్తానంటూ మోడీ నోట్లరద్దు మంత్ర దండాన్ని గాల్లో తిప్పాడు. కానీ ఈ ఎన్నికల్లో దొరికిన దాదాపు 4వేల కోట్ల రూపాయలు నల్లధనం ఏ కలుగులో నుంచి వచ్చిందో కనుక్కునే ప్రయత్నం కూడా చేయటం లేదు ప్రభుత్వం.
         ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఖాతాలకి గొళ్ళెం పెట్టి మరీ బీజేపీ వేల కోట్లు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టింది. ఇదేశైలి త్రిపుర ఎన్నికల వరకు కొనసాగింది. సన్యాసులు సాధువులు సంత్లు నాయకులుగా ఉన్న పార్టీకి ఇన్ని నిధులు ఎలా వచ్చాయన్న విషయాన్ని దర్యాప్తు చేయాల్సిన సంస్థలన్నీ బీజేపీ పెరట్లో పలుపు తాళ్లకు కట్టేయబడ్డాయి. దాంతో అసలైన నిజాలు ఎన్నటికీ ప్రజల దృష్టిలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ప్రత్యామ్నాయ మార్గాల్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు.

                మోడీ మంత్ర దండమో అమిత్‌షా తంత్ర గండమో తెలీదు కానీ రాజుగారి గంగాణం నిధులతో పొంగి పొర్లుతోంది. ఇంకా చెప్పాలంటే కార్పొరేట్‌ కంపెనీల లాభాల రేటును మించి బీజేపీ ఖాతాలో నికర నిల్వలు పెరుగుతూ వచ్చాయి. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల్లో లబ్దిదారులంతా బీజేపీకి చందాలు ఇచ్చి కాంగ్రెస్‌కు కరువు కాలం చూపినట్టు కనిపిస్తోంది. వేరే పార్టీల విషయంలో ఇలా జరిగి ఉంటే జాతిని మేల్కొలపటానికి అటు ప్రభుత్వంలోని ఇటు పాత్రికేయ రంగంలోని నిఘావర్గాలు జూలు విదిలించి ఉండేవి. కానీ ఇక్కడ ఆయా నిఘా వ్యవస్థలను మేల్కొల్పాల్సిన చౌకీదారే కండ్లు మూసుకున్నారు.
             ఈ ఎన్నికల్లో ప్రధాన బూర్జువా పార్టీలు పెట్టిన ఖర్చు నిస్సందేహంగా ఎన్నికల సంఘం అనుమతించిన పరిమితి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఒక్కటే 125 హెలికాఫ్టర్లు అద్దెకు తీసుకున్నది. ఇక ప్రయివేటు విమానాల సంఖ్య తేలాల్సి ఉంది. ఒకే రోజు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఏపీ మీదుగా కేటాల5 వరకు జరిగిన బహిరంగసభల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరయ్యారు. ప్రయివేటు విమానం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. సగటున హెలికాప్టర్ల అద్దె గంటకు ఏడున్నర వేల డాలర్లు. అంటే సుమారు ఐదు లక్షల రూపాయలు. కనీసం ఓ మీటింగ్‌కు ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చి మీటింగ్‌లో ఉపన్యాసం ఇచ్చి తిరిగి వెళ్లితే ఎంత లేదన్నా 4 గంటల సమయం అవసరం. అంటే 20లక్షల ఖర్చు. ఈ విధంగా ఏ పార్టీకి చెందిన ఎంత మంది నాయకులు ఇలాంటి మీటింగ్‌లల్లో ఎన్నింటిలో పాల్గొన్నారో లెక్క తీయటం బ్రహ్మ విద్య ఏమీ కాదు. దేశీయ పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగాల వద్ద గగన వీధుల్లో తిరిగిన గాలిమరల వివరాలు అన్నీ నిక్షిప్తం అయి ఉంటాయి. ఎన్నికల సంఘం కనీసం కండ్లు తెరిచి వ్యవహరించి ఈ వివరాలు తెప్పించుకుంటే ఏ పార్టీ స్టార్‌ నాయకుల ప్రయాణాలకే ఎంత ఖర్చు పెట్టిందో లెక్క తేల్చవచ్చు. ఓ సారి అలాంటి లెక్క తీసాక ఆ ఖర్చు మొత్తాన్ని లెక్కిస్తే బూర్జువా పార్టీలు ప్రత్యేకించి బీజేపీ అభర్థులందరినీ అనర్హులుగా ప్రకటించవచ్చు. ఇవి కాక జేసీ దివాకర్‌ రెడ్డి వెల్లడించిన వివరాలు పోగేస్తే ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాడో లెక్క తేల్చడం కూడా పెద్ద శ్రమతో కూడిన వ్యవహారం కాదు.

                    ఈ ఆర్భాటాల్లో బీజేపీని మించగల శక్తి మరో పార్టీకి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి బీజేపీ ఖాతాలో రూ.570 కోట్లు జమ పడ్డాయి. 2016-17నాటికి ఈ మొత్తం 1034 కోట్లకు పెరిగింది. ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన వివరాలలోని విషయాలే. రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాల విషయంలో పారదర్శకతకు మంగళం పాడిన తర్వాతనే బీజేపీకి ఈ నిధుల వరద పెరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థాయిలో నిధులు సమీకరించుకునే వెసులుబాటు బీజేపీకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ చందాలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు నడిచింది. వాద ప్రతివాదనలు విన్నాక ఏ పార్టీకి ఎంత మొత్తంలో కార్పొరేట్‌ కంపెనీల నుంచి నిధులు అందాయో మార్చి 31నాటికి తెలియ చేయాలని ఆదేశించింది.
               ఎన్నికల వ్యవస్థే బూర్జువావర్గ పాలనను పరిరక్షించే మార్గాల్లో ఒకటి అన్న అంచనా ఉన్నపుడు ఈ ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెడితే ఏమిటి ఎవరు గెలిస్తే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఎంత అస్త వ్యస్థంగా ఉన్నా ఈ ఎన్నికల వ్యవస్థలో ఎంతో కొంత మేర ప్రజల వాణి వినిపించే వామపక్షాల లాంటి శక్తులు చట్టసభల్లో అడుగు పెట్టగలుగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు బలంగా ఉన్న కేరళ, బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్థాయిలో లేదు. ఎన్నికల ప్రచారం ఎంతో కొంత విధానాలకు పరిమితమయ్యే పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో ఉంది. కానీ సరళీకరణ విధానాలు దేశంలో అన్ని వ్యవస్థలను దిగమింగుతున్నట్టు రాజకీయ వ్యవస్థను పార్టీలను కూడా దిగ మింగుతోంది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని దీనికి ఓ మార్గంగాను, రహస్య మార్గాల్లో పార్టీలకు చందాలు చేరవేయటం ఓ సాధనంగానూ మారింది. సాధారణంగా ఎన్నికల్లో కోటీశ్వరులు కార్పొరేట్‌ వర్గం బరిలోకి దిగాక ఎన్నికల ప్రచారంలో రైతు వ్యవసాయ కార్మిక సమస్యలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు, ధరల భారం, నిరుద్యోగ సమస్య వంటి సాధారణ పౌరుల ఈతిబాధలకు ఎన్నికల ప్రచారంలో చోటు దక్కుతుందని ఆశించటం నేతి బీరకాయలో నేయి చందమే.

ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వారి గెలుపునకు 91శాతం అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. గత 20ఏండ్లల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలుపొందిన అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు విశ్లేషిస్తే కోట్లల్లో ఖర్చు పెట్ట గలిగిన అభ్యర్థులు 84శాతం గెలిచారు. మిగిలిన 16శాతం బహుశా వామపక్షాల అభ్యర్థులు, రిజర్వుడ్‌ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అయి ఉంటారు.
అభ్యర్ధుల ధన బలానికి పార్టీల ధన బలం తోడైతే? ఇక పర్యవసానం ఏమిటో ఊహించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్నికల్లో రానురాను పెరుగుతున్న ధన ప్రభావం ఎన్నికలను కార్పొరేట్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించే మరో రంగంగా మారుతోంది.
              ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అడ్డుకోకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు చట్టసభల్లో ప్రవేశించలేవు. అటువంటి శక్తులకు చట్టసభల్లో ప్రవేశం లేకుండా ప్రజా సమస్యల మీద చట్ట సభల్లో చర్చకు అవకాశం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడే శక్తులు ప్రత్యామ్నాయ ఎన్నికల వ్యవస్థ గురించిన చర్చ కూడా తమ ఎజెండాలో చేర్చుకోవాలి. కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తమవుతున్న ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలను కాపాడుకోవటం కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల తక్షణ కర్తవ్యం కావాలి. చేజారిపోతున్న ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
May 08,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/804659


ఓటర్ల స్పందన బీజేపీని బెంబేలెత్తిస్తోందా?

May 11,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/805849


మోడీ మజిలీ కథలు

ఆదివారం నాటికి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరో ఘట్టం ముగుస్తుంది. మరో పది రోజుల్లో భావి భారత పాలకులు ఎవరన్న విషయం స్పష్టం కానుంది. దాంతో మార్చి ఏడో తేదీ ఎన్నికల ప్రకటనతో మొదలైన 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కథ కంచికి చేరనుంది. పాలక పార్టీ ఈ ఎన్నికల్లో గెలవటానికి ప్రచారంలో పెట్టిన అంశాలు గమనిస్తే చిన్నప్పటి కాశీ మజిలీ కథలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన గానీ, స్వర్ణచతుర్భుజి పేరుతో నిర్మించిన జాతీయ రహదారులు కానీ లేవు. దాంతో కాశీయాత్రకు బయలుదేరేటప్పుడు జట్లు జట్లుగా బయలుదేరే వారు. ఒక్కో జట్టులో వయసులో పెద్దవాడైన వ్యక్తి ఒక్కో మజిలీలో ఒక్కో కథ చెపుతూ సాటి ప్రయాణీకుల్లో ఉత్సాహం నింపటానికి ప్రయత్నం చేసేవాడు. అలా వచ్చినవే కాశీ మజిలీ కథలు. కట్టు కథలైనా, పుక్కిటి పురాణాలైనా మనువాద సాహిత్యంలో కొకొల్లలు. మనువాదమే మానవవాదమని నమ్మే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ుకు తిరుగులేని ప్రతినిధిగా ఉన్న మోడీ కూడా ఈ పుక్కిటి పురాణాల నుంచి బాగా స్ఫూర్తి పొందినట్టున్నారు. ఒక్కో దశ పోలింగ్‌కు ఒక్కో ప్రచారాస్త్రాన్ని ముందుకు తెచ్చి ఓటర్లల్లో ఉత్సాహం నీరుగారకుండా చూసేందుకు విశ్వప్రయత్నం చేశారు.
మోడీ మరోసారి ఢిల్లీ మజిలీ చేరుకోవటానికి ఎన్నికల ప్రచారంలో సైతం అనేక మజిలీలు దాటుకుంటూ వచ్చారు. తొలి దశ ఎన్నికల్లో మోడీ ప్రధాన కేంద్రీకరణ యావత్తూ బాలకోట్‌ దాడుల నేపథ్యంలో దేశానికి శక్తివంతమైన పాలన కావాలని, అటువంటి శక్తివంతమైన పాలన అందించే సత్తా తనకు మాత్రమే ఉందని ఉపన్యాసాలిచ్చారు. వందిమాగధుల పాత్ర పోషించటానికి పోటీ పడే సాక్షిమహరాజ్‌ వంటి వారు మరోసారి మోడీ అధికారానికి వస్తే భవిష్యత్తులో భారతదేశంలో ఎన్నికలతో పని ఉండబోదని ఇంటిగుట్టును రట్టు చేశారు. రెండో దశలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ప్రచారం నాటికి మరో అడుగు ముందుకేసి యోగీ ఆదిత్యనాథ్‌ వంటి నేతలు ఏకంగా భారతీయ సైన్యాన్ని మోడీ సేనగా ప్రకటించారు. వందలమందికి గుండెలు ఎదురొడ్డే మగధీరులున్న ఈ దేశంలో 56అంగుళాల ఛాతీ కలిగిన నేతలు సైతం లక్షల మంది సైనికులు వెన్నంటి వుంటే తప్ప ఎన్నికల బరిలో నెగ్గలేని స్థితికి చేరుకున్నారు.

ఇక మూడో దశకు వచ్చేసరికి పాచికలు విసరటం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వంతు అయ్యింది. ఏకంగా తాము అధికారానికి వస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ ఏర్పాటు చేస్తామని, సదరు రిజిష్టరులో ఇమడని పౌరులందరినీ విదేశీయులుగా పరిగణించి తరిమి వేస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ సమయానికి రాఫెల్‌ వివాదాన్ని విచారిస్తున్న సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ డిసెంబర్‌ నాటి తన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనను మన్నించింది. విచారణ చేపట్టింది. దాంతో రాఫెల్‌ వివాదంలో భాగమైన అనుమానాస్పద లావాదేవీలు, జోక్యాలను విచారిస్తే దేశ భద్రతను బహిరంగ మార్కెట్‌లో పెట్టినట్టేనని మోడీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. సైనికోన్మాదం ఉఛ్చదశకు చేరుకోవటంతో కాంగ్రెస్‌ కూడా తానేమీ వెనకబడలేదని చెప్పుకోవటానికి తమ హయాంలో సైతం 12సార్లు పాకిస్థాన్‌ శిబిరాలపై మెరుపు దాడులు చేశామని వెల్లడించింది. ఈ విధంగా వెల్లడించుకోవటం అంటే దేశభద్రత కాపాడటంలో తమకు సామర్థ్యం ఉందని చెప్పుకోవటమే. తద్వారా బీజేపీ వేసిన ఉచ్చులో కాంగ్రెస్‌ చిక్కుకుపోయింది.

బీజేపీ వ్యూహకర్తలు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజనసమాజ్‌ పార్టీల మధ్య పొత్తు ఇంటికి చేరదని అంచనా వేశారు. ములాయంసింగ్‌ మాయావతిల మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే దీనికి పునాది. ఈ వైరానికి సంబంధించిన అనేక విషయాలు ఒళ్లో ఒదిగిన మీడియా ద్వారా, కోట్ల ఖర్చు ఇంధనంతో నడుస్తున్న సోషల్‌ మీడియా ద్వారా ఉత్తరప్రదేశ్‌ ఓటర్లకు చేరవేసేందుకు బీజేపీ నేతృత్వంలోని పుకార్ల ఫ్యాక్టరీలు షికార్లు మొదలు పెట్టాయి. ఈ పుకార్లలో వాస్తవం లేదని నిరూపిస్తూ మాయావతి ములాయం సింగ్‌ యాదవ్‌లు ఒకే వేదిక మీద ఎన్నికల సభల్లో పాల్గొని ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారు. దీంతో నాల్గో దశ పోలింగ్‌ సమయం దగ్గరపడే కొద్దీ బీజేపీ మజిలీ ఢిల్లీ చేరుతుందా లేదా అన్న సందేహం మొదలైంది. ఫలితంగా సహనం కోల్పోయిన ప్రధాని ఏకంగా అణోన్మాదం రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఎన్నికల బహిరంగ సభలో భారతదేశంలోని అణ్వాయుధాలు దీపావళి రోజు పేల్చటానికి దాచుకోలేదని కనుసైగతో కరాచీని నేలమట్టం చేస్తాయని హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రయోగం కేవలం పాకిస్థాన్‌నే కాదు, భారతదేశాన్నీ మట్టిపాలు చేస్తుందన్న సంయమనం లేకుండా వ్యవహరించటం ప్రధాని బాధ్యతలో ఉన్న మోడీకి తగని పని. ఇటువంటి ఉపన్యాసాలు విన్నప్పుడే కోతికి కొబ్బరి చిప్ప సామెత గుర్తుకొస్తుంది.

మొదటి మూడు దశల్లో ముస్లిం వ్యతిరేకతనే ఆయుధంగా మల్చుకున్న మోడీ, ఆయన వంది మాగధులు నాల్గో దశకు వచ్చే సరికి మోడీ వెనకబడిన కులానికి చెందినవాడు కావటంతో దేశంలోని అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ ఓర్వలేక ఒక్కటవు తున్నాయని సానుభూతి రాజకీయాలకు పాల్పడ్డారు. మొదటి మూడు దశల్లో ప్రధానంగా దక్షణాది రాష్ట్రాల్లో పోలింగ్‌ హడావుడి పూర్తి అయ్యింది. నాల్గో దశలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎక్కువ స్థానాలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. ఈ దశలో మోడీ తన వెనకబడిన కులాన్ని ముందుకు తేవటం బీజేపీ ఎన్నికల వ్యూహంలోని పదునును గుర్తు చేసే అంశం.
ఐదో దశ పోలింగ్‌ పూర్తి అయ్యే నాటికి క్రమంగా బీహార్‌ రాజస్థాన్‌ ఒడిషా రాష్ట్రాలతో సహా మెజారిటీ సీట్లల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. పంజాబ్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దాంతో చాకచక్యంగా రాజీవ్‌గాంధీని దుమ్మెత్తిపోసే ప్రచార వ్యూహానికి బీజేపీ తెరతీసింది. తదుపరి దశల్లో పోలింగ్‌ జరిగే అన్ని నియోజకవర్గాలకు రాజీవ్‌గాంధీకి మధ్య సంబంధం ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఈ ప్రాంతానికి చెందిన వారే. సిక్కులు, జాట్‌ సిక్కులు వీరిలో అధికులు. దాంతో వారి మనోభావాలు రెచ్చగొట్టేందుకు మోడీ మిగిలిన దశల పోలింగ్‌ను రాజీవ్‌గాంధీ పాలనపై రిఫరెండంగా మార్చటానికి తాను సిద్ధమంటూ సవాలు విసిరారు. ఆరోదశ పోలింగ్‌కు వచ్చే సరికి తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారనీ తిరిగి సానుభూతి కార్డు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. గత ఐదేండ్లలో మోడీ గురించి ప్రయోగించిన ఉపమానాలతో ఓ డిక్షనరీ తయారు చేసి తనను ఇన్ని మాటలంటున్నారు చూడండి అంటూ వాపోయారు మోడీ. ఈ విధంగా మోడీ మజిలీ కథల్లో ఒక్కో మజిలీలో చెప్పిన కథకు ఒక్కో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. ఈ అన్ని దశల్లో ఒక్క చోట కూడా ఐదేండ్లలో సాధించిన విజయాలు గురించి చెప్పుకునేందుకు మోడీ ప్రయత్నం చేయకపోవ టం గమనించాల్సిన విషయం. మోడీ పాలన, విజయాల డొల్లతనాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
ఈ ఆరుదశల్లో దేశం ఎన్నో కథలు విన్నది. భారీ తారాగణంతో రాజకీయ స్కోప్‌ సినిమాలు చూసింది. కథానాయకులు ప్రతినాయకులుగా మారటం, ప్రతినాయకులు కథా నాయకులుగా మారటాన్ని దేశం గమనించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు ముందుకు తెచ్చిన అంశాలు, ప్రజల దృష్టినాకర్షించటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యం పట్ల జవాబుదారీ తనం పట్ల రాజకీయనాయకులకు ఏమాత్రం పట్టింపు ఉందో అర్థం చేసుకోవటానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాజకీయ విలువలు అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల లోకాలు దాటి పాతాళానికి చేరుకున్నాయి. మన పాలకులు విశిష్టంగా భావించే పురాణ ఇతిహాసాల ప్రకారం పాతాళానికి చేరే కొద్దీ ఈతి బాధలు పెరుగుతూ పోతాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యం కూడా పాతాళానికి జారిపోయే కొద్దీ కొత్త కొత్త సమస్యల సుడిగుండంలో కూరుకుపోతుంది. ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి చేర్చటానికి పాలకవర్గం మండుటెండలో సైతం మడమ తప్పికుండా పని చేసింది. ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోకుండా ప్రజల మధ్యే ఉండేలా చేయటం ప్రజలు, ప్రతిపక్షాల కర్తవ్యం.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037
May 14,2019

 Nava Telangana Daily

ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం ప్రమాదకరం

దేశం ఎన్నికల కొలిమి నుంచి ఎండల కొలిమిలోకి నడుస్తోంది. ఈ వేడిలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో విసురుతున్న సవాళ్లలో కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతున్నాం. అటువంటి వాటిలో ఒకటి పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య ఉండాల్సిన సంబంధం. మోడీ అధికారానికి రావటానికి ముందే ఈ దేశాన్ని కాంగ్రెస్‌ చెర నుంచి విముక్తి చేయటం లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అధికారానికి వచ్చాక దేశాన్ని ప్రతిపక్షం నుంచి విముక్తి చేయటమే లక్ష్యమని సవరించుకున్నారు. మరోవైపున ఆర్నెల్ల క్రితం ఎన్నికలు జరిగిన తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు, కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయనున్నట్టు వార్తలు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ జెండా కింద గెలిచిన దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పచ్చ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో కలిపేసుకున్నారు. కొద్దికాలం క్రితం జమ్ముకాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీల పొత్తు వికటించిన తర్వాత పీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలో విలీనం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. చివరకు పీడీపీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు జతకట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని గవర్నర్‌ను కోరటంతో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్షాన్ని కబళించటం పాలకపక్షం హక్కయింది. ఈ నేపథ్యంలో కొన్ని మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతిపక్షం ప్రజాస్వామ్య మౌలిక లక్షణాల్లో ఒకటి. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే శక్తి. ప్రభుత్వ తప్పొప్పులను పరిశీలించి జవాబుదారీతనం కోరే శక్తి. ఐదేండ్లకొకసారి ప్రజల ముందుకొచ్చే ఎన్నికల్లో ఏదో ఒక మోతాదులో ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకుతెచ్చే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయం ప్రతిపాదించటం అంటే పాలకపక్ష వైఫల్యాలను ముందు పరిశీలించాలి. విమర్శించాలి. ప్రజలకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తించి అర్థం చేసుకుని నివారణ అవకాశాలను ప్రజల ముందుంచాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను, దొర్లిన పొరపాట్లను గుర్తించి ప్రజల ముందు ఎత్తి చూపాలి. బహుశా ప్రతిపక్షం ఉంటే తమ వైఫల్యాలు, చేతగానితనం, బండారం ఒకరోజు కాకపోతే మరో రోజైనా బట్టబయలు కాక తప్పదన్న సూత్రాన్ని పాలక పార్టీలు అర్థం చేసుకున్నట్టున్నాయి. అందుకే అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్టున్నాయి.

ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం గురించి చర్చించాలనుకున్నప్పుడు పురాణాల్లో ప్రతిపక్షం పాత్ర, ప్రతిపక్షం లేకపోవటం వల్ల కలిగిన నష్టాలనేకం గుర్తు కొస్తాయి. రామాయణంలో దశరధుడు రాముడిని వనవాసం పంపాలని నిర్ణయించినప్పుడు ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలు ఎవ్వరూ వేయలేదు. సీతను అడవిలో విడిచి రమ్మని రాముడు ఆదేశించినప్పుడు ఇది నైతికమా, చట్టబద్ధమా, న్యాయసమ్మతమా అని ఎవ్వరూ ప్రశ్నించలేదు. రావణుడు సీతను అపహరించుకు వచ్చినప్పుడు మండోదరి మనకు ఇది తగదు అని చెప్పిందే తప్ప ప్రతిఘటించలేదు. విభీషణుడు ఎదురు తిరిగాడు. రావణుడు కాదు కూడదు అన్నప్పుడు లంక నుంచి వాకౌట్‌ చేశాడు. ఇది ప్రతిపక్షం. ఇదే ప్రతిపక్షానికి తగిన బలం ఉంటే రామ రావణ యుద్ధం జరిగి ఉండేదే కాదు. రామరాజ్యంలో ప్రతిపక్షానికి ఈమాత్రం అవకాశం కూడా లేదు. లంకలోని రావణ రాజ్యంలోనే ప్రతిపక్షానికి చోటుంది. ఈ ప్రతిపక్షం మాట కూడా విననప్పుడు లంక రావణ కాష్ఠమైంది.
మహాభారతంలో పాచికలాటలో ద్రౌపదిని పణంగా పెట్టేటప్పుడు కొలువులో ఉన్న పెద్దలందరూ ముఖముఖాలు చూసుకున్నారే తప్ప ఎవ్వరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. మహాభారతంలో పాలకుల నిర్ణయాలను ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని నాటి సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు నిలదీసి అడ్డుకుని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. కౌరవసేనలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి తర్వాత పెద్దవాడు వికర్ణుడు. వస్త్రాపహరణ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వికర్ణుడు కూడా వాకౌట్‌ చేస్తాడు. కనీసం వికర్ణుడు పోషించిన ప్రతిపక్ష పాత్రనైనా కురువృద్ధులు, గురువృద్ధులు పోషించి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. మహాభారత, రామాయణాలే ప్రతిపక్షం పాత్ర గురించి హెచ్చరిస్తున్నాయి. నాటి కథలన్నిటిలో రాచరికమూ, నియంతృత్వమే. కానీ మనమిప్పుడున్నది ప్రజాస్వామ్యంలో. ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. అటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మరెన్ని ఉత్పాతాలకు దారి తీయనున్నాయో ఆలోచించుకోవటం ఓటర్ల వంతు.
- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037

18 May 2019

Nava Telangana 

సంస్కృతిక జాతీయవాదం దిశగా బీజేపీ ప్రయాణం

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్‌షో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య కండబల ప్రదర్శన కేంద్రంగా మారింది. గతేడాది రోడ్‌షోకు అనుమతించకపోవటంపై బీజేపీ ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జాతీయ స్థాయిలో బీజేపీ బెంగాల్‌లో తృణమూల్‌ ప్రధానశక్తులుగా ఆవిర్భవించటంతో రెండు పార్టీలూ రాజకీయ పోరాటానికి కొత్త నిర్వచనం ఇచ్చాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు బెంగాల్‌ రాజకీయాలను మలుపు తిప్పిన కార్మిక కర్షక పోరాటాల స్థానాన్ని మూకస్వామ్యం ఆక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి వీధిపోరాటాల నడుమనే రాజకీయ అస్థిత్వాన్ని వెతుక్కున్న మమతా బెనర్జీని ఎదుర్కోటానికి బీజేపీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నది.
ప్రజాస్వామిక వ్యవస్థలను తుత్తునియలు చేయటానికి మూకస్వామ్యం రూపంలో బీజేపీ వినూత్న వ్యూహాలను ఎలా అనుసరిస్తుందో శబరిమల తీర్పు నేపథ్యంలో కేరళ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. బీజేపీ దృష్టిలో రాజకీయ ఆందోళన అంటే ప్రత్యర్థి శ్రేణులపై భౌతికదాడులే. 2011నుంచీ బెంగాల్‌లో పోలింగ్‌ సందర్భంగా జరుగుతున్న హింసాకాండ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే సీపీఐ(ఎం) విన్నవించినా వీడియోలు ఫోటోలు అందచేసినా అటు ఎన్నికల సంఘం గానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. అప్పట్లో సీపీఐ(ఎం)ను ఓడించటం పాలకవర్గాల ఏకైక లక్ష్యంగా నిలిచింది. దాంతో వేలాదిమంది సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవటమేకాక పార్టీకి చెందిన వందలాది కార్యాలయాలను తృణమూల్‌ ఆక్రమించింది. ఇదే మార్గాన్ని నేడు బీజేపీ అనుసరిస్తోంది. ఫలితంగా దేశంలో అత్యంత హింసాత్మక సంఘటనలు జరిగిన రాష్ట్రంగా ఈ సారి బెంగాల్‌ నమోదైంది.

అదలా ఉంచితే అమిత్‌షా రోడ్‌షో సందర్భంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ కళాశాల ప్రాంగణంలో నిలబెట్టిన విద్యాసాగర్‌ విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేయటం దేశాన్ని నివ్వెరపర్చింది. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక లెనిన్‌ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చి వేసిన ఫోటోలు వీడియోలు దేశమంతా వైరల్‌ అయితే సోకాల్డ్‌ ప్రజాతంత్ర శక్తులు నోరు మెదపలేదు. అదే సాంప్రదాయాన్ని బీజేపీ ఇప్పుడు బెంగాల్‌కు వ్యాపింపచేసింది. ఏకంగా ఆధునిక బెంగాల్‌ నిర్మాతగా పేరుగాంచిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాలను కూల్చివేతకు తెరలేపింది. విగ్రహాల కూల్చివేతకు ముందు జరిగిన పరిణామాలు రాజకీయ ప్రాధాన్యత కలిగినవి. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్న మోడీ రామనామాన్ని జపిస్తే బెంగాల్‌లో ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని ఉపన్యసించారు. దీన్నే మంత్రంగా పరిగణించిన బీజేపీ శ్రేణులు జై శ్రీరాం అంటూ వీధుల్లోకి రావటం మొదలైంది. చివరి దశలో పోలింగ్‌ జరగనున్న తొమ్మిది నియోజకవర్గాలు ప్రధానంగా పట్టణ ప్రాంత నియోజకవర్గాలే. పట్టణ ప్రాంతాల్లో బలం పుంజుకున్న బీజేపీ తృణమూల్‌ ఆధిపత్యాన్ని సవాలు చేయబూనుకుంది.
బీజేపీకి రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ పార్టీ నిర్మాణంలేదు. ఈ మధ్యకాలం వరకు బీజేపీ భావజాలాన్ని నమ్మిన శ్రేణులూ పెద్దగా లేవు. ప్రధానంగా తృణమూల్‌, కాంగ్రెస్‌లలో సీట్లు దక్కని నేతలే బీజేపీకి తొలి పెట్టుబడిగా మారారు. రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా ప్రజాదరణ లేకపోయినా రెండు వనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. మొదటిది నిరుద్యోగం. రెండోది డబ్బు. 2011వరకు ఎన్నికల్లో ధన ప్రభావం నామమాత్రంగా ఉండేది. విధానాలే కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరిగేది. సీపీఐ(ఎం) స్థానంలో టిఎంసీ అధికారానికి రావటంతో క్రమంగా ఎన్నికల రంగం రూపురేఖలు మార్చుకొంది. ధన ప్రభావానికి తెరతీసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీని ఈ విషయంలో ఢ కొట్టే పార్టీలు లేవు. దాంతో బీజేపీ పెద్దఎత్తున రాష్ట్రంలోకి కోట్ల కట్లను దించింది. నిరుద్యోగులను సైన్యంగా మార్చుకుంది. వీధిపోరాటాలే వ్యూహంగా ఎంచుకుంది.

గత ఆరు దశాబ్దాలుగా చాపకింద నీరులాగా పని చేసిన ఆరెస్సెస్‌ శాఖలు నేడు మితవాద రాజకీయాలకు కేంద్రంగా మారాయి. కోల్‌కతా వాణిజ్యమంతా మార్వాడీల చేతుల్లో ఉంటుంది. ఈ మార్వాడిలే ఆరెస్సెస్‌ను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టారు. 1990వరకు ఆరెస్సెస్‌ కార్యకలాపాలు, ఉపన్యాసాలు హిందీలో జరిగేవి. తర్వాతి కాలంలో ఉపన్యాసాలన్నీ బెంగాలీలోనే జరపాలని సంఫ్‌ు పట్టుబట్టి పెద్దఎత్తున సాహిత్యాన్ని బెంగాలీ భాషలోకి అనువదించి విచ్చలవిడిగా అందుబాటులోకి తేవటం ప్రారంభించింది. ఇక్కడే ఓ విషయాన్ని ప్రస్తావించాలి బెంగాల్‌లో సీపీఐ(ఎం) ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుందని బూర్జువా పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. అరుణ్‌శౌరీ లాంటి వాళ్లు బెంగాల్‌లో ముస్లింల జనాభా గురించి పుంఖాను పుంఖాలుగా రాశారు. అయినా వామపక్ష సంఘటన అధికారంలో ఉన్నంత కాలమూ సంఫ్‌ుపరివారం కార్యక్రమాలు సాధారణ స్థాయి దాటలేదు. కానీ సీపీఐ(ఎం)ను గద్దె దించే లక్ష్యంతో కాంగ్రెస్‌ సహకారంతో తృణమూల్‌ 28శాతంగా ఉన్న ముస్లింలను ఓటుబ్యాంకుగా మార్చుకోవటం మొదలు పెట్టిన తర్వాతనే సంఘపరివారం కార్యకలాపాలు విస్తరించటానికి కావల్సిన ఇంధనాన్ని సమకూర్చి పెట్టింది. దాంతో అటు దుర్గాపూజ కమిటీలను స్పాన్సర్‌ చేయటంతో పాటు క్రమంగా రామనవమి యాత్రలు, హనుమాన్‌ జయంతు లను కూడా తృణమూల్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించటం మొదలుపెట్టింది. అప్పటివరకు నిద్రాణంగా ఉన్న సంఘపరివారం కార్యకలాపాలు రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో ఊపందుకోవడం మొదలైంది. అది నిద్రపోతున్న సంఘపరివారం జూలు విప్పటానికి కారణమైంది. ఈ విధంగా తృణమూల్‌ అనుసరించిన కాంపిటేటివ్‌ మత సమీకరణలు బెంగాల్‌ రాజకీయ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. దాని ఫలితమే రోడ్‌ షో సందర్భంగా జరిగిన ఘర్షణలు, దాడులు, ఈ ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగిన హత్యాకాండ.

గతేడాది తృణమూల్‌ విద్యార్థి విభాగం జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చటానికి ప్రతీకారంగా బీజేపీ శ్రేణులు విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూల్చేశాయి. విద్యాసాగర్‌ జీవితాంతం కట్టుబడి ఉన్న విలువలకు ఆరెస్సెస్‌ అవగాహన పూర్తిగా భిన్నమైనది. రాజారామ్మోహన్‌ రారు కంటే ముందే బాల్య వివాహాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా సాధికారిత, ప్రజాతంత్ర హక్కులు వంటి అంశాలపై జీవితాంతం కృషిచేశారు. బంగ్లబాషకు వర్ణమాల రూపొందించారు. మహిళా విద్యాభ్యాసానికి పెద్దపీట వేశారు. దేశంలో మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు స్థాపించిన ఇరువురిలో ఒకరిగాఖ్యాతి గడించారు. వారిలో ఒకరు జ్యోతిబాపూలే కాగా, మరొకరు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌. అంతేకాదు. అప్పటివరకు పండిత పుత్రులకు మాత్రమే అవకాశం ఉన్న సంస్కృత విద్యను అన్ని కులాల వారికీ అందించేందుకు అడ్మిషన్‌ పద్ధతిలో మార్పులు తెచ్చారు. ఆ తర్వాతనే శూద్రులు కూడా సంస్కృత పాఠశాలలో విద్యార్థులయ్యారు. ఈ విలువలకు ఆది నుంచీ ఆరెస్సెస్‌ బద్ద వ్యతిరేకి. దీంతో ఈ ఘటన ఆధునిక బెంగాల్‌ సంస్కృతిపై దాడిగా పరిగణించబడుతోంది.
బీజేపీ ఎక్కడ రాజకీయాలు చేసినా అవి ముందుగా సాంస్కృతిక రాజకీయాలుగానే ఉంటాయి. బీజేపీ తొలినినాదమే సాంస్కృతిక జాతీయవాదం. దీన్ని సాధించుకోవటానికి ప్రజాదరణ పొందిన సంస్కృతిని ధ్వంసం చేయటం ఏకైక వ్యూహంగా బీజేపీ రాజకీయాలు సాగుతాయి. ఉమ్మడి విలువలు, ఉమ్మడి వారసత్వం, ఉమ్మడి సాంప్రదాయాలను ధ్వంసం చేయాలంటే అటువంటి ఉమ్మడి స్వభావానికి పునాదులు వేసిన త్యాగధనులను వారి స్ఫూర్తిని కాలరాయాలి. విగ్రహాలు కూల్చివేత ఇందులో ఓ అంకం మాత్రమే. వ్యవస్థల విధ్వంసం మరో అంకం. గత ఐదేండ్లల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ స్థాయి పాలనా వ్యవస్థలను కుప్పకూల్చిన తీరు పాఠకుల ముందు ఉంది. ఇప్పుడు సాంస్కృతిక వైవిధ్యానికి గల పునాదులు ద్వంసం చేయటంలో నిమగమైంది. ఆధునిక భారత నిర్మాణం బెంగాల్‌ నవనిర్మాణంతోనే మొదలైంది. ఆధునిక భారత్‌ను అంధకారంలోకి నెట్టాలంటే బెంగాలీ చైతన్యాన్ని దారి మళ్లించటం తక్షణ అవసరం. బెంగాల్‌లో బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం రానున్న కాలంలో బీజేపీ సంఘపరివారం అనుసరించనున్న సాంస్కృతిక జాతీయవాద రాజకీయాలకు సూచికగా, వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి హెచ్చరికగా నిలుస్తోంది.
- ప్రశాంత్‌