Monday, May 17, 2010

ప్రపంచం నెత్తిన యూరో పరిరక్షణ భారం !

Published in Prajasakti Business Watch May 17th

మే 3న బిజినెస్‌వాచ్‌లో గ్రీస్‌ను ఆదుకునేందుకు యూరోపియన్‌ యూనియన్‌ ముందున్న మార్గాలు గురించి ప్రస్తావించుకున్నాము. చిట్టచివరకు యూరోపియన్‌ యూనియన్‌ నేతలు ఆలస్యంగానైనా మేల్కొన్నారు. దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన గ్రీస్‌ సహాయ నిధిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ నిధి యూరో పరిరక్షణ నిధి అని పిలవటం మరింత సబబుగా ఉంటుంది. గతంలో చెప్పుకున్నట్లు గ్రీస్‌ పతనం కావటానికి అంగీకరించటం అంటే యూరో కరెన్సీపై అంతర్జాతీయ విశ్వాసాన్ని కోల్పోవటమే. అందువల్లనే మే మొదటివారంలో యూరోపియన్‌ యూనియన్‌ నేతల కసరత్తు అంతా ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా సాగింది. యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భావ క్రమంలో లిస్బన్‌ ఒప్పందం ఒక ముఖ్య ఘట్టం. ఈ ఒప్పందంలోని ఆర్టికల్‌ 12.2లో '' సభ్య దేశాలు ప్రకృతి వైపరీత్యాలకు గురైనపుడు, లేదా ఇతర భారీ నష్టానికి గురైనపుడు మిగిలిన దేశాలు సదరు సభ్య దేశాన్ని ఆదుకోవాలి'' అని ఆదేశిస్తోంది. ఈ ఒప్పందం కింద తాజా గ్రీసు/యూరో పరిరక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. స్థూలంగా యూరోపియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్‌లు సంయుక్తంగా రూపొందించిన పథకం ఇది. ఈ ఒప్పందం ద్వారా మొత్తం యూరోపియన్‌ యూనియన్‌ ద్రవ్య వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం ఐఎంఎఫ్‌కు దఖలు పర్చారు. 1999 లాటిన్‌ అమెరికా దేశాల రుణ సంక్షోభం తర్వాత ప్రాధాన్యత తగ్గిపోయిన ఐఎంఎఫ్‌ తిరిగి ఈ రూపంలో తన పర్యవేక్షణ విధులకు తెరతీసింది.

పట్టిక-2లో చివరి రెండు పాయింట్లు ముఖ్యంగా పరిశీలించాల్సినవి. యూరోజోన్‌లో దేశాలకు దేశాలే రుణబారిన పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయా ప్రభుత్వాలు నిధుల సమీకరణ కోసం విడుదల చేసే బాండ్లకు ( నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, ప్రభుత్వరంగ సంస్థల రుణ సేకరణ ఒప్పందాలు) మార్కెట్‌ ఆదరణ కరువైంది. లావాదేవీలు స్థంభించాయి. స్థంభించిన లావాదేవీలను పునఃప్రారంభించకుండా ద్రవ్య చలామణి సాధ్యం కాదు. అందువల్ల ఏకంగా యూరోపియన్‌ యూనియన్‌ సెంట్రల్‌ బ్యాంకే ఈ రుణ పత్రాలను, బాండ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించటం జరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో జరిగే ఇటువంటి లావాదేవీలన్నీ రేటింగ్‌ ఏజెన్సీల అంచనాలను ప్రమాణంగా తీసుకుంటాయి. రేటింగ్‌ ఎజెన్సీ అంటే మార్కెట్‌లో బాండ్లు విడుదల చేసే సంస్థ, ప్రభుత్వం ఆదాయ వ్యయాలు పరిశీలించి ఈ బాండ్ల ద్వారా సేకరిస్తున్న రుణాలు చెల్లించగల స్థితిలో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారిస్తుంది. రుణ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా గ్రేడులు ఇస్తారు. యూరోపియన్‌ యూనియన్‌లో కొన్ని దేశాల ఆర్థిక స్థితిగతులు శిధిలావస్థకు చేరుకోవటంతో రేటింగ్‌ బాగా పడిపోయింది. రేటింగ్‌ లేని దేశాలు విడుదల చేసే బాండ్లను ఎవ్వరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అందువల్లనే పై పట్టికలో చివరి క్లాజు. రేటింగ్‌ ప్రమాణాలతో నిమిత్తం లేకుండా యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాల బాండ్లు కొనుగోలు చేయటానికి సెంట్రల్‌ బ్యాంకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అంటే ఒకరకంగా చెప్పాలంటే అమెరికాలో బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, రేటింగ్‌ ఎజెన్సీలు సబ్‌ప్రైం రుణాలకు ఆమోదం ఇచ్చినట్లన్నమాట. దీని పర్యవసానం తాత్కాలికంగా యూరో బాండ్‌ మార్కెట్‌లోనూ, ద్రవ్య మార్కెట్‌లోనూ కదలిక వచ్చినా దీర్ఘకాలంగా యూరో సంక్షోభం అన్ని దేశాలను ఆవహించటానికి మార్గం సిద్ధం అవుతుంది. అంటే గ్రీస్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ దేశాలు విడుదల చేసే బాండ్లను మిగిలిన దేశాల్లోని ద్రవ్య సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ కొనుగోళ్లకు గతంలో ఆయా ప్రభుత్వాలే హామీ ఉంటే ఇపుడు ఏకంగా యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు హామీగా ఉంటుంది. తద్వారా యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లోని నష్టాలు, కష్టాలన్నీ సెంట్రల్‌ బ్యాంకు వద్ద కేంద్రీకృతమవుతాయి.యూరోపియన్‌ యూనియన్‌ బడ్జెట్‌ రూపంలో ఒక దేశంలో నష్టాలకు మరో దేశం బీమా పథకాలు అమలు జరుగుతాయి. ఉదాహరణకు గ్రీసులో జరిగే నష్టాలను పూడ్చుకోవటానికి జర్మనీ బడ్జెట్‌ వాటా నుండి నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి అంతిమంగా యూరోజోన్‌లో రాజకీయ అస్థిరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ ఒప్పందం తర్వాత రైన్‌, వెస్ట్‌ఫాలియా స్థానిక ఎన్నికల్లో జర్మన్‌ అధికార కూటమి చావుదెబ్బతిన్నది. దాంతో ఐఎంఎఫ్‌ ఆదేశాలకు అనుగుణంగా విధించాల్సిన సంక్షోభ నివారణ పన్ను వంటి కొత్త పన్నులను నిరవధికంగా వాయిదా వేసింది జర్మన్‌ ప్రభుత్వం. పోర్చుగల్‌ కూడా ఈ తరహాలోనే నూతన పన్నుల వడ్డనకు సిద్ధమవుతోంది. గ్రీస్‌లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలు ఈ దేశాలకూ విస్తరించటం అనివార్యం. ఈ విధంగా ఇపుడు దేశీయ సరిహద్దులకు పరిమితం అయిన సంక్షోభాన్ని యూరోజోన్‌ సరిహద్దులకు విస్తరించటానికి రంగం సిద్ధం అయింది.

ఈ అవగాహనలో మరో ముఖ్యమైన అంశం యూరోజోన్‌లోని అన్ని దేశాలు పరిరక్షణ, పునరావాస చర్యల్లో పాలు పంచుకోవాలన్న షరతు. ఈ షరతు ఆచరణలో ఏ రూపం తీసుకొంటుందో పక్కనున్న పట్టికను పరిశీలిస్తే మరో విషయం స్పష్టమవుతుంది. ఈ షరతు అమల్లో భాగంగా ప్రభుత్వాలు తీసుకునే పొదుపు చర్యలు యూరో జోన్‌లో ఎగుమతులు, దిగుమతులను పెద్దఎత్తున ప్రభావితం చేయనున్నాయి. ఇయు బడ్జెట్‌లో ఆయా దేశాల వాటాల నిష్పత్తికి అనుగుణంగానే 440 బిలియన్‌ యూరోల భారాన్ని ఆయా దేశాలు పంచుకుంటాయి. మరోవైపున ఐఎంఎఫ్‌ విడుదల చేసే 250 బిలియన్‌ యూరోల భారాన్ని మొత్తం ఐఎంఎఫ్‌ సభ్య దేశాలు పంచుకోవాలి. అంటే గ్రీసు పరిరక్షణ భారం ఎంతో కొంత భారతదేశ ప్రజానీకం కూడా మోయాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్యాకేజిని అమలు చేయాలంటే జర్మనీ 187 బిలియన్‌ డాలర్ల భారాన్ని మోయాలి. ఇది జర్మనీ ప్రభుత్వ రుణంలో ఆరు శాతం. అదేవిధంగా ఫ్రాన్స్‌ 143 బిలియన్‌ డాలర్ల భారం, ఇటలీ 122 బిలియన్‌ డాలర్ల భారాన్ని మోయాలి. మిగిలిన దేశాలు కూడా ఇదే తరహాలో తమవంతు భుజాన్ని అరువు ఇవ్వాల్సి ఉంటుంది. తత్పర్యవసానంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవహరాలను ఈ ప్యాకేజీ ప్రభావితం చేయనున్నాయి. ఏ విధంగా చూసుకున్నా గ్రీసు పరిరక్షణతో ప్రారంభమైన యూరోజోన్‌ చర్యలు చివరకు యూరో పరిరక్షణ భారాన్ని మొత్తం ప్రపంచ దేశాల నెత్తిన పెట్టాయి.

యూరోపియన్‌ బెయిలవుట్‌కు ఎవరు ఎంత చెల్లించారు ?

యూరోప్‌ ఆర్థిక స్థిరత్వానికి గాను యూరోపియన్‌ యూనియన్‌ నిధి నుండి 60 బిలియన్‌ యూరోలు కేటాయింపు

ఈ స్థిరత్వాన్ని సాధించేందుకు సభ్య దేశాలు అందరూ 440 బిలియన్‌ యూరోల విలువైన రుణాలు మంజూరు చేయాలి.

250 బిలియన్‌ యూరోల నిధిని ఐఎంఎఫ్‌ సమకూర్చాలి.

ఈ విధంగా ఏర్పాటైన నిధినుండి ఏ దేశమైనా సహాయం పొందాలంటే సదరు దేశం ఐఎంఎఫ్‌ కనుసన్నల్లో సంస్కరణలు అమలు చేయాలి.

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు యూరో సభ్య దేశాల బాండ్లను కొనుగోలు చేస్తుంది.

బాండ్‌ మార్కెట్‌లో కదలిక తెచ్చేందుకు రేటింగ్‌ ఏజెన్సీల ప్రమాణాలను తిరస్కరించి కొనుగోళ్లు చేయటానికి అంగీకారం కుదిరింది.

అయితే ఈ చర్యలు యూరో జోన్‌కు స్థిరత్వాన్ని సాధిస్తాయా అన్నది కీలక ప్రశ్న.

Monday, May 10, 2010

జాతీయ సహజవనరుల వినియోగ విధానం కావాలి

నాలుగేళ్ల పాటు కోర్టుల్లోనూ, ఆరేళ్లకుపైగా కుటుంబవివాదాల్లోనూ మగ్గిన కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబ వివాదం, ప్రభుత్వ నిర్వాకం, అధికారుల కుమ్మక్కు, కంపెనీల లాభాపేక్ష కలిసి కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర నిర్ణయించే ప్రక్రియను వివాదాస్పదంగా మార్చాయి. ఈ తెరలన్నీ తొలగిస్తూ శుక్రవారం నాడు అత్యుతన్నత న్యాయస్థానం రెండు విషయాలు స్పష్టం చేసింది. మొదటిది, కార్పొరేట్‌ రంగంలో కుటుంబ వివాదాలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావని ప్రకటించటం మొదటిది కాగా జాతీయ సహజసంపదపై సంపూర్ణ హక్కు ప్రభుత్వానిదేనని, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వాటిని సమగ్రంగా వినియోగించుకునేందుకు విధానం రూపొందించే హక్కు ప్రభుత్వానికి ఉందన్న రూలింగ్‌ రెండోది. ఈ తీర్పుపై వచ్చిన వ్యాఖ్యానాలు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొదటిగా కుటుంబ వివాదాలు ప్రత్యేకించి ఆస్తి వివాదాలు, ఒప్పందాలు న్యాయవ్యవస్థ పరిధిలోకి వస్తాయా రావా అన్న ప్రశ్నను తీసుకుందాం.

ప్రతి కుటుంబంలోనూ ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఇదేమీ కొత్త కాదు. ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలకు తలో వాటా అప్పగిస్తూ వీలునామా రాయటం కూడా కొత్తేమీ కాదు. వారసత్వపు హక్కు చట్టబద్ధమే. ఒక వేళ తల్లితండ్రులు వీలునామా రాయకుండా గతించిన పక్షంలో వారసత్వ హక్కు చట్టం ద్వారా ఆస్తివివాదాలు పరిష్కరించుకోవటం మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి విషయాల్లో వీలునామా, లేదా ఒక ఒప్పందం ఉండీ కూడా వివాదాలు వచ్చినపుడు పరిష్కరించుకోవటానికి ఈ వీలునామా, ఒప్పందం ఒక్కటే ఆధారం. దేశంలోని న్యాయస్థానాల్లో జరుగుతున్న సివిల్‌ దావాల్లో అత్యధికం అటువంటివే. చివరకు కుటుంబ సభ్యులు ఒక అంగీకారానికి వచ్చి రాజీ పడటమో లేదా కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా నడుచుకోవటమో జరుగుతుంది.ఇది నిత్యం మనం చూస్తున్న విషయం. మరి అంబానీల కుటుంబ ఒప్పందం మాత్రం న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని అత్యున్నత న్యాయస్థానం ఎందుకు భావించిందో ధర్మాసనంలో కూర్చున్న ముగ్గురు న్యాయమూర్తులకే తెలియాలి. ఇదే సూత్రం అయితే కుటుంబాల్లోని ఆస్తి వివాదాలన్నింటినీ న్యాయవ్వవస్థ పరిధి నుండి మినహాయించొచ్చు కదా!

ఇక రెండో విషయాన్ని పరిశీలిద్దాం. 2008లో ఈ వివాదంపై పెద్దఎత్తున పార్లమెంట్‌లో చర్చ జరిగేవరకూ ప్రభుత్వం కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర విషయంలో తాను నిమిత్తమాత్రురాలేనన్న వాదన ఎత్తుకొంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిలదీసిన తర్వాత గానీ ప్రకృతివనరులన్నింటిపై ప్రభుత్వానిదే సంపూర్ణ హక్కు అని పెట్రోలియం మంత్రి ప్రకటించాల్సి వచ్చింది. రాజ్యాంగాన్ని తిరగేసిన వారికెవరికైనా ఒక దేశంలోని ప్రకృతి వనరులు ఆ దేశ సార్వభౌమత్వం పరిధిలోనే (చట్టం పరిభాషలో దీన్నే సావరిన్‌ డొమెయిన్‌ అంటారు) ఉంటాయన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవటానికి సుప్రీం కోర్టు నాలుగేళ్ల పాటు మేథో మథనం చేస్తే గానీ మనం తెలుసుకోలేని పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వం ఈ హక్కును వినియోగించుకోవటంలో, అధికారాన్ని ప్రదర్శించటంలో నీళ్లునములుతూ వచ్చింది. అదే జాతీయ రహదారులకు అవసరమైన స్థల సేకరణ విషయంలో ప్రజల అభిప్రాయాలకు వీసమెత్తు విలువ ఇవ్వని ప్రభుత్వం కెజి బేసిన్‌ గ్యాస్‌ విషయంలో మాత్రం అంబానీ అభిప్రాయానికి ఎదురు తిరిగి పల్లెత్తు మాట అనేకలేకపోయింది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ముందుకొచ్చి '' ప్రభుత్వాధినేతలూ, ఇవీ మీ హక్కులు, అధికారాలు'' అని గుర్తు చేయాల్సి వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత ''మా మాటే నెగ్గింది'' అని ప్రభుత్వం చంకలు కొట్టుకుంటోంది. ఒకసారి ప్రకృతి వనరుల విషయంలో ప్రభుత్వం సంపూర్ణహక్కుదారు అని అంగీకరించిన తర్వాత దాని వెన్నంటే మరో ప్రశ్న తలెత్తుతోంది. అటువంటి ప్రకృతివనరుల వినియోగంలో ప్రభుత్వ పాత్రకు సంబంధించిన ప్రశ్న అది.

ప్రభుత్వం నిర్దిష్టవనరుపై తన హక్కును గుర్తించటంతో పాటు దాన్ని విశాల ప్రయోజనాల దృష్ట్యా వినియోగించటానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాల్సిన బాధ్యత కూడా దానిపై ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గుర్తు చేయాల్సి రావటం చూస్తుంటే ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాధ్యతారాహిత్యం ఒక్క గ్యాస్‌ కేటాయింపులు విషయంలోనే కాదు. టెలికాం రంగానికి ప్రాణవాయువులాంటి స్పెక్ట్రం, ఇంధనవనరుల రంగానికి కీలకమైన బొగ్గు, జలవనరులు విషయంలోనూ కనిపిస్తోంది. ఒక్క 3జి సేవలు వేలం వేయటం ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 40 వేల కోట్లకు పైగా ఆదాయం పొందింది. అదే రీతిలో 2జి స్పెక్ట్రం సేవలు వేలం వేసి ఉంటే కనీసం 20 వేల కోట్ల రూపాయల ఆదాయం అయినా వచ్చి ఉండేది. బొగ్గు గనుల కేటాయింపులోనూ ఇదే సూత్రం వరిస్తుంది. ఇంతటి ఆదాయ మార్గాలు అవినీతిపరుల పాలుజేసి ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రజలపై భారాలు పెంచాలని ప్రభుత్వం వాదించటం సిగ్గు చేటు. తిరిగి విషయానికి వద్దాం.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగం ప్రత్యేకించి గుత్తపెట్టుబడిదారుల శక్తి సామర్ధ్యాలు భారీఎత్తున పెరిగాయి. దాంతో పాటే ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే శక్తికూడా పెరిగింది. దీనికి అనేక మార్గాల్లో పని చేస్తాయి గుత్తపెట్టుబడిదారీ సంస్థలు. వీటికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తోడైతే ఇక చెప్పేదేముంది ! ప్రభుత్వాలకు వాళ్లు చెప్పిందే వేదం. చేసిందే వాదం. ఈ మాయలో పడిన ప్రభుత్వాలు చివరకు తమ హక్కులు, అధికారాలు వదులుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. కెజి బేసిన్‌ గ్యాస్‌ ధర నిర్ధారణ విషయంలోనూ అదే లక్షణం కనిపిస్తోంది. రానురాను విద్యుత్పత్తిలో గ్యాస్‌ పాత్ర పెరుగుతుందన్న విషయం ప్రభుత్వానికీ తెలుసు. అటువంటి గ్యాస్‌ నిక్షేపాలు పరిమితంగా ఉన్నాయనీ తెలుసు. అటువంటి పరిమిత సహజవనరులను ప్రజా ప్రయోజనాల దృష్టితో ఉపయోగించాలే తప్ప ఒకటో రెండో కార్పొరేట్‌ సంస్థలకు సర్వాధికారాలు కట్టబెట్టే ప్రయత్నం తప్పని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థపై కార్పొరేట్‌ రంగానికి సంపూర్ణాధికారం ఇచ్చేందుకు ప్రపంచీకరణ విధానాలు మరింత ఊపు తెస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తించాలని సుప్రీం కోర్టు హెచ్చరిక సమకాలీన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంతేకాదు. ఒకప్పుడు ప్రైవేటురంగానికి అవధుల్లేని స్వేచ్చ కల్పించాలని చెప్పిన సుప్రీం కోర్టు నేడు కీలకమైన సేవలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కూడా ప్రభుత్వానికి హితవుచెప్పింది.

అనిల్‌ అంబానీ నిర్మించ తలపెట్టిన దాద్రి విద్యుత్‌ కంపెనీకే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలతో మొదలు పెట్టి నవరత్న కంపెనీ ఎన్టీపిసీ నిర్మిస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు కూడా గ్యాస్‌ ఇంధనం అవసరం. అటువంటపుడు ముఖేష్‌ అంబానీకే ఈ గ్యాస్‌పై సంపూర్ణ హక్కులు కట్టబెట్టటం ఎంతవరకు సబబో ప్రభుత్వం ఆలోచించాలి. ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని ఎక్కువ చేసి చూపించటం ఇదే మొదటిసారి కాదు. అందులోనూ ప్రభుత్వానికి సరఫరా చేయటం అనేసరికి ఉత్పత్తి వ్యయం ఒక్కసారిగా వందరెట్లు కూడా పెరుగుతుంది. ముఖేష్‌ అంబానీ కంపెనీ కూడా అదే తరహాలో వ్యయం ఎక్కువ చేసి చూపింది. ప్రభుత్వం అంగీకరించింది. దాంతో షుమారుగా మూడు డాలర్లుగా ఉన్న టన్ను గ్యాస్‌ ధర ఒక్కసారిగా దాదాపు 9 డాలర్లకు చేరింది. దాంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం ఒక్కసారిగా మూడు వందల రెట్లు పెరిగింది. ఈ భారం తిరిగి ప్రజల నెత్తినే పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా కాలం మించి పోలేదు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అంబానీ సోదరులు తమ మధ్య ఒప్పందాన్ని పున:సమీక్షించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విశాల దేశ ప్రయోజనాలు గమనంలో కి తీసుకుని గ్యాస్‌ ధర నిర్ణయించటానికి ఆర్‌ఐఎల్‌ కంపెనికి ఇచ్చిన విచ్చల విడి అధికారాలను సమీక్షించాలి. దానికి గాను ప్రభుత్వం ముందుగా సహజవనరుల వినియోగానికి సంబంధించి నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలి. ఈ విధానం పరిధిలో ప్రకృతివనరుల ధరవరల నిర్ణయం జరగాలి. అపుడే ప్రజానీకం ధరల భారం నుండి కాస్తయినా ఊపిరి పీల్చుకోగలుగుతుంది.

కొండూరి వీరయ్య

Wednesday, May 5, 2010

''కమ్యూనిస్టు వ్యతిరేకులారా ఇక మీ విమర్శలు చాలించండి''

Published in Marxistu, May 2010

* ''ఫస్ట్‌ యాజ్‌ ట్రాజెడీ, దెన్‌ యాజ్‌ ఫార్స్‌'' Book Review
* స్లావొజ్‌ జిజెక్‌ వెర్సొ ప్రెస్‌ పేజీలు : 157, వెల : రూ. 650

21వ శతాబ్దంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న తొలి సంక్షోభం గురించి అనేక రచనలు వచ్చాయి. ఇందులో కొన్ని రచ నలు సంక్షోభం తీరు తెన్నుల వర్ణణకు పరిమితం అయితే, మరికొన్ని రచనలు సంక్షోభ కారణాలు వెతికే ప్రయత్నం చేశాయి. కొన్ని రచనలు మాత్రమే సంక్షోభానికి పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేశాయి. అందులో కూడా సాంప్ర దాయక పరిష్కారాలు చూపించే రచనలే ఎక్కువ. వీటన్నింటికి భిన్నంగా వర్తమాన సంక్షో భాన్ని సరికొత్త కోణంలో పరిశీలించిన రచన స్లావోజ్‌ జిజెక్‌ రచించిన ''తొలుత ఒక విషాదంగా తరువాత ఒక ప్రహసనంగా'' (ఫస్ట్‌ యాజ్‌ ట్రాజెడీ, దెన్‌ యాజ్‌ ఫార్స్‌) అన్న గ్రంథం. మార్క్స్‌ ప్రసిద్ధ గ్రంథం లూయీ బోనపార్టీ 18వ బ్రూమెయిర్‌ రచనలో ఒక వాక్యాన్ని తన రచనకు శీర్షికగా ఎంచుకోవడం ద్వారా జిజెక్‌, సంక్షోభంపై తన విమర్శ మిగిలిన విమర్శలకు భిన్నంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. లండన్‌ విశ్వవిద్యా లయంలో బిర్క్‌బెక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యుమాని టీస్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు జిజెక్‌. ఈ కాలంలో అత్యధిక విశ్లేషణలు నిర్దిష్టంగా పెట్టుబడిదారీ విధానాన్ని బ్రతికించే ఏకైక లక్ష్యంతో వచ్చాయి. కాని వారంతా బయటికి మాత్రం తటస్థ విశ్లేషకులుగా వ్యవహరించారు. అటువంటి వారికి భిన్నంగా జిజెక్‌ ''ఇక్కడ నేను తటస్థ విశ్లేషణను ముందుంచటం లేదు. సంపూ ర్ణమైన పక్షపాతంతోనే వాదనలు ముందుకు తెస్తున్నాను. అవి కూడా పాక్షికమైనవే. ఎందు కంటే సత్యం పాక్షికమైనది. అటువంటి పాక్షిక సత్యాన్ని చేరుకోవాలంటే పక్షపాత వైఖరి తీసుకోక తప్పదు. ఇక్కడ నేను కమ్యూనిజం పక్షం వహిస్తున్నాను'' అంటూ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ''కమ్యూనిజాన్ని నమ్మిన వారు ఇకపై ఏ మీమాంసకు లోను కావాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకులారా, ఇక చాలిం చండి. ఇంతకాలం అవాకులు చెవాకులు పేలారు. వాటన్నింటిని క్షమించి వదిలేస్తున్నాము. ఇకనైనా విషయాన్ని తీవ్రంగా పరిశీలించండి'' అని పేర్కొన్నాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభాన్ని మాత్రమే కాదు, సైద్ధాంతిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నది. ఈ సైద్ధాంతిక సంక్షోభం నుండి బయటపడేందుకు ముందుకొచ్చిన, వస్తున్న పలు సంక్లిష్ట వాదనలను కేవలం 160 పేజీల్లో సంక్షిప్తీకరించటం ద్వారా జిజెక్‌ ఒక నూతన ప్రపంచాన్ని పాఠకుల కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పుస్తకాన్ని 1. బడుద్ధాయిలూ...ఇది సైద్ధాంతిక పోరాటం, 2. కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం అన్న రెండు భాగా లుగా విభజించారు. మధ్యమధ్యలో ఉపశీర్షికలు ఉన్నాయి. జిజెక్‌ తన గ్రంథంలో అత్యంత సంక్లిష్ట వాదనలను సంక్షిప్తంగా పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశాడు. పుస్తకం చిన్నదే అయినా చదివి అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. ఇందులో ఉన్న వాదనలు, ప్రతి వాదనలు అంత వైవిధ్యమైనవి కావటమే దీనికి కారణం. తాజా సంక్షోభం వలన విప్లవ రాజకీ యాలు, విముక్తి రాజకీయాలు తమంతతాముగా విజృంభించబోవనీ, సంక్షోభం కాస్తా సామాజిక సంక్షోభంగా మారి కార్మికవర్గంపై దాడి పదు నెక్కుతుందనీ, జాత్యంహంకార వివక్ష, యుద్ధం, పేదరికం విజృంభిస్తాయనీ, అన్ని దేశాల్లోనూ పేదలు సంపన్నుల మధ్య అంతరాలు మరింత పెరుగుతాయనీ పేర్కొన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రం పరిధికి బయటే పరిష్కారం వెదకాలని ప్రతి పాదించారు.

మొదటి భాగాన్ని ప్రధానంగా పెట్టుబడి దారీ సంక్షోభాన్ని సమర్థించుకోవటానికి జరుగు తున్న పలు ప్రయత్నాలనూ, వాటి రాజకీయ పర్యవసానాలనూ విశ్లేషించటానికి కేటాయిం చారు. రెండో భాగంలో కమ్యూనిస్టు ప్రతిపా దనలు ముందుకు తెచ్చారు. పెట్టుబడిదారీ విధానం గురించీ, కమ్యూనిస్టు ప్రతిపాదనల గురించీ ఆయన ప్రధానంగా సామాజిక రాజ కీయ విశ్లేషణకు బదులు సామాజిక మనస్తత్వ వివశ్లేషణ చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఈ రచనలో క్రియాశీల రాజకీయ కోణంపై డోలయమానం కనిపిస్తుంది. పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించటంలో సమర్థవంతంగా వ్యవహరించినా కమ్యూనిజానికి సంబంధించిన పలు ప్రతిపాదనల విషయంలో యూరప్‌లోని సైద్థాంతిక ధోరణుల పరిమితి నుండి బయట పడలేకపోయారని ఆయన ముందుకు తెచ్చిన పలు ప్రతిపాదనలు గమనిస్తే అర్థమవుతుంది.

సంక్షుభితమైన పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిజం స్థాపన మినహా మరో ప్రత్యా మ్నాయం లేదంటూ ప్రత్యక్ష రాజకీయకార్యా చరణకు ప్రోత్సహించే పుస్తకం ఇది. అదేసమ యంలో కమ్యూనిజం భావనలు వేళ్లూనుకో కుండా ఉండేందుకు, దృష్టి మళ్లించేందుకు అత్యంత మితవాదులు, ఉదారవాదులే కమ్యూ నిస్టు పరిభాషలో వాదనలు ముందుకు తెస్తారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిస్తారు. అమెరికా ఆధునిక చరిత్రలో ప్రత్యేకించి 21వ శతాబ్దంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు- 9/11 ఉగ్రవాదుల దాడి, తదనంతర పరిణామాలు, 2007-2008లో పెల్లుబుకిన పెట్టుబడిదారీ సంక్షోభం...ఈ రెంటినీ పోలుస్తూ విశ్లేషణ మొదలవుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ అమెరికా పాలక వర్గాలు ముందుకు తెచ్చిన వాదనలు - అమెరికా విలువలనూ, జీవన విధానానీ కాపాడుకోవాలన్న వాదనలను ప్రస్తా విస్తూ వాటిపై తన ప్రతివాదన వినిపించారు. ఈ సందర్భంగానే 1989లో బెర్లిన్‌ గోడ పతనం సందర్భంగా ముందుకు వచ్చిన చరిత్ర అంతం, మానవ సమాజ అభివృద్ధిలో పెట్టుబడిదారీ విధానమే ఆఖరి దశ, సంతోషదాయకమైన 90వ దశకం అన్న వాదనలు ఊహాజనిత వాదనలని జిజెక్‌ నిర్ధారించాడు. ఫ్రాన్సిస్‌ ఫుకుయామా ప్రతిపాదించిన చరిత్ర అంతం సిద్ధాంతం కూడా తప్పని రెండు సార్లు రుజువయిందని చెప్పారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం గురించి మొదటి భాగంలో విపులంగా చర్చించిన జిజెక్‌ మిగిలిన వారికి మల్లే ఈ చర్చను పెట్టుబడిదారీ విధానం పరిధిలో నుండే చూడకుండా దాని పరిధి బయట నుండి సమీక్షించటం ఇందులోని ప్రత్యేకత. అదేసమయంలో ఈ నూతన విశ్లేషణకు అవసరమైన సైద్ధాంతిక పునాదిని మాత్రం జిజెక్‌ చూపలేకపోయాడు. ఈ వైఫల్యం కమ్యూనిస్టు ప్రతిపాదనల గురించిన చర్చలో మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పెట్టుబడి దారీ విధానంలోని తాజా ధోరణుల గురించి చర్చను రచయిత ఆయిదు అంశాలుగా విభజిం చాడు. 1. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌కు, మెయిన్‌ స్ట్రీట్‌కు మధ్య జరుగుతున్న చర్చ 2. సమానత్వం ప్రాతిపదికన సంపద పంపిణీకీ, పెట్టుబడిదారీ విధానంలో కనిపించే సంపద వడపోతకు మధ్య జరుగుతున్న సంవాదం 3. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యమే తాజా సంక్షోభానికి మూల కారణమనే చర్చ 4. సంక్షోభ రహిత పెట్టుబడి దారీ విధానం గురించిన చర్చ. తటస్థ మార్కెట్‌ అంటూ ఏదీ లేదని, ఏ సందర్భ పరిమితుల్లోనైనా మార్కెట్‌ను రాజకీయాలు నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నాడు. చివరిగా పెట్టుబడిదారీ విధానానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురాలేకపోతే ఈ వాద ప్రతివాదాల వల్ల వామపక్ష భావజాలానికే ఎక్కువ నష్టం జరుగు తుందని రచయిత అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా పాలకవర్గాలు సంక్షోభ కారణాల గురించిన శక్తివంతమైన వ్యాఖ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాయి. తాజా సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న సంక్షోభం కాదని, నిజానికి పెట్టు బడిదారీ విధానం నుండి వైదొలగిన ఫలితమే ఈ సంక్షోభమనే వాదనలు పాలక వర్గాల వ్యాఖ్యానాల్లో అంతర్భాగంగా ఉంటాయి. ఇటు వంటి వాఖ్యానం ప్రజలను నిద్ర నుండి మేల్కొ ల్పేది కాదు. మరింత గాఢ నిద్రకు ఉపక్రమింప చేసేది. అంతేకాదు, పెట్టుబడిదారీ విధానం ఒక తటస్థ సామాజిక యంత్రాంగం అన్నదే ఒక సైద్థాంతిక వాదన. ప్రజలను ఆశల పల్లకి లోకి ఎక్కించిన వ్యవస్థ ఏదైనా ఉంటే అది పెట్టుబడిదారీ వ్యవస్తే. పెట్టుబడిదారీ విధానం తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటానికిగాను వస్తు ఆరాధాన, వస్తు కాంక్షతో పాటు భావ ఆరాధానను కూడా ప్రోత్సహిస్తుంది. ఒకసారి దేని గురించైనా ఆరాధ్యభావం ఏర్పర్చిన తర్వాత సదరు విషయం వలన కలుగుతున్న దుష్ప్రభా వాన్ని తగ్గించి చూపటంలో ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడిదారీ విధానం భావ ఆరా ధన రూపంలో నిర్మిస్తున్న మిథ్యావాదంపై కూడా పోరాడాల్సిన అవసరముంది అని రచయిత విశదీకరించాడు.

శతృ శిబిరం ప్రచార యుద్ధం గురించి సమగ్రంగా వివరించే ప్రయత్నం చేశాడు రచయిత. శతృ శిబిర ప్రచార యుద్ధపు ఏకైక లక్ష్యం ఉనికిలో ఉన్న ఒక శక్తిని... ప్రతిఘటించే సామర్థ్యం గల శక్తిని హతమార్చటం కాదు, అసలు అటువంటి ప్రతిఘటించే సామర్థ్యం ఉన్న శక్తే ఉనికిలోకి వచ్చే అవకాశం లేకుండా చేయటమే దాని లక్ష్యం. అందువల్లనే తాజా సంక్షోభం వ్యవస్థకు సంబంధించిన సంక్షోభంగా కాక వ్యవస్థపై నమ్మకానికి సంబంధించిన సంక్షోభం అన్న వాదన ముందుకు తేవటం ద్వారా మొత్తంగా చర్చనే పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. తాజా సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం కొత్త ముసుగు తొడుక్కుని ముందుకు వస్తుంది. ''సామాజికంగా బాధ్యతాయుతమైన పర్యావరణ పెట్టుబడిదారీ విధానం'' రూపంలో ఇది మనకు కనిపిస్తుంది. అమెరికాలో హరిత విద్యుత్‌ బిల్లు, భారత దేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల విస్తరణ గురించి జరుగుతున్న చర్చలను ఈ నేపథ్యంలోనే మనం చూడాలి. కోపెన్‌హేగెన్‌ సదస్సులో సంపన్న దేశాలు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనాలు. ఇటువంటి ధోరణులు పెట్టుబడిదారీ విధానంలో ఆధునికోత్తర వాదంగా చెప్పుకోవచ్చు. వీటి పర్యవసానం సాంప్రదాయక పెట్టుబడిదారీ విధానం కంటే మరింత దారుణంగానూ, తీవ్రంగానూ ఉంటుంది. ప్రతి సంక్షోభం నేపథ్యంలో వామ పక్షాల జోక్యానికి ఎంతగా అవకాశాలు అందివ స్తాయో అంతకంటే ఎక్కువ అవకాశాలు ఒంటెత్తు పోకడలకు, ప్రజలను దారి మళ్లించే రాజకీయాలకూ వస్తాయనీ, దీనికి యూరోపియన్‌ దేశాల అనుభవాలే నిదర్శనాలనీ రచయిత చెప్పాడు.

మానవత్వం, మానవతావాదం గురించిన చర్చకు కూడా జిజెక్‌ సమర్థవంతమైన జవా బిచ్చారు. సైద్థాంతిక భావజాలాలకు అతీతంగా ఉండాలంటూ ముందుకు వస్తున్న కొన్ని భావ నలు, చర్చలు నిస్సందేహంగా సైద్ధాంతిక కోణం నుండి వస్తున్నవే తప్ప సైద్ధాంతిక భావజాలానికి అతీతమైనవి కావని ఆయన చెప్పారు. అమెరికా ప్రతిపాదిస్తున్న ప్రజాస్వామ్యం కేవలం ఎత్తుగడే తప్ప దానికి వాస్తవిక పునాది లేదన్నాడు. రాజకీయాలకు, ప్రజా జీవనానికి మధ్య పెరుగు తున్న అంతరానికీ, అస్తిత్వ రాజకీయాల ఆవిర్భా వానికీ మధ్య మధ్య సంబంధం ఉందని చెబుతూ ''ఇతరులు'' అన్న భావన రాజకీయ భావజాలంలో ఎలా ప్రవేవించింది, నాటి నుండి మనవాళ్లు, ఇతరుల అన్న అర్థంతో జరుగుతున్న చర్చలకు, అస్తిత్వ రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా స్పృజించాడు రచయిత. చారిత్రక పరిణామ క్రమంలో తెరమీదకు వచ్చిన బహుముఖ అస్తిత్వాల గురించిన సమగ్ర అంచనా లేకపోతే ప్రజలు అస్తిత్వవాదానికి, విముక్తి వాదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేరని ఆయన చెప్పాడు.

నేడు మనం చూస్తున్న పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరించగలమా అన్న ప్రశ్న వేసి దానికి సమాధానంగా కమ్యూనిస్టు పరిష్కారాలు ప్రతిపాదించాడు రచయిత. ఈ అధ్యాయంలో జరిగిన చర్చ అంతా అనేక ప్రతిపాదనలు, సూచనలు చుట్టూ తిరుగుతుంది. సంపూర్ణమైన మార్క్సిస్టు -లెనినస్టు అర్థంలో కమ్యూనిజం సాధన అన్న పదబంధాన్ని రచయిత వాడలేదనిపిస్తుంది. మరోవైపున కమ్యూనిజం సాధనకు కీలకమైన మార్క్సిస్టు లెనినిస్టు సూత్రాలపై నడిచే కమ్యూనిస్టు పార్టీ, విప్లవానికి అవసరమైన కార్మికవర్గ నాయకత్వం, విప్లవానం తరం బూర్జువా రాజ్యాంగయంత్రం స్థానంలో కార్మికవర్గ నియంతృత్వం స్థాపనల గురించి రచయిత చర్చను వాయిదా వేశాడు. కార్మిక వర్గం పొందికలో వచ్చిన మార్పులను ప్రసా ్తవిస్తూ ప్రపంచీకరణ నేపథ్యంలో పలు రకాలుగా చీలిపోయిన కార్మికవర్గాన్ని ఐక్యం చేయాల న్నాడు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదం నాడు కార్మికవర్గాన్ని సమీకరించటానికి దోహదం చేస్తే పోరాడకపోతే సర్వం కోల్పోతామన్న ఆందోళన నేటి సమీక రణకు పునాదిగా ఉండాలని రచయిత ప్రతిపా దించాడు. అయితే ప్రస్తుత పెట్టుబడిదారీ సంక్షో భం నుండి బయట పడి కమ్యూనిజం సాధన కోసం పోరాడేందుకు అవసరమైన సమగ్ర రాజ కీయ వ్యూహాన్ని ప్రతిపాదించటంలో రచయిత వెనకంజ వేశాడు.

నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు తెస్తున్న సంక్లిష్టమైన సమస్యల పరిధి, నిడివి దృష్టిలో పెట్టుకున్నపుడు కమ్యూనిజం ఒక్కటే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వగల దని రచయిత నిర్థారించాడు. ఈ మధ్య కాలం లో ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బాం ప్రచురించిన ''సోషలిజం విఫలమైంది, పెట్టు బడిదారీ విధానం దివాళా తీసింది. ప్రత్యామ్నా యం ఏమిటి?'' అన్న ప్రశ్నకు రచయిత కమ్యూ నిజం సమాధానంతో ముందుకు వచ్చాడు. ఈ పరిష్కారం దిశగా ప్రపంచ కార్మికవర్గం పయ నించకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగానే పెట్టుబడిదారీ విధానం పరిమిత సామ్యవాద భావనలను ప్రచారాస్త్రాలుగా మారుస్తోందనీ, ప్రకృతి వనరులపై ప్రజల ప్రత్యక్ష హక్కు అన్న పర్వావరణ ఉద్యమకారుల వాదనలు ఇందులో భాగమేనని ఆయన పేర్కొన్నాడు. ఇటువంటి వాదనలన్నింటికీ సమాధానం ఇవ్వాలంటే కమ్యూనిజం నిరంతరం ప్రగతిశీల నూతనత్వా న్ని తనలో ఇముడ్చుకోవాలంటాడు. సామ్రాజ్య వాద ప్రపంచీకరణ నేపథ్యంలో మెజారిటీ ప్రజలు కార్మికవర్గంలో చేరుతున్నారు. అంతర్జా తీయంగా రిజర్వు కార్మికవర్గ సైన్యం విస్తరి స్తోంది. ముందు ముందు వీరందరూ ప్రజా స్వామ్యంపేర చెలామణీ అవుతున్న బూర్జువా రాజకీయ క్రమంలో కూడా స్థానం సంపాదిం చుకునే పరిస్థితుల్లో ఉండరు. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో మార్క్స్‌ ప్రతిపాదించిన అత్యున్నత విముక్తి సిద్ధాంతంలోని వాస్తవిక ప్రతిపాదనల గురించి ప్రజలను చైతన్యపర్చా ల్సిన అవసర ముంది అని జిజెక్‌ తన గ్రంథం లో చెప్పాడు. సామ్రాజ్యవాదపు ఆధిపత్య వ్యాఖ్యానం నడుమ వాస్తవిక విషయాలు ప్రజలకు చేరటం లేదు. అందువల్ల ప్రజలు మిథ్యావాదానికి దగ్గరవుతున్నారు. పైన చెప్పుకున్నట్లు ఈ మిథ్యావాదపు ఉపరితలాన్ని బద్దలు కొట్టి వాస్తవాలు ప్రజలకు చేరేలా చేయటం కూడా నేడు సైద్ధాంతిక పోరాటంలో అంతర్భాగమే అవుతుందని ఆయన పేర్కొ న్నాడు.

యూరోపియన్‌ దేశాల రాజకీయాలపై పట్టు కలిగిన జిజెక్‌ ఫ్రాన్స్‌, ఇటలీల్లో జరుగు తున్న రాజకీయమార్పులపై కూడా దృష్టి సారించాడు. ఫ్రెంచి అధ్యక్షుడు, ఇటలీ ప్రధానిల శృంగార క్రీడలు, ఆయా దేశాల రాజకీయాల్లో వాటి ప్రభావం గురించి రేఖా మాత్రంగా పాఠకుల దృష్టికి తెస్తూ, ఇవన్నీ రాజకీయాల పట్ల ప్రజా దృక్ఫధాన్ని మార్చటంలో భాగమనీ రచయిత అభిప్రాయపడతాడు. కారణాలు ఏవైనా ఇటువంటి ఏవగింపు చర్యలపై చర్చ మొదలు పెట్టిన తర్వాత ప్రజానీకం ఎదుర్కొం టున్న దైనందిన జీవన సమస్యలపైకి దృష్టి మళ్లించటం సాధ్యం కాదని, తద్వారా పాలక వర్గాలు తమ ప్రయోజనాలను యథాతథంగా కొనసాగించుకోవటంలో కృతకృత్యులవుతాయని చెప్పాడు. పైన చెప్పుకున్నట్లు సంక్షోభం పర్యవ సానంగా మితవాద రాజకీయాలు, కార్మిక వర్గంపై దాడి పెరుగుతాయి. వివిధ దేశాల్లో ఈ దాడులు ప్రారంభం కావటానికి ముందు జరుగుతున్న చర్చల ధోరణిని రచయిత ప్రస్తా వించిన తీరు ఇంగ్లాండ్‌, అమెరికా, ఆస్ట్రేలి యాల్లో ప్రవాసుల పట్ల జరుగుతన్న వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రవాసుల వల్లనే దేశీయ యువత నిరుద్యోగం బారిన పడుతుందన్న వాదన ముందుకు తేవటం ద్వారా నిరుద్యోగ యువతను ప్రభుత్వ వైఫల్యం నుండి దృష్టి మళ్లించటంలో వివిధ దేశాల్లోని పాలక వర్గాలు కృతకృత్యులయ్యాయి. ఈ ధోరణి ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

వామపక్ష వాదనల్లో ఆధునికానంతర వాదనల గురించి కూడా రచయిత ఈ గ్రంధంలో ప్రస్తావించాడు. కార్మిక వర్గ నియంతృత్వం సిద్థాంతాన్ని వ్యతిరేకించే వారిని రచయిత ఆధునికానంతర వామపక్ష వాదులుగా వర్గీకరించాడు. కార్మికవర్గ నియంతృత్వాన్ని ఆచరణలోకి తెచ్చింది లెనిన్‌ నేతృత్వంలోని బోల్షివిక్‌ పార్టీ. అందువల్ల వీరు సహజంగానే లెనిన్‌ సూత్రీకరణలకు వ్యతిరేక వాదనలు ముందుకు తెస్తారు. వేతన కార్మికుల పోరాటాలను కమ్యూనిస్టు పోరాటాల్లో అంతర్భాగంగా చూడకపోవటం కూడా ఆధునికోత్తర వామపక్ష వాదనల్లో భాగంగా ఉంటుంది. దీనికి గాను వీళ్లు ముందుకు తెచ్చే వాదన ''వేతన శ్రమకు కాలం చెల్లింది. పెట్టుబడికి, శ్రమశక్తికి మధ్య వైరుధ్యం గతం మాట. దీని స్థానంలో ప్రభుత్వం, బహుముఖ వ్యవస్థల మధ్య వైరుధ్యం ముందుకొస్తోంది. కాబట్టి మనం దానిపై కేంద్రీకరించాల''న్న నూతన సామాజిక ఉద్యమకారుల సైద్థాంతిక వాదనలను తీవ్రంగా విమర్శిస్తాడు రచయిత. అంతేకాదు. కమ్యూనిజాన్ని ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టుగా మలచాలంటే పెట్టుబడిదారీ విధానంపై మరింత కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని రచయిత చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవటానికి రచయిత ''ఎన్నికల ప్రజాస్వామ్యం ఏకాభిప్రాయంతో కూడిన పెట్టుబడిదారీ విధానమే. దీన్నే నేడు మనం మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అని పిలుచుకుంటున్నాము'' అంటూ ప్రజాస్వామిక వ్యవస్థ పరిధిలోనే శాశ్వత పరిష్కారం వెతకాలని ప్రయత్నించటం సరికాదని పేర్కొన్నాడు. అందుకనే ''కమ్యూనిస్టు వ్యతిరేకులారా, ఇక మీ విమర్శలు చాలించండి. ఇంతవరకు మీరు చేసిన విమర్శలను సహించి మిమ్ములను క్షమిస్తున్నాము. ఇకనైనా పరిస్తితి తీవ్రతను గమనించండి'' అంటూ కార్యోన్ముఖులను చేయబూనుకుంటాడు జిజెక్‌.

Monday, May 3, 2010

గ్రీకు ట్రాజెడీతో ప్రశ్నార్థకమవుతున్న ఆర్థిక పునరుత్థానం

PRajasakti May3th 2010
గ్రీసులో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మొత్తం యూరోపియన్‌ యూనియన్‌ను ముంచెత్తనుంది. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులు ఏటా ఏప్రిల్‌లో జరిపే సమావేశాలు ఈ సారి ఏప్రిల్‌ 23-24 తేదీల్లో ముగిశాయి. మొదట్లో గ్రీసును ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోవటానికి అభ్యంతరాలు తెలిపిన జర్మనీ ఎట్టకేలకు తమ వంతు వాటా అందిస్తామని ప్రకటించింది. మొత్తం గ్రీసు రుణాలు 300 బిలియన్‌ యూరోలు. దీనిమీద ప్రతి ఏడాదీ పెరుగుతున్న వడ్డీ భారం 54 బిలియన్‌ యూరోలు. ఇది కాక బాండ్ల మీద చెల్లించాల్సింది షుమారు 45 బిలియన్‌ యూరోలు. ఇందులో మే మాసం చివరికి 8.5 బిలియన్‌ యూరోలు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకుని చూస్తే గ్రీసు బడ్జెట్‌లోటు 13 శాతానికి పైమాటే. యూరోపియన్‌ యూనియన్‌ పదకొండేళ్ల క్రితం ఉమ్మడి కరెన్సీకి సంబంధించిన విధి విధానాలు రూపొందించేటపుడు ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీన్నే మాస్ట్రిచ్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం యూరోపియన్‌ యూనియన్‌లో చేరి ఉమ్మడి కరెన్సీగా యూరోను అంగీకరించిన దేశాలు తమ బడ్జెట్‌ లోటును సగటున మూడు శాతానికి మించకుండా చూసుకోవాలి. ఇటువంటిదే మన దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన ఎప్‌ఆర్‌బిఎం చట్టం. గ్రీసు తక్షణం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడేయటానికి కావల్సిన నిధులు 145 బిలియన్‌లు. పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కటానికి షుమారు 5 ట్రిలియన్‌ డాలర్లు నిధులు వివిధ రూపాల్లో కుమ్మరించిన సంపన్న దేశాలు, సంపన్నులమవుదామనుకుంటున్న దేశాలు గ్రీసును ఆదుకోవటానకిఇ 145 బిలియన్‌ యూరోల నిధిని సమీకరించలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

యూరోపియన్‌ యూనియన్‌ ముందు నేడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గ్రీసును దివాళా తీయించటం ఒకటి. గ్రీసును ఆదుకోవటం ద్వారా గ్రీసు ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని యూరోపియన్‌ దేశాలన్నీ పంచుకోవటం మరోటి. ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రశ్చన్న యుద్ధ కాలంలో వివిధ దేశాల మధ్య కుదిరిన నాటో, సీటో, సెంటో రక్షణ ఒప్పందాలు మనకు తెలుసు. ఈ ఒప్పందాల ప్రకారం సదరు కూటముల్లో ఏ ఒక్క సభ్యదేశమైనా శతృదాడిని ఎదుర్కొంటున్న పక్షంలో మిగిలిన అన్ని దేశాలు దాడికి గురవుతున్న దేశానికి రక్షణగా నిలవాలి. కుడి ఎడంగా ఇదే సూత్రాల మీద ఆధారపడి ఉనికిలోకి వచ్చినవే ప్రాంతీయ ఆర్థిక మండళ్లు. ఇందులో యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భావానికి 1970 దశకం నుండీ పెద్దఎత్తున కృషి సాగితే ఉత్తర అమెరికా స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం 90లలో ముందుకొచ్చింది. మిగిలిన ప్రాంతీయ కూటములు సార్క్‌, ఏషియాన్‌, జి8+వంటివి ప్రధానంగా రాజకీయ కూటములుగానే ఉన్నాయి. పరిపూర్ణమైన ఆర్థిక కూటమిగా యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. తద్వారా ఈ యూనియన్‌లోని సభ్యదేశాలన్నీ ఉమ్మడి బ్యాంకు, ఉమ్మడి కరెన్సీ, ఉమ్మడి ఆర్థిక విధానాల ప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక ఉన్న సైద్ధాంతిక ప్రాతిపదిక పెట్టుబడిదారీ విధానం అజేయం అన్న భావన. ప్రత్యేకించి 90 దశకంలో తూర్పు యూరప్‌ దేశాల్లో సోషలిస్టు రాజ్యాలు పతనం అయిన తర్వాత ఈ భావన మరింత వేళ్లూనుకొంది. దాంతో అప్పటి వరకు నత్తనడక నడుస్తూ వచ్చిన యూరోపియన్‌ యూనియన్‌ భావన అంగలు పంగల మీద ఒక కొలిక్కి వచ్చింది. దానికనుగుణంగానే విధి విధానాలు రూపొందాయి. ఈ పరిస్థితుల్లో గ్రీసును ఒంటరిగా దివాళా తీయించటం ఇయు కోసం ఏర్పాటు చేసుకున్న చట్రం పరిధిలో సాధ్యం కాదు. అలా చేయటం అంటే సభ్య దేశాల ఆర్థిక స్థిరత్వానికి ఇయు హామీ ఇవ్వలేదన్న సారాంశాన్ని ప్రపంచానికి తెలియచేయటమే. ఇదే జరిగితే అమెరికా, డాలర్‌ ఆర్థిక శక్తి సామర్థ్యాలకు దీటుగా తెరమీదకు వస్తుందనుకున్న యూరో, యూరోపియన్‌ యూనియన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అంతర్జాతీయంగా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయి.

మిగిలింది అమెరికా సంక్షోభ భారాన్ని ప్రపంచం మొత్తం పంచుకున్నట్లుగా గ్రీసు సంక్షోభ భారాన్ని యూరోపియన్‌ దేశాలు పంచుకోవటం. అలా చేయాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ కూడా కొంత భారాన్ని భరించాలి. ఇయులో సభ్య దేశాల హౌదాకు అనుగుణంగా ఈ భారాల పంపకం ఉంటుంది. అంటే ఈ భారంలో సింహభాగం జర్మనీ భరిస్తే, తదుపరి ముఖ్యవాటాలు ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలు పంచుకోవాలి. అంటే ఈ దేశాలు తమ జాతీయ అవసరాల కోసం కేటాయించుకున్న నిధుల్లో కొంత మొత్తాన్ని తగ్గించి గ్రీసుకు రుణాలు ఇవ్వాలి. దీనివల్ల ఆయా దేశాల్లో సామాజికరంగ వ్యయం తగ్గిపోవటం అనివార్యం. అంతేకాదు. ఈ దేశాల బ్యాంకుల్లో గ్రీసును దివాళా తీయించిన బాండ్లు వచ్చి చేరతాయి. తద్వారా ఆయా దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్థల సామర్థ్యం తగ్గిపోతుంది. దీని ప్రభావం అంతర్జాతీయ ద్రవ్యరంగంపైనా పడుతుంది.

ఈ రెండింటిలో ఏ నిర్ణయానికి వచ్చినా ముప్పు అనివార్యం. అందువల్లనే ఈ ముప్పు గురించి యూరోపియన్‌ దేశాల ప్రజలు చర్చించకుండా చేయటానికి గ్రీసు ప్రభుత్వం మాస్ట్రిచ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని, బడ్జెట్‌లోటును 3 శాతానికి తగ్గంచాలని అటు ఐఎంఎఫ్‌, జర్మనీలు ఒత్తిడి తెస్తున్నాయి. 13 శాతంగా ఉన్న బడ్జెట్‌ లోటును ఒక్కసారిగా 3 శాతానికి తగ్గించటం అంటే సామాజిక, రక్షణ రంగాల్లో ప్రభుత్వ కేటాయింపులు పెద్దఎత్తున కోతకు గురికావాలి. కనీసం 70 శాతం వరకూ ఈరంగాల్లో వ్యయం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పదిశాతానికిపైగా ఉన్న నిరుద్యోగం మరింత పెరగటం ఖాయం. ఐఎంఎఫ్‌ మాజీ అధ్యక్షుడు కెన్నెత్‌ రోగాఫ్‌ '' గ్రీసు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడిని ఒప్పించటం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం వల్లనే స్టాండర్డ్‌ మరియు పూర్‌ రేటింగ్‌ సంస్థ గ్రీసు ప్రభుత్వ బాండ్లను చిత్తుకాగితాల కోవలోకి చేర్చింది. ఈ సంస్కరణలు చేపట్టనిదే ఐఎంఎఫ్‌ కూడా నిధులు విడుదల చేయటం సాధ్యం కాదు'' అని ప్రకటించారు. గ్రీసు ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్‌ చేతుల్లో పునర్వవస్థీకరణకు గురవటం అంటే 70 దశకం నుండి వర్ధమాన దేశాలు అమలు జరిపిన ఆర్థిక సంస్కరణలను గ్రీసు అమలు జరపటమే. దీని పర్యవసానం రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా ఈ సంస్కరణలను దేశీయంగా కొనుగోలుశక్తిని మరింత తగ్గించి వేస్తాయి. దాంతో గ్రీసు ఆర్థిక వ్యవస్థ 70,80 దశకాల్లో అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థ తరహాలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఏ రకంగా చూసుకున్నా గ్రీసు ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కమ్ముకున్న పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభంలో ఒక కీలకమైన మలుపుగా నిలవబోతోంది. అంతర్జాతీయ విశ్లేషకులు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలతో సహా ఇప్పుడిపుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2007 నాటి సంక్షోభం నీడ నుండి బయటకు వస్తోందని అంచనా వేస్తున్నారు. గ్రీసు పరిణామాలు, గ్రీసు పరిణామాలనే పోలిన పోర్చుగల్‌, స్పెయిన్‌, ఐర్లండ్‌, ఇటలీ ( ఈ దేశాల మొదటి అక్షరాలను ఒక చోట చేర్చి పిగ్స్‌ అని పిలుస్తున్నారు.) దేశాల పరిణామాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పునరుత్థానంపై కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.